కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఊహించని స్థలంలో సత్యాన్ని కనుగొనడం

ఊహించని స్థలంలో సత్యాన్ని కనుగొనడం

రా జ్య ప్ర చా ర కు ల ని వే ది క

ఊహించని స్థలంలో సత్యాన్ని కనుగొనడం

“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె”నన్నది దేవుని చిత్తం. (1 తిమోతి 2:​3, 4) ఈ లక్ష్యాన్ని సాధించడానికి, యెహోవాసాక్షులు కోట్ల సంఖ్యలో బైబిళ్ళను, బైబిలు అధ్యయన సహాయకాలను ముద్రించి, పంచిపెట్టారు. కొన్నిసార్లు, ఏమాత్రం ఊహించని విధాల్లో, యథార్థహృదయులు సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రచురణలు సహాయం చేశాయి. ఈ విషయమై, సియర్రా లియోన్‌లోనున్న ఫ్రీటౌన్‌లోని రాజ్య ప్రచారకులు ఈ క్రింది అనుభవాన్ని నివేదిస్తున్నారు.

తొమ్మిదిమంది పిల్లలున్న ఒక కుటుంబంలో ఊస్మాన్‌ రెండవ కుమారుడు. దైవభక్తిగల కుటుంబంలో పెరిగిన ఆయన క్రమంగా తన తండ్రితోపాటు ఆరాధనకు వెళ్తుండేవాడు. అయితే, తన మతం నరకం గురించి బోధిస్తున్నదాన్ని బట్టి ఊస్మాన్‌ ఎంతో కలతచెందాడు. కనికరంగల దేవుడు దుష్ట ప్రజలను అగ్నిలో కాల్చడం ద్వారా వారిని ఎలా హింసిస్తాడో ఆయనకు అర్థమయ్యేదికాదు. నరకాగ్ని సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేందుకు సహాయకంగా ఊస్మాన్‌కు ఇవ్వబడిన వివరణలేవీ ఆయనకు మనశ్శాంతిని ఇవ్వలేకపోయాయి.

ఊస్మాన్‌ 20 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఒకరోజు, ఒక చెత్త కుండీలో చెత్త మధ్యన సగభాగం వరకు కూరుకుపోయిన ఒక నీలం రంగు పుస్తకాన్ని ఆయన గమనించాడు. పుస్తకాలంటే ఉన్న మక్కువతో ఆయన దాన్ని తీసుకొని శుభ్రం చేశాడు, దాని పేరు నిత్యజీవమునకు నడుపు సత్యము * అని ఉండడం చూశాడు.

‘ఈ సత్యము ఏమిటి?’ అని ఊస్మాన్‌ ఆశ్చర్యపోయాడు. ఆయనలో కుతూహలం పెరగడంతో ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వెంటనే దాన్ని మొత్తం చదివేశాడు. దేవుని పేరు యెహోవా అని తెలిసికొని ఆయన ఎంత ఉప్పొంగిపోయాడో! (కీర్తన 83:​18) దేవుని సర్వోన్నతమైన లక్షణం ప్రేమ అనీ, ప్రజలను అగ్నిమయమైన స్థలంలో హింసించడమన్న తలంపు కూడా ఆయనకు హేయమైనదనీ ఊస్మాన్‌ తెలుసుకున్నాడు. (యిర్మీయా 32:​35; 1 యోహాను 4:⁠8) చివరిగా, యెహోవా త్వరలోనే భూపరదైసును తీసుకువస్తాడని, దానిలో ప్రజలు నిరంతరం జీవించగలుగుతారని ఊస్మాన్‌ చదివాడు. (కీర్తన 37:​29; ప్రకటన 21:​3, 4) ప్రేమాకనికరాలు గల దేవుని నుండి ఎంతటి అద్భుతమైన సత్యం! తాను ఎంతమాత్రం ఊహించలేని స్థలంలో సత్యాన్ని కనుగొనే అవకాశం ఇచ్చినందుకు ఊస్మాన్‌ యెహోవాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

కొన్ని రోజుల తర్వాత, కొందరి స్నేహితుల సహాయంతో ఊస్మాన్‌ యెహోవాసాక్షుల రాజ్యమందిరం ఎక్కడ ఉందో తెలుసుకొని, మొదటిసారిగా ఒక కూటానికి హాజరయ్యాడు. తనతో బైబిలు అధ్యయనం చేయమని అక్కడ ఒక సాక్షిని అడిగాడు. కుటుంబం నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనప్పటికీ, ఊస్మాన్‌ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకున్నాడు. (మత్తయి 10:​36) నేడు, ఆయన సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు. చెత్త కుండీలో ఒక బైబిలు ప్రచురణ దొరకడం ద్వారా ఇదంతా జరగడం ఎంత అద్భుతమో కదా!

[అధస్సూచి]

^ పేరా 5 యెహోవాసాక్షులు 1968 లో ప్రచురించినది.