సమూయేలు మొదటి గ్రంథం 13:1-23
13 సౌలు రాజైనప్పుడు+ అతనికి . . .* ఏళ్లు; అతను రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాడు.
2 సౌలు ఇశ్రాయేలీయుల్లో నుండి 3,000 మందిని ఎంచుకున్నాడు. వాళ్లలో 2,000 మంది సౌలుతోపాటు మిక్మషులో, బేతేలు దగ్గరున్న పర్వత ప్రాంతంలో ఉండేవాళ్లు; 1,000 మంది యోనాతానుతోపాటు+ బెన్యామీనీయుల గిబియాలో+ ఉండేవాళ్లు. సౌలు మిగతా ప్రజల్ని వాళ్లవాళ్ల డేరాలకు పంపించేశాడు.
3 తర్వాత యోనాతాను గెబాలో+ ఉన్న ఫిలిష్తీయుల+ సైనిక స్థావరం మీద దాడిచేసి వాళ్లను ఓడించాడు. ఫిలిష్తీయులు దాని గురించి విన్నారు. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశమంతటా బూర* ఊదించి,+ “హెబ్రీయులారా, వినండి!” అంటూ ప్రకటన చేయించాడు.
4 “సౌలు ఫిలిష్తీయుల సైనిక స్థావరం మీద దాడిచేసి వాళ్లను ఓడించాడు, కాబట్టి ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల్ని అసహ్యించుకుంటున్నారు” అనే వార్త ఇశ్రాయేలీయులందరూ విన్నారు. కాబట్టి ప్రజలు గిల్గాలులో+ సౌలును అనుసరించడానికి పిలిపించబడ్డారు.
5 ఫిలిష్తీయులు కూడా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సమకూడారు. వాళ్లు 30,000 యుద్ధ రథాలతో, 6,000 మంది గుర్రపురౌతులతో, సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులతో వచ్చారు;+ వాళ్లు బేతావెనుకు+ తూర్పు వైపున మిక్మషులో మకాం వేశారు.
6 తాము కష్టంలో ఉన్నామని ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైంది, ఎందుకంటే వాళ్లు ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు; దాంతో వాళ్లు గుహల్లో,+ బండ సందుల్లో, బండల్లో, నేలమాళిగల్లో, గుంటల్లో దాక్కున్నారు.
7 కొంతమంది హెబ్రీయులైతే యొర్దానును దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు+ కూడా వెళ్లారు. కానీ సౌలు మాత్రం గిల్గాలులోనే ఉన్నాడు, అతన్ని అనుసరిస్తున్న ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు.
8 సమూయేలు నియమించిన సమయం వరకు, అంటే ఏడురోజుల పాటు సౌలు వేచివున్నాడు. కానీ సమూయేలు గిల్గాలుకు రాలేదు. ప్రజలేమో సౌలు దగ్గర నుండి చెదిరిపోతున్నారు.
9 చివరికి సౌలు, “దహనబలిని, సమాధాన బలుల్ని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. అప్పుడు అతను దహనబలిని అర్పించాడు.+
10 సౌలు దహనబలిని అర్పించడం పూర్తవ్వగానే సమూయేలు వచ్చాడు. దాంతో సౌలు అతన్ని కలిసి పలకరించడానికి వెళ్లాడు.
11 అప్పుడు సమూయేలు, “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. దానికి సౌలు ఇలా జవాబిచ్చాడు: “ప్రజలు నన్ను విడిచివెళ్తుండడం+ నేను చూశాను. నువ్వేమో నియమించిన సమయానికి రాలేదు. ఫిలిష్తీయులేమో మిక్మషులో సమకూడుతున్నారు.+
12 కాబట్టి నేను, ‘ఇప్పుడు ఫిలిష్తీయులు గిల్గాలులో నా మీదికి వస్తారు, కానీ నేను ఇంకా యెహోవా అనుగ్రహాన్ని కోరలేదు’ అని అనుకున్నాను. అందుకే నేనే దహనబలిని అర్పించాను.”
13 అప్పుడు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “నువ్వు తెలివితక్కువగా ప్రవర్తించావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞకు నువ్వు లోబడలేదు.+ ఒకవేళ నువ్వు లోబడివుంటే, యెహోవా ఇశ్రాయేలు మీద నీ రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపర్చేవాడు.
14 కానీ ఇప్పుడు నీ రాజ్యం నిలవదు.+ యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞకు నువ్వు లోబడలేదు+ కాబట్టి యెహోవా తన హృదయానికి నచ్చిన ఒక వ్యక్తిని కనుగొంటాడు.+ యెహోవా అతన్ని తన ప్రజలమీద నాయకునిగా నియమిస్తాడు.”+
15 తర్వాత సమూయేలు లేచి గిల్గాలు నుండి బెన్యామీనీయుల గిబియాకు వెళ్లాడు. సౌలు ప్రజల్ని లెక్కపెట్టాడు; అతనితో ఇంకా దాదాపు 600 మంది ఉన్నారు.+
16 సౌలు, అతని కుమారుడైన యోనాతాను, వాళ్లతో ఇంకా ఉన్న ప్రజలు బెన్యామీనీయుల గెబాలో+ ఉన్నారు. ఫిలిష్తీయులు మిక్మషులో+ మకాం వేశారు.
17 దాడిచేసే దళాలు మూడు దండ్లుగా ఫిలిష్తీయుల శిబిరం నుండి బయల్దేరేవి. ఒక దండు ఒఫ్రాకు వెళ్లే దారిలో షూయాలు ప్రాంతానికి వెళ్లేది;
18 ఇంకో దండు బేత్-హోరోనుకు+ వెళ్లే దారిలో వెళ్లేది; మూడో దండు జెబోయిము లోయకు ఎదురుగా ఉన్న సరిహద్దుకు నడిపించే దారిలో ఎడారి వైపు వెళ్లేది.
19 ఆ సమయంలో ఇశ్రాయేలు దేశమంతటా ఒక్క కమ్మరి కూడా లేడు. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇలా అనుకున్నారు: “అప్పుడే హెబ్రీయులు ఒక్క ఖడ్గాన్ని గానీ ఈటెను గానీ చేసుకోకుండా ఉంటారు.”
20 దాంతో ఇశ్రాయేలీయులందరూ తమ నాగటి నక్కులకు, తొల్లికలకు,* గొడ్డళ్లకు, కొడవళ్లకు పదును పెట్టించుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది.
21 నాగటినక్కులకు, తొల్లికలకు, మూడు ముండ్ల పరికరాలకు, గొడ్డళ్లకు పదును పెట్టించుకోవడానికి, మునికోలను బిగించడానికి ఒక పిమ్* చెల్లించేవాళ్లు.
22 యుద్ధం జరిగే రోజున సౌలు, యోనాతానుల వెంట ఉన్న ప్రజల్లో ఎవ్వరి దగ్గర ఒక్క ఖడ్గం గానీ ఈటె గానీ కనిపించలేదు;+ సౌలు, అతని కుమారుడైన యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయి.
23 ఫిలిష్తీయుల సైనిక దళం ఒకటి మిక్మషులోని+ కనుమ దగ్గరికి వెళ్లింది.
అధస్సూచీలు
^ హీబ్రూ మూలపాఠంలో సంఖ్య లేదు.
^ అక్ష., “కొమ్ము.”
^ ఒకవైపు గొడ్డలి మొన, ఇంకోవైపు సన్నని పార ఉండే పనిముట్టు.
^ దాదాపు 8 గ్రాముల బరువు ఉండే ఒక ప్రాచీన కొలత. అనుబంధం B14 చూడండి.