కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నక్షత్రాల్లో వెల్లడవుతున్న దేవుని శక్తి

నక్షత్రాల్లో వెల్లడవుతున్న దేవుని శక్తి

నక్షత్రాల్లో వెల్లడవుతున్న దేవుని శక్తి

“మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”​—⁠యెషయా 40:​26.

సూర్యగోళం ఒక మోస్తరు పరిమాణంగల నక్షత్రం. అయినా దాని పరిమాణం, భూ పరిమాణం కన్నా 3,30,000 రెట్లు ఎక్కువ. భూమికి దగ్గర్లోవున్న ఎన్నో నక్షత్రాలు సూర్యునికన్నా చిన్నగా ఉన్నాయి. అయితే, V382 సిగ్నీ వంటి ఇతర నక్షత్రాల పరిమాణం మన సూర్యుని పరిమాణం కన్నా కనీసం 27 రెట్లు ఎక్కువ.

మన సూర్యగోళం ఎంత సౌరశక్తిని ఉత్పన్నంచేస్తుంది? పదిహేను కిలోమీటర్ల దూరంలో మండే మంట వేడి మీకు తగలాలంటే ఆ మంట ఎంత వేడిగా ఉండాలో ఒకసారి ఆలోచించండి! సూర్యుడు భూమికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, బాగా ఎండగావున్నప్పుడు చర్మం కమిలిపోవచ్చు. కానీ ఆశ్చర్యమేమిటంటే, సూర్యుని నుండి వెలువడుతున్న వందకోట్ల శక్తిలో దాదాపు ఒక్క వంతు మాత్రమే భూమికి చేరుతుంది. ఆ ఒక్కవంతు సౌరశక్తి భూమ్మీదున్న సమస్త జీవకోటి మనుగడకు సరిపోతుంది.

వాస్తవానికి, మన సూర్యగోళం ఉత్పన్నం చేసే సౌరశక్తి, భూమి వంటి దాదాపు 31 లక్షల కోట్ల గ్రహాలకు సరిపోతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అది ఎంతనేది మరోవిధంగా చెప్పాలంటే, సౌరశక్తినంతటినీ కేవలం ఒక్క క్షణంపాటు తీసుకోగలిగినా, ఆ శక్తి అమెరికా “ప్రస్తుతం వాడుతున్న శక్తి ప్రకారం చూస్తే రాబోయే 90,00,000 సంవత్సరాల వరకు దానికి సరిపోతుంది” అని స్పేస్‌ వెదర్‌ ప్రిడిక్షన్‌ సెంటర్‌ (ఎస్‌డబ్ల్యుపిసి) వెబ్‌సైట్‌ చెబుతోంది.

సూర్యుని కేంద్రం నుండి సౌరశక్తి ఉత్పన్నమవుతుంది, ఆ కేంద్రం అణు రియాక్టర్‌లాగానే, పరమాణువులు ఒక​దానితో ఒకటి సంలీనమయ్యేలా చేసి, శక్తిని బయటకు విడుదల చేస్తుంది. సూర్యగోళం ఎంత పెద్దగా ఉంటుందంటే, దాని కేంద్రం ఎంత దళసరిగా ఉంటుందంటే, కేంద్రంలో ఉత్పన్నమైన శక్తి సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. “ఒకవేళ ఈరోజు సౌరశక్తి ఉత్పన్నమవ్వడం ఆగిపోతే, దాని ప్రభావం భూమ్మీద గుర్తించ​దగినవిధంగా కనిపించడానికి 5,00,00, 000 సంవత్సరాలు పడుతుంది” అని ఎస్‌డబ్ల్యుపిసి వెబ్‌సైట్‌ చెబుతోంది.

ఈ వాస్తవాన్ని పరిశీలించండి: రాత్రిపూట మబ్బుల్లేని ఆకాశాన్ని చూస్తే సూర్యునిలాంటి వేలాది నక్షత్రాలు మీకు కనిపిస్తాయి. వాటిలో ప్రతీ నక్షత్రం ఎంతో శక్తిని ఉత్పన్నం చేస్తుంది. విశ్వంలో వందలకోట్ల నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

ఈ నక్షత్రాలన్నీ ఎలా ఉనికిలోకి వచ్చాయి? విశ్వం ఉనికి​లోకి రావడానికి గల కారణాలేమిటో తమకు ఇప్పటికీ అర్థంకాకపోయినా, 14 వందలకోట్ల సంవత్సరాల క్రితం అది హఠాత్తుగా ఉనికిలోకి వచ్చిందని ఇప్పుడు అనేకమంది పరిశోధకులు నమ్ముతున్నారు. అయితే బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:⁠1) ఎంతో శక్తిని ఉత్పన్నం చేసే నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త “బలాతిశయము” లేదా అపారమైన శక్తి గలవాడు అనడంలో సందేహం లేదు.​—⁠యెషయా 40:⁠26.

దేవుడు తన శక్తిని ఎలా ఉపయోగిస్తాడు?

యెహోవా దేవుడు, తాను కోరుతున్నట్లు జీవించేవారిని బలపర్చడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఇతరులకు దేవుని గురించి బోధించడానికి తన శక్తినంతటినీ ధారపోశాడు. పౌలు సామాన్య మానవుడే అయినప్పటికీ, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆయన అందరికీ మేలు చేసే పనులు చేయగలిగాడు. ఎలా? దేవుడు తనకు ‘బలాధిక్యాన్ని,’ అంటే అధికశక్తిని ఇవ్వడంవల్లే చేయగలిగానని ఆయన చెప్పాడు.​—⁠2 కొరింథీయులు 4:​7-9.

యెహోవా దేవుడు, తన నైతిక ప్రమాణాలను బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించినవారిని నాశనం చేయడానికి తన శక్తిని ఉపయోగించాడు. అలా యెహోవా దుష్టులను మాత్రమే నాశనం చేయడానికి తన శక్తిని ఉపయోగిస్తాడని చెప్పడానికి, యేసుక్రీస్తు సొదొమ గొమొఱ్ఱాల నాశనాన్ని, నోవహు దినాల్లో వచ్చిన జలప్రళయాన్ని ఉదాహరణలుగా పేర్కొన్నాడు. యెహోవా తన ప్రమాణాలను అలక్ష్యం చేసేవారిని నాశనం చేయడానికి మరోసారి తన శక్తిని ఉపయోగిస్తాడని యేసు ముందే చెప్పాడు.​—⁠మత్తయి 24:​3, 37-39; లూకా 17:​26-30.

మీకేమనిపిస్తోంది?

నక్షత్రాల్లో స్పష్టంగా కనిపించే దేవుని శక్తి గురించి బాగా ఆలోచిస్తే మీలో కూడా దావీదు రాజులో కలిగిన భావాలే కలగవచ్చు. ఆయన తన భావాలను ఇలా వ్యక్తం చేశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?”​—⁠కీర్తన 8:​3, 4.

నిజమే, సువిశాలమైన విశ్వంతో పోలిస్తే మనమెంత అల్పులమో గ్రహించడానికి వినయం అవసరం. అయితే దేవుని అపారమైన శక్తిని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ధైర్యాన్నిచ్చే ఈ మాటలను వ్రాసేలా యెహోవా యెషయా ప్రవక్తను ప్రేరేపించాడు: ‘దేవుడు సొమ్మసిల్లిన​వారికి బలమిచ్చును, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ​జేయును. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.’​—⁠యెషయా 40:​29-31.

మీరు దేవుడు కోరుతున్నట్లు జీవించడంలో కొనసాగాలనుకుంటే, మీకు సహాయం చేయడానికి ఆయన తన పరిశుద్ధాత్మను తప్పక ఇస్తాడు. కానీ మీరు దానికోసం అడగాలి. (లూకా 11:​13) దేవుని సహాయంతో, మీరు ఏ కష్టాన్నైనా సహించి సరైనది చేయడానికి కావల్సిన బలాన్ని పొందుతారు.​—⁠ఫిలిప్పీయులు 4:​13. (w 08 5/1)

[7వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుని సహాయంతో, మీరు సరైనది చేయడానికి కావల్సిన బలాన్ని పొందుతారు

[7వ పేజీలోని చిత్రాలు]

పైన ఎడమ నుండి సవ్యదిశలో: సుడిగుండం (వర్ల్‌పూల్‌) నక్షత్రవీధి, కృత్తిక నక్షత్రరాశి, ఒరాయన్‌ నీహారిక, ఆండ్రోమిడా నక్షత్రవీధి

[7వ పేజీలోని చిత్రాలు]

సూర్యుని పరిమాణం భూ పరిమాణం కన్నా 3,30,000 రెట్లు ఎక్కువ

[7వ పేజీలోని చిత్రసౌజన్యం]

కృత్తిక: NASA, ESA and AURA/Caltech; పైనున్న మిగతావన్నీ: National Optical Astronomy Observatories