కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది

పాడైపోయే పదార్థాలపై రాయబడినా బైబిలు నిలిచింది

పాడైపోయే పదార్థాలపై రాయబడినా బైబిలు నిలిచింది

ముప్పు: బైబిలు రచయితలు, నకలు రాసేవాళ్లు పపైరస్‌ మీద, * జంతు చర్మాల మీద రాసేవాళ్లు. (2 తిమోతి 4:13) వాటివల్ల బైబిలుకు ఎదురైన ముప్పు ఏంటి?

పపైరస్‌ త్వరగా చిరిగిపోతుంది, రంగు మారిపోతుంది. పపైరస్‌ చుట్టలు త్వరగా పాడైపోవచ్చు లేదా బూజు పట్టి కుళ్లిపోవచ్చు; ఒకవేళ మట్టిలో పాతిపెడితే జంతువులు, పురుగులు చీమలు దాన్ని తినేయవచ్చు అని నిపుణులు అంటారు. పపైరస్‌ మీద రాసిన కొన్ని రాతప్రతులు అధిక వెలుతురు, తేమ తగలడం వల్ల పాడైపోయాయి.

పపైరస్‌తో పోలిస్తే జంతు చర్మాలు ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. కానీ సరిగ్గా భద్రపర్చకపోయినా, విపరీతమైన వేడి, తేమ, వెలుతురు తగిలినా జంతు చర్మాలు కూడా పాడైపోతాయి. * వాటిని పురుగులు తినేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే, ప్రాచీన రాతప్రతులు కొన్ని మాత్రమే ఇప్పటివరకు నిలిచివున్నాయి. ఒకవేళ బైబిలు రాతప్రతులు కూడా ఇలానే పాడైవుంటే, అందులోని సందేశం మనవరకు చేరేది కాదు.

బైబిలు ఎలా నిలిచింది: మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ప్రతీ రాజు బైబిల్లోని మొదటి ఐదు కాండాలను తనకోసం ‘ఒక పుస్తకంలో నకలు రాసుకోవాలి.’ (ద్వితీయోపదేశకాండం 17:18) అంతేకాదు, వృత్తిలో భాగంగా నకలు రాసే వ్యక్తులు, లేఖనాల కాపీలను ఎక్కువ సంఖ్యలో తయారుచేశారు. దాంతో యేసు కాలానికల్లా, ఆ కాపీలు ఇశ్రాయేలీయుల సమాజమందిరాల్లో, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి వచ్చాయి! (లూకా 4:16, 17; అపొస్తలుల కార్యాలు 17:11) మరి, కొన్ని అతి పురాతనమైన రాతప్రతులు ఇప్పటివరకు పాడవకుండా ఎలా ఉన్నాయి?

మృత సముద్ర గ్రంథపు చుట్టలు అని ఇప్పుడు పిలువబడుతున్న రాతప్రతులు, కొన్ని వందల ఏళ్ల క్రితం మట్టి కుండల్లో పెట్టి గుహల్లో భద్రపర్చబడ్డాయి

“యూదులు లేఖనాల గ్రంథపు చుట్టలను కూజాల్లో లేదా కుండల్లో భద్రపర్చేవాళ్లు” అని కొత్త నిబంధన నిపుణుడైన ఫిలిప్‌ డబ్ల్యూ. కమ్‌ఫర్ట్‌ అన్నాడు. ఆ తర్వాత కాలాల్లో, క్రైస్తవులు కూడా అదే పద్ధతి పాటించారు. ఫలితంగా, ప్రాచీన కాలంనాటి కొన్ని బైబిలు రాతప్రతులు మట్టి కుండల్లో, చీకటి ప్రదేశాల్లో, గుహల్లో, పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో దొరికాయి.

ఫలితం: ప్రాచీన రాతప్రతుల్లోని కొన్ని భాగాలు వేల సంఖ్యలో దొరికాయి; వాటిలో కొన్ని 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం నాటివి. వేరే ఏ పురాతన గ్రంథానికి సంబంధించిన రాతప్రతులు ఇంత ఎక్కువ సంఖ్యలో దొరకలేదు.

^ పేరా 3 పపైరస్‌ అనే నీటిమొక్క నుండి, రాయడానికి వీలుగా ఉండే కాగితంలాంటి పదార్థాన్ని తయారుచేసేవాళ్లు. దాన్ని పపైరస్‌ అని పిలిచేవాళ్లు.

^ పేరా 5 యు.ఎస్‌. చేసిన స్వాతంత్ర్య ప్రకటన అధికారిక కాపీ జంతు చర్మం మీద రాయబడింది. ఇప్పుడు, అంటే దాదాపు 250 సంవత్సరాల తర్వాత గమనిస్తే, అది చదవడానికి కూడా వీల్లేనంతగా పాడైపోయింది.