కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 20

చివరి ఆరు తెగుళ్లు

చివరి ఆరు తెగుళ్లు

మోషే, అహరోను దేవుడు చెప్పిన మాటల్ని ఫరోకు వినిపించడానికి వెళ్లి ‘నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, పెద్ద ఈగల్ని దేశం మీదకు పంపిస్తాను’ అని చెప్పారు. గొప్పవాళ్లు, పేదవాళ్లు అని తేడా లేకుండా ఐగుప్తులో అందరి మీదకు ఈ ఈగలు గుంపులు గుంపులుగా వచ్చాయి. దేశమంతా ఈగలతో నిండిపోయింది. కానీ ఇశ్రాయేలీయులు ఉండే గోషేను ప్రాంతంలో మాత్రం ఈగలు లేవు. నాలుగవ తెగులు దగ్గర నుండి ఐగుప్తీయులు మాత్రమే బాధపడ్డారు. ఫరో ఇలా బతిమాలాడు: ‘ఈ ఈగలను తీసేయమని యెహోవాతో చెప్పు. అప్పుడు నీ ప్రజలు వెళ్లొచ్చు.’ కానీ యెహోవా ఈగలను తీసేసినప్పుడు, ఫరో మళ్లీ మనసు మార్చుకున్నాడు. ఫరోకు ఎప్పటికైనా బుద్ధి వస్తుందా?

యెహోవా ఇలా చెప్పాడు: ‘ఫరో నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, ఐగుప్తీయుల జంతువులన్నీ జబ్బు వచ్చి చచ్చిపోతాయి.’ తర్వాత రోజు, జంతువులు చచ్చిపోవడం మొదలయ్యాయి. కానీ ఇశ్రాయేలీయుల జంతువులకు ఏమి కాలేదు. అయినా ఫరో మొండిగా ఉన్నాడు, ఒప్పుకోలేదు.

అప్పుడు యెహోవా మోషేతో ఫరో దగ్గరకు వెళ్లి గాలిలోకి బూడిద విసరమని చెప్పాడు. ఆ బూడిద దుమ్ములా గాలిలో నిండిపోయి ఐగుప్తీయుల అందరి మీద పడింది. ఆ దుమ్ము వల్ల ఐగుప్తీయులకు, వాళ్ల జంతువులకు బాగా నొప్పి పుట్టించే పుండ్లు వచ్చాయి. అయినా సరే ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.

యెహోవా మోషేను ఈ మాట చెప్పమని ఫరో దగ్గరకు పంపిస్తాడు: ‘నువ్వు ఇంకా నా ప్రజలను ఇక్కడ నుండి పంపించడానికి ఒప్పుకోవడం లేదా? రేపు ఈ దేశమంతా వడగండ్లు కురుస్తాయి.’ తర్వాత రోజు యెహోవా వడగండ్లు, ఉరుములు, పిడుగులు పంపిస్తాడు. ఐగుప్తుకు వచ్చిన తుఫానులలో ఇదే చాలా భయంకరమైనది. చెట్లు, పంటపొలాలు అన్నీ నాశనమయ్యాయి. కానీ గోషేను ప్రాంతంలో మాత్రం ఏం జరగలేదు. ఫరో ఇలా అన్నాడు: ‘ఇది ఆపేయమని యెహోవాను వేడుకో. అప్పుడు మీరు వెళ్లవచ్చు.’ కానీ వడగళ్లు, వర్షం ఆగిపోయాక, ఫరో తన మనసు మార్చుకున్నాడు.

మోషే ఇలా అన్నాడు: ‘వడగండ్ల తుఫానులో నాశనం కాకుండా మిగిలిన చెట్లన్నిటిని ఇప్పుడు మిడతలు తినేస్తాయి.’ లక్షల మిడతలు వచ్చి పొలాల్లో, చెట్లమీద మిగిలిపోయిన వాటిని తినేశాయి. ‘ఈ మిడతలను తీసేయమని యెహోవాను బ్రతిమాలు’ అని ఫరో వేడుకుంటాడు. కానీ యెహోవా మిడతల్ని తీసేసినా ఫరో మొండిగానే ఉన్నాడు.

యెహోవా మోషేతో, ‘నీ చేయి ఆకాశం వైపు చాపు’ అన్నాడు. వెంటనే ఆకాశం మొత్తం చీకటిగా అయిపోయింది. మూడు రోజులు ఐగుప్తీయులు ఏమీ చూడలేకపోయారు. ఎవ్వరూ కనిపించలేదు. ఇశ్రాయేలీయుల ఇళ్లలో మాత్రమే వెలుగు ఉంది.

ఫరో మోషేతో ఇలా చెప్పాడు: ‘నువ్వు, నీ ప్రజలు వెళ్లవచ్చు కానీ, మీ జంతువులను ఇక్కడే వదిలేయండి.’ మోషే ఇలా చెప్పాడు: ‘మేము మా జంతువులను తీసుకెళ్లాలి ఎందుకంటే మేము మా దేవునికి వాటిని బలి అర్పించాలి.’ ఫరోకు చాలా కోపం వచ్చింది. ఆయన ఇలా అరిచాడు: ‘ఇక్కడ నుండి వెళ్లిపోండి! ఈసారి నేను నిన్ను చూస్తే చంపేస్తాను.’

“నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.”—మలాకీ 3:18