కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 13

యాకోబు ఏశావు కలిసిపోయారు

యాకోబు ఏశావు కలిసిపోయారు

అబ్రాహామును, ఇస్సాకును కాపాడినట్లే తనను కూడా కాపాడతానని యెహోవా యాకోబుకు మాట ఇచ్చాడు. యాకోబు హారాను అనే చోటుకు వెళ్లి అక్కడే ఉండిపోయాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అతని కుటుంబం బాగా పెద్దది అయ్యింది. అతను చాలా ధనవంతుడు అయ్యాడు.

చివరికి యెహోవా యాకోబుతో ‘నువ్వు నీ సొంత దేశానికి తిరిగి వెళ్లిపో’ అన్నాడు. కాబట్టి యాకోబు, అతని ఇంటివాళ్లు చాలా పెద్ద ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దారిలో కొంతమంది యాకోబు దగ్గరకు వచ్చి ‘నీ అన్న ఏశావు వస్తున్నాడు, అతనితో 400 మంది ఉన్నారు’ అని చెప్పారు. ఏశావు అతనిని అతని కుటుంబాన్ని ఏమైనా చేస్తాడేమో అని యాకోబుకు భయం వేసింది. అతను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: ‘దయచేసి, నన్ను మా అన్న నుండి కాపాడు.’ తర్వాత రోజు యాకోబు ఏశావుకు చాలా గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని, ఒంటెల్ని, గాడిదల్ని బహుమానంగా పంపించాడు.

ఆ రాత్రి యాకోబు ఒక్కడే ఉన్నప్పుడు ఒక దేవదూత కనిపించాడు. ఆ దూత అతనితో కుస్తీ పడుతూ ఉన్నాడు. వాళ్లు పొద్దున వరకు పోరాడారు. యాకోబుకు దెబ్బ తగిలినా దేవదూతని విడిచిపెట్టలేదు. ఆ దూత ‘నన్ను పోనివ్వు’ అని చెప్పాడు. కానీ యాకోబు ‘నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వెళ్లనివ్వను’ అన్నాడు.

ఆ దూత చివరికి యాకోబును ఆశీర్వదించాడు. ఏశావు తనకేమీ చేయకుండా యెహోవా చూసుకుంటాడని అప్పుడు యాకోబుకు తెలిసింది.

తెల్లవారగానే యాకోబు దూరం నుండి ఏశావును అతనితో ఉన్న 400 మందిని చూశాడు. ఇంటివాళ్లను వెనకాల వదిలి యాకోబు ముందు వెళ్తాడు. అతని అన్న ముందు ఏడు సార్లు వంగి నమస్కారం చేశాడు. ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబు చుట్టూ చేతులు వేశాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏడ్చుకుని ఏ గొడవలేకుండా కలిసిపోయారు. యాకోబు ఆ పరిస్థితిలో చేసిన దాన్ని చూసి యెహోవాకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి.

తర్వాత ఏశావు అతని ఇంటికి వెళ్లిపోతాడు. యాకోబు తన దారిలో వెళ్లిపోతాడు. యాకోబుకు 12 మంది కొడుకులు. వాళ్ల పేర్లు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇశ్శాఖారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. యెహోవా తన ప్రజలను కాపాడడానికి వాళ్లలో ఒకడైన యోసేపును ఉపయోగించుకున్నాడు. ఎలానో మీకు తెలుసా? తెలుసుకుందాం.

“మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి, అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా ఉంటారు.”—మత్తయి 5:44, 45