కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3 యేసు గురించిన సత్యాన్ని తెలుసుకోండి

3 యేసు గురించిన సత్యాన్ని తెలుసుకోండి

3 యేసు గురించిన సత్యాన్ని తెలుసుకోండి

‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను అనుగ్రహించాడు.’—యోహాను 3:16.

ఆటంకం: యేసు అనే వ్యక్తి అసలు జీవించనేలేదని కొంతమంది అంటారు. మరికొంతమంది, ఆయన జీవించాడని ఒప్పుకుంటారు కానీ, ఆయన ఎప్పుడో చనిపోయిన ఓ సాధారణ వ్యక్తి అంటారు.

దాన్నెలా అధిగమించవచ్చు? నతనయేలు * అనే యేసు శిష్యుణ్ణి ఆదర్శంగా తీసుకోండి. ఆయన స్నేహితుడైన ఫిలిప్పు వచ్చి మెస్సీయ ఎవరో తనకు తెలిసిపోయిందని, ఆయన ఎవరో కాదు ‘యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసే’ అని చెప్పాడు. అయితే, నతనయేలు ఫిలిప్పు చెప్పింది వెంటనే నమ్మకుండా “నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?” అని అడిగాడు. నతనయేలుకు సందేహాలున్నా, “వచ్చి చూడు” అని ఫిలిప్పు అన్నప్పుడు ఆయన ఫిలిప్పుతో వెళ్లాడు. (యోహాను 1:43-51) అలాగే, మీరు కూడా యేసు ఎవరనే విషయాన్ని స్వయంగా తెలుసుకుంటే ప్రయోజనం పొందుతారు. అయితే మీరేమి చేయవచ్చు?

యేసు నిజంగా జీవించాడని చూపించే చారిత్రక రుజువులను పరిశోధించండి. మొదటి శతాబ్దంలో జీవించిన జోసీఫస్‌, టాసిటస్‌ అనే గౌరవనీయులైన ఇద్దరు చరిత్రకారులు క్రైస్తవులు కాదు. అయినా, వీళ్లు యేసుక్రీస్తు నిజంగా జీవించాడని చెప్పారు. సా.శ. 64లో రోమాలో చెలరేగిన అగ్ని ప్రమాదానికి కారణం క్రైస్తవులని రోమా చక్రవర్తి అయిన నీరో వేసిన నింద గురించి చెప్తూ టాసిటస్‌ ఇలా రాశాడు: “అప్పట్లో ప్రజలు క్రైస్తవులని పిలిచిన ఒక వర్గం చేస్తున్న పనులు ఇష్టంలేని కారణంగా నీరో వారిపై అపరాధాన్ని మోపి వారిని తీవ్రంగా హింసించాడు. తిబెరి పరిపాలనాకాలంలో అధికారంలోవున్న పొంతి పిలాతు అనే మన న్యాయాధికారి, క్రైస్తవులు అనే పేరుకు మూలమైన క్రిస్తుస్‌ [క్రీస్తు] అనే వ్యక్తికి మరణ శిక్ష విధించాడు.”

యేసుకు సంబంధించి, తొలి క్రైస్తవులకు సంబంధించి మొదటి శతాబ్దంలోని, రెండవ శతాబ్దంలోని చరిత్రకారులు చెప్పినవాటి గురించి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 2002వ సంచిక ఇలా చెప్తోంది: “ప్రాచీన కాలాల్లో క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా యేసు నిజంగా జీవించాడన్న విషయాన్ని సందేహించలేదని ఆయా వృత్తాంతాలు రుజువు చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై మొదటిసారిగా 18వ శతాబ్దం చివర్లో, ఆ తర్వాత 19వ శతాబ్దంలో, 20 శతాబ్దం ఆరంభంలో సరైన కారణాలు లేకుండానే వాదోపవాదాలు జరిగాయి.” 2002లో ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంపాదకీయం ఇలా తెలియజేసింది: “కొంతమంది నాస్తికులు తప్ప చాలామంది పండితులు నజరేయుడైన యేసు నిజంగా జీవించాడనే వాస్తవాన్ని ఎప్పుడో అంగీకరించారు.”

యేసును దేవుడు తిరిగి బ్రతికించాడనే రుజువును పరిశీలించండి. యేసు వ్యతిరేకులు ఆయనను బంధించినప్పుడు ఆయన దగ్గరి స్నేహితులు ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. అంతేకాదు, ఆయన స్నేహితుడైన పేతురు భయంతో ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పాడు. (మత్తయి 26:55, 56, 69-75) సైనికులు యేసును బంధించడంతో, ఆయన అనుచరులు తలా ఒక దిక్కు పారిపోయారు. (మత్తయి 26:31) కానీ ఆ తర్వాత వెంటనే, ఆయన శిష్యులు ఉత్సాహంగా ప్రకటించడం మొదలుపెట్టారు. పేతురు, యోహానులు యేసును చంపడానికి కుట్రపన్నిన మనుషుల ముందు ధైర్యంగా నిలబడ్డారు. యేసు శిష్యులు ఎంతగా పురికొల్పబడ్డారంటే వాళ్లు తమ విశ్వాసాన్ని వదులుకునే బదులు చావడానికైనా సిద్ధపడి, రోమా సామ్రాజ్యమంతటా ఆయన బోధలను ప్రకటించారు.

వాళ్లలో ఇంత పెద్ద మార్పు రావడానికి కారణం ఏమిటి? యేసును దేవుడు తిరిగి బ్రతికించాడనీ అలా ఆయన తిరిగి బ్రతికిన తర్వాత ‘కేఫాకు [పేతురుకు] తర్వాత పండ్రెండుగురికి కనిపించాడనీ’ అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఆ తర్వాత ఆయన ‘ఐదు వందలకన్నా ఎక్కువమంది సహోదరులకు ఒక్క సమయంలోనే కనిపించాడు’ అని కూడా పౌలు చెప్పాడు. పౌలు ఆ మాటలు రాసే సమయానికి ప్రత్యక్షసాక్షుల్లో చాలామంది ఇంకా బ్రతికేవున్నారు. (1 కొరింథీయులు 15:3-7) ప్రత్యక్షసాక్షులు ఒక్కరో ఇద్దరో అయితే సంశయవాదులు దాన్ని తేలిగ్గానే కొట్టిపారేయవచ్చు. (లూకా 24:1-11) కానీ, ప్రత్యక్షసాక్షులు ఐదువందలకన్నా ఎక్కువమంది ఉన్నారు కాబట్టి, యేసును దేవుడు తిరిగి బ్రతికించాడు అనడానికి అది తిరుగులేని సాక్ష్యం.

ప్రతిఫలం ఏమిటి? యేసును విశ్వసించి ఆయన ఆజ్ఞలను పాటించేవాళ్ల పాపాలను దేవుడు క్షమిస్తాడు కాబట్టి, వాళ్లు మంచి మనస్సాక్షిని కలిగివుండవచ్చు. (మార్కు 2:5-12; 1 తిమోతి 1:19; 1 పేతురు 3:16-22) వాళ్లు ఒకవేళ చనిపోయినా “అంత్యదినమున” తిరిగి బ్రతికిస్తానని యేసు వాగ్దానం చేశాడు.—యోహాను 6:40. (w09 5/1)

మరింత వివరణ కోసం బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? * పుస్తకంలోని “యేసుక్రీస్తు ఎవరు?” అనే నాలుగో అధ్యాయం, “విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం” అనే ఐదో అధ్యాయం చూడండి.

[అధస్సూచీలు]

^ పేరా 4 మత్తయి, మార్కు, లూకా తమ సువార్తల్లో నతనయేలును బర్తొలొమయి అనే పేరుతో ప్రస్తావించారు.

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించారు.

[7వ పేజీలోని చిత్రం]

నతనయేలు స్వయంగా తెలుసుకున్నట్లు, యేసు నిజంగా జీవించాడని చూపించే రుజువులను పరిశోధించండి