కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

88వ కథ

యోహాను యేసుకు బాప్తిస్మమివ్వడం

యోహాను యేసుకు బాప్తిస్మమివ్వడం

ఆ వ్యక్తి తలపై వచ్చి వాలుతున్న పావురాన్ని చూడండి. ఆయన యేసు. ఆయనకు అప్పుడు దాదాపు 30 సంవత్సరాలు. ఆయనతోపాటు ఉన్న వ్యక్తి యోహాను. మనం ఆయన గురించి ఇప్పటికే కొంత తెలుసుకున్నాం. మరియ తన బంధువైన ఎలీసబెతును దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలీసబెతు గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు, మీకు గుర్తుందా? గర్భంలోని ఆ శిశువు యోహానే. అయితే యోహాను, యేసు ఇక్కడ ఏమి చేస్తున్నారు?

యోహాను యేసును యొర్దాను నది నీళ్ళలో ముంచాడు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. మొదట ఆ వ్యక్తి నీళ్ళలో ముంచబడతాడు, తరువాత బయటకు తీయబడతాడు. యోహాను ప్రజలకు అలా బాప్తిస్మం ఇచ్చేవాడు కాబట్టే ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను అని పిలువబడ్డాడు. అయితే యోహాను యేసుకు ఎందుకు బాప్తిస్మం ఇచ్చాడు?

యేసు వచ్చి తనకు బాప్తిస్మం ఇవ్వమని యోహానును అడిగాడు కాబట్టి యోహాను ఇచ్చాడు. తాము చేసిన చెడు పనులకు పశ్చాత్తాపపడుతున్నట్లు చూపించాలనుకునే ప్రజలకు యోహాను బాప్తిస్మమిచ్చేవాడు. మరి యేసు పశ్చాత్తాపపడడానికి ఎప్పుడైనా చెడు పనులు చేశాడా? లేదు, యేసు పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఎన్నడూ చెడు పనులు చేయలేదు. తనకు బాప్తిస్మమిమ్మని ఆయన యోహానును అడగడానికి మరో కారణముంది. ఆ కారణమేంటో మనం చూద్దాం.

యేసు యోహాను దగ్గరకు రాకముందు వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి అంటే చెక్కతో బల్లలు, కుర్చీలు, బెంచీలు వంటివాటిని తయారుచేసే వ్యక్తి. మరియ భర్తయైన యోసేపు వడ్రంగి పని చేసేవాడు, ఆయన యేసుకు కూడా అదే పని నేర్పించాడు. అయితే యెహోవా తన కుమారుణ్ణి వడ్రంగి పని చేయడానికి భూమ్మీదకు పంపించలేదు. ఆయన యేసుకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు. యేసు ఆ పనిని ప్రారంభించవలసిన సమయం వచ్చింది. కాబట్టి యేసు తన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానని చూపించడానికి తనకు బాప్తిస్మమిమ్మని యోహానును అడిగాడు. యేసు అలా చేయడాన్ని చూసి దేవుడు సంతోషించాడా?

అవును సంతోషించాడు, ఎందుకంటే యేసు నీళ్ళలోనుండి పైకి వచ్చిన వెంటనే, ‘ఈయన నా కుమారుడు. ఈయనయందు నేను ఆనందిస్తున్నాను’ అని పరలోకంనుండి ఒక స్వరం వినబడింది. అలాగే, పరలోకం తెరువబడి, ఒక పావురం యేసు మీదకు వచ్చినట్లు కనిపించింది. అయితే అది నిజమైన పావురం కాదు. అది ఒక పావురంగా కనిపిస్తుంది అంతే. నిజానికి అది దేవుని పరిశుద్ధాత్మ.

ఆ తర్వాత యేసు ఎంతో ధ్యానించవలసి ఉంది కాబట్టి ఆయన 40 రోజులపాటు ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ సాతాను ఆయన దగ్గరకు వచ్చాడు. సాతాను యేసుతో దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన పనులు చేయించడానికి మూడుసార్లు ప్రయత్నించాడు. కానీ యేసు అలా చేయలేదు.

ఆ తర్వాత యేసు తిరిగివచ్చి కొంతమందిని కలిశాడు, వాళ్ళే ఆయనకు మొదటి అనుచరులు లేక శిష్యులు అయ్యారు. వాళ్ళలో కొంతమంది పేర్లు అంద్రెయ, పేతురు (సీమోను అని కూడా పిలువబడ్డాడు), ఫిలిప్పు, నతనయేలు (బర్తొలొమయి అని కూడా పిలువబడ్డాడు). యేసు, ఆయన క్రొత్త శిష్యులు గలిలయ జిల్లాకు వెళ్ళారు. గలిలయలో వాళ్ళు నతనయేలు స్వంత పట్టణమైన కానాలో ఆగారు. అక్కడ యేసు ఒక గొప్ప పెండ్లి విందుకు వెళ్ళి తన మొదటి అద్భుతాన్ని చేశాడు. అదేమిటో మీకు తెలుసా? ఆయన నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు.