కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను నిన్ను మరువను”

“నేను నిన్ను మరువను”

దేవునికి దగ్గరవ్వండి

“నేను నిన్ను మరువను”

యెహోవాకు తన ప్రజలమీద నిజంగా శ్రద్ధ ఉందా? ఉంటే, ఎంత ఉంది? వాటి సమాధానం దేవుడు చెప్తేనే మనకు తెలుస్తుంది. తన భావాల గురించి యెహోవా బైబిల్లో స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పుడు యెషయా 49:15 లోని మాటలను పరిశీలించండి.

ఆ వచనంలో, హృదయాన్ని తాకే ఒక చక్కని ఉదాహరణతో తన ప్రజలపట్ల తనకెంత శ్రద్ధ ఉందో యెహోవా తెలియజేశాడు. ముందుగా, ఆలోచింపజేసే ఈ ప్రశ్న ఆయన అడిగాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా?” ఈ ప్రశ్న వినగానే జవాబు పెద్ద కష్టమైనదేమీ కాదు అనిపిస్తుంది. పాలిచ్చే తల్లి తన చంటిబిడ్డను ఎలా మర్చిపోగలదు? శిశువు ప్రతీ క్షణం తల్లిమీద ఆధారపడుతుంది. తనకేం కావాలన్నా ఏడ్చి తల్లికి తెలిసేలా చేస్తుంది. కానీ యెహోవా ఆ ప్రశ్న అడగడానికి వేరే కారణం కూడా ఉంది.

తల్లి బిడ్డకు పాలు ఎందుకు ఇస్తుంది, దాని అవసరాలన్నీ ఎందుకు తీరుస్తుంది? కేవలం బిడ్డ ఏడుపు ఆపడానికేనా? కాదు. సహజంగానే తల్లికి “తన గర్భమున పుట్టిన బిడ్డ” మీద కరుణ ఉంటుంది. ఇక్కడ “కరుణించు” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “కనికరపడు,” “జాలిపడు” అనే అర్థాలు కూడా ఉన్నాయి. (నిర్గమకాండము 33:19; యెషయా 54:10) ఆ హీబ్రూ పదం, నిస్సహాయులపట్ల లేదా బలహీనులపట్ల చూపించే వాత్సల్యాన్ని సూచించవచ్చు. తల్లికి తన చంటిబిడ్డ మీద ఉండే వాత్సల్యం అత్యంత బలమైన భావోద్వేగాల్లో ఒకటి.

కానీ విచారకరమైన విషయమేమిటంటే, పాలు తాగే పసిబిడ్డల మీద కొందరు తల్లులు జాలి చూపించడం లేదు. అందుకే యెహోవా, ‘వాళ్లయినా మర్చిపోతారు’ అన్నాడు. నేడు చాలామంది స్త్రీపురుషులు నమ్మకద్రోహులుగా, అనురాగం లేనివారిగా ఉన్నారు. (2 తిమోతి 3:1-5) కొందరు తల్లులు పురిట్లోని బిడ్డల్ని పట్టించుకోవడంలేదనో, కఠినంగా చూస్తున్నారనో, వదిలేసి వెళ్లిపోయారనో అప్పుడప్పుడు వింటుంటాం. యెషయా 49:15 గురించి ఒక బైబిలు రెఫరెన్సు గ్రంథం ఇలా వివరించింది: ‘తల్లులూ పాపులే కాబట్టి, తమ ఎదగని ప్రవృత్తి వల్ల వాళ్ల ప్రేమ కొన్నిసార్లు మరుగునపడిపోతుంది. అలా అత్యంత గొప్పదైన అమ్మ ప్రేమ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది.’

‘కానీ నేను నిన్ను మర్చిపోను’ అని యెహోవా హామీ ఇస్తున్నాడు. యెషయా 49:15లోని ప్రశ్నను యెహోవా ఎందుకు అడిగాడో మనకు ఇప్పుడిప్పుడే అర్థమౌతుంది. ఒక అపరిపూర్ణ తల్లికంటే తాను ఎంతో ఎక్కువ వాత్సల్యం గలవాడినని ఆయన చెప్పాలనుకున్నాడు. అపరిపూర్ణ తల్లులైతే, నిస్సహాయులైన తమ పసిబిడ్డల పట్ల కొన్నిసార్లు వాత్సల్యం చూపించకపోవచ్చు. కానీ యెహోవా మాత్రం, అవసరంలో ఉన్న తన ఆరాధకుల పట్ల ఎల్లప్పుడూ వాత్సల్యం చూపిస్తాడు, వాళ్లను ఎప్పటికీ మర్చిపోడు. పైన ప్రస్తావించిన రెఫరెన్సు గ్రంథం యెషయా 49:15 గురించి సరిగ్గానే ఇలా చెబుతోంది: “ఇది, పాత నిబంధనలో దేవుని ప్రేమను వర్ణించడానికి ఉపయోగించిన అత్యంత గొప్ప వ్యక్తీకరణ, లేదా అలాంటి వాటిలో ఒకటి.”

“మన దేవుని మహా వాత్సల్యము” గురించి తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది! (లూకా 1:76-79) అందుకే, యెహోవాకు ఎలా మరింత దగ్గర కావచ్చో నేర్చుకోండి. ప్రేమగల ఈ దేవుడు తనను ఆరాధించేవాళ్లకు ఇలా అభయమిస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీయులు 13:5. (w12-E 02/01)