కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాసొరెట్‌లు లేఖనాల్ని ఉన్నదున్నట్లుగా నకలు రాశారు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది

బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచింది

బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచింది

ముప్పు: బైబిలు సందేశం రాయబడిన రాతప్రతులు పాడైనా, బైబిల్ని నాశనం చేయడానికి కొంతమంది ప్రయత్నించినా వాటన్నిటినీ తట్టుకుని బైబిలు నిలిచింది. అయితే కొంతమంది నకలు రాసేవాళ్లు, అలాగే అనువాదకులు బైబిలు సందేశంలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నించారు. వాళ్లు తమ నమ్మకాల్ని బైబిలు సిద్ధాంతాలకు తగ్గట్టుగా మార్చుకునే బదులు, బైబిలు సిద్ధాంతాలనే తమ నమ్మకాలకు తగ్గట్టు మార్చడానికి ప్రయత్నించారు. అలాంటి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి:

  • ఆరాధనా స్థలం: ద సమారిటన్‌ పెంటాటుక్‌ రచయితలు, గెరిజీము పర్వతం మీద వాళ్లు కట్టాలనుకుంటున్న ఆలయానికి బైబిలు మద్దతిస్తుందని చూపించేలా నిర్గమకాండం 20:17⁠లో కొన్ని అదనపు మాటలు చేర్చారు.

  • త్రిత్వ సిద్ధాంతం: బైబిలు రాయడం పూర్తై 300 సంవత్సరాలు అవ్వకముందే, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే ఒక రచయిత 1 యోహాను 5:7కు ఈ మాటలు కలిపాడు. “పరలోకంలో తండ్రి, వాక్యం, పవిత్రశక్తి ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కటే.” కానీ ఈ మాటలు మూలప్రతిలో లేవు. “అయితే, ఆరవ శతాబ్దం మొదలుకొని ప్రాచీన లాటిన్‌ రాతప్రతుల్లో, లాటిన్‌ వల్గేట్‌లో ఈ మాటలు ఎక్కువగా కనిపించాయి,” అని ఒక బైబిలు నిపుణుడు రాశాడు.

  • దేవుని పేరు: దేవుని పేరు చాలా పవిత్రమైనది కాబట్టి దాన్ని ఉపయోగించకూడదని కొంతమంది యూదులు నమ్మేవాళ్లు. దాంతో చాలామంది బైబిలు అనువాదకులు తమ అనువాదాల్లో దేవుని పేరును తీసేసి, దాని స్థానంలో “దేవుడు”, “ప్రభువు” అనే బిరుదులు వాడారు. బైబిల్లో ఆ బిరుదులను కొంతమంది మనుషులకు, అబద్ధ దేవుళ్లకు చివరికి సాతానుకు కూడా వాడారు.​—యోహాను 10:34, 35; 1 కొరింథీయులు 8:5, 6; 2 కొరింథీయులు 4:4. *

బైబిలు ఎలా నిలిచింది: మొదటి కారణం పరిశీలించండి. నకలు రాసేవాళ్లలో కొంతమంది నిర్లక్ష్యంగా, మోసపూరితంగా వ్యవహరిస్తూ బైబిలు సందేశంలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మిగతావాళ్లు మాత్రం చాలా శ్రద్ధతో బైబిలు సందేశాన్ని ఉన్నదున్నట్టుగా నకలు రాశారు. సా.శ. 6 నుండి సా.శ. 10 శతాబ్దాల మధ్యకాలంలో, మాసొరెట్‌లు హీబ్రూ లేఖనాల్ని నకలు రాశారు. దాన్ని మాసొరెటిక్‌ టెక్స్‌ట్‌ అని పిలుస్తారు. వాళ్లు మూలప్రతిలో ఉన్న పదాల సంఖ్యను, అక్షరాల సంఖ్యను లెక్కపెట్టి, తమ నకలు ప్రతుల్లో కూడా అన్నే పదాలు, అక్షరాలు ఉండేలా చూసుకున్నారు. వాళ్లు చూసి రాస్తున్న మూలప్రతుల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే, ఆ విషయాన్ని తమ నకలు ప్రతిలోని మార్జిన్‌లో ప్రస్తావించేవాళ్లు. మాసొరెట్‌లు బైబిలు సందేశంలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నించలేదు. “ఉద్దేశపూర్వకంగా బైబిలు సందేశాన్ని మార్చడాన్ని అత్యంత భయంకరమైన నేరంగా మాసొరెట్‌లు పరిగణించేవాళ్లు” అని ఒక నిపుణుడు వివరించాడు.

రెండవ కారణం పరిశీలించండి. నేడు అనేక రాతప్రతులు అందుబాటులో ఉండడం వల్ల, బైబిలు నిపుణులు వాటిని ఒకదానితో మరొకటి పోల్చి తప్పుల్ని గుర్తించగలిగారు. ఉదాహరణకు, లాటిన్‌ బైబిలు అనువాదమే ఖచ్చితమైనదని మతనాయకులు కొన్ని శతాబ్దాల పాటు బోధిస్తూ వచ్చారు. కానీ వాళ్లు, మూలప్రతుల్లో లేని కొన్ని మాటల్ని 1 యోహాను 5:7⁠లో చేర్చారని పై పేరాల్లో తెలుసుకున్నాం. వాళ్లు చేర్చిన ఆ మాటలు ప్రసిద్ధి చెందిన ఇంగ్లీషు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో కూడా కనిపించాయి! అయితే కొంతకాలానికి, వివిధ భాషల్లో ఉన్న అతిపురాతనమైన కొన్ని రాతప్రతులు బయటపడ్డాయి. అవి పరిశీలించి ఈ మాటలు వాటిలో లేవని నిపుణులు నిర్ధారించారు. దాంతో కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ రివైజ్డ్‌ ఎడిషన్‌లలో, ఇంకా ఇతర బైబిళ్లలో ఆ మాటల్ని తీసేశారు.

చెస్టర్‌ బెట్టీ P46, పపైరస్‌ మీద రాయబడిన క్రీ.శ. 200 నాటి బైబిలు రాతప్రతి

బైబిలు సందేశంలో మార్పులు జరగలేదని ప్రాచీన రాతప్రతులు రుజువు చేస్తున్నాయి. 1947⁠లో మృత సముద్ర గ్రంథపు చుట్టలు దొరికాయి. ఇవి మాసొరెటిక్‌ టెక్స్‌ట్‌ కన్నా దాదాపు వెయ్యేళ్లు పాతవి. కొంతమంది నిపుణులు ఈ రెండింటిలో ఉన్న సమాచారాన్ని పోల్చి చూశారు. మాసొరెట్లు బైబిలు సందేశాన్ని ఉన్నదున్నట్లుగా నకలు చేశారు కాబట్టి బైబిలు సందేశం నమ్మదగినదని రుజువైనట్టు ఒక నిపుణుడు చెప్పాడు.

ఐర్లాండ్‌లోని ఒక లైబ్రరీలో అతి ప్రాచీన రాతప్రతుల్లోని కొన్ని భాగాలు ఉన్నాయి; అవి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని దాదాపు అన్ని పుస్తకాలకు సంబంధించినవి. వాటిలోని కొన్ని రాతప్రతులు బైబిలు పూర్తైన దాదాపు వందేళ్ల తర్వాత నకలు చేయబడ్డాయి. నిజానికి, బైబిలు సందేశం ఎన్నోసార్లు నకలు చేయబడినా అందులో చిన్నచిన్న తప్పులు వచ్చాయే గానీ, అసలు సందేశం ఏమీ మారలేదని ఒక డిక్షనరీ చెప్పింది.

“నకలు రాయబడిన హీబ్రూ లేఖనాలు, ఇతర పుస్తకాల ప్రాచీన రాతప్రతుల కన్నా ఎంతో ఖచ్చితమైనవి”

ఫలితం: ప్రాచీన రాతప్రతులు ఉండడం, అవి కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల బైబిలు సందేశం మారకుండా ఉంది. ఒక నిపుణుడు ఇలా చెప్పాడు: ‘ఏ ఇతర ప్రాచీన గ్రంథం ఇన్నిసార్లు నకలు రాయబడలేదు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని సందేశం ఏమాత్రం మారలేదు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.’ మరో నిపుణుడు ఇలా అన్నాడు: “మన దగ్గర ఉన్న హీబ్రూ లేఖనాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదు. అవి ఇతర ప్రాచీన రాతప్రతుల కన్నా ఎంతో ఖచ్చితమైనవి.”

^ పేరా 6 ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి www.jw.orgలో ఉన్న పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదంలో A4, A5 అనుబంధాలను చూడండి.