కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను బిడియాన్ని అధిగమించేందుకు నాకు సహాయం లభించింది

నేను బిడియాన్ని అధిగమించేందుకు నాకు సహాయం లభించింది

జీవిత కథ

నేను బిడియాన్ని అధిగమించేందుకు నాకు సహాయం లభించింది

రూత్‌ ఎల్‌. అల్‌రిక్‌ చెప్పినది

నేను సువార్తను ప్రకటిస్తూ ఇంటింటికీ వెళ్తున్నాను. అలా ఒక పాదిరీ ఇంటికి కూడా వెళ్ళినప్పుడు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ మొదటి అధ్యక్షుడుగా సేవ చేసిన చార్లెస్‌ టి. రస్సల్‌కు వ్యతిరేకంగా ఆ పాదిరీ అనేక అబద్ధ ఆరోపణలను చేశాడు. అది విని, దుఃఖం ఆపుకోలేక ఆయన ఇంటి గుమ్మంలోనే ఏడ్చేశాను. నేను ఒక చిన్న అమ్మాయినై ఉండి ప్రజలను ఎందుకు సందర్శించానన్నది వివరిస్తానుండండి.

నేను, 1910 లో, అమెరికాలోని, నెబ్రాస్కాలో ఉన్న మతనిష్ఠగల ఒక కుటుంబంలో జన్మించాను. మా కుటుంబం ఫామ్‌లో నివసించేది. ప్రతిరోజూ, ఉదయమూ సాయంకాలమూ భోజనం తర్వాత కుటుంబ సమేతంగా మేము బైబిలు చదివేవాళ్ళం. మా ఫామ్‌కి దాదాపు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న విన్‌సైడ్‌ అనే చిన్న పట్టణంలోని మెథడిస్ట్‌ చర్చిలో మా నాన్న సండే స్కూల్‌ సూపరింటెండెంట్‌. మాకు గుర్రపు బండి ఉండేది. దానికి ఇరువైపులా కర్టెన్‌లు ఉండేవి కనుక, వాతావరణం ఎలా ఉన్నా, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళగల్గేవాళ్ళం.

నాకు దాదాపు ఎనిమిది ఏండ్లు ఉన్నప్పుడు, చంటివాడైన మా తమ్ముడికి శిశువులకు వచ్చే పక్షవాతం వచ్చింది. అయోవాలోని ఆసుపత్రికి అమ్మ వాడ్ని ట్రీట్‌మెంటుకి తీసుకువెళ్ళింది. ఆమె ఎంతో శ్రద్ధగా చూసుకున్నప్పటికీ, మా తమ్ముడు ఆసుపత్రిలోనే చనిపోయాడు. అయితే, అయోవాలో ఉన్నప్పుడు మా అమ్మ, బైబిలు విద్యార్థిని కలిసింది. యెహోవాసాక్షులు అప్పట్లో అలాగే పిలువబడేవారు. ఆ యెహోవాసాక్షీ, అమ్మా చాలా విషయాలపై సంభాషణలు జరుపుకున్నారు. ఆమెతో అమ్మ బైబిలు విద్యార్థుల కూటాలకు కూడా వెళ్ళింది.

అమ్మ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురించిన స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ సంపుటులను తీసుకువచ్చింది. మానవ ఆత్మ అమర్త్యమైనది, దుష్టులు నిత్య దండనను అనుభవిస్తారు అనే బోధలు అసత్యములనీ బైబిలు విద్యార్థులు బోధిస్తున్నది సత్యమనీ ఆమెకు త్వరలో నమ్మకం కుదిరింది.—ఆదికాండము 2:7; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4.

అయితే, నాన్నగారు చాలా కలతపడ్డారు. బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరు కావాలని అమ్మ చేసే ప్రయత్నాలకు ఆయన అవరోధాలను పెట్టేవారు. ఆయన నన్నూ, మా అన్నయ్య క్లారెన్స్‌నూ తనతోపాటు చర్చికి తీసుకువెళ్ళేవారు. నాన్నగారు ఇంట్లో లేనప్పుడు, అమ్మ మాతో బైబిలు అధ్యయనం చేసేది. దాని ఫలితంగా, బైబిలు విద్యార్థుల బోధలనూ, చర్చి బోధలతో పోల్చి చూసే మంచి అవకాశం పిల్లలమైన మాకు దొరికింది.

నేనూ, క్లారెన్స్‌ చర్చిలో జరిగే సండే స్కూల్‌కి క్రమంగా వెళ్ళేవాళ్ళం. క్లారెన్స్‌ అడిగే ప్రశ్నలకు ఆ టీచర్‌ సమాధానాలను ఇవ్వలేకపోయేది. మేము ఇంటికి తిరిగి వెళ్ళాక, అక్కడ జరిగిన విషయాలను అమ్మతో చెప్పేవాళ్ళం. ఆ అంశాలపై మేము సుదీర్ఘమైన చర్చలను జరిపేవాళ్ళం. చివరికి, నేను చర్చిని వదిలిపెట్టి, అమ్మతో పాటు బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టాను. కొద్దికాలానికి, క్లారెన్స్‌ కూడా మాతో రావడం మొదలుపెట్టాడు.

బిడియాన్ని అధిగమించడం

1922 సెప్టెంబరులో, ఒహాయోలోని, సీడార్‌ పాయింట్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశానికి 18,000 కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు. అక్కడ, వాచ్‌టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, “రాజును ఆయన రాజ్యమును ప్రకటించుడి” అని ప్రేక్షకులతో చెప్తుండగా, అవే మాటలున్న బ్యానర్‌ విప్పబడింది. ఆ సన్నివేశాన్ని ఇప్పటికీ నా మనో నేత్రాలతో చూడగల్గుతున్నాను. అది మరవలేని సమావేశమే. ఆ ఉద్బోధకు నేను కదిలించబడ్డాను. దేవుని రాజ్యసువార్తను గురించి ఇతరులకు చెప్పడం అత్యవసరమన్న భావన నాలో కలిగింది.—మత్తయి 6:9, 10; 24:14.

1922 నుండి 1928 వరకు జరిగిన సమావేశాల్లో, కొన్ని తీర్మానాలను తీసుకున్నారు. వాటిలోని సందేశాలను కరపత్రాల రూపంలో ప్రచురించారు. ఆ కరపత్రాలను బైబిలు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలకు పంచిపెట్టారు. నేను సన్నగా ఎత్తుగా ఉండేదాన్ని. నన్ను గ్రేహౌండ్‌ అని పిలిచేవారు. (గ్రేహౌండ్‌ అన్నది, సన్నగా ఎత్తుగా ఉండే ఒక జాతి కుక్క.) ముద్రిత సందేశాలతో ఒక్కో ఇంటికి వెళ్ళేదాన్ని. అలా కరపత్రాలను పంచిపెట్టే పని నాకు బాగా నచ్చింది. కానీ, ఇండ్లకు వెళ్ళి మాట్లాడడం, దేవుని రాజ్యాన్ని గురించి వ్యక్తులతో చెప్పడం అంటే అంత సులభం కాదు.

నేను ఎంత బిడియస్థురాలినంటే, ప్రతి సంవత్సరమూ మా అమ్మ చాలా మంది బంధువులను మా ఇంటికి ఆహ్వానించినప్పుడు బిడియంతో బిక్క చచ్చిపోయేదాన్ని. నేను పడక గదిలోకి పారిపోయి అక్కడే ఉండే దాన్ని. ఒకసారి, అమ్మ, కుటుంబ సభ్యులందరి ఫోటో తీయాలనుకుంది. నన్ను బయటికి రమ్మని చెప్పింది. నేను వెళ్ళలేదు కాబట్టి, అమ్మ నన్ను నా గదిలో నుండి బయటికి లాక్కెళ్తుంటే, నేను వాళ్ళతో కలవడానికి ఇష్టపడక, గట్టిగా అరిచి గీపెట్టాను.

ఒక రోజు, నేనెలాగైనా పరిచర్యలో పాల్గొనాలన్న దృఢ నిశ్చయముతో, బైబిలు సాహిత్యాన్ని నా సంచిలోకి వేసుకుని బయలుదేరాను. “నేను చెయ్యలేను” అని మళ్ళీ మళ్ళీ అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ తర్వాతి క్షణంలోనే, “నేను తప్పక చేయాలి” అని అనుకున్నాను. చివరికెలాగైతేనేమీ, నేను ప్రకటించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత, నేను వెళ్ళడానికి ధైర్యాన్ని కూడగట్టుకోగల్గినందుకు చాలా సంతోషించాను. నేను ఆ పని చేయడం కష్టమే అయినప్పటికీ, దాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందించాను. ఆ సమయంలోనే, నేను మొదట్లో పేర్కొన్న పాదిరీని కలిసిందీ, ఆ తర్వాత అక్కడ నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిందీ. సమయం గడుస్తున్న కొలది, యెహోవా సహాయంతో, నేను ప్రజల ఇండ్ల దగ్గర మాట్లాడగలిగాను, నా ఆనందం అధికమైంది. తర్వాత, నేను యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకుని, ఆ విషయాన్ని 1925 లో నీటి బాప్తిస్మం ద్వారా తెలిపాను.

పూర్తికాల పరిచర్యను ప్రారంభించడం

నాకు 18 ఏండ్లున్నప్పుడు, మా పెద్దమ్మ ఇచ్చిన డబ్బుతో ఒక కారు కొనుక్కుని పయినీరింగ్‌ మొదలుపెట్టాను. పూర్తికాల పరిచర్యను పయినీరింగ్‌ అంటారు. రెండు సంవత్సరాల తర్వాత, 1930 లో, నా పయినీర్‌ భాగస్వామీ నేనూ ప్రకటనా నియామకాన్ని స్వీకరించాము. అప్పటికెల్లా, క్లారెన్స్‌ కూడా పయినీరింగ్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్దికాలానికి, బేతేలులో (న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ కార్యాలయం) సేవ చేయమని తనకు వచ్చిన పిలుపును అందుకుని అక్కడికి వెళ్ళాడు.

ఆ సమయంలో, మా అమ్మా నాన్నలు విడిపోయారు. నేనూ అమ్మా ఒక హౌస్‌ ట్రెయిలర్‌ని నిర్మించుకుని, కలిసి పయినీరింగ్‌ చేయడం మొదలుపెట్టాము. ఆ సమయంలోనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడింది. కనుక, పయినీరింగ్‌ కొనసాగించడం పెద్ద సవాలే అయ్యింది. కాని వదిలిపెట్టకూడదని మేము నిర్ణయించుకున్నాం. బైబిలు సాహిత్యాన్నిచ్చి కోళ్ళను, గ్రుడ్లను, కూరగాయలను, పండ్లను, పాత బ్యాటరీలను, ఇక ఉపయోగపడని పాత అల్యూమినియం వస్తువులను తీసుకునేవాళ్ళం. పాత బ్యాటరీలను, పాత అల్యూమినియం వస్తువులను అమ్మి వచ్చే డబ్బుతో కారుకు కావలసిన ఇంధనాన్ని కొనుక్కోవడానికీ, మరితర అవసరాలను తీర్చుకోవడానికీ ఉపయోగించుకునేవాళ్ళం. డబ్బు ఆదా చేయడానికి గాను, కారుకు కావలసిన సర్వీసింగ్‌ చేయడమూ ఆయిల్‌ మార్చడమూ నేర్చుకున్నాను. యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చుతాడనీ, మనకు కలిగే ఆటంకాలను అధిగమించేందుకు మనకు సహాయపడే మార్గాలను చూపిస్తాడనీ మేము గ్రహించగల్గాం.—మత్తయి 6:33.

మిషనరీ నియామకాలకు వెళ్ళడం

1946 లో, న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌కి సమీపాన ఉండే వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ ఏడవ తరగతికి రమ్మని నాకు పిలుపు వచ్చింది. అప్పటికీ, నేనూ అమ్మా కలిసి పయినీరింగ్‌ చేయడం మొదలై 15 కన్నా ఎక్కువ సంవత్సరాలైంది. అయినప్పటికీ, నేను మిషనరీ పనిలో తర్ఫీదు పొందే అవకాశానికి తాను ఆటంకం కాకూడదని అనుకుంది. గిలియడ్‌ స్కూల్‌కు వెళ్ళే ఆధిక్యతను స్వీకరించమని అమ్మ నన్ను ప్రోత్సహించింది. గిలియడ్‌ పట్టభద్రురాలనైన తర్వాత, ఇల్లినాయిస్‌లోని పెయోరియా నుండి వచ్చిన మార్తా హెస్‌ నా భాగస్వామి అయ్యింది. మరో ఇద్దరితో పాటు మేమిద్దరమూ, ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌కు నియమించబడ్డాం. విదేశంలో నియామకం కోసం మేము ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాం.

1947 లో మాకు నియామకం లభించింది. నన్నూ మార్తనూ హవాయికి పంపించారు. ఆ దీవుల్లోకి వలసవెళ్ళడం సులభమే కనుక, అమ్మ మాతో పాటు వచ్చి, హోనోలులు నగరంలో మాకు దగ్గర్లో నివసించింది. ఆమె ఆరోగ్యం క్షీణించనారంభించింది. నేను నా మిషనరీ కార్యక్రమాలను చూసుకుంటూనే, అమ్మకు సహాయపడేదాన్ని. హవాయిలో, 1956 లో, అమ్మ తన 77వ ఏట మరణించింది. అప్పటి వరకూ నేను అమ్మను చూసుకోగల్గాను. మేము హవాయికి వచ్చినప్పుడు, అక్కడ దాదాపు 130 మంది సాక్షులు ఉండేవారు. అమ్మ చనిపోయేనాటికి, అక్కడ వెయ్యి కన్నా ఎక్కువ మంది సాక్షులున్నారు. ఇక మిషనరీల అవసరం లేదు.

తర్వాత, నన్నూ మార్తనూ జపాన్‌కి నియమిస్తున్నట్లు తెలుపుతున్న ఒక ఉత్తరం వాచ్‌టవర్‌ సొసైటీ నుండి మాకు అందింది. అప్పటికి నాకు 48 ఏండ్లు, మార్త నా కన్నా నాలుగు సంవత్సరాలే చిన్నది. మా ఈ వయస్సులో మేము జపాన్‌ భాష నేర్చుకోగలమా అన్నది మాకు మొదట కలిగిన చింత. కానీ మేము ఆ విషయాన్ని యెహోవాకు వదిలేసి, మా నియామకానికి ఒప్పుకున్నాం.

1958 లో, న్యూయార్క్‌ నగరంలోని యాంకీ స్టేడియంలోను పోలో గ్రౌండ్స్‌లోను అంతర్జాతీయ సమావేశాలు జరిగిన వెంటనే, మేము ఓడ మీద టోక్యోకి బయలుదేరాము. మేము యాకోహామా పోర్ట్‌కి చేరుకుంటుండగా తుపాను వచ్చినందువల్ల ఇబ్బందులకు గురయ్యాము. డాన్‌, మేబల్‌ హస్‌లట్‌, లాయిడ్‌, మెల్బా బ్యారీ, మరితర మిషనరీలు మా కోసం ఆ పోర్ట్‌కి వచ్చారు. ఆ సమయంలో, జపాన్‌లో కేవలం 1,124 మంది సాక్షులు మాత్రమే ఉన్నారు.

మేము జపాన్‌ భాషను అధ్యయనం చేయడమూ, ఇంటింటి పరిచర్యలో పాల్గొనడమూ వెంటనే మొదలుపెట్టాము. ఆంగ్ల అక్షరమాలను ఉపయోగిస్తూ, జపాన్‌ భాషలోని అందింపులను వ్రాసుకుని, ఇంటింటికి వెళ్ళినప్పుడు వారికి చదివి వినిపించేవాళ్ళం. దానికి జవాబుగా, గృహస్థులు, “యోరోషీయీ డెసూ” లేదా “కెకో డెసూ,” అని జవాబిచ్చేవారు. దానర్థం, “సరే,” “మంచిది” అని మేము నేర్చుకున్నాం. ఇష్టం లేదనేందుకు కూడా ఆ మాటలనే ఉపయోగిస్తారు కనుక గృహస్థునికి ఆసక్తి ఉందా లేదా అన్నది మాకు అన్నిసార్లూ తెలిసేది కాదు. వాళ్ళు చెప్పేదానర్థాన్ని గొంతును బట్టి లేదా ముఖ కవళికలను బట్టి అర్థం చేసుకోవాలి. వాటిని బట్టి ఆ పదాల అర్థాన్ని గ్రహించేందుకు మాకు కాస్త సమయం పట్టింది.

నా హృదయానికి ఎంతో ఆనందాన్నిచ్చిన అనుభవాలు

అప్పటికీ మేము జపాన్‌ భాషతో గింజుకుంటూనే ఉన్నాము. ఒకరోజు, మీట్సూబీషీ కంపెనీ డార్మెట్రీకి వెళ్ళినప్పుడు 20 ఏండ్ల యువతిని కలుసుకున్నాను. ఆమె బైబిలు జ్ఞానంలో అభివృద్ధిని సాధించింది, 1966 లో బాప్తిస్మం తీసుకుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆమె పయినీరింగ్‌ మొదలుపెట్టింది, ఆ తర్వాత త్వరలోనే ప్రత్యేక పయినీర్‌గా నియమించబడింది. అప్పటి నుండి ఆమె అలాగే సేవ చేస్తోంది. ఆమె తన యౌవనం నుండే పూర్తికాల పరిచర్యలో తన సమయాన్నీ శక్తినీ ఉపయోగించడాన్ని చూడడం నాకు ఎల్లప్పుడూ ఎంతో పురికొల్పుగా ఉంటుంది.

బైబిలు సత్యం విషయమై ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకోవడం ఒక సవాలే. ముఖ్యంగా, క్రైస్తవేతర సమాజంలో నివసించేవారికి అది పెద్ద సవాలే. అయినప్పటికీ, నేను బైబిలు అధ్యయనం చేసిన అనేక మందితో సహా ఇతర వేలాదిమంది ఈ సవాలును ఎదుర్కున్నారు. వారు జపాన్‌లోని ఇండ్లలో సాంప్రదాయకంగా కనిపించే బౌద్ధమతానికీ షింటో మతానికీ సంబంధించిన ఖరీదైన పూజా వస్తువులను వదిలిపెట్టారు. అలాంటి పనులు చేయడమంటే మృత పూర్వీకులను అగౌరవపర్చడం అని బంధువులు వ్యాఖ్యానిస్తారు కనుక, అలా చేయడానికి క్రొత్తవాళ్ళకు చాలా ధైర్యం కావాలి. వాళ్ళు ధైర్యంగా తీసుకున్న ఆ చర్యలు, అబద్ధమత ఆరాధనా సంబంధిత వస్తువులను విడనాడిన తొలి క్రైస్తవుల చర్యలను గుర్తుచేస్తాయి.—అపొస్తలుల కార్యములు 19:18-20.

ఈ సమయంలో, నాకొక బైబిలు విద్యార్థిని గుర్తుకొస్తుంది. ఆమె ఒక గృహిణి. ఆమె కుటుంబ సమేతంగా టోక్యో నుండి తరలి వెళ్ళాలని పథకం వేసుకుంది. అన్యమతారాధనకు సంబంధించిన వస్తువులేమీ లేని ఒక క్రొత్త ఇంటికి వెళ్ళాలనుకుంది. ఆమె తన కోరికను తన భర్తకు చెప్పింది. ఆయన ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాడు. ఆమె ఆ విషయాన్ని ఎంతో ఆనందంగా నాకు చెప్పింది. అంతలో, తాను మునుపు కొన్న ఎంతో ఖరీదైన మార్బుల్‌ వేస్‌ను ప్యాక్‌ చేసినట్లు ఆమెకు గుర్తుకు వచ్చింది. అది ఇంట్లో ఉంటే సంతోషం వెల్లివిరుస్తుందని అంటారు కనుకనే ఆమె దాన్ని కొన్నది. దానికి అన్యమత ఆరాధనతో సంబంధమున్నట్లు తనకు ఇప్పుడు అనుమానం ఉన్నందువల్ల, ఆమె ఒక సుత్తి తీసుకుని దాన్ని పగలగొట్టేసింది.

ఈ స్త్రీ, మరితరులూ, అబద్ధారాధనతో సంబంధమున్న ఖరీదైన వస్తువులను ఇష్టపూర్వకంగా పారవేసి, యెహోవాకు సేవ చేసేటటువంటి క్రొత్త జీవన శైలిని ధైర్యంగా మొదలుపెట్టడాన్ని చూడడం నాకు ఎంతో ప్రతిఫలదాయకమైన, సంతృప్తికరమైన అనుభవం. నేను జపాన్‌లో నలభై కన్నా ఎక్కువ సంవత్సరాలుగా మిషనరీ సేవలో ఆనందిస్తున్నందుకు నేను యెహోవాకు ఎడతెగక కృతజ్ఞతలు తెలుపుతుంటాను.

ఆధునిక దిన “అద్భుతాలు”

నేను పూర్తికాల పరిచర్యలో గడిపిన 70 కన్నా ఎక్కువ సంవత్సరాలను ఆలోచించినప్పుడు, ఆధునిక దిన అద్భుతాలుగా నాకనిపించే విషయాలను బట్టి నేను ఆశ్చర్యపోతుంటాను. ఎంతో బిడియస్థురాలినైన నేను, చాలా మంది వినాలని అనుకోని అంశమైన రాజ్యాన్ని గురించి ప్రజలతో మాట్లాడేందుకు చొరవతీసుకోవడానికే నా యావత్‌ జీవితాన్ని ఉపయోగించగల్గుతానని చిన్నప్పుడు కలలో కూడా అనుకోలేదు. అయితే, అలా చేస్తున్నది నేను మాత్రమే కాదు. వందల కొలది, వేల కొలది మంది అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఫలప్రదంగా చేస్తున్నారు కనుకనే, నేను 1958 లో జపాన్‌కు వచ్చినప్పుడు, ఒక వెయ్యికంటే కొంచెమే ఎక్కువగా ఉండిన యెహోవాసాక్షుల సంఖ్య నేడు 2,22,000 కన్నా ఎక్కువగా ఉంది !

నేనూ మార్తా జపాన్‌కి మొదటిసారి వచ్చినప్పుడు, టోక్యో బ్రాంచ్‌లో నివసించమని చెప్పారు. తర్వాత 1963 లో, అక్కడే జపాన్‌ బ్రాంచ్‌కు చెందిన ఆరు అంతస్థుల కట్టడాన్ని నిర్మించారు. అప్పటి నుండి మేము అందులోనే ఉంటున్నాం. 1963 నవంబరులో, బ్రాంచ్‌ పైవిచారణకర్త అయిన లాయిడ్‌ బ్యారీ ఇచ్చిన ప్రతిష్ఠాపన ప్రసంగానికి హాజరైన 163 మందిలో మేము కూడా ఉన్నాం. అప్పటికల్లా, జపాన్‌లో యెహోవాసాక్షుల సంఖ్య 3,000 అయ్యింది.

రాజ్య ప్రకటనా పని అతి శీఘ్రంగా వ్యాపించి, 1972 లో నూమాజూ నగరంలో క్రొత్త బ్రాంచ్‌ని విస్తృతం చేసే సరికి సాక్షుల సంఖ్య 14,000 కన్నా ఎక్కువగా కావడాన్ని చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది. అయితే, 1982వ సంవత్సరం నాటికి, జపాన్‌లో రాజ్య ప్రచారకుల సంఖ్య 68,000ను మించిపోయింది. దాంతో, టోక్యోకు దాదాపు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎబీనా నగరంలో జపాన్‌ బ్రాంచ్‌కు సంబంధించిన ఇంకా పెద్ద కట్టడం నిర్మించబడింది.

ఇంతలో, టోక్యో నగర నడిబొడ్డున ఉన్న పాత బ్రాంచ్‌ కట్టడాన్ని పునర్నవీకరించారు. కొంత కాలానికి, నేనూ, నా భాగస్వామి మార్తా హెస్‌తో సహా, 40 నుండి 50 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ సంవత్సరాలుగా జపాన్‌లో సేవ చేస్తున్న 20 కన్నా ఎక్కువ మంది మిషనరీల మిషనరీ హోమ్‌గా అది మారింది. ఒక డాక్టరూ, ఆయన భార్యా మా మిషనరీ హోమ్‌లోనే ఉంటున్నారు. ఆయన భార్య నర్సు. వాళ్ళు ఎంతో ప్రేమగా మా ఆరోగ్య అవసరాలను తీర్చుతుంటారు. ఇటీవల, మరొక నర్సు ఆ స్టాఫ్‌లో చేరింది. క్రైస్తవ సహోదరీలు, పగటి సమయాల్లో వచ్చి ఆ నర్సులకు సహాయపడుతుంటారు. మాకు భోజనం తయారు చేయడానికీ, మా గదులను శుభ్రం చేయడానికీ ఎబీనాలో ఉన్న బేతేలు కుటుంబంలోని సభ్యులు ఇద్దరిద్దరుగా వంతుల వారీగా వస్తారు. నిజంగా యెహోవా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు.—కీర్తన 34:8, 10.

ఎన్నో సంవత్సరాలుగా మిషనరీలుగా ఉన్న మేము నివసిస్తున్న ఈ కట్టడం ప్రతిష్టించబడి 36 సంవత్సరాలు అయిన తర్వాత, ఎబీనాలో ఉన్న వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ యొక్క జపాన్‌ బ్రాంచ్‌ కట్టడం విస్తృతం చేయబడింది, అలా విస్తృతం చేయబడిన కట్టడం 1999 నవంబరు 13న ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠాపనకు 37 దేశాల నుండి వచ్చిన ఎన్నో సంవత్సరాలుగా సాక్షులుగా ఉన్న వందలాదిమందితో సహా 4,486 మంది హాజరయ్యారు, వారిలో నేనూ ఉన్నాను. ఇది నా మిషనరీ జీవితంలో నన్ను పులకరింపజేసిన ఒక సంఘటన. ప్రస్తుతం, ఆ బ్రాంచ్‌లో దాదాపు 650 మంది సభ్యులు ఉన్నారు.

నేను ఎంతో బిడియంతో, ఇంటింటికి వెళ్ళి బైబిలు సందేశాన్ని తెలియజేయనారంభించినది మొదలుకొని దాదాపు 80 సంవత్సరాలుగా యెహోవా నన్ను బలపరుస్తూ నాకు ఎంతో సహాయంగా ఉన్నాడు. నేను బిడియాన్ని అధిగమించేందుకు ఆయన నాకు సహాయం చేశాడు. నాలా ఎంతో బిడియస్థులైన వాళ్ళతో సహా, యెహోవా మీద నమ్మకముంచే ఎవరినైనా యెహోవా ఉపయోగించగలడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అపరిచితులతో, మన దేవుడైన యెహోవాను గురించి మాట్లాడడంలో నా జీవితం ఎంత సంతృప్తికరంగా ఉంది !

[21వ పేజీలోని చిత్రం]

బేతేలు నుండి మమ్మల్ని చూడడానికి వచ్చిన క్లారెన్స్‌, మా అమ్మా, నేను

[23వ పేజీలోని చిత్రం]

న్యూయార్క్‌లోని, సౌత్‌ లాన్సింగ్‌కి సమీపాన ఉన్న గిలియడ్‌ స్కూల్‌లో గడ్డి మీద అధ్యయనం చేస్తున్న మా తరగతి విద్యార్థులు

[23వ పేజీలోని చిత్రం]

ఎడమ: హవాయిలో నేను, మార్తా హెస్‌, అమ్మ

[24వ పేజీలోని చిత్రం]

కుడి: టోక్యో మిషనరీ హోమ్‌లోని సభ్యులు

[24వ పేజీలోని చిత్రం]

క్రింద: ఎంతో కాలంగా నా భాగస్వామిగా ఉన్న మార్తా హెస్‌

[25వ పేజీలోని చిత్రం]

ఎబీనాలో విస్తృతం చేయబడి గత నవంబరులో ప్రతిష్ఠించబడిన బ్రాంచ్‌ వసతులు