కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• ఒత్తిడిని తగ్గించుకోవడానికి, కొండమీది ప్రసంగానికి సంబంధించిన ఏ వ్యక్తిగత కార్యక్రమాన్ని మీరు చేపట్టవచ్చు?

మీరు ప్రతిరోజు, ఆ ప్రసంగంలోగానీ లేదా సువార్తల్లో మరెక్కడైనాగానీ యేసు చేసిన ప్రధాన బోధల్లోంచి ఒకదాన్ని చదవవచ్చు. ఆ బోధను గురించి ధ్యానించి, దాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీ సంతోషం అధికమై, ఒత్తిడి తగ్గినట్లు మీరు గ్రహిస్తారు.​—⁠12/15, 12-14 పేజీలు.

• సంఘ పెద్దలు, అదనపు బాధ్యతలను నిర్వహించగలిగేలా పరిచర్య సేవకులకు శిక్షణనివ్వడానికి గల మూడు మంచి కారణాలు ఏవి?

యెహోవాసాక్షుల సంఖ్య పెరుగుతున్నందువల్ల, క్రొత్తగా బాప్తిస్మం పొందినవారు అభివృద్ధి సాధించేందుకు సహాయపడడానికి బాధ్యతగల పురుషులు ఇంకా ఎక్కువమంది అవసరం. ఎంతోకాలంగా పెద్దలుగా ఉన్నవారు, వృద్ధాప్యం వల్ల లేదా ఆరోగ్యసమస్యల మూలంగా ఇప్పుడు మునుపటిలా సేవ చేయలేకపోవచ్చు. అంతేగాక, కొంతమంది సమర్థులైన పెద్దలు, స్థానిక సంఘానికి సంబంధించినవే కాకుండా ఇతర బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు, కాబట్టి వారు తమ సంఘంలో మునుపు చేసినంత సేవ ప్రస్తుతం చేయలేకపోవచ్చు.​—⁠1/1, 29వ పేజీ.

నిజమైన దేవుళ్ళు కాని వారిని ప్రజలు ఎలా విశ్వసిస్తారు?

చాలామంది తమ మతానికి చెందిన దేవుళ్ళను ఆరాధిస్తారు. కానీ వీరు, ఏలీయా కాలంలో బయలు దేవునిలాగే తమ ప్రజలను కాపాడలేని ప్రాణంలేని దేవుళ్ళు మాత్రమే కావచ్చు. (1 రాజులు 18:​26, 29; కీర్తన 135:​15-17) ఇతరులు, భవిష్యత్తు కొరకు ఎలాంటి నిజమైన నిరీక్షణా ఇవ్వలేని కళాకారులను లేదా క్రీడాకారులను ఆరాధిస్తారు. దానికి భిన్నంగా, యెహోవా నిజంగా ఉనికిలో ఉన్నాడు, తన సంకల్పాలను నెరవేరుస్తాడు.​—⁠1/15, 3-5 పేజీలు.

దేవుని హెచ్చరికకు కయీను ప్రతిస్పందించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవుడు మనకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు, కయీను ప్రతిస్పందించినట్టు ప్రతిస్పందించి మంచి చేయడం మానివేసే బదులు ఏది సరైనదో అదే చేయడానికి మనం ఎంపిక చేసుకోవచ్చు. పశ్చాత్తాపం చెందని వారిపై యెహోవా తన తీర్పును అమలుపరుస్తాడని కూడా బైబిలు వృత్తాంతం చూపిస్తోంది.​—⁠1/15, 22-3 పేజీలు.

పరిశుభ్రత ప్రాముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ఆవశ్యకం?

మారుతున్న సామాజిక జీవన విధానాల వల్ల, చాలామంది తమ ఇంటిని శుభ్రం చేసుకోవడంలో మునుపటికంటే తక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఆహారానికి, నీళ్ళకు సంబంధించిన పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టగలదు. శారీరక పరిశుభ్రతతో పాటు, బైబిలు ఆధ్యాత్మిక, నైతిక, మానసిక పరిశుభ్రతకు అవధానమివ్వడం గురించి నొక్కి చెబుతోంది.​—⁠2/1, 3-6 పేజీలు.

క్రైస్తవపూర్వపు సాక్షుల విషయంలో, ‘మనము లేకుండ సంపూర్ణులుకారు’ అని పౌలు అన్నాడు. అదెలా? (హెబ్రీయులు 11:​39)

రానున్న వెయ్యేండ్ల పరిపాలనలో, క్రీస్తు మరియు పరలోకములో రాజులుగా యాజకులుగా సేవ చేస్తున్న ఆయన అభిషిక్త సహోదరులు, పునరుత్థానం చేయబడిన వారికి విమోచన క్రయధనం ద్వారా కలిగే ప్రయోజనాలు చేకూరేలా చేస్తారు. తద్వారా, హెబ్రీయులు 11వ అధ్యాయంలో పేర్కొనబడిన అలాంటి విశ్వాసులు ‘సంపూర్ణులుగా చేయబడతారు.’​—⁠2/1, 23వ పేజీ.

‘మీరు రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు’ అని పౌలు హెబ్రీయులతో అనడంలో ఆయన ఉద్దేశమేమిటి? (హెబ్రీయులు 12:⁠4)

చనిపోయే వరకు ఎదిరిస్తూ ఉండటం అని ఆయన ఉద్దేశించాడు. చరిత్రలో అలా మరణం వరకు విశ్వాసంగా ఉన్న వ్యక్తుల ఉదాహరణలు కూడా ఉన్నాయి. పౌలు ఏ హెబ్రీయులకైతే వ్రాశాడో, వారు అలా మరణం వరకు పరీక్షించబడకపోయినప్పటికీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని సహించడానికి తమ విశ్వాసాన్ని బలపరచుకొని పరిణతి చెందేలా అభివృద్ధి సాధించవలసి ఉంది.​—⁠2/15, 29వ పేజీ.

యెహోవా తన న్యాయం తీవ్రతను తన కనికరంతో తగ్గిస్తాడని చెప్పకపోవడం ఎందుకు మంచిది?

కొన్ని భాషలలో, “తీవ్రతను తగ్గించడం” అంటే మితం చేయడం లేదా నిగ్రహించుకోవడం అనే భావముంది. యెహోవా న్యాయము, కనికరముగల దేవుడు, ఆయన ఆ లక్షణాలను కనబరచేటప్పుడు ఆ రెండు లక్షణాలు ఒకదానితో మరొకటి పొందికగా పనిచేస్తాయి. (నిర్గమకాండము 34:​6, 7; ద్వితీయోపదేశకాండము 32:⁠4; కీర్తన 116:⁠5; 145:⁠9) యెహోవా న్యాయము, కనికరం చేత మెత్తబరచబడాల్సిన లేక తీవ్రత తగ్గించబడాల్సిన అవసరం లేదు.​—⁠3/1, 30వ పేజీ.

చనిపోయిన ప్రియమైన కుటుంబ సభ్యుని మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచడం, ఒక క్రైస్తవునికి తగినదేనా?

మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచడమన్నది, శవాన్ని చెడిపోకుండా కాపాడే ఒక పద్ధతి. కొంతమంది పూర్వీకులు, మతసంబంధమైన కారణాలను బట్టి అలా చేసేవారు. కానీ సత్యారాధకులు అలా చేయరు. (ప్రసంగి 9:⁠5; అపొస్తలుల కార్యములు 24:​15) ఇలా శవాన్ని భద్రపరచడం, అనివార్యమైనదానిని అంటే శరీరం మట్టిలో కలిసిపోవడాన్ని కేవలం ఆలస్యం చేయగలదు. (ఆదికాండము 3:​19) కానీ ఒకవేళ ఇలా శవాన్ని భద్రపరచాలని చట్టం కోరితే, కొంతమంది కుటుంబ సభ్యులు అలా చేయాలని కోరుకుంటే, లేక అంత్యక్రియల కోసం చాలా దూరం ప్రయాణించవలసినందువల్ల అలా చేయడం అవసరమైతే, దాని గురించి చింతించవలసిన అవసరం లేదు.​—⁠3/15, 29-31 పేజీలు.

దేవుడు సమస్త జనులను ఆహ్వానిస్తాడని బైబిలులోని ఏ ఉదాహరణలు మనకు బోధిస్తున్నాయి?

నీనెవె పట్టణస్థులను హెచ్చరించడానికి యెహోవా యోనా ప్రవక్తను పంపించాడు, వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించమని దేవుడు యోనాకు ఉద్బోధించాడు. యేసు తన మాటల ద్వారా, తన మాదిరి ద్వారా సమరయులపై ప్రేమ చూపించడాన్ని ప్రోత్సహించాడు. యూదేతరులకు సువార్త ప్రకటించడంలో అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు, ఇరువురూ తమ పాత్రను నిర్వహించారు. ఇలాంటి ఉదాహరణలనుంచి, అన్ని నేపథ్యాలకు చెందిన ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉందని మనం చూడవచ్చు.​—⁠4/1, 21-24 పేజీలు.