కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 41వ అధ్యాయం

యేసు ఎవరి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడు?

యేసు ఎవరి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడు?

మత్తయి 12:22-32 మార్కు 3:19-30 లూకా 8:1-3

  • యేసు రెండో ప్రకటనా యాత్ర ప్రారంభం

  • చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు, క్షమాపణలేని పాపం గురించి హెచ్చరించాడు

క్షమించడం గురించి పరిసయ్యుడైన సీమోను ఇంట్లో మాట్లాడిన కొంతకాలానికే యేసు గలిలయలో మరో ప్రకటనా యాత్ర ప్రారంభించాడు. ఆయన పరిచర్య మొదలుపెట్టి ఇది రెండో సంవత్సరం. ఆయన ఒంటరిగా ప్రయాణించడం లేదు. ఆయనతోపాటు 12 మంది అపొస్తలులు ఉన్నారు, వాళ్లే కాక “చెడ్డదూతలు వెళ్లగొట్టబడిన, రోగాలు బాగైన” కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. (లూకా 8:2) ఆ స్త్రీలలో మగ్దలేనే మరియ, సూసన్న, యోహన్న ఉన్నారు. యోహన్న భర్త, రాజైన హేరోదు అంతిప దగ్గర పనిచేసే అధికారి.

యేసు గురించి ఎక్కువమంది ప్రజలకు తెలిసేకొద్దీ, ఆయన పనుల గురించిన వివాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఒక సందర్భంలో అది స్పష్టమైంది. చెడ్డదూత పట్టిన ఒకతన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చారు. అతను చూడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. యేసు బాగుచేసినప్పుడు, అతను చెడ్డదూత బారి నుండి విడుదల పొందాడు. అతనికి చూపు, మాట రెండూ వచ్చాయి. అది చూసిన ప్రజలు ఆశ్చర్యంతో, “బహుశా ఈయనే దావీదు కుమారుడు అయ్యుంటాడా?” అని చెప్పుకున్నారు.—మత్తయి 12:23.

యేసు ఉన్న ఇంటి దగ్గర చాలామంది గుమికూడారు. దాంతో ఆయనకు, ఆయన శిష్యులకు కనీసం భోజనం చేయడానికి కూడా వీలుకాలేదు. అయితే, అక్కడున్న వాళ్లందరూ యేసే వాగ్దానం చేయబడిన “దావీదు కుమారుడు” అని నమ్మట్లేదు. దూరంలో ఉన్న యెరూషలేము నుండి కూడా కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు అక్కడికి వచ్చారు. వాళ్లు యేసు నుండి నేర్చుకోవడానికో, ఆయనకు మద్దతివ్వడానికో రాలేదు. వాళ్లు, యేసుకు ‘బయెల్జెబూలు పట్టాడని,’ ఆయనకు ‘చెడ్డదూతల నాయకుడితో’ సంబంధం ఉందని ప్రజలతో చెప్పడం మొదలుపెట్టారు. (మార్కు 3:22) ఈ గందరగోళం గురించి విన్న యేసు బంధువులు ఆయన్ని పట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. వాళ్లు ఆయన్ని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు?

అప్పటికింకా యేసు సొంత తమ్ముళ్లు ఆయన దేవుని కుమారుడని నమ్మలేదు. (యోహాను 7:5) నజరేతులో తమతో కలిసి పెరిగిన యేసు ఇలా గందరగోళం సృష్టిస్తున్నాడేంటి అని వాళ్లకు అనిపించి ఉంటుంది. దాంతో, ఆయనకు  ఏదో మానసిక సమస్య వచ్చిందనుకొని, “అతనికి పిచ్చి పట్టింది” అన్నారు.—మార్కు 3:21.

కానీ వాస్తవమేంటి? యేసు కాసేపటి క్రితమే చెడ్డదూత పట్టిన ఒకతన్ని బాగుచేశాడు; అతనికి చూపు, మాట వచ్చాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు ఆయన పేరు పాడుచేయాలని ఆయన మీద తప్పుడు ఆరోపణ మోపారు. “ఇతను చెడ్డదూతల నాయకుడైన బయెల్జెబూలు సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు” అని వాళ్లు అన్నారు.—మత్తయి 12:24.

యేసు వాళ్ల ఆలోచనను పసిగట్టి ఇలా అన్నాడు: “ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే, అది నాశనమౌతుంది. అలాగే ఒక నగరంలోని లేదా ఒక ఇంట్లోని వాళ్లే ఒకరిమీద ఒకరు తిరగబడి విడిపోతే, అది నిలవదు. అదేవిధంగా సాతానే సాతానును వెళ్లగొడుతుంటే, అతను తన మీద తానే తిరగబడి విడిపోతున్నాడు; అప్పుడు అతని రాజ్యం ఎలా నిలుస్తుంది?”—మత్తయి 12:25, 26.

ఎంత చక్కని తర్కం! కొంతమంది యూదులు చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నారని పరిసయ్యులకు తెలుసు. (అపొస్తలుల కార్యాలు 19:13) అందుకే యేసు ఇలా అడిగాడు: “ఒకవేళ నేను బయెల్జెబూలు వల్ల చెడ్డదూతల్ని వెళ్లగొడుతుంటే, మరి మీవాళ్లు ఎవరి వల్ల వెళ్లగొడుతున్నారు?” మరో మాటలో చెప్పాలంటే, వాళ్లు చేసిన ఆరోపణను వాళ్లకు కూడా అన్వయించాలి. తర్వాత యేసు ఇంకా ఇలా అన్నాడు: “కానీ నేను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నది దేవుని పవిత్రశక్తితో అయితే, నిజంగా దేవుని రాజ్యం మిమ్మల్ని దాటివెళ్లినట్టే.”—మత్తయి 12:27, 28.

యేసు చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం, సాతాను కన్నా ఆయనకు ఎక్కువ శక్తి ఉందని రుజువు చేసింది. యేసు ఆ విషయాన్ని ఈ ఉదాహరణతో స్పష్టం చేశాడు: “ఎవరైనా ఒక బలవంతుని ఇంట్లో దూరి అతని వస్తువులు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుణ్ణి కట్టేయాలి కదా? అప్పుడే అతను ఆ ఇల్లంతా దోచుకోగలడు. నావైపు ఉండనివాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొడుతున్నాడు.” (మత్తయి 12:29, 30) శాస్త్రులు, పరిసయ్యులు యేసును వ్యతిరేకించడం ద్వారా తాము సాతాను వైపు ఉన్నామని నిరూపించుకున్నారు. వాళ్లు, యెహోవా సహాయంతో పనిచేస్తున్న దేవుని కుమారుని దగ్గరి నుండి ప్రజల్ని చెదరగొడుతున్నారు.

సాతాను వైపున్న ఈ వ్యతిరేకుల్ని యేసు ఇలా హెచ్చరించాడు: “మనుషులు ఎలాంటి పాపాలు చేసినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా అన్నిటికీ క్షమాపణ ఉంటుంది. కానీ, ఎవరైనా పవిత్రశక్తిని దూషిస్తే మాత్రం వాళ్లకు ఎప్పటికీ క్షమాపణ ఉండదు, వాళ్ల పాపం ఎప్పటికీ పోదు.” (మార్కు 3:28, 29) దేవుని పవిత్రశక్తి చేస్తున్నవాటిని సాతాను చేస్తున్నాడని చెప్పేవాళ్లకు ఎలాంటి గతి పడుతుందో ఆలోచించండి!