కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

నీటిలో ముంచడానికి కష్టమయ్యేంతటి తీవ్రమైన అంగవైకల్యం గానీ అనారోగ్యం గానీ ఉన్న ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటే, అలాంటి వ్యక్తిని కూడా నీటిలో పూర్తిగా ముంచడం అవసరమా?

“బాప్తిస్మమివ్వడం” అనే పదం, బాప్తొ అనే గ్రీకు క్రియాపదం నుండి వచ్చింది, దాని అర్థం ‘ముంచడం.’ (యోహాను 13:​26) బైబిలులో, “బాప్తిస్మమివ్వడానికి” అన్నా, “ముంచడానికి” అన్నా రెండు పదాల భావం ఒక్కటే. ఐతియొపీయుడైన నపుంసకునికి ఫిలిప్పు ఇచ్చిన బాప్తిస్మం గురించి రోథర్‌హామ్‌ అనువాదమైన ది ఎంఫసైజ్డ్‌ బైబిల్‌ ఇలా చెబుతోంది: “ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోనికి దిగారు, ఫిలిప్పు ఆయనను నీటిలో ముంచాడు.” (అపొస్తలుల కార్యములు 8:​38) కాబట్టి బాప్తిస్మం పొందే వ్యక్తి వాస్తవానికి నీళ్లలో పూర్తిగా ముంచబడతాడు.​—⁠మత్తయి 3:​16; మార్కు 1:​10.

యేసు తన శిష్యులకు ఇలా నిర్దేశించాడు: ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బాప్తిస్మమియ్యుడి.’ (మత్తయి 28:​19, 20) అందుకే యెహోవాసాక్షులు స్విమ్మింగ్‌ పూల్‌లలో, సరస్సుల్లో, నదుల్లో, లేదా పూర్తిగా మునగడానికి సరిపడే నీళ్ళున్న ఇతర స్థలాల్లో బాప్తిస్మమిచ్చే ఏర్పాట్లు చేస్తారు. నీళ్ళలో పూర్తిగా ముంచడం ద్వారా బాప్తిస్మం ఇవ్వాలన్నది లేఖనానుసారమైన ఆవశ్యకత కాబట్టి, ఒక వ్యక్తి అలా బాప్తిస్మం పొందకుండా మినహాయించే అధికారం మానవులకు లేదు. కాబట్టి, ఒక వ్యక్తి తానున్న పరిస్థితి కారణంగా అసాధారణమైన చర్యలు తీసుకోవలసి వచ్చినా ఆయనకు బాప్తిస్మం ఇవ్వాలి. ఉదాహరణకు, బాగా వృద్ధులైనవారికి లేదా ప్రత్యేకంగా అనారోగ్యం వల్ల బలహీనంగా ఉన్నవారికి పెద్దగా ఉండే స్నానపు తొట్లలో బాప్తిస్మమివ్వడం సహాయకరంగా ఉంటుంది. తొట్టిని గోరువెచ్చని నీటితో నింపాలి, బాప్తిస్మం పొందే వ్యక్తిని హడావుడి చేయకుండా నెమ్మదిగా దాంట్లోకి దించాలి, ఆ వ్యక్తి దానిలో సర్దుకున్నాక బాప్తిస్మం ఇవ్వాలి.

తీవ్రమైన అంగవైకల్యం ఉన్నవారు కూడా గతంలో బాప్తిస్మం పొందారు. ఉదాహరణకు, ట్రాకియాటమి (ఊపిరి ఆడని పరిస్థితులలో తాత్కాలికంగా ఊపిరి ఆడడానికి శ్వాసనాళానికి రంధ్రం చేసే చికిత్స) కారణంగా గొంతులో శాశ్వతంగా రంధ్రం ఉన్నవారు లేదా మెకానికల్‌ రెస్పిరేటర్‌ (ఊపిరి పీల్చుకోడానికి ఉపయోగపడే యంత్రపరికరం) అవసరమున్నవారు కూడా నీళ్ళలో ముంచబడి బాప్తిస్మం పొందారు. నిస్సందేహంగా అలాంటి బాప్తిస్మాలన్నిటికీ సమగ్రమైన ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉంటుంది. శిక్షణ పొందిన ఒక నర్సు లేదా వీలైతే ఒక డాక్టరు సమీపంలో ఉంటే మంచిది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకున్నట్లైతే దాదాపు అన్ని పరిస్థితుల్లోనూ బాప్తిస్మాలు ఇవ్వవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలని నిజంగా కోరుకుంటే దాంట్లోని కష్టనష్టాలను భరించడానికి ఆయన సిద్ధపడితే, ఆ వ్యక్తి నీటిలో బాప్తిస్మం పొందడానికి చేయదగిన ప్రతి ప్రయత్నం చేయాలి.