కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్వం, వినయం గురించిన పాఠం

గర్వం, వినయం గురించిన పాఠం

గర్వం, వినయం గురించిన పాఠం

రాజైన దావీదు జీవితంలోని ఓ సంఘటన, నిజమైన వినయానికి గర్వానికి మధ్య వ్యత్యాసాన్ని నొక్కిచూపిస్తుంది. దావీదు యెరూషలేమును స్వాధీనపరచుకొని, దానిని తన రాజధానిగా చేసుకున్న తర్వాత ఆ సంఘటన జరిగింది. యెహోవాయే ఇశ్రాయేలుకు నిజమైన రాజని దావీదు దృష్టించాడు, అందుకే ఆయన దేవుని ప్రత్యక్షతను సూచించే మందసాన్ని నగరంలోకి తీసుకువచ్చే ఏర్పాటు చేశాడు. దావీదుకు ఆ సంఘటన ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఆయన మందసాన్ని మోస్తున్న యాజకుల వెంట వెళ్తూ అందరూ చూసేలా తన సంతోషాన్ని ప్రదర్శించాడు. యెరూషలేము నివాసులు తమ రాజు “గంతులు వేయుచు,” ‘తన శక్తికొలది నాట్యమాడడాన్ని’ చూశారు.​—⁠1 దినవృత్తాంతములు 15:15, 16, 29; 2 సమూయేలు 6:​11-​16.

అయితే, దావీదు భార్యయైన మీకాలు మాత్రం ఆనందంగా సాగిన ఆ ఊరేగింపులో పాలుపంచుకోలేదు. ఆమె కిటీకీలో నుండి దాన్ని గమనిస్తూ, యెహోవాను దావీదు స్తుతిస్తున్న తీరును ప్రశంసించే బదులు, ఆమె “తన మనస్సులో అతని హీనపరచెను.” (2 సమూయేలు 6:​16) మీకాలు ఎందుకలా భావించింది? ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలుకు కుమార్తెగానే కాక, ప్రస్తుతం ఇశ్రాయేలుకు రెండవ రాజుకు భార్యగా ఉన్న తన తన హోదాకే ఆమె అధిక ప్రాముఖ్యతనిచ్చింది. రాజుగా ఉన్న తన భర్త, తన స్థాయినుండి సామాన్యుల స్థాయికి దిగజారి వారి ఊరేగింపులో పాల్గొనకూడదని ఆమె భావించి ఉండవచ్చు. ఆమెలోని అలాంటి అహంభావ భావాలు దావీదు ఇంటికి తిరిగివచ్చినప్పుడు ఆయనను ఆహ్వానిస్తూ ఆమె అన్న మాటల్లో వెల్లడయ్యాయి. ఆమె వ్యంగ్యంగా ఇలా అంది: “హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసియెంత ఘనముగా కనబడితివి.”​—⁠2 సమూయేలు 6:⁠20.

ఈ విమర్శకు దావీదు ఎలా స్పందించాడు? దావీదు ఆమెను ఖండిస్తూ, యెహోవా ఆమె తండ్రియైన సౌలును నిరాకరించి తనపై అనుగ్రహం చూపించాడని అన్నాడు. దావీదు ఇంకా ఇలా అన్నాడు: “ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదును.”​—⁠2 సమూయేలు 6:​21, 22.

అవును, యెహోవాను వినయంతో సేవించాలనే దావీదు తీర్మానించుకున్నాడు. దావీదుకున్న ఆ వైఖరినిబట్టి యెహోవా ఆయనను “నా యిష్టానుసారుడైన మనుష్యుడు” అని ఎందుకు అన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. (అపొస్తలుల కార్యములు 13:22; 1 సమూయేలు 13:​14) వాస్తవానికి, వినయానికి సర్వోత్తమ మాదిరియైన యెహోవా దేవుణ్ణే దావీదు అనుకరిస్తున్నాడు. ఆసక్తికరంగా, ‘నేను అల్పుడనౌతాను’ అని మీకాలుతో దావీదు పలికిన మాటల్ని సూచించేందుకు ఉపయోగించబడిన హెబ్రీ మూల క్రియాపదమే మానవులపట్ల దేవుని దృక్కోణాన్ని వివరించడానికి కూడా ఉపయోగించబడింది. యెహోవా విశ్వంలో మహోన్నతుడైనప్పటికీ, కీర్తన 113:​6, 8 ఆయనను ఇలా వర్ణిస్తుంది: “భూమ్యాకాశములను వంగి [తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు తన ఉన్నతస్థానం నుండి లేదా హోదానుండి క్రిందికి వచ్చి] చూడననుగ్రహించుచున్నాడు. ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు.”

యెహోవా వినయంగలవాడు కాబట్టి, “అహంకార దృష్టి”గల గర్వాంధులను ఆయన ద్వేషించడంలో ఆశ్చర్యం లేదు. (సామెతలు 6:​16, 17) ఆ చెడు గుణాన్ని ప్రదర్శించి, దేవుడు ఎంపికచేసిన రాజుపట్ల అగౌరవాన్ని చూపించినందుకు, దావీదుకు బిడ్డను కనే ఆధిక్యత మీకాలుకు లభించలేదు. ఆమె గొడ్రాలిగానే మరణించింది. మనకెంత ప్రాముఖ్యమైన పాఠమో కదా! దేవుని అనుగ్రహం కోరుకునేవారందరూ ఈ మాటల్ని ఖచ్చితంగా అనుసరించాలి: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”​—⁠1 పేతురు 5:⁠5.