కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

తన భక్తుల మరణం ఏ విధంగా ‘యెహోవా దృష్టిలో విలువైనది’?

▪ ఒక కీర్తనకర్త దేవుని ప్రేరణతో ఇలా పాడాడు, “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది.” (కీర్త. 116:15) తన సత్యారాధకుల్లోని ప్రతీ ఒక్కరి ప్రాణం యెహోవా దృష్టిలో చాలా విలువైనది. అయితే, ముందటి వాక్యంలో 116వ కీర్తనలో నుండి ఉల్లేఖించబడిన లేఖనం కేవలం ఒక్క వ్యక్తి మరణం గురించి మాట్లాడడం లేదు.

ఒక క్రైస్తవుడు చివరి వరకు నమ్మకంగా యెహోవా సేవ చేసినా, ఆయన చనిపోయినప్పుడు ఇచ్చే ప్రసంగంలో కీర్తన 116:15ను ఆయనకు అన్వయించడం సముచితం కాదు. ఎందుకు? ఎందుకంటే, ఆ కీర్తనకర్త మాటలకు విస్తృత భావం ఉంది. తన భక్తులు ఉనికిలో లేకుండా పోయే పరిస్థితి యెహోవా రానివ్వడు. ఎందుకంటే, ఆయన వాళ్లను అమూల్యమైనవారిగా ఎంచుతాడు.—కీర్తన 72:14; 116:8 చూడండి.

తన సేవకులు ఈ భూమ్మీద లేకుండా పోయే పరిస్థితి యెహోవా రానివ్వడని కీర్తన 116:15 అభయమిస్తోంది. యెహోవా సేవకులు ఇప్పటికే తీవ్రమైన శ్రమల్ని, హింసల్ని సహించి నిలబడ్డారని మన ఆధునిక చరిత్ర చూపిస్తోంది. దీన్నిబట్టి, తన సేవకులు ఉనికిలో లేకుండా పోయే పరిస్థితి యెహోవా రానివ్వడని స్పష్టంగా అర్థమౌతోంది.

యెహోవాకు సాటిలేని శక్తి ఉంది, అంతేకాక ఆయన సంకల్పం తప్పక నెరవేరుతుంది కాబట్టి, తన సేవకులు ఈ భూమ్మీద నుండి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి రానివ్వడు. ఒకవేళ అలాంటి పరిస్థితి రానిస్తే, ఆయన శత్రువులు ఆయనకంటే శక్తిగలవారన్నట్లు అవుతుంది. అలా ఎన్నటికీ జరగదు! అంతేకాక, తన నమ్మకమైన సేవకులకే ఈ భూమి నివాస స్థలంగా ఉండాలనే యెహోవా సంకల్పం నెరవేరకుండా పోతుంది, అలా కూడా ఎన్నటికీ జరగదు! (యెష. 45:18; 55:10, 11) యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయపు భూసంబంధ ఆవరణంలో ఆయనను ఆరాధించే మానవులెవ్వరూ మిగలకపోతే, ఈ భూమ్మీద ఆయనకు చేసే పరిశుద్ధ సేవ ఆగిపోతుంది. ‘కొత్త ఆకాశం’ కింద జీవించే నీతియుక్త మానవ సమాజమైన ‘కొత్త భూమికి’ పునాది కూడా ఉండదు. (ప్రక. 21:1) అంతేకాక, భూమ్మీద విధేయులైన మానవులు లేకపోతే క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉండదు.—ప్రక. 20:4, 5.

ఒకవేళ తన శత్రువులు తన సేవకులందర్నీ ఈ భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేందుకు యెహోవా అనుమతిస్తే ఆయన స్థానం మీద, ఆయన పేరుప్రతిష్ఠల మీద సందేహాలు వస్తాయి. అదే గనుక జరిగితే, విశ్వ సర్వాధిపతిగా యెహోవాకున్న స్థానంపై పెద్ద మచ్చ ఏర్పడుతుంది. అంతేకాక, యెహోవాకు తనపై, తన పరిశుద్ధ నామంపై ఉన్న గౌరవాన్ని బట్టి ఆయన తన నమ్మకమైన సేవకులు లేకుండా తుడిచిపెట్టబడే పరిస్థితి రానివ్వడు. దేవుడు అన్యాయం చేయడు కాబట్టి, తనకు నమ్మకంగా సేవచేస్తున్న ప్రజల గుంపును తప్పకుండా కాపాడతాడనే విషయాన్ని కూడా గమనించండి. (ద్వితీ. 32:4; ఆది. 18:25) పైగా, ఒకవేళ తన సేవకులు ఉనికిలో లేకుండా పోయే పరిస్థితిని అనుమతిస్తే, ‘యెహోవా తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు’ అనే మాటలు అబద్ధమైపోతాయి. (1 సమూ. 12:22) నిజానికి, “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.”—కీర్త. 94:14.

యెహోవా ప్రజలు ఉనికిలో లేకుండా పోయే పరిస్థితి ఎన్నడూ రాదని తెలుసుకోవడం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది. కాబట్టి, యెహోవా చేసిన ఈ వాగ్దానంపై విశ్వాసం ఉంచుతూ ఎల్లప్పుడూ ఆయనను నమ్మకంగా సేవిద్దాం, “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము.”—యెష. 54:17.

[22వ పేజీలోని బ్లర్బ్‌]

తన సేవకులు ఉనికిలో లేకుండా పోయే పరిస్థితిని యెహోవా ఎన్నడూ రానివ్వడు