కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

80వ అధ్యాయం

మంచి కాపరి, గొర్రెల దొడ్లు

మంచి కాపరి, గొర్రెల దొడ్లు

యోహాను 10:1-21

  • మంచి కాపరి, గొర్రెల దొడ్ల గురించి యేసు చెప్పాడు

యేసు యూదయలో బోధిస్తూ ఉన్నాడు. ప్రజలకు గొర్రెల గురించి, గొర్రెల దొడ్ల గురించి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన వాటిని ఉదాహరణగా తీసుకుని బోధించాడు. యూదులకు దావీదు రాసిన ఈ మాటలు గుర్తుండే ఉంటాయి: “యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ ఉండదు. పచ్చికబయళ్లలో ఆయన నన్ను పడుకోబెడతాడు.” (కీర్తన 23:1, 2) దావీదు మరో కీర్తనలో ఇశ్రాయేలీయుల్ని ఇలా ప్రోత్సహించాడు: ‘రండి, మనల్ని తయారుచేసిన యెహోవా ముందు మోకరిద్దాం. ఎందుకంటే ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. ఆయన మందలోని గొర్రెలం.’ (కీర్తన 95:6, 7) అవును చాలాకాలం క్రితమే, ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలీయులు గొర్రెల మందతో పోల్చబడ్డారు.

పుట్టుకతోనే ధర్మశాస్త్ర ఒప్పందం కింద ఉన్న ఇశ్రాయేలీయులు, ఒక విధంగా ‘గొర్రెల దొడ్డిలోని’ గొర్రెల్లా ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం వాళ్లకు ఒక కంచెలా పనిచేస్తూ, ధర్మశాస్త్రంలేని ప్రజల చెడు మార్గాల నుండి వాళ్లను కాపాడింది. అయితే, కొంతమంది ఇశ్రాయేలీయులు దేవుని మందతో కఠినంగా వ్యవహరించారు. వాళ్ల గురించి యేసు ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గొర్రెల దొడ్డిలోకి ద్వారం నుండి రాకుండా వేరే మార్గంలో ఎక్కి వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు. అయితే ద్వారం నుండి వచ్చేవాడు గొర్రెల కాపరి.”—యోహాను 10:1, 2.

ఆ మాట వినగానే, మెస్సీయ లేదా క్రీస్తు అని చెప్పుకున్న కొంతమంది వ్యక్తులు ప్రజలకు గుర్తొచ్చి ఉండవచ్చు. వాళ్లు దొంగలు, దోచుకునేవాళ్లు. ప్రజలు అలాంటి మోసగాళ్ల వెనక కాదు గానీ, “గొర్రెల కాపరి” వెనక వెళ్లాలి. ఆ కాపరి గురించి యేసు ఇలా అన్నాడు:

“ద్వారపాలకుడు ఆయన కోసం తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచి, వాటిని బయటికి నడిపిస్తాడు. తన గొర్రెలన్నిటినీ బయటికి తీసుకొచ్చాక, ఆయన వాటి ముందు నడుస్తాడు. అవి ఆయన స్వరాన్ని గుర్తుపడతాయి కాబట్టి ఆయన వెనక వెళ్తాయి. అవి పరాయి వ్యక్తి వెనక అస్సలు వెళ్లవు కానీ అతని దగ్గర నుండి పారిపోతాయి. ఎందుకంటే పరాయివాళ్ల స్వరం వాటికి తెలీదు.”—యోహాను 10:3-5.

గొర్రెల కాపరి యేసేనని, ధర్మశాస్త్రం కిందున్న గొర్రెల్లాంటి ఇశ్రాయేలీయులు ఆయన్ని అనుసరించాలని ద్వారపాలకుడిగా పనిచేసిన యోహాను గుర్తించాడు. గలిలయలో, అలాగే ఇక్కడ యూదయలో కొన్ని గొర్రెలు యేసు స్వరాన్ని గుర్తుపట్టాయి. యేసు వాటిని ఎక్కడికి “నడిపిస్తాడు”? ఆయన్ని అనుసరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఆ ఉదాహరణ వింటున్న కొంతమందికి, ‘ఆయన చెప్పిన పోలిక అర్థం కాలేదు.’—యోహాను 10:6.

యేసు ఇలా వివరించాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గొర్రెలు వెళ్లే ద్వారాన్ని నేనే. నా స్థానంలో వచ్చిన వాళ్లందరూ దొంగలు, దోచుకునేవాళ్లు; అయితే గొర్రెలు వాళ్ల మాట వినలేదు. నేనే ద్వారాన్ని; నా ద్వారా ప్రవేశించేవాళ్లు రక్షించబడతారు. వాళ్లు లోపలికి వెళ్తూ, బయటికి వస్తూ ఉంటారు, వాళ్లకు ఆహారం దొరుకుతుంది.”—యోహాను 10:7-9.

యేసు ఇక్కడ ఒక కొత్త విషయం చెప్తున్నాడు. ధర్మశాస్త్ర ఒప్పందం అనే దొడ్డికి ద్వారం యేసు కాదని ఆ మాటలు వింటున్నవాళ్లకు తెలుసు, ఎందుకంటే అది వందల సంవత్సరాల నుండే అమల్లో ఉంది. కాబట్టి తాను ‘నడిపించే’ గొర్రెలు ఒక కొత్త దొడ్డిలోకి ప్రవేశిస్తాయని యేసు చెప్తున్నాడు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

కాపరిగా తాను ఏమేం చేస్తాడో వివరిస్తూ యేసు ఇంకా ఇలా అన్నాడు: “గొర్రెలు జీవం పొందాలని, శాశ్వత జీవితం పొందాలని నేను వచ్చాను. నేను మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు.” (యోహాను 10:10, 11) యేసు అంతకుముందు తన శిష్యులకు ధైర్యం చెప్తూ, “చిన్నమందా, భయపడకండి, మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం” అన్నాడు. (లూకా 12:32) కాబట్టి ఎవరైతే ‘చిన్నమందలో’ ఉంటారో, వాళ్లనే యేసు ఆ కొత్త దొడ్డిలోకి నడిపిస్తాడు. దానివల్ల వాళ్లు ‘జీవాన్ని, శాశ్వత జీవితాన్ని’ పొందుతారు. చిన్నమందలో ఒకరిగా ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా!

యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి; వాటిని కూడా నేను తీసుకొని రావాలి, అవి నా స్వరాన్ని వింటాయి. అప్పుడు గొర్రెలన్నీ ఒకే కాపరి కింద ఒకే మంద అవుతాయి.” (యోహాను 10:16) వేరే గొర్రెలు ‘ఈ దొడ్డివి కావు.’ కాబట్టి, వాళ్లు రాజ్యాన్ని స్వతంత్రించుకునే ‘చిన్నమందకు’ కాకుండా ఇంకో దొడ్డికి చెందినవాళ్లు అయ్యుండాలి. వేర్వేరు దొడ్లకు చెందిన ఈ గొర్రెలకు వేర్వేరు నిరీక్షణలు ఉన్నాయి. అయినప్పటికీ, వాళ్లంతా తమ కాపరి అయిన యేసు నుండి ప్రయోజనం పొందుతారు. ఆయన ఇలా అన్నాడు: ‘తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను.’—యోహాను 10:17.

అప్పుడు అక్కడున్న ప్రజల్లో చాలామంది, “ఇతనికి చెడ్డదూత పట్టాడు, ఇతను పిచ్చివాడు” అన్నారు. కానీ, కొంతమంది యేసు మాటల్ని శ్రద్ధగా విన్నారు, మంచి కాపరి వెనక వెళ్లాలని కోరుకున్నారు. వాళ్లు ఇలా అన్నారు: “ఇవి చెడ్డదూత పట్టిన మనిషి మాట్లాడే మాటలు కావు. చెడ్డదూత గుడ్డివాడికి చూపు తెప్పించలేడు కదా?” (యోహాను 10:20, 21) యేసు పుట్టుగుడ్డివాడైన వ్యక్తిని బాగుచేయడాన్ని మనసులో ఉంచుకుని వాళ్లు అలా అన్నారు.