ద్వితీయోపదేశకాండం 18:1-22

  • యాజకుల, లేవీయుల భాగం (1-8)

  • మంత్రతంత్రాలకు సంబంధించినవి నిషిద్ధం (9-14)

  • మోషేలాంటి ఒక ప్రవక్త (15-19)

  • అబద్ధ ప్రవక్తల్ని ఎలా గుర్తుపట్టాలి (20-22)

18  “లేవీయులైన యాజకులకు, చెప్పాలంటే, లేవి గోత్రమంతటికీ ఇశ్రాయేలులో భాగం గానీ, స్వాస్థ్యం గానీ ఇవ్వబడదు. యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి, అంటే ఆయన స్వాస్థ్యంలో నుండి వాళ్లు తింటారు.+  కాబట్టి వాళ్లకు తమ సహోదరుల మధ్య స్వాస్థ్యం ఉండకూడదు. యెహోవా వాళ్లతో చెప్పినట్టు, ఆయనే వాళ్ల స్వాస్థ్యం.  “ప్రజల దగ్గర నుండి వీటిని పొందే హక్కు యాజకులకు ఉంటుంది: ఎవరైనా బలి అర్పించినప్పుడు, అది ఎద్దే గానీ, గొర్రే గానీ అతను దాని జబ్బను, దవడల్ని, దాని పొట్టను యాజకునికి ఇవ్వాలి.  మీ ధాన్యం నుండి, కొత్త ద్రాక్షారసం నుండి, నూనె నుండి ప్రథమఫలాల్ని; నీ గొర్రెల బొచ్చు కత్తిరించి తీసిన మొదటి ఉన్నిని యాజకునికి ఇవ్వాలి.+  ఎప్పుడూ యెహోవా పేరున పరిచారం చేసేలా నీ దేవుడైన యెహోవా నీ గోత్రాలన్నిట్లో నుండి అతన్ని, అతని కుమారుల్ని ఎంచుకున్నాడు.+  “కానీ మీ నగరాల్లో ఒక లేవీయుడు తాను నివసిస్తున్న నగరాన్ని విడిచి, యెహోవా ఎంచుకునే చోటికి*+ వెళ్లాలని కోరుకుంటే,  అక్కడ యెహోవా ముందు సేవచేస్తున్న లేవీయులైన తన సహోదరులందరిలాగే అతను కూడా అక్కడ తన దేవుడైన యెహోవా పేరున పరిచారం చేయవచ్చు.  అతను కూడా వాళ్లతో సమానంగా ఆహారాన్ని పొందుతాడు. తన వారసత్వపు ఆస్తుల్ని అమ్మడం వల్ల వచ్చిన దానికి అదనంగా దాన్ని పొందుతాడు.  “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనాల అసహ్యకరమైన ఆచారాల్ని అనుకరించడానికి నువ్వు ప్రయత్నించకూడదు.+ 10  ఇలాంటివాళ్లు నీ మధ్య ఉండకూడదు: తన కుమారుణ్ణి లేదా కూతుర్ని అగ్నిలో వేసి కాల్చేవాడు,*+ సోదె చెప్పేవాడు,+ ఇంద్రజాలం చేసేవాడు,+ శకునాలు చూసేవాడు,+ మంత్రగాడు, 11  మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, చనిపోయినవాళ్లతో మాట్లాడేవాణ్ణి గానీ భవిష్యత్తు చెప్పేవాణ్ణి గానీ సంప్రదించేవాడు, చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేసేవాడు.+ 12  ఎందుకంటే ఇవి చేసేవాళ్లంతా యెహోవాకు అసహ్యులు, ఈ అసహ్యకరమైన ఆచారాల వల్లే నీ దేవుడైన యెహోవా వాళ్లను నీ ముందు నుండి వెళ్లగొడుతున్నాడు. 13  నీ దేవుడైన యెహోవా ముందు నువ్వు నిందలేని వ్యక్తిగా ఉండాలి.+ 14  “నువ్వు ఓడించి స్వాధీనం చేసుకోబోతున్న ఈ జనాలు ఇంద్రజాలం చేసేవాళ్ల+ మాట, సోదె చెప్పేవాళ్ల+ మాట వినేవాళ్లు; కానీ నీ దేవుడైన యెహోవా అలాంటిదేదీ నిన్ను చేయనివ్వలేదు. 15  నీ దేవుడైన యెహోవా నీకోసం నీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు. మీరు అతని మాట వినాలి.+ 16  దేవుడు ఆ ప్రవక్తను ఎందుకు రప్పిస్తున్నాడంటే, హోరేబు దగ్గర సమావేశమైన రోజున+ నువ్వు నీ దేవుడైన యెహోవాను ఇలా అడగమన్నావు: ‘నా దేవుడైన యెహోవా మాట్లాడుతున్నప్పుడు* నన్ను విననివ్వకు; ఈ గొప్ప అగ్నిని ఇక నన్ను చూడనివ్వకు, లేదంటే నేను చనిపోతాను.’+ 17  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘వాళ్లు అన్న మాట సరిగ్గానే ఉంది. 18  నేను వాళ్ల సహోదరుల్లో నుండి వాళ్ల కోసం నీలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాను,+ అతని నోట నా మాటల్ని ఉంచుతాను,+ నేను అతనికి ఆజ్ఞాపించినవాటన్నిటినీ అతను వాళ్లకు తెలియజేస్తాడు.+ 19  నిజానికి, అతను నా పేరున మాట్లాడే నా మాటల్ని విననివాళ్లను నేను లెక్క అడుగుతాను.+ 20  “ ‘అహంకారంతో ఏ ప్రవక్తయినా నేను అతనికి ఆజ్ఞాపించని మాటను నా పేరున లేదా వేరే దేవుళ్ల పేరున చెప్తే, అతను చావాల్సిందే.+ 21  ఒకవేళ నీ హృదయంలో, “అది యెహోవా చెప్పిన మాట కాదని మాకు ఎలా తెలుస్తుంది?” అని అనిపించవచ్చు. 22  ఆ ప్రవక్త యెహోవా పేరున మాట్లాడినప్పుడు ఆ మాట నెరవేరకపోతే లేదా అలా జరగకపోతే, అది యెహోవా చెప్పిన మాట కాదు. అది ఆ ప్రవక్త అహంకారంతో పలికిన మాట. నువ్వు అతనికి భయపడకూడదు.’

అధస్సూచీలు

అంటే, ఆరాధనకు కేంద్రంగా ఉండేలా యెహోవా ఎంచుకునే చోటు.
అక్ష., “అగ్ని గుండా దాటించేవాడు.”
అక్ష., “స్వరాన్ని.”