కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తప్పుగా చిత్రీకరించబడిన గ్రంథం

తప్పుగా చిత్రీకరించబడిన గ్రంథం

తప్పుగా చిత్రీకరించబడిన గ్రంథం

“భూమి తనచుట్టూ తానూ, అలాగే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందనే ద్విచలన సిద్ధాంతం తప్పు, అది పరిశుద్దలేఖనాలకు పూర్తిగా విరుద్ధం.” 1616లో ఓ అధికారిక ప్రకటనలో రోమన్‌ కాథోలిక్‌ చర్చి నిషేధిత పుస్తకాల ఇండెక్స్‌ సంఘం అలా తెలియజేసింది.1 బైబిలు విజ్ఞానశాస్త్ర వాస్తవాలతో నిజంగా ఏకీభవించడంలేదా? లేక అది తప్పుగా చిత్రీకరించబడిందా?

గెలీలియో గలిలీ తాను క్రొత్తగా కనిపెట్టిన టెలిస్కోప్‌ను 1609⁄10 చలికాలంలో ఆకాశంవైపుకి త్రిప్పి, జూపిటర్‌ గ్రహం చుట్టూ తిరుగుతున్న నాల్గు చంద్రుళ్లను కనుగొన్నాడు. గ్రహాలన్నీ భూమిచుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తాయనే సర్వవ్యాప్త నమ్మకాన్ని ఆయన చూసిన విషయం పటాపంచలు చేసింది. 1543 ప్రారంభంలో, పోలండ్‌ దేశస్థుడైన నికొలస్‌ కోపర్‌నికస్‌ అనే ఖగోళశాస్త్రజ్ఞుడు గ్రహాలన్నీ సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తాయనే సిద్ధాంతాన్ని రూపొందించాడు. దీనిని విజ్ఞానశాస్త్ర సత్యమని గెలీలియో నిరూపించాడు.

అయితే, కాథోలిక్‌ మతగురువులకైతే ఇది వితండవాదమే. విశ్వానికి కేంద్రం భూమేనని చర్చి ఎంతోకాలంనుండి విశ్వసించింది.2 “భూమి యెన్నటికిని కదలకుండునట్లు . . దానిని పునాదులమీద” స్థిరపర్చబడినదిగా చిత్రీకరించిన లేఖనాల అక్షరార్థభాష్యంపై ఈ దృక్పథం ఆధారపడివుంది. (కీర్తన 104:5) గెలీలియో రోమ్‌కు రావాలని ఆజ్ఞాపించబడి, ఇన్‌క్విజిషన్‌ విచారణ సభ ఎదుట హాజరయ్యాడు. కఠినంగా విచారించబడిన ఆయన తన పరిశోధనల్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడిచేయబడ్డాడు. ఆయన గృహనిర్బంధంలో తన శేషజీవితాన్ని గడిపాడు.

గెలీలియో మరణించిన దాదాపు 350 ఏళ్ల తర్వాత అంటే 1992లో, ఎంతైనా ఆయన చేసిన పరిశోధనలు వాస్తవం అనే విషయాన్ని చివరకు కాథోలిక్‌ చర్చి గుర్తించింది.3 మరి గెలీలియో పరిశోధన నిజమైతే, బైబిలు తప్పా?

బైబిలు లేఖనాల నిజమైన భావాన్ని కనుగొనడం

బైబిలు సత్యమైనదని గెలీలియో విశ్వసించాడు. తన విజ్ఞానశాస్త్ర పరిశోధనలు, బైబిల్లోని కొన్ని వచనాల సర్వవ్యాప్తభాష్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మతగురువులు ఆ వచనాల నిజమైన భావాన్ని గ్రహించలేక పోతున్నారని ఆయన వాదించాడు. “ఏ రెండు సత్యాలూ ఎన్నటికీ ఒకదాన్నొకటి విభేదించుకోవు” అని ఆయన రాశాడు.4 బైబిల్లోవున్న వాడుక పదాలకు కచ్చితమైన విజ్ఞానశాస్త్ర పదాలు విరుద్ధమైనవి కావని ఆయన సూచించాడు. కానీ మతగురువులు దానితో ఏకీభవించలేదు. భూమిని గూర్చిన బైబిలు వ్యాఖ్యానాలన్నిటినీ అక్షరార్థంగానే తీసుకోవాలని వాళ్లు పట్టుబట్టారు. తత్ఫలితంగా, వాళ్లు గెలీలియో పరిశోధనల్ని తిరస్కరించడం మాత్రమే కాదుగానీ అలాంటి లేఖనాలు వ్యక్తపరుస్తున్న అసలైన భావాల్ని గ్రహించలేకపోయారు.

నిజానికి, “భూమి నాలుగు మూలలు” అని బైబిలు సూచిస్తున్నప్పుడు, భూమి చతురస్రంగా ఉందని బైబిలు రచయితలు తలంచినట్లు దీని భావం కాదనే విషయాన్ని ఇంగిత జ్ఞానం మనకు తెలియజేయాలి. (ప్రకటన 7:1, NW) బైబిలు సామాన్య ప్రజల వాడుక భాషలో రాయబడింది, తరచుగా స్పష్టమైన అలంకారిక భాష ఉపయోగించబడింది. కాబట్టి భూమి ‘నాలుగు మూలల్ని’ కల్గివున్నట్లుగానూ, గట్టి ‘పునాదినీ’ ‘స్తంభాల్నీ’ కల్గివున్నట్లుగానూ, అలాగే ఓ ‘మూలరాయిని’ కల్గివున్నట్టుగానూ బైబిలు మాట్లాడుతున్నప్పుడు, అది భూమిని గూర్చిన విజ్ఞానశాస్త్రపరమైన వివరణను ఇవ్వడంలేదు; స్పష్టంగా, మనం మన అనుదిన సంభాషణలో తరచూ అలంకారికంగా మాట్లాడుకునే రీతిలోనే అది అలంకారికంగా మాట్లాడుతోంది. *యెషయా 51:13; యోబు 38:6.

జీవితచరిత్రకారుడైన ఎల్‌. గోమోనట్‌ గెలీలియో గలిలీ (ఆంగ్లం) అనే తన పుస్తకంలో ఇలా తెలియజేశాడు: “బైబిలు తర్కన ఆధారంగా విజ్ఞానశాస్త్రానికి హద్దులుపెట్టాలనుకునే సంకుచిత స్వభావంగల మత గురువులు బైబిల్ని అప్రతిష్ఠపాలు చేయడం మినహా ఏమీచేయలేరు.”5 వాళ్లు చేసిందదే. నిజానికి, బైబిలుకాదుగానీ బైబిలుకు మత గురువులు చెప్పిన భాష్యమే విజ్ఞానశాస్త్రంపై నిర్హేతుకమైన నిర్బంధాల్ని విధించింది.

అదే విధంగా, నేటి మత మూలసిద్ధాంతవాదులు భూమి 24-గంటల నిడివిగల ఆరు దినాల్లో సృజించబడిందని మొండిగా వాదించేటప్పుడు, వాళ్లు బైబిల్ని వక్రీకరిస్తారు. (ఆదికాండము 1:3-31) అలాంటి దృక్పథం విజ్ఞానశాస్త్రంతోగానీ లేక బైబిలుతోగానీ పొందికకల్గివుండదు. మన అనుదిన వాడుక భాషలో సూచిస్తున్నట్లుగానే, బైబిల్లో కూడా “దినము” అనే పదం వివిధ భావాలున్న పదం. అది వేర్వేరు నిడువులుగల కాల పరిమాణాల్ని సూచిస్తుంది. ఆదికాండము 2:4 లో సృష్టిదినాలు ఆరూ ఒక సంపూర్ణ ‘దినము’గా సూచించబడ్డాయి. బైబిల్లో “దినము” అని అనువదించబడిన హెబ్రీ పదానికి “దీర్ఘకాలం” అనే సరళమైన భావంవుంది.6 కాబట్టి, సృష్టిదినాల్లో ప్రతీ దినమూ 24 గంటల నిడివిని కల్గివుందని వాదించడానికి బైబిల్లో ఏ విధమైన ఆధారమూ లేదు. మరో విధంగా బోధించడంద్వారా, మూలసిద్ధాంతవాదులు బైబిల్ని తప్పుగా చిత్రీకరిస్తారు.—2 పేతురు 3:8 కూడా చూడండి.

చరిత్రయందంతటా, మతగురువులు బైబిల్ని తరచుగా వక్రీకరించారు. బైబిలు చెబుతున్న దాన్ని క్రైస్తవమత సామ్రాజ్య మతాలు తప్పుగా చిత్రీకరించిన మరికొన్ని విధానాల్ని పరిశీలించండి.

మతంచే తప్పుగా చిత్రీకరించబడింది

బైబిల్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ల క్రియలే, తాము పవిత్రమైనదిగా భావిస్తున్నామని చెప్పుకుంటున్న ఆ గ్రంథానికున్న ఖ్యాతిని తరచుగా అప్రతిష్ఠపాలు చేస్తాయి. నామకార్థ క్రైస్తవులు, దేవుని పేరిట ఒకళ్లరక్తాన్ని మరొకళ్లు చిందించుకున్నారు. కానీ, క్రీస్తు అనుచరులు “ఒకరి నొకరు ప్రేమింపవలెనని” బైబిలు ఉద్బోధిస్తోంది.—యోహాను 13:34, 35; మత్తయి 26:52.

కొంతమంది మతగురువులు ఇచ్ఛకపు మాటలుచెప్పి తమ మందల కష్టార్జితాన్ని మోసకరంగా దోచుకుంటున్నారు—మీరు “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అనే లేఖనాధారిత ఉపదేశానికిది ఎంతో భిన్నమైంది.—మత్తయి 10:8; 1 పేతురు 5:2, 3.

స్పష్టంగా, బైబిల్లో రాయబడిన వాటిని ఊరకనే ఎత్తి చెబుతున్నవారి లేక వాటి ప్రకారంగా జీవిస్తున్నామని చెప్పుకునేవారి మాటల్నిబట్టీ, క్రియల్నిబట్టీ దానికి తీర్పుతీర్చలేము. కాబట్టి, బైబిలు ఏమైవుంది, మరి అది ఏమి చెబుతుంది, అదెందుకు అంత విశిష్టమైన గ్రంథమైవుంది అనే విషయాల్ని తనకుతానుగా తెలుసుకోవాలని నిష్పక్షపాతియైన వ్యక్తి కోరుకోవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 8 ఉదాహరణకు, సూర్య నక్షత్ర తారామండలాలు నిజానికి భూభ్రమణం మూలంగానే కదులుతున్నట్లుగా కనబడుతున్నప్పటికీ—వాటిని గురించి మరీ అక్షరార్థంగా దృష్టించే నేటి ఖగోళశాస్త్రజ్ఞులు సహితం అవి ‘ఉదయిస్తున్నాయనీ,’ ‘అస్తమిస్తున్నాయనీ’ అంటారు.

[4వ పేజీలోని చిత్రం]

గెలీలియో టెలిస్కోపుల్లో రెండు టెలిస్కోపులు

[5వ పేజీలోని చిత్రం

ఇన్‌క్విజిషన్‌ విచారణకర్తల ఎదుట గెలీలియో