కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బంగారం కన్నా మరింత విలువైనదాన్ని వెదకండి

బంగారం కన్నా మరింత విలువైనదాన్ని వెదకండి

మీకెప్పుడైనా బంగారం దొరికిందా? చాలా కొద్దిమందికే అది దొరికివుండవచ్చు. కానీ బంగారంకన్నా మరింత విలువైనదాన్ని లక్షలమంది కనుగొన్నారు. అదే దేవుని గురించిన జ్ఞానం. “సువర్ణము దానికి సాటియైనది కాదు” అని బైబిలు చెప్తుంది.—యోబు 28:12, 15.

కొన్ని విషయాల్లో, నిజమైన ఆసక్తి ఉన్న బైబిలు విద్యార్థులను బంగారం కోసం వెతికేవాళ్లతో పోల్చవచ్చు. ఆ విద్యార్థులు విలువైన జ్ఞానాన్ని సంపాదించాలంటే కష్టపడాలి, లేఖనాలను పరిశోధిస్తూ ఉండాలి. అయితే బంగారాన్ని కనుగొనే మూడు విధానాలను పరిశీలించి వాటినుండి బైబిలు విద్యార్థులమైన మనం ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

మీకు బంగారం దొరికిందా?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మీరు నదీ తీరాన నడుస్తూ వెళ్తున్నారు. సూర్యుని కాంతికి మెరుస్తున్న చిన్న రాయి ఒకటి మీకు కనిపించింది. అదేమిటో చూద్దామని వంగి తీస్తే అది ఒక బంగారం ముక్క అని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అది చూడ్డానికి అగ్గిపుల్లకు ఉండే నల్ల బుడుపు కన్నా చిన్నగా ఉంది, కానీ నాణ్యమైన వజ్రం కన్నా చాలా అరుదైంది. అలాంటి ముక్కలు ఇంకా దొరుకుతాయేమోనని మీరు ఖచ్చితంగా చుట్టూ వెతుకుతారు.

అదేవిధంగా, బైబిల్లో ఉన్న మంచివార్త చెప్పడానికి కొంతకాలం క్రితం ఒక యెహోవాసాక్షి మీ ఇంటికి వచ్చి ఉండవచ్చు, ఆరోజు మీకు బాగా గుర్తుండివుంటుంది. అంతేకాదు మొదటి ఆధ్యాత్మిక బంగారం ముక్క దొరికిన రోజు కూడా మీకు బాగా జ్ఞాపకం ఉండివుంటుంది. బహుశా దేవుని పేరు యెహోవా అని బైబిల్లో మీరు మొట్టమొదటిసారి చూడడమే ఆ బంగారం అయ్యుండవచ్చు. (కీర్త. 83:18) ఆ తర్వాత, మీరు యెహోవాకు స్నేహితులు అవ్వగలరని కూడా నేర్చుకొని ఉంటారు. (యాకో. 2:23) ఆ సమయంలో బంగారం కన్నా మరింత విలువైనదాన్ని మీరు కనుగొన్నారని అర్థంచేసుకుని ఉంటారు. అంతేకాదు మరింత ఆధ్యాత్మిక బంగారాన్ని కనుగొనాలని కూడా కోరుకొనివుంటారు.

మీకు మరింత బంగారం దొరికిందా?

కొన్నిసార్లు సముద్రపు కాలువల్లో, నదుల్లో చిన్నచిన్న బంగారు తునకలు పేరుకుపోయి ఉంటాయి. అలాంటి చోట బంగారం కోసం కష్టపడి వెతికే వ్యక్తి కొన్నినెలల్లో కిలోల కొద్దీ బంగారాన్ని కనుగొంటాడు, అది కొన్ని లక్షల రూపాయల విలువ చేస్తుంది.

మీరు ఒక యెహోవాసాక్షితో బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు, మరింత బంగారం కోసం వెదుకుతున్నట్లు మీకు అనిపించివుంటుంది. ఒక లేఖనం తర్వాత మరో లేఖనం గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు మీ జ్ఞానం మరింత పెరిగివుంటుంది, దేవుని గురించి ఎన్నో విషయాలు నేర్చుకొనివుంటారు. ఆ విలువైన బైబిలు సత్యాల గురించి లోతుగా ఆలోచించడంవల్ల, దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో, దేవుని ప్రేమలో నిలిచివుంటూ నిత్యజీవం ఎలా పొందవచ్చో మీరు నేర్చుకుని ఉంటారు.—యాకో. 4:8; యూదా 20, 21.

బంగారం కోసం కష్టపడి వెతికే వ్యక్తిలా మీరూ విలువైన బైబిలు సత్యాలను నేర్చుకోవడానికి కృషిచేస్తున్నారా?

బంగారు నిధి కోసం వెతికే వ్యక్తిలాగే మీరు కూడా విలువైన బైబిలు సంపదను వెతకడానికి చాలా కష్టపడివుంటారు. బైబిల్లోని ప్రాథమిక సత్యాలు నేర్చుకున్న తర్వాత, సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలనే ఉత్సాహం మీలో కలిగివుంటుంది.—మత్త. 28:19, 20.

వెతుకుతూ ఉండండి

అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావాతో ఏర్పడిన పెద్దరాళ్లలో కూడా చిన్న మొత్తంలో బంగారం ఉంటుంది. అలాంటి కొన్ని రాళ్లలో ఎంత ఎక్కువ బంగారం ఉంటుందంటే, వాటిని బయటకు తీసి పొడిచేసి ఆ ఖనిజం నుండి బంగారాన్ని వేరుచేయవచ్చు. నిజానికి మొదటిసారి చూసినప్పుడు ఖనిజంలోని బంగారం కంటికి కనిపించకపోవచ్చు. ఎందుకంటే అత్యంత నాణ్యమైన 1000 కిలోల ఖనిజంలో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. కానీ కష్టపడి దాన్ని వెలికితీసే వ్యక్తి చాలా సంతోషిస్తాడు.

‘క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు’ నేర్చుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి కృషిచేయాల్సిన అవసరం ఉంటుంది. (హెబ్రీ. 6:1, 2, NW) బైబిలు చదువుతున్నప్పుడు కొత్తకొత్త విషయాల్ని, జీవితంలో ఉపయోగపడే విషయాల్ని తెలుసుకోవడానికి కృషిచేయాలి. అయితే, మీరు ఎన్నో ఏళ్లుగా బైబిల్ని లోతుగా అధ్యయనం చేస్తున్నప్పటికీ, వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయవచ్చు?

నేర్చుకోవాలనే కుతూహలంతో ఉండండి. చిన్నచిన్న విషయాలపై కూడా మనసుపెట్టండి. మీరు కృషిచేస్తూనే ఉంటే, దేవుని జ్ఞానం, నిర్దేశం అనే విలువైన ఆధ్యాత్మిక సంపదను కనుగొంటారు. (రోమా. 11:33) లేఖనాల గురించి మీకున్న జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మీ భాషలో ఉన్న పరిశోధనా ఉపకరణాలను చక్కగా ఉపయోగించుకోండి. మీకు కావాల్సిన నిర్దేశాల కోసం, బైబిలు ప్రశ్నలకు జవాబుల కోసం ఓపిగ్గా వెదకండి. తోటి సహోదరసహోదరీలను కలిసి వాళ్లకు సహాయపడిన, వాళ్లను ప్రోత్సహించిన లేఖనాలు, ఆర్టికల్స్‌ ఏమిటో అడిగి తెలుసుకోండి. మీరు బైబిల్ని లోతుగా పరిశీలిస్తున్నప్పుడు నేర్చుకున్న ఆసక్తికరమైన విషయాల్ని వాళ్లతో పంచుకోండి.

నిజమే, మీ లక్ష్యం కేవలం జ్ఞానం పెంచుకోవడం కాదు. “జ్ఞానము ఉప్పొంగజేయును” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 కొరిం. 8:1) కాబట్టి, వినయంగా ఉంటూ బలమైన విశ్వాసాన్ని కలిగివుండడానికి కృషిచేయండి. కుటుంబ ఆరాధన, వ్యక్తిగత బైబిలు అధ్యయనం క్రమంగా చేసుకుంటే యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించగలుగుతారు, ఇతరులకు సహాయం చేయగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు బంగారం కన్నా మరింత విలువైనదాన్ని కనుగొన్నారనే సంతోషంతో ఉంటారు.—సామె. 3:13, 14.