కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వం ద్వారా బలపడ్డాను

మన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వం ద్వారా బలపడ్డాను

జీవిత కథ

మన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వం ద్వారా బలపడ్డాను

థామ్సన్‌ కాంగాల చెప్పినది

1993, ఏప్రిల్‌ 24న, జాంబియాలోని లుసాకాలో ఉన్న క్రొత్త బ్రాంచి కార్యాలయ కాంప్లెక్స్‌ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఆ కాంప్లెక్స్‌లో 13 బిల్డింగులున్నాయి. నాకు నడవడం చాలా కష్టం కనుక, “మీరు మధ్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మీ కోసం ఒక కుర్చీ వెంట తీసుకురమ్మంటారా?” అని మాకు ఆ కాంప్లెక్స్‌ని చూపిస్తున్న క్రైస్తవ సహోదరి నన్నడిగింది. నేను నల్లవాణ్ణి, ఆమె శ్వేతజాతీయురాలు, కానీ ఆమెకు అలాంటి పట్టింపేమీ లేదు. ఎంతో చలించిపోయిన నేను ఆమెకు కృతజ్ఞతలు తెలిపాను, ఎందుకంటే, ఆమె అలా నాపై దయ చూపడం వల్ల, ఆ బ్రాంచి సౌకర్యాలన్నింటినీ నేను చూడగలిగాను.

అనేక సంవత్సరాలుగా కలుగుతున్న ఇలాంటి అనుభవాలు, నా హృదయాన్ని ఎంతో ఉత్తేజపరిచాయి, యేసు చెప్పిన ప్రేమ, అంటే తన నిజమైన అనుచరులను గుర్తించే ప్రేమ యెహోవాసాక్షుల క్రైస్తవ సహవాసంలో ఉందన్న నా నమ్మకం మళ్ళీమళ్ళీ ధ్రువీకరించబడింది. (యోహాను 13:35; 1 పేతురు 2:​17) అయితే, 1931 లో ఈ క్రైస్తవులతో నాకు పరిచయం ఎలా అయ్యిందో మీకు చెప్తాను. వాళ్లు యెహోవాసాక్షులు అనే బైబిలు ఆధారిత పేరుతో తెలియబడాలన్న తమ కోరికను బహిరంగంగా ప్రకటించిన సంవత్సరం అదే.​—⁠యెషయా 43:⁠12.

ఆఫ్రికాలో తొలి పరిచర్య

1931 నవంబరులో, నాకు 22 ఏండ్లున్నప్పుడు, ఉత్తర రోడీషీయలోని (ఇప్పుడు జింబాబ్వే) కాపర్‌బెల్ట్‌ ప్రాంతంలోవున్న కీట్వేలో నివసిస్తున్నాను. అప్పుడు నాతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన స్నేహితుడే నాకు సాక్షులను పరిచయం చేశాడు. తర్వాత నేను వాళ్ళ కూటాల్లో కొన్నింటికి వెళ్లాను, ఆ తర్వాత, దేవుని వీణ * (ఆంగ్లం) అనే బైబిలు అధ్యయన సహాయకం పంపించమని కోరుతూ, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్న బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం వ్రాశాను. ఆ పుస్తకం ఆంగ్లంలో ఉంది, నాకు ఆంగ్లం అంతగా రాదు కనుక దాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది.

బాంగ్‌వ్యూలు సరస్సుకు నైరృతి దిశగా దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాపర్‌బెల్ట్‌కు సమీప ప్రాంతంలో నేను పెరిగాను, అనేక పొరుగు ప్రాంతాల్లోని వాళ్ళు కాపర్‌బెల్ట్‌లోని రాగి గనుల్లో పని చేసేవారు. సాక్షుల గుంపులు అనేకము బైబిలు అధ్యయనం చేయడానికి క్రమంగా అక్కడ కూడుకునేవి. కొన్నాళ్ళ తర్వాత, నేను కీట్వే నుండి దాని దగ్గరి పట్టణమైన డోలాకు వెళ్ళిపోయి, అక్కడ ఉన్న సాక్షుల గుంపుతో సహవసించడం మొదలుపెట్టాను. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అని పిలువబడే ఫుట్‌బాల్‌ జట్టుకు అప్పుడు నేను క్యాప్టన్‌గా ఉండేవాడిని. దక్షిణాఫ్రికాలో అనేక స్టోర్లు ఉన్న ఆఫ్రికన్‌ లేక్స్‌ కార్పొరేషన్‌ అనే కంపెనీ మేనేజరు ఇంట్లో సేవకుడిగా కూడా నేను పనిచేశాను, ఆయన శ్వేతజాతీయుడు.

నేను ఎక్కువ చదువుకోలేదు. నాకు తెలిసిన కొద్దిపాటి ఆంగ్లం, నేను పనిచేసిన యూరోపియన్ల నుండి నేర్చుకున్నదే. అయినప్పటికీ నాకు ఇంకా ఎక్కువ చదువుకోవాలన్న తపన ఉండేది, దక్షిణ రోడీషీయలోనున్న (ఇప్పుడు జింబాబ్వే) ప్లమ్‌ట్రీలోని ఒక స్కూల్‌లో చదువుకోవడానికి అప్లై చేశాను. అయితే, ఆ మధ్యే కేప్‌టౌన్‌ బ్రాంచి ఆఫీసుకు రెండవసారి ఉత్తరం వ్రాశాను. దేవుని వీణ అన్న పుస్తకం నాకు అందిందనీ, నేను యెహోవాకు పూర్తికాలం సేవ చేయాలని కోరుకుంటున్నాననీ వాళ్ళకు ఆ ఉత్తరంలో తెలిపాను.

వాళ్ళ జవాబు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. “యెహోవాకు సేవ చేయాలన్న మీ కోరికను మేమెంతో ప్రశంసిస్తున్నాము. దాని గురించి ప్రార్థించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము, మీరు సత్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి యెహోవా మీకు తప్పక సహాయపడతాడు, మీరు ఆయనకు సేవ చేయడానికి ఆయనే ఒక చోటును చూసిపెడతాడు” అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ ఉత్తరాన్ని అనేకసార్లు చదివిన తర్వాత, నేను ఏమి చేయాలి అని చాలామంది సాక్షులను అడిగాను. “యెహోవాకు సేవ చేయాలన్నది నిజంగా మీ కోరికైతే, అలాగే చెయ్యండి, వెంటనే చెయ్యండి” అని జవాబిచ్చారు.

ఒక వారమంతా నేను ఆ విషయం గురించి ప్రార్థించాక, చదువు వదిలేసి సాక్షులతో బైబిలు అధ్యయనం కొనసాగించాలనే చివరికి నిర్ణయించుకున్నాను. మరుసటి సంవత్సరం, అంటే 1932 జనవరిలో యెహోవా దేవునికి నన్ను నేను సమర్పించుకున్నానన్న విషయాన్ని నీటి బాప్తిస్మం ద్వారా తెలిపాను. డోలా నుండి దానికి సమీపాన ఉన్న లూవాన్‌షా నగరానికి తరలివెళ్ళాక, అక్కడ జనెట్‌ అనే తోటి విశ్వాసురాలిని కలుసుకున్నాను. 1934 సెప్టెంబరులో మేము పెళ్ళి చేసుకున్నాము. మేము పెళ్ళి చేసుకునేటప్పటికే, జనెట్‌కి ఒక కొడుకూ ఒక కూతురూ ఉన్నారు.

నేను క్రమక్రమంగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి, 1937 లో పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు నేను, ప్రయాణ పరిచారకుడిగా సేవచేయడానికి నియమించబడ్డాను, ప్రయాణ పరిచారకుడ్ని ఇప్పుడు ప్రాంతీయ పైవిచారణకర్త అంటారు. ప్రయాణ పైవిచారణకర్తలు యెహోవాసాక్షులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి వాళ్ళ సంఘాలను సందర్శిస్తారు.

తొలి సంవత్సరాల్లో ప్రకటనా పని

తన దగ్గరకు యెహోవాసాక్షులను పంపించమని కోరిన సోకోంట్వీ అనే ఒక ఆఫ్రికన్‌ గ్రామపెద్దను కలుసుకోమని 1938 జనవరిలో నాకు నిర్దేశం వచ్చింది. ఆయన నివసిస్తున్న ప్రాంతానికి చేరుకోవడానికి నేను మూడు రోజులు సైకిలు మీద ప్రయాణం చేశాను. ఆయన కేప్‌టౌన్‌ బ్రాంచి కార్యాలయానికి వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా నన్ను పంపారని నేను ఆయనకు చెప్పినప్పుడు, ఆయన హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తం చేశాడు.

నేను, ఆయన ప్రజలు ఉంటున్న ఒక్కొక్క గుడిసెకు వెళ్ళి, ఇన్‌సాకా (ప్రజా పందిరి) దగ్గరకు రమ్మని వారిని ఆహ్వానించాను. అలా సమావేశమైన గుంపుతో నేను మాట్లాడాను. దాని ఫలితంగా అనేక బైబిలు అధ్యయనాలు మొదలయ్యాయి. ఆ గ్రామపెద్దా ఆయన గుమస్తా అక్కడి సంఘాలకు పైవిచారణకర్తలైన వారిలో మొదటివారు. నేడు ఆ ప్రాంతంలో 50 కన్నా ఎక్కువ సంఘాలున్నాయి. అదిప్పుడు సాంఫ్యా జిల్లా అని పిలువబడుతోంది.

నేను 1942 నుండి 1947 వరకు, బాంగ్‌వ్యూలు సరస్సు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సేవచేశాను. నేను ఒక్కొక్క సంఘంలో పదేసి రోజుల చొప్పున గడిపేవాణ్ణి. అప్పట్లో, ఆధ్యాత్మిక కోత పని చేసేవాళ్లు చాలా తక్కువ కాబట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు, ‘కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొను[డి]’ అన్నప్పుడు ఎలా భావించాడో మేమూ అలాగే భావించాము. (మత్తయి 9:​36-38) ఆ రోజుల్లో, ప్రయాణించడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి నేను సంఘాలను సందర్శిస్తున్నప్పుడు, జనెట్‌ పిల్లలతోపాటు లూవాన్‌షాలో ఉండిపోయేది. అప్పటికల్లా, జనెట్‌కూ నాకూ మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ వారిలో ఒకబ్బాయి పది నెలల వయస్సులోనే చనిపోయాడు.

ఆ రోజుల్లో మోటారు వాహనాలు తక్కువగా ఉండేవి, రోడ్లు కూడా తక్కువగా ఉండేవన్నదీ నిజమే. నేను జనెట్‌ సైకిల్‌ తీసుకుని ఒక రోజు, 200 కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరానికి ప్రయాణం మొదలుపెట్టాను. మధ్యమధ్యలో నేను ఒక చిన్న నదిని దాటవలసి వచ్చినప్పుడు, సైకిల్‌ని నా భుజాల మీద పెట్టుకుని ఒక చేతితో సైకిల్‌ని పట్టుకుని, మరో చేతితో ఈదేవాడ్ని. ఆ మధ్య, లూవాన్‌షాలోని సాక్షుల సంఖ్య అతి వేగంగా పెరిగింది, 1946 లో 1,850 మంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరయ్యారు.

మన పనికి వ్యతిరేకతను ఎదుర్కోవడం

అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. ఒకసారి, కావామ్‌బ్వాలోని జిల్లా కమీషనర్‌ నన్ను పిలిపించి, “ఇప్పుడు వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రచురణలు నిషేధించబడ్డాయి, కనుక మీరు వాటిని ఉపయోగించడం మానుకోమని చెబుతున్నాను. అయితే నేను మీకు రెఫరెన్సు పుస్తకాలను ఇవ్వగలను, మీరు వాటిని మీ పనిలో ఉపయోగించడానికి ఇతర పుస్తకాలను వ్రాసుకునేందుకు ఉపయోగించుకోగలరు” అని అన్నాడు.

“నాకు మా దగ్గర ఉన్న సాహిత్యం చాలు, వాటిని మించి వేరే ఏమీ నాకు అవసరం లేదు” అని నేను సమాధానమిచ్చాను.

“మీకు అమెరికన్ల గురించి తెలియదు. వాళ్ళు మిమ్మల్ని తప్పు దారి పట్టిస్తారు” అని ఆయన అన్నాడు. (అప్పట్లో మన సాహిత్యం అమెరికాలోనే ముద్రించబడేవి.)

“లేదు, నేను సహవసిస్తున్నవాళ్ళు అలా తప్పుదారి పట్టించరు” అని జవాబిచ్చాను.

అప్పుడు ఆయన, “యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు ఆర్ధిక విరాళాలనివ్వాలని ఇతర మతాల వారు ప్రోత్సహిస్తున్నట్లు, మీరు మీ సంఘాలను ప్రోత్సహించలేరా?” అని అడిగాడు.

“అది ప్రభుత్వ రాయబారుల పని” అని జవాబిచ్చాను.

“మీరు ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని గురించి ఆలోచించవచ్చు కదా?” అని ఆయన అన్నాడు.

“నరహత్య చేయకూడదనీ పోట్లాడరాదనీ నిర్గమకాండము 20:​13; 2 తిమోతి 2:​23, 24 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వచనాల్లో బైబిలు మనకు ఆజ్ఞాపిస్తుంది” అని జవాబిచ్చాను.

నన్ను అక్కడి నుండి వెళ్ళిపోనిచ్చినప్పటికీ, ఆ తర్వాత ఫోర్ట్‌ రోస్‌బెరీలోని జిల్లా కమీషనర్‌ నన్ను మళ్ళీ పిలిపించారు. ఫోర్ట్‌ రోస్‌బెరీ ఇప్పుడు మాన్సా అని పిలువబడుతుంది. “ప్రభుత్వం మీ పుస్తకాలను నిషేధించిందని నీకు తెలపడానికే నిన్ను ఇక్కడికి పిలిపించాను” అని ఆయన అన్నాడు.

“అవును, నేను దాని గురించి విన్నాను” అని చెప్పాను.

“కాబట్టి నువ్వు మీ సంఘాలన్నింటిని సందర్శించి, మీ పుస్తకాలనన్నింటినీ ఇక్కడికి తీసుకురావాలని నీ తోటి ఆరాధకులకు చెప్పు. అర్థమయ్యిందా?”

“అది నా పని కాదు. ప్రభుత్వ రాయబారుల బాధ్యత” అని జవాబిచ్చాను.

ఒక కలయిక వల్ల లభించిన ఫలితం

యుద్ధం తర్వాత కూడా మేము ప్రకటనా పనిచేస్తూనే వచ్చాం. 1947 లో, మ్వాంజా గ్రామంలోని ఒక సంఘంలో సేవ చేయడం ముగించాక, ఒక కప్పు టీ ఎక్కడ కొనుక్కోవచ్చని వాకబు చేశాను. అక్కడి వాళ్ళు అప్పుడు కోండీ వాళ్ళింటిని చూపించారు. అక్కడ టీ రూమ్‌ ఉంది. కోండీ, ఆయన భార్యా నన్ను ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. నేను టీ త్రాగుతుండగా, “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే పుస్తకంలో, “నరకం, నిరీక్షణతో విశ్రాంతి తీసుకునే స్థలం” అనే అధ్యాయాన్ని చదవమని కోండీని కోరాను.

నేను టీ త్రాగడం అయిన తర్వాత, “నరకమంటే ఏమిటని మీరు అర్థం చేసుకున్నారు?” అని అడిగాను. ఆయన, తను చదివిన దాన్ని బట్టి ఆశ్చర్యపోయి, సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత ఆయనా ఆయన భార్యా ఇద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన సాక్షిగా కొనసాగలేదు, కానీ ఆయన భార్య, ఆయన పిల్లల్లో చాలా మంది కొనసాగారు. ఆయన పిల్లల్లో ఒకరైన పిల్నీ, ఇప్పటికీ జాంబియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తోంది. పిల్నీ వాళ్ళ అమ్మ ఇప్పుడు వృద్ధురాలైనప్పటికీ, ఇప్పటికీ నమ్మకమైన సాక్షిగానే ఉంది.

కొంత కాలం తూర్పు ఆఫ్రికాలో నివాసం

ఉత్తర రోడీషీయలో 1948 ప్రారంభంలో, లుసాకాలో స్థాపించబడిన బ్రాంచి కార్యాలయం నన్ను టాంగన్యీకాకు (ఇప్పుడు టాంజానియా) నియమించింది. కాలినడకన పర్వత ప్రాంతం గుండా ప్రయాణం చేయడానికి మరొక సాక్షి నాకూ నా భార్యకూ తోడు వచ్చాడు. గమ్యస్థానానికి చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది, మేము బాగా అలిసిపోయాము. నేను పుస్తకాలనూ, నా భార్య మా బట్టలనూ, ఆ సాక్షి మా పడకా వగైరాలను మోసుకువచ్చాం.

1948 మార్చిలో మేము అంబేయా చేరుకున్నప్పుడు, అక్కడి సహోదరులు బైబిలు బోధలకు మరింత అనుగుణంగా సవరింపులు చేసుకునేలా వారికి సహాయపడడానికి చేయవలసింది చాలా ఉండేది. ఒక విషయమేమిటంటే, మేము ఆ ప్రాంతంలోనివారికి వాచ్‌టవర్‌ ప్రజలమనే తెలుసు. యెహోవాసాక్షులు అనే పేరును సహోదరులు అంగీకరించినప్పటికీ, అది ప్రజల్లో ఇంకా ప్రాచుర్యం పొందలేదు. అంతేకాక, కొంతమంది సాక్షులు, మృతులను ఘనపరచడానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాలను ఇంకా విడిచిపెట్టవలసి ఉంది. అనేకులకు అత్యంత క్లిష్టమైన సవరింపు తమ వివాహాలను చట్టబద్ధం చేసుకోవడం ద్వారా వాటిని అందరి ఎదుట గౌరవనీయంగా చేసుకోవడమే.​—⁠హెబ్రీయులు 13:⁠4.

తర్వాత, ఉగాండాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల్లో సేవచేసే ఆధిక్యత నాకు లభించింది. నేను ఎంటెబెలోను కంపాలాలోను దాదాపు ఆరు వారాలు గడిపాను. బైబిలు సత్యాన్ని తెలుసుకునేందుకు అక్కడి అనేకమంది ప్రజలు సహాయాన్ని పొందారు.

న్యూయార్క్‌ నగరానికి ఆహ్వానం

నేను ఉగాండాలో కొంతకాలం పాటు సేవచేసిన తర్వాత, 1956 తొలిభాగంలో, డార్‌ఎస్సలామ్‌ చేరుకున్నాను. అది టాంగన్యీకా రాజధాని. అక్కడ, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి నా కోసం వచ్చిన ఒక ఉత్తరం ఉంది. 1958 లో జూలై 27 నుండి ఆగస్టు 3 వరకు జరగబోతున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరవ్వడానికి న్యూయార్క్‌కు వెళ్ళేందుకు అవసరమైన సిద్ధపాట్లను ఆరంభించడానికి సంబంధించిన నిర్దేశాలు అందులో ఉన్నాయి. దాని గురించి నేను ఎంత పులకించిపోయానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ సమయం వచ్చినప్పుడు, నేనూ మరొక ప్రయాణ పైవిచారణకర్త లూకా మ్వాంగో, డోలా నుండి దక్షిణ రోడీషీయాలోని సాలిస్‌ బరీకీ (ఇప్పుడు హరారే), ఆ తర్వాత కెన్యాలోని నైరోబీకీ ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోని లండన్‌కీ విమానంలో వెళ్ళాము. అక్కడ మాకు హార్ధిక స్వాగతమివ్వబడింది. మేము ఇంగ్లాండ్‌కు చేరుకున్న రోజు, ఆఫ్రికావాళ్ళమైన మమ్మల్ని శ్వేతజాతీయులు ఎంతటి అతిథి మర్యాదలతో స్వీకరించారో చూసి, ఎంతో పులకించిపోయి, దాని గురించి రాత్రి పడుకున్నప్పుడు చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆ అనుభవం మమ్మల్ని చాలా చాలా ప్రోత్సహించింది.

చివరికి, మేము, న్యూయార్క్‌కి చేరుకున్నాం, సమావేశం అక్కడే జరిగింది. నేను, ఆ సమావేశంలో ఒక రోజు, ఉత్తర రోడీషీయలోని యెహోవాసాక్షుల కార్యకలాపాలను గురించి నివేదించాను. ఆ రోజు న్యూయార్క్‌ నగరంలోని పోలో గ్రౌండ్స్‌లోను, యాంకీ స్టేడియంలోను దాదాపు 2,00,000 మంది హాజరయ్యారు. నాకు లభించిన అంత గొప్ప ఆధిక్యత గురించి ఆ రోజు రాత్రి ఆలోచిస్తూ ఉన్నందువల్ల నిద్రపోలేకపోయాను.

అతి త్వరలోనే సమావేశం పూర్తయ్యింది, మేము ఇంటికి తిరిగి వచ్చాము. మేము ఇంటికి తిరిగి వచ్చే ముందు, ఇంగ్లాండ్‌లోని సహోదర సహోదరీల ప్రేమపూర్వక ఆతిథ్యాన్ని మళ్ళీ అనుభవించాము. ఏ జాతికి చెందినవారు ఏ దేశం వారు అన్న తేడా లేకుండా యెహోవా ప్రజల మధ్యవున్న ఐక్యత, ఆ పర్యటనలో మరపురానంతగా ప్రస్ఫుటమైంది.

సేవా, శ్రమలూ కొనసాగాయి

1967 లో, నేను జిల్లా సేవకుడిగా అంటే ఒక సర్క్యూట్‌ నుండి మరొక సర్క్యూట్‌కి ప్రయాణించే పరిచారకుడిగా నియమించబడ్డాను. అప్పటికల్లా, జాంబియాలోని యెహోవాసాక్షుల సంఖ్య 35,000 కన్నా ఎక్కువైంది. తర్వాత, నా ఆరోగ్యం బాగా క్షీణించినందువల్ల, మళ్ళీ కాపర్‌బెల్ట్‌లోనే ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించబడ్డాను. ఆ తర్వాత, జనెట్‌కి ఆరోగ్య సమస్యలు మొదలై, 1984 డిసెంబరులో మరణించింది. ఆమె తన మరణం వరకూ యెహోవాకు నమ్మకంగా ఉంది.

ఆమె మరణం తర్వాత, నేనే ఆమె చనిపోయేలా ఏదో మంత్రం వేయించానని అవిశ్వాసులైన ఆమె బంధువులు నన్ను నిందించినప్పుడు, నా మనసు ఎంతో బాధపడింది. కొందరికి జనెట్‌ అనారోగ్యం గురించి తెలుసు, ఆమెకు చికిత్స చేసిన డాక్టరుతో వాళ్ళు మాట్లాడారు కూడా. వాళ్ళు ఆమె జబ్బును గురించిన సత్యాన్ని ఆ బంధువులకు వివరంగా తెలియజేశారు. అప్పుడు మళ్ళీ ఒక శ్రమ మొదలైంది. ఊకూప్యానికా అనే సాంప్రదాయక ఆచారాన్ని నేను పాటించాలని కొందరు బంధువులు చెప్పారు. నేను మునుపున్న మతంలోని ఈ సాంప్రదాయం ప్రకారం, భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే బ్రతికివున్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి దగ్గరి బంధువుతో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. అయితే నేను దానికి ససేమిరా ఒప్పుకోలేదు.

చివరికి, బంధువుల ఒత్తిడి ఆగింది. నేను దృఢంగా నిలిచేందుకు యెహోవా నాకు సహాయపడినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. నా భార్య చనిపోయిన ఒక నెల తర్వాత, ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి, “సహోదరా కాంగాలా, మీ భార్య మరణించాక మీరు మెలిగిన విధానం మాకు నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది, దైవభక్తికి విరుద్ధమైన ఒక్క ఆచారానికి కూడా మీరు లొంగిపోలేదు. మీకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నాడు.

ఎంతో అద్భుతమైన కోత

యెహోవాసాక్షుల్లో ఒకరిగా నేను పూర్తికాల పరిచర్య మొదలుపెట్టి ఇప్పటికి 65 సంవత్సరాలు అయ్యింది. గడిచిన ఈ సంవత్సరాల్లో, ఒకప్పుడు నేను ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేసిన ప్రాంతాల్లో వందలాది సంఘాలు రూపొందడాన్నీ అనేక రాజ్య మందిరాలు నిర్మించబడడాన్నీ చూడడం ఎంత ఆనందకరంగా ఉంది! 1943 లో జాంబియాలో, దాదాపు 2,800 మంది సాక్షులు ఉండేవారు, ఇప్పుడు ఇక్కడ సాక్షుల సంఖ్య 1,22,000కి పైగా పెరిగింది. 1,10,00,000 వరకూ జనాభా ఉన్న ఈ దేశంలో, గత సంవత్సరం, 5,14,000 కన్నా ఎక్కువ మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజర్యయారు.

ఈ కాలమంతా, యెహోవా నన్ను చక్కగా చూసుకుంటున్నాడు. నాకు చికిత్స అవసరమైనప్పుడు, ఒక క్రైస్తవ సహోదరుడు నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. ఇప్పటికీ సంఘాలు నన్ను బహిరంగ ప్రసంగాలివ్వడానికి ఆహ్వానిస్తాయి, అలాంటి అనేక సందర్భాలు నన్నెంతో బలపరుస్తాయి. సహోదరీలు వంతుల వారీగా వచ్చి మా ఇంటిని శుభ్రం చేయడానికీ సహోదరులు ప్రతివారం నన్ను కూటాలకు తీసుకువెళ్ళడానికీ నేను సహవసిస్తున్న సంఘం ఏర్పాటు చేసింది. నేను యెహోవాను సేవించకపోతే, ఇంత ప్రేమపూర్వక సంరక్షణ నాకు లభించేది కాదని నాకు తెలుసు. పూర్తికాల పరిచర్యలో నన్ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నందుకూ ఇప్పటి వరకు నేను నిర్వర్తించగలిగిన అనేక బాధ్యతలను నాకిచ్చినందుకూ నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

నా కంటి చూపు మందగించింది, నేను రాజ్యమందిరానికి నడిచి వెళ్ళేటప్పుడు, మధ్యలో అనేకసార్లు విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. ఈ మధ్య నా పుస్తకాల సంచి నాకు చాలా బరువుగా అనిపిస్తుంది, కాబట్టి కూటాల్లో నాకు అవసరం లేని ఏ పుస్తకాన్నైనా తీసేసి బరువు తగ్గించుకుంటాను. చాలామట్టుకు, నేను క్షేత్ర పరిచర్య చేస్తున్నది నా ఇంటికి వచ్చేవారితో బైబిలు అధ్యయనాలను నిర్వహించడం ద్వారానే. అయినప్పటికీ, గత సంవత్సరాలను ఆలోచిస్తూ ఇప్పటి వరకు జరిగిన అద్భుతమైన పెరుగుదలను అవలోకించగలగడం ఎంత ఆహ్లాదకరంగా ఉంది! నేను సేవ చేసిన క్షేత్రంలో, యెషయా 60:22 లో వ్రాయబడిన యెహోవా మాటలు ఉత్కృష్టమైన విధంగా నెరవేరాయి. ఆ వచనం, “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును” అని అంటుంది. నిజంగా, జాంబియాలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అది నెరవేరడాన్ని చూడడానికి నేను జీవించివున్నాను. *

[అధస్సూచీలు]

^ పేరా 7 ఇది యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ దీన్ని ఇప్పుడు ముద్రించడం లేదు.

^ పేరా 50 విచారకరంగా, సహోదరుడు కాంగాల బలం ఉడిగిపోయి, ఈ ఆర్టికల్‌ని ప్రచురించడం కోసం సిద్ధం చేస్తున్న సమయంలోనే నమ్మకమైన సేవకుడిగా చనిపోయారు.

[24వ పేజీలోని చిత్రాలు]

థామ్సన్‌, వెనుక జాంబియా బ్రాంచి

[26వ పేజీలోని చిత్రం]

నేడు జాంబియా బ్రాంచి