కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?

కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?

కోపం అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఒక కాలేజ్‌ బాస్కెట్‌బాల్‌ కోచ్‌ ఉద్యోగం పోయింది.

కావాల్సింది చేయకపోవడంతో పిల్లవాడు కోపంగా మొండికేశాడు.

గది గందరగోళంగా చేసినందుకు తల్లీ కొడుకుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

కోపపడే వాళ్లను అందరం చూశాం. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు చిరాకుపడుతూ ఉంటాం. కోపం మంచిది కాదు, దాన్ని చూపించకూడదని మనకు అనిపిస్తుంది. కానీ అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు కోపపడడంలో తప్పు లేదనుకుంటాం. ‘మనుషులందరికీ కోపం రావడం సహజం, అది మంచిదే’ అని అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో ఉంది.

క్రైస్తవ అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు తెలిసినవాళ్లకు పై అభిప్రాయం సరైనదే అనిపించవచ్చు. అప్పుడప్పుడు అందరికీ కోపం వస్తుందని చెబుతూ ఆయనిలా అన్నాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” (ఎఫెసీయులు 4:26) దీనంతటిని బట్టి కోపాన్ని చూపించవచ్చా? లేదా అదుపులో పెట్టుకోవాలా?

కోపపడవచ్చా?

పౌలు కోపం గురించి ఆ సలహా ఇచ్చినప్పుడు బహుశా ఆయన మనసులో కీర్తనల్లోని “కోపంగా ఉండండి. కాని పాపం చేయవద్దు” అనే మాటలు ఉండవచ్చు. (కీర్తన 4:4, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అయితే, ఈ మాటల నుండి పౌలు ఏం చెప్పాలనుకున్నాడు? ఆయనిలా వివరించాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసీయులు 4:31) నిజానికి పౌలు క్రైస్తవులకు కోపం చూపించవద్దనే చెబుతున్నాడు. ఆసక్తికరంగా, అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఇంకా ఇలా చెప్పింది: “కోపాన్ని వెళ్లగక్కడం నిజానికి కోపాన్ని, ఆవేశాన్ని ఇంకా పెంచుతుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు . . . సమస్య పరిష్కారం అవ్వదు.”

కోపాన్ని, దానివల్ల వచ్చే చెడు ఫలితాలను ఎలా ‘విసర్జించాలి’? ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను ఇలా రాశాడు: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును [కోపాన్ని తగ్గిస్తుంది, NW] తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” (సామెతలు 19:11) మరి “ఒకని సుబుద్ధి” కోపాన్ని తగ్గించడానికి ఎలా సహాయపడుతుంది?

సుబుద్ధి కోపాన్ని తగ్గిస్తుంది, ఎలా?

సుబుద్ధి అంటే ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం. సుబుద్ధి ఉంటే ఒక విషయాన్ని పైపైనే చూడం కానీ అన్నివైపుల నుండి ఆలోచిస్తాం. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు లేదా కోపం తెప్పించినప్పుడు సుబుద్ధి ఎలా సహాయం చేస్తుంది?

అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు బాగా కోపం వస్తుంది. కానీ అదే కోపంతో ఆవేశంగా ఏదైనా చేస్తే మనంగానీ ఎదుటివాళ్లుగానీ బాధపడాల్సి రావచ్చు. మంటలు ఆర్పకపోతే ఇల్లంతా కాలిపోయినట్టు కోపంతో ఆవేశంగా ప్రవర్తిస్తే మన పేరు పాడవుతుంది; ఇతరులతో, దేవునితో కూడా ఉన్న సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి లోపల కోపం మొదలౌతున్నట్లు అనిపించిన వెంటనే, ఆ విషయం గురించి ఒకసారి లోతుగా ఆలోచించాలి. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని అన్నివైపుల నుండి ఆలోచిస్తే కోపం తగ్గుతుంది.

సొలొమోను తండ్రి దావీదు రాజు నాబాలు అనే అతన్ని చంపేయాలనుకున్నాడు, కానీ ఆ అపరాధం చేయకుండా ఆగిపోయాడు. ఎందుకంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దావీదుకు సహాయం వెంటనే దొరికింది. యూదయ అనే ప్రాంతంలోని అరణ్యంలో దావీదు, అతని సహచరులు నాబాలు గొర్రెలను కాపాడారు. గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు దావీదు నాబాలును ఆహారం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నాబాలు, “నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా?” అన్నాడు. ఎంత అవమానం! ఆ మాటలు విన్న వెంటనే నాబాలును, ఆయన కుటుంబాన్ని నాశనం చేయడానికి 400 మందితో దావీదు బయలుదేరాడు.—1 సమూయేలు 25:4-13.

ఆ విషయం తెలిసిన వెంటనే నాబాలు భార్య అబీగయీలు దావీదును కలవడానికి వెళ్లింది. దావీదును, అతని మనుషులను కలవగానే అతని కాళ్ల మీద పడి, “నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము” అని అంది. నాబాలు బుద్ధిలేని వాడని, అతన్ని చంపి పగ తీర్చుకుంటే అనవసరంగా అపరాధం చేశానని బాధపడాల్సి వస్తుందని దావీదుకు వివరించింది.—1 సమూయేలు 25:24-31.

కోపం చల్లారేలా అబీగయీలు చెప్పిన మాటల్లోని ఏ విషయాలను దావీదు లోతుగా ఆలోచించాడు? ఒకటి, నాబాలు ముందు నుంచే బుద్ధిలేని వాడని దావీదు తెలుసుకున్నాడు. రెండు, పగ తీర్చుకోవడానికి ప్రాణం తీసుంటే అనవసరంగా తప్పు చేసివుండేవాన్నని గ్రహించాడు. దావీదులాగే, మీకు కూడా ఒక్కోసారి కోపం రావచ్చు. అప్పుడేమి చేయవచ్చు? మాయో క్లినిక్‌ ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో ఈ సలహా ఉంది: “కొన్ని క్షణాలు ఆగి గట్టిగా గాలి పీల్చుకొని 1 నుండి 10 వరకు లెక్కపెట్టండి.” ఒక్కసారి ఆగి సమస్యకు అసలు కారణం ఏంటి, మీకు అనిపించింది చేస్తే ముందుముందు ఏం జరగవచ్చో ఆలోచించండి. సుబుద్ధిని ఉపయోగించి మీ కోపాన్ని తగ్గించుకోండి లేదా పూర్తిగా తీసేసుకోండి.—1 సమూయేలు 25:32-35.

నేడు చాలామంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయం పొందారు. పోలాండ్‌ జైల్లో ఉన్న 23 సంవత్సరాల సెబాస్టియన్‌ కోపం తగ్గించుకోవడానికి, ఆవేశం అదుపు చేసుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేసిందో ఇలా వివరిస్తున్నాడు: “మొదటిగా, సమస్య గురించి ఆలోచిస్తాను ఆ తర్వాత బైబిలు ఇస్తున్న సలహా పాటిస్తాను. సలహాల కోసం బైబిలు చాలా మంచి పుస్తకం.”

కోపం తగ్గించుకోవడానికి బైబిలు సలహాలు ఉపయోగపడతాయి

సెట్సువో కూడా అలాంటి పద్ధతినే పాటించాడు. ఆయనిలా అన్నాడు: “పని చేసే దగ్గర తోటివాళ్లు చిరాకు తెప్పిస్తే వాళ్లమీద అరిచేవాన్ని. అయితే ఇప్పుడు బైబిలు విషయాలు నేర్చుకున్నాను కాబట్టి అరిచే బదులు అసలు తప్పు ఎవరిది? సమస్యకు కారణం నేనే కదా? అని ఆలోచిస్తున్నాను.” ఇలా ఆలోచించడం వల్ల కోపాన్ని తగ్గించుకున్నాడు, మనసులో మొదలయ్యే ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నాడు.

కోపం ఎంత బలంగా వచ్చినా, దేవుని వాక్యం ఇచ్చే సలహాలు అంతకన్నా బలంగా పనిచేస్తాయి. బైబిల్లో ఉన్న సలహాలను పాటిస్తూ, దేవుని సహాయం కోసం ప్రార్థిస్తే మీరు కూడా సుబుద్ధితో కోపాన్ని తగ్గించుకోవచ్చు లేదా అదుపులో ఉంచుకోవచ్చు. ▪ (w14-E 12/01)