కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాశిచక్రం మీ జీవితాన్ని ప్రభావితం చేయాలా?

రాశిచక్రం మీ జీవితాన్ని ప్రభావితం చేయాలా?

బైబిలు ఉద్దేశము

రాశిచక్రం మీ జీవితాన్ని ప్రభావితం చేయాలా?

“తమ అదృష్టాన్ని చుక్కల్లో వెదుక్కునే యౌవనస్థులకు, వృద్ధులకు కొదువే లేదు.”​—పోప్‌ జాన్‌ పాల్‌ II.

ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం, ప్రతి నలుగురు అమెరికా వాసుల్లో ఒకరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జ్యోతిశ్శాస్త్రంపై ఆధారపడతారు. జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సూచనలను చూడడం ప్రపంచంలోని ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై లేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా, ఆర్థిక విషయాల్లో, ప్రయాణ పథకాల్లో, ఉద్యోగ మార్పుల్లో, వివాహ తేదీల్లో, సైనిక వ్యూహాల్లో నడిపింపు కోసం రాశిచక్రాన్ని సంప్రదించడం జరుగుతోంది. రాశిచక్ర సూచనలు ఒకరికి తమ భవిష్యద్‌ వివాహ జతను, చివరికి ఏ భాగస్వామి తగినవారై ఉండగలరనేదాన్ని కూడా గుర్తించగలవని చెప్పబడుతుంది. తూర్పు నుండి పడమర వరకూ, జ్యోతిశ్శాస్త్రం లక్షలాదిమంది అవధానాన్ని చూరగొన్నది. అయితే రాశిచక్ర పుట్టుపూర్వోత్తరాలేమిటి?

చారిత్రక పూర్వాపరాలు

రాశిచక్రానికి సంబంధించిన వివిధ రూపాలను మనకు తెలిసిన తొలి నాగరికతల్లో కనుగొనవచ్చు. “రాశిచక్రంలోని తారాగణం” గురించి చివరికి బైబిల్లో కూడా ప్రస్తావించబడింది. (2 రాజులు 23:5, NW) ప్రాచీన కాలాల్లో హిందువులు, అలాగే చైనీయులు, ఐగుప్తీయులు, గ్రీకేయులు, ఇంకా ఇతర ప్రజలు రాశిచక్రాన్ని సంప్రదించేవారని స్పష్టమౌతుంది. అయితే, రాశిచక్ర సూచనల తొలి నివేదనలను ప్రాచీన బబులోనులో కనుగొనవచ్చు.

భవిష్యత్తును గురించిన సమాచారాన్ని పొందాలనే ప్రయత్నంలో బబులోనీయులు జ్యోతిశ్శాస్త్రాన్ని వృద్ధిచేశారు. ఖగోళ కదలికలను గమనించి విస్తృతమైన చార్టులు, పట్టికలు తయారు చేయబడేవి. వాటి నుండి, మానవ వ్యవహారాలు, ఖగోళ సంబంధిత సంఘటనలు ప్రవచించబడేవి. అనేక సందర్భాల్లో, జ్యోతిశ్శాస్త్రజ్ఞులు వచ్చి సలహాలు ఇచ్చేంత వరకూ రాజకీయపరమైన లేక సైనికపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగేది కాదు. కాబట్టి, ప్రత్యేకమైన జ్ఞానమూ, సహజాతీత శక్తులూ ఉన్నాయని చెప్పుకునే మతనాయక వర్గం ఎంతో ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. వాస్తవానికి, బబులోనులోని ప్రముఖ ఆలయాలన్నిటిలోనూ ఖగోళ పరిశీలనా కేంద్రాలు ఉండేవి.

ఆధునిక కాలాల్లోనూ, అనేకుల జీవితాల్లో రాశిచక్ర సూచనలు ప్రముఖ పాత్ర వహిస్తూనే ఉన్నాయి. జాతక చక్రంలో నమ్మకం లేదని చెప్పుకునే వారు కూడా అప్పుడప్పుడూ కేవలం వినోదం కోసమో లేక అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనో రాశిచక్రాన్ని సంప్రదిస్తుండవచ్చు. జ్యోతిశ్శాస్త్రజ్ఞులు చేసిన కొన్ని భవిష్యత్తువాణులు నెరవేరాయన్నది నిజమే. అయితే నక్షత్రాలను సంప్రదించడం ప్రయోజనకరమని దానర్థమా? నిజంగా, జ్యోతిశ్శాస్త్రంలో ఆసక్తిని దేవుని ప్రాచీన సేవకులు ఎలా దృష్టించారు?

దాగివున్న ప్రమాదాలు

నమ్మకమైన యూదులు బబులోనీయులలా జ్యోతిశ్శాస్త్రాన్ని అనుసరించలేదు​—దానికి మంచి కారణమే ఉంది. దేవుడు వారిని స్పష్టంగా ఇలా హెచ్చరించాడు: “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.” *​—ద్వితీయోపదేశకాండము 18:10-12.

దేవుని సేవకులు జ్యోతిశ్శాస్త్రాన్ని దృఢంగా వ్యతిరేకించారు. ఉదాహరణకు, నమ్మకమైన రాజైన యోషీయా “బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును [“రాశిచక్రంలోని తారాగణానికి,” NW] నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపివేసెను.” యోషీయా చేసినది “యెహోవా దృష్టికి యథార్థముగా” ఉండెనని తెలియజేయబడింది, దాన్ని బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. (2 రాజులు 22:2; 23:5) అయితే, కొందరిలా అడుగవచ్చు, ‘జ్యోతిశ్శాస్త్రజ్ఞులు చెప్పిన భవిష్యవాణులలో కొన్నైనా నెరవేరాయికదా?’

ఆసక్తికరంగా, “సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న” ఒక చిన్నదాని గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మనం చదువుతాము. ఆమెకున్న శక్తులనుబట్టి ఆమె యజమానులు లాభము పొందారు గనుక, ఈ చిన్నది ప్రవచించిన కొన్ని విషయాలు నెరవేరాయని స్పష్టమౌతుంది. అయితే భవిష్యద్‌ సంఘటనలను తెలియజేసే ఈ చిన్నదాని సామర్థ్యం వెనుకనున్నదేమిటి? ఆమె “పుతోను అను దయ్యము” ప్రభావం క్రింద ఉందని బైబిలు పేర్కొంటుంది.​—అపొస్తలుల కార్యములు 16:16.

“లోకమంతయు” అపవాదియగు సాతాను అయిన “దుష్టుని యందున్నదని” బైబిలు చూపిస్తుంది. (1 యోహాను 5:19) కొన్ని భవిష్యవాణులు నిజమయ్యేలా చేసేందుకు సంఘటనలను మలుపు త్రిప్పడం ద్వారా సాతాను అతని దయ్యాలు లక్షలాదిమంది అవధానాన్ని చూరగొన్నాయి.

జ్యోతిశ్శాస్త్రం “అపవాది తంత్రముల”లో ఒకటన్నది చాలా సరళమైన సత్యం, ప్రజలు తన సంకల్పాన్ని నెరవేర్చేలా వారిని అదుపు చేయడానికీ, వారిని ప్రభావితం చేయడానికీ అతడు దాన్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి, జ్యోతిశ్శాస్త్రం కూడా ఒక భాగమైయున్న సాతాను కుతంత్రములను “ఎదిరించ”మని బైబిలు క్రైస్తవులకు ఉద్బోధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. (ఎఫెసీయులు 6:11) అయితే భవిష్యత్తుకు సంబంధించి మనం ఏ నడిపింపూ లేకుండా విడిచిపెట్టబడ్డామని దీనర్థమా?

బైబిలు​—ఒక నమ్మకమైన నిర్దేశం

నిర్ణయాలు తీసుకోవడంలో బైబిలు నమ్మకమైన నిర్దేశంగా ఉన్నట్లు లక్షలాదిమంది కనుగొన్నారు. కీర్తనకర్తయైన దావీదు మాటల్లో చెప్పాలంటే, “యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.” (కీర్తన 19:7; 119:105) అయితే ప్రతి సందర్భంలోనూ ఒక వ్యక్తి ఏమి చేయాలనేది బైబిలు నిర్దిష్టంగా చెప్తుందని దాని భావం కాదు. కానీ, మన జ్ఞానేంద్రియాలకు తర్ఫీదునిచ్చుకునేందుకు సహాయం చేయగల సూత్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇవి, తప్పొప్పులను మనం వివేచించుకునేలా చేసి, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయపడతాయి.​—హెబ్రీయులు 5:14.

కాబట్టి నిజక్రైస్తవులు వినోదం కోసమో లేక తెలుసుకోవాలనే ఉత్సుకతతోనో కూడా జాతక చక్రాలను సంప్రదించకపోవడానికి తగిన కారణమే ఉంది. ఎంతో కుయుక్తితో కూడిన వాటితో సహా, దయ్యాల ప్రభావానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరికలను వారు జ్ఞానయుక్తంగా అనుసరిస్తారు. రాశిచక్రానికి బదులు బైబిలు మీ జీవితాన్ని ప్రభావితం చేసేందుకు అనుమతించడం ద్వారా, మీరు దేవుని ఆశీర్వాదాన్ని నిరంతరం అనుభవించవచ్చు.​—కీర్తన 37:29, 38.

(g00 11/8)

[అధస్సూచి]

^ సోదెలో, నిగూఢమైన శక్తుల ద్వారా ప్రాముఖ్యంగా భవిష్యద్‌ సంఘటనలకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చర్యలన్నీ ఇమిడి ఉన్నాయి.

[26వ పేజీలోని చిత్రం]

తూర్పు రాశిచక్రం

[26వ పేజీలోని చిత్రం]

పశ్చిమ రాశిచక్రం