కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుద్ధ గాయాలను మాన్పడం

యుద్ధ గాయాలను మాన్పడం

యుద్ధ గాయాలను మాన్పడం

అబ్రహాం 20 సంవత్సరాలపాటు గెరిల్లా ఆర్మీలో ఉన్నాడు. * అయితే అటు తర్వాత ఆయన పోరాడ్డం మానేసి, మళ్ళీ యుద్ధభూమిలోకి అడుగు పెట్టలేదు. నిజం చెప్పాలంటే, కొంతమంది మునుపటి శత్రువులు ఇప్పుడాయన సన్నిహిత మిత్రులు. ఆయనను అలా మార్చిందేమిటి? బైబిలే. అది అబ్రహాంకు నిరీక్షణనూ అంతర్దృష్టినీ ఇచ్చి, దేవుని దృక్కోణంలో నుంచి మానవ వ్యవహారాలను పరిశీలించేలా ఆయనకు తోడ్పడుతోంది. పోరాడాలనే కోరికను ఆయనలో నుంచి తీసేసింది బైబిలు. ఆయన తనకు కల్గిన గాయాలను అంటే బాధాదుఃఖాలనూ, విద్వేషవిషాదాలనూ నయంచేసుకోవడం ప్రారంభించాడు. హృదయాన్ని బాగుచేసే శక్తివంతమైన ఔషధం బైబిల్లో ఉందని ఆయన కనుగొన్నాడు.

భావోద్వేగపరమైన గాయాలను మాన్పుకోవడానికి ఒక వ్యక్తికి బైబిలు ఎలా సహాయపడగలదు? గతంలో అబ్రహాంకు ఏం జరిగిందో దాన్ని మార్చలేదుగానీ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం ఆయన ఆలోచనా సరళి సృష్టికర్త ఆలోచనా సరళికి అనుగుణంగా మారేలా చేసింది. ఆయనకిప్పుడు భవిష్యత్తు పట్ల నిరీక్షణ ఉంది, క్రొత్త ప్రాధాన్యతలున్నాయి. దేవునికి ప్రాముఖ్యమైన విషయాలే ఆయనకూ ప్రాముఖ్యమయ్యాయి. ఇలా జరగడం ఎప్పుడైతే ప్రారంభమైందో, అలా ఆయన హృదయంలోని గాయాలు మాడుకట్టడం ప్రారంభించాయి. అబ్రహాం తాను మారడానికి సహాయాన్ని ఆ విధంగా పొందాడు.

అంతర్యుద్ధంలోకి దూకడం

అబ్రహాం 1930లలో ఆఫ్రికాలో జన్మించాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం, ఆయన దేశం శక్తివంతమైన పొరుగుదేశ పరిపాలన క్రిందకి వచ్చింది. అయితే అబ్రహాం స్వదేశీయుల్లో అనేకులు స్వాతంత్ర్యాన్ని కోరుకున్నారు. 1961 లో అబ్రహాం, శక్తివంతమైన ఆ పొరుగు దేశానికి విరుద్ధంగా గెరిల్లా యుద్ధాన్ని సాగిస్తున్న ఒక స్వాతంత్రోద్యమంలో చేరాడు.

“వాళ్లు మా శత్రువులు. వాళ్లు మమ్మల్ని చంపడానికి పథకం వేశారు, అందుకే మేము వాళ్లను చంపడం ప్రారంభించాం” అని అబ్రహాం వివరించాడు.

అబ్రహాం జీవితమెప్పుడూ ప్రమాదకరంగా ఉండేది, అందుకే 1982 లో అంటే 20 సంవత్సరాలపాటు సాయుధ పోరాటం సాగించిన తర్వాత, ఆయన ఐరోపాకు పారిపోయాడు. అప్పటికాయన తన 40వ పడి చివరిలో ఉన్నాడు, తన గత జీవితాన్ని గురించి సింహావలోకనం చేసుకోవడానికి కావల్సినంత సమయం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆయనకెలాంటి ఆశయాలున్నాయి? ఆయన కోసం భవిష్యత్తులో ఏమి వేచివుంది? అబ్రహాం కొందరు యెహోవాసాక్షులను కలుసుకున్నాడు, వారి కూటాలకు హాజరవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఒక సాక్షి ఇచ్చిన కరపత్రాన్ని చదవడం ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ కరపత్రం, రాబోయే భూపరదైసు గురించీ మానవజాతిని పాలించే పరలోక ప్రభుత్వం గురించీ వర్ణించింది. అది నిజంకాగలదా?

“యుద్ధంలో నేను గడిపిన సంవత్సరాలన్నీ వృథా అయ్యాయని బైబిల్లో నుంచి నేను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరినీ న్యాయంగా పరిపాలించే ఏకైక ప్రభుత్వం దేవుని రాజ్యమే” అని అంటున్నాడు అబ్రహాం.

అబ్రహాం ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందిన కొద్దికాలం తర్వాత, రాబర్ట్‌ అనే పేరుగల వ్యక్తి ఆఫ్రికానుంచి పారిపోయి అబ్రహాం నివసిస్తున్న ఐరోపా నగరానికే వచ్చాడు. రాబర్ట్‌, అబ్రహాంలు ఒకే యుద్ధంలో పోరాడారు కానీ వ్యతిరేక పక్షాల్లో పోరాడారు. జీవితంలో నిజమైన సంకల్పం గురించి రాబర్ట్‌ తరచూ ఆలోచించేవాడు. ఆయన మతాభిమానం గల వ్యక్తి, బైబిలులోని కొన్ని భాగాలు చదివాడు, దేవుని పేరు యెహోవా అని ఆయనకు తెలుసు. అబ్రహాం సహవసిస్తున్న సంఘంలోని సాక్షులు, బైబిలును బాగా అర్థం చేసుకోవడానికి రాబర్ట్‌కు సహాయాన్ని అందజేస్తామన్నప్పుడు, ఆయన వెంటనే ఒప్పుకున్నాడు.

“యెహోవా, యేసుక్రీస్తులు వేర్వేరు వ్యక్తులని అంగీకరిస్తూ, వారిరువురి పేర్లను సాక్షులు ఉపయోగించిన విధానం మొట్ట మొదటి నుంచీ నన్ను ఆకట్టుకుంది. బైబిల్లో నుంచి నేను అప్పటికే తెలుసుకున్న దానికి అది పొందికగా ఉంది. సాక్షులు దుస్తులు చక్కగా ధరిస్తారు, జాతీయ తేడాలను లక్ష్యపెట్టకుండా ఇతరులపట్ల దయగా ఉంటారు. అలాంటి విషయాలు నామీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి” అని రాబర్ట్‌ వివరిస్తున్నాడు.

శత్రువులు మిత్రులయ్యారు

మునుపటి శత్రువులైన అబ్రహాం రాబర్ట్‌లు ఇప్పుడు సన్నిహిత మిత్రులయ్యారు. వాళ్లు యెహోవాసాక్షుల ఒకే సంఘంలో పూర్తికాల ప్రచారకులుగా సేవ చేస్తున్నారు. “యుద్ధ సమయంలో, ఇరుగుపొరుగు దేశాల్లోని ప్రజల్లోని అనేకమంది ఒకే మతానికి చెందినవారైనా, వారు ఒకర్నొకరు ద్వేషించుకోవడం ఎలా సాధ్యమని నేను తరచుగా ఆశ్చర్యపోయేవాడిని, రాబర్ట్‌ నేను ఒకే చర్చికి చెందినవారం అయినప్పటికీ మేము ఒకరికొకరం వ్యతిరేకంగా యుద్ధం చేశాం. ఇప్పుడు మేమిద్దరం యెహోవాసాక్షులం, మా విశ్వాసం మమ్మల్ని ఐక్యం చేసింది” అని అబ్రహాం వివరిస్తున్నాడు.

రాబర్ట్‌ ఇలా అంటున్నాడు: “వ్యత్యాసమదే, మేమిప్పుడు, ఒక స్వచ్ఛమైన సహోదరత్వమందు మమ్మల్ని భాగంగా చేసే విశ్వాసానికి చెందినవారం. మేమికపైన యుద్ధానికి వెళ్ళం.” మునుపు శత్రువులైన వీరి హృదయాలపై బైబిలు శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది. ద్వేషం, విషాదం స్థానంలో నమ్మకం, స్నేహం క్రమేణా చోటుచేసుకున్నాయి.

అబ్రహాం, రాబర్ట్‌లు యుద్ధంలో పాల్గొన్న కాలంలోనే మరో ఇద్దరు యువకులు, రెండు పొరుగురాజ్యాల మధ్య జరిగే మరో పోరాటంలో ఒకరికొకరు వ్యతిరేకంగా తమ తమ దేశాల తరపున పోరాడారు. త్వరలోనే బైబిలు వాళ్ల హృదయాలను కూడా నయం చేయడానికి అత్యంత శక్తివంతమైన ఔషధంలా పనిచేసింది. ఎలా?

చంపు​—⁠అమరవీరుడిగా చావు

మతాభిమానం గల ఒక కుటుంబంలో పెంచబడిన గాబ్రియెల్‌ తన స్వదేశం, పవిత్ర యుద్ధంలో చిక్కుకుపోయిందని తెలుసుకున్నాడు. అందుకే ఆయన తన 19 ఏళ్ళ వయసులోనే యుద్ధంలో పోరాడ్డానికి తనను పంపించమని కోరుతూ స్వచ్ఛంద సైనికుడిగా చేరాడు. 13 నెలల పాటు ఆయన భయంకరమైన యుద్ధాల్లో పోరాడాడు, కొన్నిసార్లు శత్రువుకు కేవలం ఒక మైలు దూరంలోనే ఉండి పోరాడాడు. “ప్రత్యేకంగా నాకొక సందర్భం గుర్తుంది, శత్రువులు ఆ రాత్రి దాడిచేయవచ్చని మా కమాండర్‌ మాకు చెప్పాడు. మేము చాలా ఉద్రిక్తులమై ఆ రాత్రంతా మోర్టర్‌ ఫిరంగులను కాల్చాం” అని ఆయన అంటున్నాడు. ఆయన పొరుగుదేశపు ప్రజలను తన శత్రువులుగానూ, మరణానికి అర్హులుగానూ భావించాడు. “ఎంతమందిని వీలైతే అంతమందిని చంపడమే నా ధ్యేయమైంది, తరువాత చాలా మంది నా స్నేహితుల్లాగే నేను కూడా వీరమరణం పొందాలనుకున్నాను” అని ఆయన చెబుతున్నాడు.

అయినప్పటికీ, కాలక్రమేణా గాబ్రియెల్‌ ఆ భ్రాంతినుంచి బయటపడ్డాడు. పర్వతాల్లోకి పారిపోయి, యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగావున్న ఒకదేశపు సరిహద్దుల్లోకి రహస్యంగా చేరుకున్నాడు, అక్కడినుంచి ఐరోపాకు వెళ్ళాడు. జీవితమెందుకు ఇంత క్లిష్టంగా ఉందనీ, సమస్యలు దేవుడు విధించే శిక్షలా అని ఆయన అదే పనిగా దేవున్ని అడిగాడు. ఆయనక్కడ యెహోవాసాక్షులను కలుసుకున్నాడు, వారాయనకు నేడు జీవితం అనేక సమస్యలతో ఎందుకు నిండివుందన్నది బైబిలు నుంచి చూపించారు.​—⁠మత్తయి 24:​3-14; 2 తిమోతి 3:​1-5.

గాబ్రియెల్‌ బైబిలు నుంచి ఎంత ఎక్కువగా నేర్చుకున్నాడో, దాంట్లో సత్యముందని అంత ఎక్కువగా గ్రహించాడు. “మనం పరదైసు భూమిపై నిరంతరం జీవించగలమని నేను నేర్చుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బాల్యం నుంచీ నేను కోరుకున్నదదే.” బైబిలు గాబ్రియెల్‌ను ఓదార్చింది, ఇప్పటివరకు వ్యాకులత చెందిన ఆయన హృదయానికి ఉపశమనాన్నిచ్చింది. ఆయన లోతైన భావోద్వేగ గాయాలు మానడం ప్రారంభించాయి. మునుపటి శత్రువైన డానియెల్‌ను ఆయన కలుసుకునే సమయానికి గాబ్రియెల్‌కు ద్వేష భావం ఇసుమంతైనా లేదు. అయితే డానియెల్‌ ఐరోపాకు వెళ్లేలా చేసిందేమిటి?

“నువ్వంటూ ఉంటే, దయచేసి నాకు సహాయం చెయ్యి!”

డానియెల్‌ ఒక క్యాథలిక్కుగా పెంచబడ్డాడు, ఆయన 18వ ఏట సైనికుడిగా చేర్చుకోబడ్డాడు. గాబ్రియెల్‌ పోరాడుతున్న యుద్ధంలోనే పోరాడ్డానికి డానియెల్‌ను పంపించారు, కాని వ్యతిరేక పక్షంగా. పోరాట స్థలానికి దగ్గరగా డానియెల్‌ నడుపుతున్న ట్యాంకు ప్రేలిపోయింది. ఆ ప్రేలుడులో ఆయన స్నేహితులు చనిపోయారు, ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డాడు, ఆయనను ఖైదీగా తీసుకువెళ్ళారు. తటస్థంగా ఉన్న దేశానికి పంపించడానికి ముందు ఆయన కొన్ని నెలలపాటు ఆసుపత్రిలోనూ, క్యాంపులోనూ గడిపాడు. ఒంటరితనంతోనూ, ఏ దిక్కూలేకా ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. “నువ్వంటూ ఉంటే, దయచేసి నాకు సహాయం చెయ్యి” అని డానియెల్‌ దేవునికి ప్రార్థించాడు. ఆ మరుసటి రోజే యెహోవాసాక్షులు ఆయనను కలుసుకున్నారు, ఆయనకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగారు. చివరికి ఆయన ఒక శరణార్థిగా ఐరోపాకు పయనించాడు. మరొకసారి అక్కడ, డానియెల్‌ యెహోవాసాక్షులను కలుసుకున్నాడు, వారితో బైబిలు పఠనం చేశాడు. ఆయన నేర్చుకున్నవి ఆయన చింతనూ, విషాదాన్నీ తగ్గించాయి.

గాబ్రియెల్‌ డానియెల్‌లిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులు, బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షులుగా ఆధ్యాత్మిక సహోదరత్వంలో ఐక్యమయ్యారు. “యెహోవా పట్లా, బైబిలు జ్ఞానం పట్లా ఉన్న ప్రేమ, సంగతులను యెహోవా దృక్కోణం నుంచి చూసేలా నాకు సహాయం చేశాయి. డానియెల్‌ ఇకపై నా శత్రువు కాదు. కొన్ని సంవత్సరాల క్రితమైతే ఆయన ప్రాణాలను నేను సంతోషంగా తీసేసివుండేవాడిని. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అంటే, ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా ఇష్టపడేలా బైబిలు నాకు నేర్పించింది” అని గాబ్రియెల్‌ చెబుతున్నాడు.

“వేర్వేరు మతాలకూ, వేర్వేరు జాతులకూ చెందిన ప్రజలు ఒకర్నొకరు చంపుకోవడం నేను చూశాను, ఒకే మతానికి చెందిన ప్రజలు యుద్ధంలో తమ తమ దేశాల తరపున ఇరుపక్షాల్లో పోరాడుతూ ఒకర్నొకరు చంపుకుంటున్నారు. నేనది చూసి దానికి దేవుడే నిందించబడాలనుకున్నాను. యుద్ధాలన్నింటి వెనుక సాతానున్నాడని ఇప్పుడు నాకు తెలుసు. ఇప్పుడు మేమిరువురం తోటి విశ్వాసులం. మేమిక ఎన్నడూ యుద్ధంలో పాల్గొనం!”

‘దేవుని వాక్యము సజీవమైనది బలాన్నిస్తుంది’

అబ్రహాం, రాబర్ట్‌, గాబ్రియెల్‌, డానియెల్‌లు అంతలా ఎందుకు మారిపోయారు? వారి మనసుల్లో లోతుగా పాతుకుపోయిన దుఃఖద్వేషాలను ఎలా తీసివేసుకోగలిగారు?

వీరిలోని ప్రతి ఒక్కరూ ‘సజీవమైనది బలాన్నిచ్చేది’ అయిన బైబిలును చదివారు, ధ్యానించారు, దాన్నుంచి సత్యాన్ని నేర్చుకున్నారు. (హెబ్రీయులు 4:​12) ఆ బైబిలు గ్రంథకర్తే, మానవజాతి సృష్టికర్త. వినడానికీ నేర్చుకోవడానికీ ఇష్టపడేవారి హృదయాన్ని మంచి కోసం ఎలా ప్రభావితం చేయాలో ఆయనకు తెలుసు. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” ఒక పాఠకుడు తనను నడిపించడానికి ఒక్కసారి బైబిలును అనుమతించినట్లైతే, అతడు క్రొత్త విలువలనూ ప్రమాణాలనూ తన సొంతం చేసుకుంటాడు. సంగతులను యెహోవా ఎలా దృష్టిస్తాడో ఆయన నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఈ విధమైన ప్రక్రియ, యుద్ధ గాయాలను మాన్పడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను తెస్తుంది.​—⁠2 తిమోతి 3:​16,17.

ఏ దేశంగానీ, జనాంగంగానీ, జాతిగానీ ఇతర దేశాలకన్నా జనాంగాలకన్నా జాతులకన్నా గొప్పదీ కాదు, నీచమైనదీ కాదు అని దేవుని వాక్యం వివరిస్తోంది. “దేవుడు పక్షపాతి కా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” దీన్ని అంగీకరించే బైబిలు పాఠకుడు, జాతీయతా విద్వేషాలను లేదా జాతి విద్వేషాలను క్రమేణా అధిగమించడానికి సహాయం పొందుతాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

ప్రస్తుత మానవ పరిపాలనా విధానం స్థానంలోకి దేవుడు త్వరలోనే తన మెస్సీయా రాజ్యాన్ని తీసుకొస్తాడని బైబిలు ప్రవచనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ద్వారా దేవుడు “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు[తా]డు.” యుద్ధాలను ప్రేరేపించే, వాటిలో పోరాడమని ప్రజలను బలవంతపెట్టే సంస్థలు తొలగించబడతాయి. యుద్ధంలో మరణించినవారు పునరుత్థానమౌతారు, పరదైసు భూమిపై జీవించే అవకాశం వారికి ఇవ్వబడుతుంది. దాడిచేసే వాని ఎదుట నుంచిగానీ, అణచివేసే వారి ఎదుట నుంచిగానీ ఎవరూ పారిపోవాల్సిన అవసరంలేదు.​—⁠కీర్తన 46:⁠9; దానియేలు 2:​44; అపొస్తలుల కార్యములు 24:⁠14, 15.

భూ పరదైసులో జీవించే మానవులను గూర్చి బైబిలు ఇలా చెబుతోంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు . . . వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు.” అక్కడ మానని గాయాలుగానీ, పూడ్చలేని హానిగానీ ఏదీ ఉండదు. అటువంటి నిరీక్షణపై విశ్వాసముంచడం, ఒకని హృదయంలో నుంచి దుఃఖాన్నీ విచారాన్నీ క్రమేణా తొలగిస్తుంది.​—⁠యెషయా 65:​21-23.

బైబిలు నిజంగానే హృదయానికి ఒక శక్తివంతమైన ఔషధంలాంటిది. దాని బోధనలు, ఇప్పటికే యుద్ధ గాయాలను బాగుచేస్తున్నాయి. మునుపటి శత్రువులు ఒక అంతర్జాతీయ సహోదరత్వంలో ఐక్యమౌతున్నారు. యుద్ధ గాయాలను నయంచేసే ఈ ప్రక్రియ, మానవజాతి హృదయాల్లో ద్వేషం, విషాదం, బాధ, దుఃఖం వంటివి అసలు లేకుండా తీసివేయబడేంత వరకూ దేవుని నూతన విధానంలో కొనసాగుతుంది. “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు” అని సృష్టికర్త వాగ్దానం చేస్తున్నాడు.​—⁠యెషయా 65:​17.

[అధస్సూచి]

^ పేరా 1 ఈ ఆర్టికల్‌లోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

“యుద్ధంలో గడిపిన సంవత్సరాలన్నీ వృథా అని నేను బైబిల్లో నుంచి నేర్చుకున్నాను”

[5వ పేజీలోని బ్లర్బ్‌]

బైబిలు, మునుపటి శత్రువుల హృదయాలపై శక్తివంతమైన ప్రభావం చూపించగలదు

[6వ పేజీలోని బ్లర్బ్‌]

ద్వేషం, విషాదం స్థానంలో క్రమేణా నమ్మకం, స్నేహం చోటుచేసుకున్నాయి

[6వ పేజీలోని బ్లర్బ్‌]

పాఠకుడు తనను నడిపించడానికి ఒక్కసారి బైబిలును అనుమతించినట్లైతే, క్రొత్త విలువలనూ ప్రమాణాలనూ తన సొంతం చేసుకుంటాడు

[7వ పేజీలోని చిత్రం]

మునుపటి శత్రువులు ఇప్పుడొక అంతర్జాతీయ సహోదరత్వంలో ఐక్యమౌతున్నారు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Refugee camp: UN PHOTO 186811/J. Isaac