కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మార్గంలో సాగిపోవడమే మాకు బలమూ ఆనందమూ

యెహోవా మార్గంలో సాగిపోవడమే మాకు బలమూ ఆనందమూ

జీవిత కథ

యెహోవా మార్గంలో సాగిపోవడమే మాకు బలమూ ఆనందమూ

లూయీజీ డి. వాలెంటీనో చెప్పినది

“ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని యెహోవా ఉద్బోధిస్తున్నాడు. (యెషయా 30:​21) నేను 60 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని ఆ ఉపదేశాన్ని అనుసరించాలన్నదే నా లక్ష్యం. నా తల్లిదండ్రులు చూపిన మాదిరి నా చిన్నతనంలోనే నా ముందు ఈ లక్ష్యాన్ని ఉంచింది. వాళ్ళు, ఇటలీ నుండి వలస వచ్చి, అమెరికాలోని ఒహాయోలోని, క్లీవ్‌ల్యాండ్‌లో 1921 లో స్థిరపడ్డారు. వాళ్ళు అక్కడే తమ ముగ్గురు పిల్లలను​—⁠నన్నూ, మా అన్నయ్య మైక్‌నీ, మా చెల్లెలు లిడీయను​—⁠పెంచారు.

నాతల్లిదండ్రులు వివిధ మతాలను పరిశీలించి, నిరాశతో చివరికి తమ ప్రయత్నాల్ని మానుకున్నారు. అలా ఉండగా, 1932 లో, ఒక రోజు, మా నాన్నగారు ఇటాలియన్‌ భాషలో ఒక రేడియో కార్యక్రమాన్ని విన్నారు. దాన్ని యెహోవాసాక్షులు ప్రసారం చేశారు. మా నాన్నగారికి తాను విన్నది బాగా నచ్చింది. ఆయన మరింత సమాచారం కావాలని కోరుతూ ఉత్తరం వ్రాశారు. అప్పుడు, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధానకార్యాలయం నుండి ఇటలీ దేశస్థుడైన ఒక యెహోవాసాక్షి మమ్మల్ని సందర్శించాడు. ఆయన వచ్చాక తెల్లవారే వరకూ మా ఇంట్లో ఉత్తేజకరమైన చర్చ జరిగింది. సత్య మతాన్ని కనుగొన్నామన్న నమ్మకం మా తల్లిదండ్రులకు కలిగింది.

అమ్మా నాన్నా క్రైస్తవ కూటాలకు హాజరుకానారంభించారు, ప్రయాణ పైవిచారణకర్తలకు ఇంట్లో వసతిని కల్పించారు. నేను చిన్న పిల్లవాడినే అయినప్పటికీ, వాళ్ళు ప్రకటనా పనిలో నన్ను కూడా వెంట తీసుకువెళ్ళారు, అలా యెహోవాను పూర్తికాలం సేవించడం గురించి నేను ఆలోచించేలా చేశారు. అలా చేసిన ఒక సందర్శకుడు క్యారీ డబ్ల్యు. బార్బర్‌. ఆయన ఇప్పుడు యెహోవాసాక్షుల పరిపాలక సభలో ఒక సభ్యుడు. కొంత కాలం తర్వాత, అంటే నాకు 14 ఏండ్లున్నప్పుడు, 1941 ఫిబ్రవరిలో, బాప్తిస్మం తీసుకున్నాను, 1944 లో క్లీవ్‌ల్యాండ్‌లో నేను పయినీరుగా సేవచేయనారంభించాను. మైక్‌, లిడీయలు కూడా బైబిలు సత్యపు మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు. మైక్‌, తన మరణం వరకూ యెహోవాకు సేవ చేశాడు. లిడీయ తన భర్త హరాల్డ్‌ వైడ్నర్‌తో పాటు 28 సంవత్సరాలు ప్రయాణ పరిచర్యలో ఉన్నది. నేడు వాళ్ళు ప్రత్యేక పూర్తికాల పరిచారకులుగా సేవచేస్తున్నారు.

సేవలో సాగిపోవాలన్న నా తీర్మానాన్ని జైలు బలపరచింది

ఖడ్గాలను నాగటి నక్కులుగా సాగగొట్టడాన్ని గురించి మాట్లాడుతున్న యెషయా 2:4కు అనుగుణంగా, నేను నా బైబిలు శిక్షిత మనస్సాక్షి అనుసారంగా ప్రవర్తించినందుకు, నన్ను 1945 తొలి భాగంలో, ఒహాయోలోని చిలిక్లోత్‌ ఫెడరల్‌ జైలులో వేశారు. ఒకప్పుడు ఆ జైలు అధికారులు, ఖైదీలుగా ఉన్న సాక్షులను యెహోవాసాక్షులు ప్రచురించిన కొన్ని బైబిలు సాహిత్యాలను మాత్రమే తమ దగ్గర ఉంచుకోవడానికి అనుమతించారు. అయితే, అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక సంఘంలోని సాక్షులు వాళ్ళకు సహాయం చేశారు. వాళ్ళు ఆ జైలుకు సమీపాన ఉన్న పొలాల్లో అప్పుడప్పుడు కొన్ని ప్రచురణలను వేసి వెళ్ళేవారు. మరుసటి రోజు ఉదయం, పనిచేయవలసిన చోటికి తమను తీసుకువెళ్ళినప్పుడు, ఆ ఖైదీలు ఆ ప్రచురణలను వెతుక్కొని ఏదో ఒక విధంగా జైలుకు తీసుకెళ్ళేవాళ్ళు. నేను ఆ జైలుకి వెళ్ళే సమయానికి, సాక్షులు మరెక్కువ సాహిత్యాలను తమతో ఉంచుకునేందుకు అనుమతి లభించింది. అయినప్పటికీ, యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని అమూల్యంగా ఎంచడం మునుపెన్నటికన్నా ఎక్కువగా అప్పుడు నేర్చుకున్నాను. కావలికోట, తేజరిల్లు! పత్రికల క్రొత్త సంచికలను అందుకున్న ప్రతిసారీ నాకు ఆ పాఠం గుర్తుకొస్తుంది.

జైలులో సంఘ కూటాలను జరుపుకోవడానికి మాకు అనుమతి లభించినప్పటికీ, సాక్షులు కాని వాళ్ళు ఆ కూటాలకు హాజరుకావడానికి అనుమతి లభించలేదు. అయినప్పటికీ, కొందరు జైలు అధికారులూ, ఖైదీలూ దొంగచాటుగా హాజరయ్యేవారు, వాళ్ళలో కొందరు సత్యాన్ని అంగీకరించారు కూడా. (అపొస్తలుల కార్యములు 16:​30-34) సహోదరుడు ఏ. హెచ్‌. మ్యాక్‌మిల్లన్‌ మమ్మల్ని సందర్శించేవాడు, ఆయన సందర్శనాలు చాలా ఓదార్పునిచ్చేవి. మేము జైలులో గడుపుతున్న సమయం వ్యర్థం కాదనీ, భావి నియామకాలకు అది మంచి తర్ఫీదునిస్తుందనీ ఆయన ఎల్లప్పుడూ భరోసా ఇచ్చేవాడు. పెద్దవయస్కుడైన ఆ సహోదరుడు నా హృదయాన్ని స్పర్శించి, యెహోవా త్రోవలో నడవాలన్న నా నిర్ణయాన్ని మరింత బలపరిచాడు.

నేను సహచరిని సంపాదించుకున్నాను

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది, జైలు తలుపులు తెరువబడ్డాయి, నేను పయినీరింగ్‌ని, అంటే పూర్తి కాల పరిచర్యను పునఃప్రారంభించాను. తర్వాత, 1947 లో మా నాన్నగారు చనిపోయారు. అందువల్ల, మా కుటుంబాన్ని పోషించేందుకు, నేను ఒక లౌకిక పని చేయనారంభించాను. అలాగే వైద్య సంబంధ మర్దనాలు చేయడానికి యోగ్యతను పొందాను. ఈ నైపుణ్యం 30 సంవత్సరాల తర్వాత నేనూ నా భార్యా ఎదుర్కున్న క్లిష్ట సమయాల్లో మాకు సహాయపడింది. నేను కథలో చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను. మొదట నా భార్య గురించి చెబుతానుండండి.

1949 లో ఒక రోజు మధ్యాహ్నం నేను రాజ్య మందిరంలో ఉన్నప్పుడు ఫోను మోగింది. నేను ఫోను ఎత్తినప్పుడు, “నా పేరు క్రిస్టీన్‌ గెన్‌చర్‌. నేను యెహోవాసాక్షుల్లో ఒకరిని. నేను ఉద్యోగం కోసం క్లీవ్‌ల్యాండ్‌కు వచ్చాను. నేను ఇక్కడి సంఘంతో సహవసించాలని ఇష్టపడుతున్నాను” అని ఒక తియ్యని స్వరం చెప్పింది. మా రాజ్య మందిరం ఆమె నివసిస్తున్న స్థలానికి చాలా దూరంలో ఉంది, నాకు ఆమె స్వరం నచ్చింది, నేను ఆమెకు మా రాజ్యమందిరానికి రావలసిన దారి చెప్పాను, ఆ ఆదివారమే రమ్మని నేను ఆమెను ప్రోత్సహించాను​—⁠ఎందుకంటే ఆ ఆదివారమే నేను బహిరంగ ప్రసంగమివ్వబోతున్నాను. ఆదివారం, రాజ్యమందిరానికి మొదట వెళ్ళింది నేనే. పరిచయం లేని సహోదరి ఎవరూ అక్కడ కనిపించలేదు. ప్రసంగమిస్తున్నప్పుడు కూడా, గుమ్మం వైపుకు చూస్తున్నాను. కానీ ఎవరూ రాలేదు. మరుసటి రోజు ఆమెకు ఫోన్‌ చేశాను. ఇక్కడికి రావలసిన బస్సులను గురించి తనకింకా సరిగా తెలియదని చెప్పింది. అన్నీ వివరంగా చెప్పడానికి నేనే ఆమెను కలుస్తానని నాకై నేనే ముందుకు వెళ్ళాను.

ఆమె తల్లిదండ్రులు చెకోస్లవాకియా నుండి వలస వచ్చారనీ, చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు? (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని చదివిన తర్వాత, బైబిలు విద్యార్థులతో సహవసించడం మొదలుపెట్టారని తెలుసుకున్నాను. ఆమె తల్లిదండ్రులు 1935 లో బాప్తిస్మం తీసుకున్నారు. 1938 లో, క్రిస్టీన్‌ వాళ్ళ నాన్న అమెరికాలోని పెన్సిల్వేనియాలోని క్లైమర్‌లోని యెహోవాసాక్షుల సంఘానికి కంపెనీ సర్వెంట్‌ (ఇప్పుడు సంఘ పైవిచారణకర్త అని అంటారు) అయ్యారు. క్రిస్టీన్‌ తన 16వ యేట 1947 లో బాప్తిస్మం తీసుకుంది. ఈ అందమైన, ఆధ్యాత్మిక మనస్కురాలైన సహోదరితో ప్రేమలో పడేందుకు నాకు ఎక్కువ సమయం పట్టలేదు. 1950, జూన్‌ 24న మేము వివాహం చేసుకున్నాం. అప్పటి నుండి క్రిస్టీన్‌ నాకు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. దేవుని రాజ్యాసక్తులను ముందుంచడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధమే. సామర్థ్యంగల ఈ సహచరి నా జీవిత భాగస్వామిగా అయ్యేందుకు ఒప్పుకున్నందుకు యెహోవాకు చాలా కృతజ్ఞుడను.​—⁠సామెతలు 31:⁠10.

గొప్ప ఆశ్చర్యం

1951, నవంబరు 1న మేము కలిసి పయినీరింగ్‌ చేయడం మొదలుపెట్టాం. రెండు సంవత్సరాల తర్వాత, ఒహాయోలోని, టోలెడోలో జరిగిన సమావేశంలో, హూగో రీమర్‌ అనే సహోదరుడూ, ఆల్‌బర్ట్‌ ష్రోడర్‌ అనే సహోదరుడూ మిషనరీ సేవలో ఆసక్తి ఉన్న పయినీర్ల గుంపుతో మాట్లాడారు. మేము కూడా వాళ్ళలో ఉన్నాం. క్లీవ్‌ల్యాండ్‌లో పయినీరింగ్‌ కొనసాగించమని మమ్మల్ని ప్రోత్సహించారు. కానీ ఆ మరుసటి నెలే, 1954 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 23వ తరగతికి హాజరు కమ్మని మాకు ఆహ్వానం లభించినప్పుడు మాకు చాలా ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి!

మేము అప్పట్లో న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో ఉన్న గిలియడ్‌ స్కూల్‌కి వెళ్తుండగా, క్రిస్టీన్‌ చాలా భయపడి, “ఇంకాస్త నెమ్మదిగా నడపండి!” అని చెబుతూ ఉంది. “క్రిస్టీన్‌ మనం ఇంకా నెమ్మదిగా నడపడమంటే, కారు పార్కుచేసినట్లే ఉంటుంది” అని చెప్పాను. కానీ మేము గిలియడ్‌ స్కూల్‌కి చేరుకున్నప్పుడు హాయిగా అనిపించింది. సహోదరుడు నేథన్‌ నార్‌ విద్యార్థుల గుంపుకి స్వాగతం పలికి, గిలియడ్‌ స్కూల్‌ అంతా చూపించారు. రాజ్యాసక్తులకు శ్రద్ధ చూపిస్తున్నప్పుడు పొదుపుగా ఉండడం మంచిదని చెబుతూ, నీళ్ళూ, విద్యుచ్ఛక్తీ వ్యర్థం కాకుండా ఎలా ఉపయోగించాలో వివరించారు. ఆ సలహా మా మనస్సులో అలాగే ఉండిపోయింది, మేము ఇప్పటికీ దాన్ని పాటిస్తాము.

విమానంలో రియోకు

మేము త్వరలోనే గిలియడ్‌ పట్టభద్రులమయ్యాము. 1954, డిసెంబర్‌ 10న, బ్రెజిల్‌లోని వెచ్చగా ఉండే రియో డీ జనైరోలో క్రొత్త నియామకానికి అక్కడ దిగడాన్ని గురించి ఎంతో ఉత్సాహంతో, చలిగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో విమానం ఎక్కాము. తోటి మిషనరీలైన పీటర్‌, బిల్లీ కార్‌బెల్లోలు మాతోపాటే ప్రయాణం చేశారు. ప్యూర్టోరికోలోను, వెనిజులాలోను, ఉత్తర బ్రెజిల్‌లోని బెలెమ్‌లోను విమానం ఆగే సమయంతో సహా మొత్తం 24 గంటల విమాన ప్రయాణమది. అయితే, ఇంజన్‌లో సమస్యలు ఉన్నందువల్ల, రియో డీ జనైరో చేరుకునే సరికి 36 గంటలు పట్టింది. రియో చేరుకుంటుండగా పైనుండి క్రిందకు చూస్తే అదెంత మనోహరమైన దృశ్యమో! ఆ నగర బల్బులు నల్లని వెల్వెట్‌ కార్పెట్‌ మీద మిరుమిట్లుగొలుపుతున్న వజ్రాల్లా ఉన్నాయి, పిండారబోసినట్లున్న వెన్నెల్లో గానబారా అఖాతంలోని నీళ్ళు తళుక్కుతళుక్కుమంటున్నాయి.

విమానాశ్రయంలో, చాలా మంది బేతేలు కుటుంబ సభ్యులు మా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించిన తర్వాత, బ్రాంచ్‌ ఆఫీసుకి తీసుకువెళ్ళారు, రాత్రి దాదాపు మూడు గంటలప్పుడు మేము పక్క మీదకు చేరాం. కొన్ని గంటల తర్వాత, నిద్రలేపే బెల్లు మోగి, మిషనరీలుగా మా మొదటి రోజు ప్రారంభమైందని మాకు గుర్తు చేసింది!

తొలి పాఠం

కొద్ది కాలంలోనే మేమొక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాం. ఒక సాయంత్రం ఒక సాక్షుల కుటుంబంతో గడిపాం. వాళ్ళ ఇంటి నుండి మేము బ్రాంచ్‌కి తిరిగి నడిచివెళ్దామని అనుకున్నప్పుడు ఆ ఆతిథేయుడు ఒప్పుకోలేదు, “వద్దు, వర్షం పడుతోంది, మీరు వెళ్ళలేరు” అని అన్నాడు, మేము ఆ రాత్రి వాళ్ళింట్లోనే ఉండాలని ఆయన పట్టుపట్టాడు. “మా ఊళ్ళో కూడా వర్షాలు పడుతాయండీ” అని నవ్వుతూ ఆయన మాటలను కొట్టిపారేసి, అక్కడి నుండి బయలుదేరాము.

రియో చుట్టూ పర్వతాలు ఉన్నాయి కనుక వర్షపు నీరు అంతా కలిసి, నగరంలోకి ప్రవహించి తరచుగా వరదను సృష్టిస్తుంది. కొద్దిసేపట్లోనే నీళ్ళు మా మోకాళ్ళ వరకూ వచ్చాయి, ఆ నీళ్ళలో అడుగు తీసి అడుగువేయడం కష్టమైంది. మేము బ్రాంచ్‌కి చేరుకునే సరికి, వీధులు కాలువల్లా తయారయ్యాయి, నీళ్ళు మా ఛాతీలవరకు వచ్చాయి. మేము చివరికి బేతేలుకు చేరుకునే సరికి తడిసి ముద్దయిపోయాం. ఆ మరుసటి రోజు, క్రిస్టీన్‌ చాలా బాధపడింది, ఆమెకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. దాంతో ఆమె చాలా కాలం చాలా నీరసంగా ఉంది. క్రొత్త మిషనరీలముగా, మేము అనుభవజ్ఞులైన స్థానిక సాక్షుల సలహాను పాటించవలసిందని ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మిషనరీ పనిలోను, ప్రయాణ పనుల్లోను తొలి అడుగులు

ఈ అవకతవకలన్నీ అయిపోయిన తర్వాత, మేము ఎంతో ఉత్సుకతతో మా క్షేత్ర పరిచర్యను మొదలుపెట్టాం. మేము ఎవరిని కలిసినా, పోర్చుగీసులో మేము వ్రాసుకున్న అందింపును చదివేవాళ్ళం. మేమిద్దరమూ ఒకే విధమైన అభివృద్ధిని సాధిస్తున్నట్లు అనిపించింది. “మీరు చెప్పేది నాకు అర్థమౌతుంది కానీ, ఆయన చెబుతున్నది అర్థం కావడం లేదు” అని నా వైపుకు చూపిస్తూ ఒక గృహస్థుడు క్రిస్టీన్‌కు చెప్పేవాడు. మరొక గృహస్థుడు, “మీరు చెబుతున్నది నాకు అర్థం అవుతుంది కానీ, ఆమె చెబుతున్నది అర్థం కావడం లేదని” నాతో చెప్పేవాడు. అయినప్పటికీ, మొదటి కొన్ని వారాల్లో మేము కావలికోటకు 100 కన్నా ఎక్కువ చందాలను కట్టించగలిగినందుకు ఎంతగానో ఆనందించాము. వాస్తవానికి, బ్రెజిల్‌లో మేము ఉన్న మొదటి సంవత్సరమే మా బైబిలు విద్యార్థులు అనేక మంది బాప్తిస్మం తీసుకుని, మిషనరీ నియామకం ఎంత ఫలవంతంగా ఉంటుందన్నది రుచి చూపించారు.

1950ల మధ్య భాగంలో, బ్రెజిల్‌లోని అనేక సంఘాల్లో ప్రాంతీయ పైవిచారణకర్తల సందర్శనం క్రమంగా జరిగేది కాదు. దానికి కారణం, యోగ్యులైన సహోదరులు ఎక్కువగా లేకపోవడమే. అప్పట్లో నాకు భాష అంతగా రాకపోయినప్పటికీ, పోర్చుగీసు భాషలో ఇదివరకు బహిరంగ ప్రసంగం ఇవ్వకపోయినప్పటికీ, 1956 లో, సావో పౌలో రాష్ట్రంలో ప్రాంతీయ పనికి నియమించబడ్డాను.

మేము మొదట సందర్శించిన సంఘానికి ప్రాంతీయ పైవిచారణకర్త వచ్చి రెండు సంవత్సరాలైంది కనుక, ఆ సంఘంలోని ప్రతి ఒక్కరు బహిరంగ ప్రసంగం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రసంగాన్ని తయారు చేసేందుకు పోర్చుగీసు భాషలోని కావలికోట నుండి కొన్ని పేరాలను కట్‌ చేసుకుని, కాగితాల మీద అంటించుకున్నాను. ఆ ఆదివారం, రాజ్యమందిరం క్రిక్కిరిసి పోయింది. స్టేజీ మీద కూడా కొందరు కూర్చున్నారు. అందరూ ఏదో గొప్ప కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. ప్రసంగం మొదలుపెట్టాను. నిజానికి ప్రసంగం కాదు చదవడమే. అప్పుడప్పుడు తలెత్తి చూస్తున్నాను, అలా చూసినప్పుడు, చిన్న పిల్లలు సహితం కదలకుండా కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాను. అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని నన్ను చూస్తున్నారు. ‘ఆహా, వాలెంటీనో, పోర్చుగీసు భాషను బాగా నేర్చుకున్నావు! ఈ ప్రజలు శ్రద్ధగా వింటున్నారు’ అని నాలో నేను అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత, నేను ఆ సంఘాన్ని మళ్ళీ సందర్శించినప్పుడు, నేను మొదట సందర్శించినప్పుడు హాజరైన ఒక సహోదరుడు, “మీరు అప్పుడు ఇచ్చిన బహిరంగ ప్రసంగం మీకు గుర్తుందా? మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు” అని చెప్పాడు. ఆ ప్రసంగంలో చాలామట్టుకు నాకూ అర్థం కాలేదని నేనూ ఒప్పుకున్నాను.

ప్రాంతీయ పనిలోని మొదటి సంవత్సరంలో, నేను తరచూ జెకర్యా 4:6 చదివాను. ‘బలముచేత కాదు, నా ఆత్మచేతనే’ అన్న మాటలు, రాజ్య పని అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం యెహోవా ఆత్మేనని నాకు గుర్తుచేసేవి. అవును మాకు ఎన్ని పరిమితులు ఉన్నా రాజ్య పని అభివృద్ధి చెందింది.

ఆ త్రోవలో సవాళ్ళూ, ఆశీర్వాదాలూ

ప్రాంతీయ పని చేయడమంటే, ఒక టైప్‌రైటర్‌నూ, సాహిత్యాలుండే అట్టపెట్టెలనూ, సూట్‌కేసులనూ, బ్రీఫ్‌కేసులనూ తీసుకొని ఒక్కో ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఒక బస్సు నుండి మరో బస్సుకి మారేటప్పుడు లగేజ్‌ ఏదీ కూడా మర్చిపోకుండా ఉండేందుకు, క్రిస్టీన్‌ మా లగేజ్‌లకు నంబర్లు వేసి ఉంచేది. మా తర్వాతి గమ్యస్థానానికి చేరుకునేందుకు మురికిగా ఉండే దుమ్ము రేగే రోడ్ల గుండా మేము 15 గంటలు బస్సు ప్రయాణం చేయడం మామూలే. ఒక్కోసారి, చాల భయం కలిగేది. ముఖ్యంగా ఇప్పుడు కూలిపోద్దేమో అన్నట్లుండే వంతెన మీద ఒకే సమయంలో బస్సులు అటు ఇటు వెళ్తున్నప్పుడు వాటి మధ్యన కాగితం కూడా పట్టేంత స్థలం లేకుండా ఒకదానికొకటి దాదాపు రాసుకున్నట్లుగా దాటుతున్నప్పుడు చాలా భయం వేసేది. మేము రైలులోను, ఓడలోను, గుఱ్ఱం మీదా కూడా ప్రయాణాలు చేశాము.

1961 లో, మేము ఒక్కో సంఘానికి వెళ్ళే బదులు ఒక్కో సర్క్యూట్‌కి వెళ్ళే డిస్ట్రిక్ట్‌ వర్క్‌ చేయనారంభించాము. యెహోవా సంస్థ తయారు చేసిన చలనచిత్రాలను ఒక్క వారంలోనే ఒక్కో సాయంకాలం ఒక్కో ప్రాంతంలో ప్రదర్శించేవాళ్ళం. అలా ప్రదర్శించకుండా మమ్మల్ని ఆపాలని స్థానిక మతగురువులు చేసే ప్రయత్నాలను విఫలం చేసేందుకు మేము చాలా వేగంగా పనిచేయవలసి వచ్చేది. ఒక పట్టణంలో, ఒక హాల్‌ ఓనరు మాతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఒక ప్రీస్టు ఆయనను బెదిరించాడు. చాలా రోజులు వెతికిన తర్వాత, మాకు మరొక చోటు దొరికింది. కాని ఆ విషయాన్ని మేము ఎవరికీ చెప్పలేదు, మేము మొదట ఒప్పందం చేసుకున్న స్థలానికి రమ్మనే అందరినీ ఆహ్వానించాము. కార్యక్రమం ప్రారంభం కాకముందు, క్రిస్టీన్‌ ఆ మొదటి హాల్‌కి వెళ్ళి, చలనచిత్రం చూడాలని అక్కడికి వచ్చినవారికి, క్రొత్త చోటు గురించి మెల్లగా తెలిపింది. అలా ఆ సాయంకాలం, 150 మంది చూసిన ఆ చలనచిత్రానికి కార్యనిర్వహణలోనున్న నూతన లోక సంస్థ (ఆంగ్లం) అన్న పేరు తగినట్లే ఉంది.

మారు మూల ప్రాంతాల్లో ప్రయాణ పని చేయడం కొన్నిసార్లు చాలా అలసట కలిగించేది. కానీ, అక్కడ నివసించే వినమ్రులైన సహోదరులు మా సందర్శనాలను ఎంతో మెచ్చుకునేవారు. వారు తమ చిన్న ఇండ్లలో మాకు చోటిచ్చి తమకున్నదాంట్లో మాకు ఘనంగా ఆతిథ్యాన్నిచ్చేవారు, మేము వాళ్ళతో గడపగలిగినందుకు యెహోవాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం. వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మాకు ఆనందకరమైన ఎన్నో ఆశీర్వాదాలు లభించాయి. (సామెతలు 19:​17; హగ్గయి 2:⁠7) అందుకే, బ్రెజిల్‌లో 21 కన్నా ఎక్కువ సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మా మిషనరీ రోజులు ముగిసినప్పుడు మేము చాలా విచారానికి లోనయ్యాం!

కష్ట సమయాల్లో యెహోవా మాకు త్రోవను చూపించాడు

1975 లో, క్రిస్టీన్‌కి ఒక శస్త్రచికిత్స జరిగిన తర్వాత, మేము ప్రయాణ పరిచర్యను పునఃప్రారంభించాము. కానీ, ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించడంతో ఆమెకు చికిత్స చేయించేందుకు మేము అమెరికాకు తిరిగివెళ్ళడమే మంచిదనిపించింది. 1976 ఏప్రిల్‌లో, మేము కాలిఫోర్నియాలోని లాంగ్‌ బీచ్‌కి వెళ్ళి, మా అమ్మతో ఉన్నాం. విదేశంలో రెండు దశాబ్దాలు ఉన్న తర్వాత, ఈ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో మాకు పాలుపోలేదు. నేను వైద్య సంబంధ మర్దనాలు చేయడం మొదలుపెట్టాను. దాని నుండి వచ్చిన డబ్బు మా ఖర్చులకు సరిపోయేది. కాలిఫోర్నియా ప్రభుత్వం క్రిస్టీన్‌కి ఒక ఆసుపత్రిలో అడ్మిషన్‌ ఇప్పించింది, డాక్టర్లు ఆమెకు రక్తం ఎక్కించకుండా చికిత్స చేయడానికి నిరాకరించడంతో, ఆమె రోజురోజుకూ మరింత బలహీనంకానారంభించింది. ఎంతో నిరాశతో, మార్గనిర్దేశం కోసం యెహోవాకు విన్నవించుకున్నాం.

ఒక రోజు మధ్యాహ్నం, నేను క్షేత్ర సేవలో ఉండగా, ఒక డాక్టరు ఆఫీసు కనిపించింది, ఆ ఆఫీసు లోపలికి వెళ్ళాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ డాక్టరు తన ఇంటికి వెళ్ళిపోబోతున్నప్పటికీ, ఆయన నన్ను తన ఆఫీసులోకి రానిచ్చాడు. మేము రెండు గంటలు మాట్లాడుకున్నాం. “మిషనరీలుగా మీ పనిని నేను మెచ్చుకుంటాను, నేను మీ భార్యకు ఫీజు లేకుండా, రక్తం ఎక్కించకుండా చికిత్స చేస్తాను” అని ఆయన అన్నాడు. నేను నా చెవులను నమ్మలేకపోయాను.

దయగల ఆ డాక్టరు ఎంతో మాన్యుడైన స్పెషలిస్ట్‌. ఆయన తాను పని చేసే ఆసుపత్రికి క్రిస్టీన్‌ను తీసుకువెళ్ళి, ఎంతో నైపుణ్యంగా ఆమెకు చికిత్స చేయడంతో, ఆమె ఆరోగ్యం త్వరలో మెరుగుపడింది. ఆ కష్ట సమయంలో యెహోవా మాకు త్రోవను చూపించినందుకు మేము ఆయనకు ఎంతో కృతజ్ఞులం!

క్రొత్త నియామకాలు

క్రిస్టీన్‌ తిరిగి బలాన్ని పుంజుకోగానే, మేము పయినీర్లుగా సేవను తిరిగి ప్రారంభించాం. లాంగ్‌ బీచ్‌లోని చాలా మంది ప్రజలు యెహోవా ఆరాధకులుగా మారేందుకు సహాయపడి ఆనందించగల్గాం. 1982 లో, అమెరికాలో ప్రాంతీయ పని చేయమని మమ్మల్ని కోరారు. మాకెంతో ఇష్టమైన ప్రయాణ పరిచర్యలో మమ్మల్ని మళ్ళీ ఉపయోగించుకుంటున్నందుకు మేము ప్రతిరోజు యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాం. మేము మొదట కాలిఫోర్నియాలోను, ఆ తర్వాత, న్యూ ఇంగ్లాండ్‌లోను సేవ చేశాము. న్యూ ఇంగ్లాండ్‌లోని సర్క్యూట్‌లో పోర్చుగీసు మాట్లాడే సంఘాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత బెర్ముడా కూడా చేర్చబడింది.

ఉత్తేజకరమైన ఆ నాలుగు సంవత్సరాల తర్వాత, మాకు మరో క్రొత్త నియామకం లభించింది. మాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్పెషల్‌ పయినీర్లుగా సేవ చేయవచ్చన్న ఆహ్వానం మాకు లభించింది. ప్రయాణ పరిచర్యను వదిలిపెట్టడమంటే మాకు బాధ కలిగినా, క్రొత్త నియామకంతో ముందుకు కొనసాగాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాం. కానీ ఎక్కడ? మేము ప్రయాణ పనిలో ఉన్నప్పుడు, మాసాచూసెట్స్‌లోని, న్యూ బెడ్‌ఫోర్డ్‌లోని పోర్చుగీస్‌ సంఘానికి సహాయం అవసరముందని గమనించాను. కనుక మేము న్యూ బెడ్‌ఫోర్డ్‌కి బయలుదేరాం.

మేము అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ సంఘం మాకు స్వాగతమిస్తూ పెద్ద పార్టీ ఇచ్చింది. మా పట్ల మెప్పుదలను కలిగివున్నారన్న అనుభూతిని అది మాకు ఇచ్చింది! మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరు పసిపిల్లలు ఉన్న ఒక యువ జంట మాకు ఇల్లు దొరికే వరకు మేము ఉండేందుకు మమ్మల్ని తమ ఇంటికి దయాపూర్వకంగా తీసుకువెళ్ళింది. యెహోవా నిజంగా, ఈ ప్రత్యేక పయినీర్‌ నియామకాన్ని మేము అనుకున్నదానికన్నా చాలా ఎక్కువగా దీవించాడు. 1986 మొదలుకొని ఈ పట్టణంలోని దాదాపు 40 మంది వ్యక్తులు సాక్షులయ్యేందుకు మేము సహాయపడగల్గాం. వాళ్ళు మా ఆధ్యాత్మిక కుటుంబంగా ఉన్నారు. అంతేకాక, ఐదుగురు స్థానిక సహోదరులు, మందను శ్రద్ధగా చూసుకునే కాపరులయ్యేంతగా ఎదగడాన్ని చూసే ఆనందం నాకు లభించింది. అది ఫలవంతమైన మిషనరీ నియామకంలో సేవ చేయడంలాగానే ఉంది.

మేము గతాన్ని గురించి మరొకసారి ఆలోచిస్తే, మేము యౌవనం నుండే యెహోవాకు సేవ చేసినందుకూ, సత్యాన్ని మా జీవిత మార్గంగా చేసుకున్నందుకూ చాలా ఆనందిస్తున్నాం. నిజమే, వార్ధక్యమూ, శారీరక బలహీనతలూ మాపై ఇప్పుడు ప్రభావం చూపవచ్చు, కానీ, యెహోవా త్రోవలో సాగిపోవడం మాకు ఇప్పటికీ బలాన్నీ ఆనందాన్నీ ఇస్తుంది.

[26వ పేజీలోని చిత్రం]

రియో డీ జనైరోకి మేము క్రొత్తగా వెళ్ళినప్పుడు

[28వ పేజీలోని చిత్రం]

మాసాచుసెట్స్‌లోని న్యూ బెడ్‌ఫోర్డ్‌లోని మా ఆధ్యాత్మిక కుటుంబం