కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

113వ అధ్యాయం

కష్టపడి పనిచేసే విషయంలో పాఠం​—⁠తలాంతులు

కష్టపడి పనిచేసే విషయంలో పాఠం​—⁠తలాంతులు

మత్తయి 25:14-30

  • తలాంతుల ఉదాహరణ

యేసు తన నలుగురు అపొస్తలులతో ఇంకా ఒలీవల కొండ మీదే ఉన్నాడు. యేసు ఇప్పుడు మరో ఉదాహరణ చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఆయన యెరికోలో ఉన్నప్పుడు, రాజ్యం రావడానికి చాలాకాలం పడుతుందని వివరించడానికి మినాల ఉదాహరణ చెప్పాడు. ఇప్పుడు కూడా అలాంటి ఉదాహరణే చెప్పాడు. తన ప్రత్యక్షత గురించి, వ్యవస్థ ముగింపు గురించి అపొస్తలులు అడిగిన ప్రశ్నకు జవాబుగానే దాన్ని చెప్పాడు. యేసు తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో శిష్యులు కష్టపడి పనిచేయాలని ఆ ఉదాహరణ నొక్కిచెప్తుంది.

యేసు ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు: “పరలోక రాజ్యాన్ని, దూర దేశానికి వెళ్లబోయే ముందు తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని అప్పగించిన వ్యక్తితో పోల్చవచ్చు.” (మత్తయి 25:14) యేసు అంతకుముందు, “రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూర దేశానికి” ప్రయాణమైన వ్యక్తితో తనను తాను పోల్చుకున్నాడు. కాబట్టి ఈ ఉదాహరణలో దూర దేశానికి వెళ్లిన “వ్యక్తి” యేసేనని అపొస్తలులు అర్థం చేసుకొనివుంటారు.—లూకా 19:12.

ఈ ఉదాహరణలోని వ్యక్తి దూర దేశానికి వెళ్లే ముందు, ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాడు, దాన్ని ప్రకటించేలా శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన వెళ్లిపోతున్నాడు, కాబట్టి వాళ్లు ఆ పనిని కొనసాగిస్తారనే నమ్మకంతో దాన్ని వాళ్లకు అప్పగించాడు.—మత్తయి 10:7; లూకా 10:1, 8, 9; యోహాను 4:38; 14:12 పోల్చండి.

ఉదాహరణలోని ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా పంచిపెట్టాడు? యేసు ఇలా చెప్పాడు: “అతను వాళ్లవాళ్ల సామర్థ్యాలకు తగ్గట్టుగా ఒక దాసునికి ఐదు తలాంతులు, ఇంకో దాసునికి రెండు తలాంతులు, మరో దాసునికి ఒక తలాంతు ఇచ్చి వెళ్లిపోయాడు.” (మత్తయి 25:15) తమకు అప్పగించిన తలాంతులతో ఆ దాసులు ఏం చేస్తారు? వాళ్లు కష్టపడి పనిచేస్తూ తమ యజమాని ఆస్తిని వృద్ధి చేస్తారా? యేసు ఇలా చెప్పాడు:

“వెంటనే, ఐదు తలాంతులు పొందిన దాసుడు వెళ్లి, వాటితో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. అలాగే, రెండు తలాంతులు పొందిన దాసుడు ఇంకో రెండు తలాంతులు సంపాదించాడు. అయితే ఒక్క తలాంతు మాత్రమే పొందిన దాసుడు వెళ్లి, గుంట తవ్వి, తన యజమాని డబ్బును అందులో దాచిపెట్టాడు.” (మత్తయి 25:16-18) యజమాని తిరిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది?

యేసు ఇలా చెప్పాడు: “చాలాకాలం తర్వాత యజమాని వచ్చి, ఆ దాసులు తన డబ్బుతో ఏమి చేశారో పరిశీలించాడు.” (మత్తయి 25:19) మొదటి ఇద్దరు దాసులు “వాళ్లవాళ్ల సామర్థ్యాలకు తగ్గట్టుగా” చేయగలిగినదంతా చేశారు. వాళ్లిద్దరూ శ్రద్ధగా పనిచేశారు, కష్టపడ్డారు, తమకు ఇచ్చిన తలాంతులతో లాభం సంపాదించారు. ఐదు తలాంతులు పొందిన దాసుడు మరో ఐదు తలాంతులు సంపాదించాడు, రెండు తలాంతులు పొందిన దాసుడు మరో రెండు తలాంతులు సంపాదించాడు. (అప్పట్లో, కూలిపని చేసే వ్యక్తి దాదాపు 19 సంవత్సరాలు కష్టపడితే ఒక తలాంతు వచ్చేది.) యజమాని ఆ ఇద్దర్నీ ఒకే విధంగా మెచ్చుకున్నాడు: “శభాష్‌, నమ్మకమైన మంచి దాసుడా! నువ్వు కొన్నిటిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను చాలావాటి మీద నియమిస్తాను. నీ యజమానితో కలిసి సంతోషించు.”—మత్తయి 25:21.

కానీ ఒక తలాంతు పొందిన దాసుడు వాళ్లిద్దరిలా కాదు. అతను ఇలా అన్నాడు: “అయ్యా, నువ్వు చాలా కఠినుడివని, విత్తనిదాన్ని కోస్తావని, తూర్పారబట్టని దాన్ని పోగుచేస్తావని నాకు తెలుసు. అందుకే నాకు భయమేసి, వెళ్లి నీ తలాంతును ఒక గుంటలో దాచిపెట్టాను. ఇదిగో, నీ తలాంతు నువ్వు తీసుకో.” (మత్తయి 25:24, 25) అతను ఆ డబ్బును షావుకారుల దగ్గర జమ చేసివుంటే, యజమానికి కనీసం వడ్డీ అయినా వచ్చివుండేది. కానీ అతను అది కూడా చేయలేదు. చెప్పాలంటే, అతను తన యజమాని కోసం ఏమాత్రం కష్టపడలేదు.

అందుకే యజమాని అతన్ని “సోమరివైన చెడ్డదాసుడా” అని పిలిచాడు. అతని దగ్గరున్న తలాంతును తీసుకుని, కష్టపడి పనిచేయాలనే కోరిక ఉన్న దాసునికి ఇవ్వమని యజమాని చెప్పాడు. తర్వాత యజమాని ఇలా అన్నాడు: “ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది, వాళ్ల దగ్గర సమృద్ధిగా ఉంటుంది. కానీ ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది.”—మత్తయి 25:26, 29.

ఈ ఒక్క ఉదాహరణలోనే శిష్యులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. యేసు తమకు అప్పగించిన బాధ్యత, అంటే శిష్యుల్ని చేసే బాధ్యత చాలా ప్రాముఖ్యమైనదని, విలువైనదని అపొస్తలులు గ్రహించాలి. అంతేకాదు, వాళ్లు ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కష్టపడి పనిచేయాలని యేసు కోరుకుంటున్నాడు. అయితే, వాళ్లందరూ తమకు అప్పగించిన ప్రకటనా పనిని ఒకే స్థాయిలో చేయాలని ఆయన కోరుకోవడం లేదు. ఉదాహరణలో చెప్పినట్లు, ప్రతీఒక్కరు “వాళ్లవాళ్ల సామర్థ్యాలకు తగ్గట్టుగా” కృషిచేయాలి. అయితే, యజమాని కోసం ఏమాత్రం కష్టపడకుండా, ‘సోమరిగా’ ఉన్నవాళ్లను యేసు అంగీకరించడు.

యేసు ఉదాహరణలోని ఈ మాటలు అపొస్తలులకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటాయో కదా: “ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది”!