కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమగల దేవుణ్ణి గురించి తెలుసుకోవడం

ప్రేమగల దేవుణ్ణి గురించి తెలుసుకోవడం

రాజ్య ప్రచారకుల నివేదిక

ప్రేమగల దేవుణ్ణి గురించి తెలుసుకోవడం

బ్రెజిల్‌ దేశస్థుడైన ఆంటోన్యూ అనే అబ్బాయికి 16 ఏండ్ల వయసులోనే జీవితం మీద విరక్తి పుట్టింది. అప్రయోజకుడనన్న తలంపులతో మత్తుమందులకూ మద్యానికీ బానిస అయిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని గురించి తరచూ ఆలోచిస్తూండేవాడు. సరిగ్గా అలా ఆలోచిస్తున్నప్పుడే, “దేవుడు ప్రేమాస్వరూపి” అని తన తల్లి చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకొచ్చేవి. (1 యోహాను 4:8) అయితే, ప్రేమాస్వరూపియైన ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అని అనుకునేవాడు.

ఆయన, ఆ తర్వాత, మత్తుమందుల వ్యసనం నుండి బయటపడడానికి స్థానిక చర్చిలోని ప్రీస్ట్‌ సహాయాన్ని తీసుకున్నాడు. క్యాథలిక్‌ చర్చి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆయనకు అనేక సందేహాలుండేవి. ఉదాహరణకు, “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” యేసు చెప్పిన మాటలను గురించి ఆలోచించేవాడు. (యోహాను 8:32) నిజానికి ఆయన వాగ్దానం చేసింది ఎలాంటి స్వాతంత్ర్యాన్ని గురించి? అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను చర్చి ఇవ్వలేకపోయింది. దానితో, ఆంటోన్యూ చర్చికి వెళ్ళడం మానేసి, పాత అలవాట్లకు మరలాడు. వాస్తవానికి ఆయన మరింత వ్యసనపరుడయ్యాడు.

అలా ఉండగా, ఆయన భార్య మారియ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆమె బైబిలు అధ్యయనం చేయడాన్ని ఆయన ఖండించలేదు. యెహోవాసాక్షులు అంటే, “అమెరికా మతమనీ అమెరికా ప్రభుత్వ ఆసక్తులకు మద్దతునిస్తుందనీ” అనుకొని ఆయన పట్టించుకోనూ లేదు.

ఆయనలా పట్టించుకోకపోయినప్పటికీ ఆయన భార్య నిరుత్సాహపడలేదు. ఆంటోన్యూకు పుస్తకాలను చదివి ఆనందించే అలవాటు ఉంది కనుక, ఆంటోన్యూకు ఆసక్తి కలుగవచ్చని తనకు అనిపించిన శీర్షికలు ఉన్న కావలికోట, తేజరిల్లు ! సంచికలను ఇంట్లో కనిపించే ప్రతిచోటా పెట్టేది. తన భార్య లేనప్పుడు ఆయన ఆ పత్రికలను తిరగేసి చూసేవాడు. ఒకసారి, అలా తిరగేసి చూస్తున్నప్పుడు, తన జీవితంలో మొదటిసారిగా, తనకున్న బైబిలు సంబంధిత సందేహాలకు సమాధానాన్ని కనుగొన్నాడు. ఆయన, “నా భార్యా, సాక్షులూ నా మీద చూపించే ప్రేమనూ దయనూ నేను గమనించడం మొదలుపెట్టాను” అని ఆ తర్వాత ఒకసారి అన్నాడు.

అలా, 1992వ సంవత్సరపు మధ్య భాగంలో తను కూడా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆయన ఇంకా మత్తుమందులను సేవిస్తూనే ఉన్నాడు. బాగా త్రాగుతూనే ఉన్నాడు. అలా ఉండగా, ఒక రోజు రాత్రి ఆంటోన్యూ, ఆయన స్నేహితుడూ ఒక కాలనీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా పోలీసులు వాళ్ళిద్దరినీ ఆపి, తనిఖీ చేసినప్పుడు ఆంటోన్యూ దగ్గర కొకైన్‌ ఉండడం చూసి, ఆయనను కొట్టడం మొదలుపెట్టారు. ఒక పోలీసు ఆయనను నేల మీదకు పడద్రోసి, ఆయన ముఖానికి దగ్గరగా తుపాకీని పెట్టాడు. అప్పుడు, మిగతా పోలీసులు, “అతడ్ని చంపెయ్‌ !” అని అరిచారు.

ఆయన అలా మట్టిలో పడి ఉండగా, తన గత జీవితమంతా జ్ఞాపకం వచ్చింది. తన జీవితంలో తాను గుర్తు చేసుకోగలిగిన మంచి విషయాలు ఏమిటంటే తన కుటుంబమూ, యెహోవా. అప్పుడు, యెహోవా సహాయాన్ని కోరుతూ ఆయన క్లుప్తంగా ప్రార్థించాడు. ఏ కారణాన్ని బట్టో తెలియదు కానీ, పోలీసువాళ్ళు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యెహోవాయే తనను కాపాడాడన్న నమ్మకంతో ఆయన ఇంటికి వెళ్ళాడు.

ఇప్పుడు, ఆయన మరింత ఉత్సాహంతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. యెహోవాను ప్రీతిపరిచేందుకు నెమ్మదిగా మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాడు. (ఎఫెసీయులు 4:22-24) ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుని, మత్తుమందుల వ్యసనం నుండి కూడా బయటపడడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆయనకు వైద్య సహాయం అవసరమై ఆసుపత్రిలో రెండు నెలలు ఉండవలసి వచ్చింది. అలా ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంతో సహా, అనేక బైబిలు ప్రచురణలను చదివే అవకాశం లభించింది. అలా, తాను చదివి తెలుసుకున్న విషయాలను మిగతా రోగులతో పంచుకోవడం మొదలుపెట్టాడు.

ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత, ఆయన సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడాన్ని కొనసాగించాడు. ఇప్పుడు, ఆయనా ఆయన తల్లీ ఆయన భార్యా కుమార్తెలూ అందరూ ఐక్యంగా సంతోషంతో యెహోవాను ఆరాధిస్తున్నారు. “‘దేవుడు ప్రేమా స్వరూపి’ అనే మాటకున్న నిజమైన అర్థమేమిటో నాకిప్పుడు అర్థమౌతోంది” అని ఆయన అంటున్నాడు.

[8వ పేజీలోని చిత్రం]

రియో డీ జనైరోలో ప్రకటించడం