కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం

ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం

ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం

“నా కుమారుడా, నీ తండ్రి ఇచ్చే క్రమశిక్షణను అనుసరించు, నీ తల్లి శాసనాన్ని నిరాకరించకు.”—సామెతలు 1:8, Nw.

మన తల్లిదండ్రులు ఎంతో అమూల్యమైన ప్రోత్సాహాన్నీ, మద్దతునూ, ఉపదేశాన్నీ మనకు ఇవ్వగలరు. బైబిలు పుస్తకమైన సామెతలు, తన తల్లి నుండి “దేవోక్తులను” పొందిన లెమూయేలు అనే యువ రాజు గురించి మాట్లాడుతుంది. ఆ దేవోక్తులు సామెతలు 31వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఆయన తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఈ ఉపదేశం నుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు.—సామెతలు 31:1.

ఒక రాజుకు తగిన ఉపదేశం

లెమూయేలు తల్లి, మన ఆసక్తిని రేకెత్తించే అనేక ప్రశ్నలతో మొదలుపెడుతుంది. ఆమె వేసిన ప్రశ్నలు: “నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?” మూడుసార్లు ఆమె చేసుకున్న విజ్ఞప్తి, తన కుమారుడు తన మాటలకు అవధానమివ్వాలని ఆమెకున్న ఆతురతను చూపిస్తుంది. (సామెతలు 31:2) తన సంతానం యొక్క ఆధ్యాత్మిక సంక్షేమాన్ని గురించి ఆమెకున్న చింత, నేడు క్రైస్తవ తల్లిదండ్రులకు మంచి మాదిరినుంచుతుంది.

ఒక తల్లి తన కుమారుని క్షేమాన్ని గురించి ఆలోచించేటప్పుడు, మందు పార్టీలు, మద్యము, స్త్రీల సాంగత్యం, ఆటపాటల్లో జరిగే అనైతిక వ్యవహారాలు వంటి విషయాల కన్నా మరేవి ఆమెను ఎక్కువ చింతాక్రాంతురాలిని చేయగలవు? లెమూయేలు తల్లి విషయాన్ని సూటిగా తెలియజేస్తుంది. “నీ బలమును స్త్రీలకియ్యకుము” అని చెబుతుంది. అనేక స్త్రీలతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడం అనేది “రాజులను నశింపజేయు” లక్షణమని ఆమె అంటోంది.—సామెతలు 31:3.

అమిత త్రాగుడు అశ్రద్ధ చేయవలసిన విషయం కానే కాదు. “ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ” అని ఆమె హెచ్చరిస్తుంది. రాజు అస్తమానం త్రాగి మత్తుడై ఉంటే, ‘కట్టడలను మరవకుండా’ ఎలా ఉంటాడు, ‘దీనులకందరికి అన్యాయము చేయకుండా’ ఎలా ఉంటాడు?—సామెతలు 31:4-7.

దానికి భిన్నంగా, రాజు అలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటే, “న్యాయముగా తీర్పు” తీర్చగలుగుతాడు, “శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగిం”చగలుగుతాడు.—సామెతలు 31:8, 9.

నేడు క్రైస్తవ యౌవనస్థులు ‘రాజులు’ కాకపోయినప్పటికీ, లెమూయేలు తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం సమయోచితమైనది, గతం కన్నా కూడా సమయోచితమైనది. మద్యాన్ని దుర్వినియోగం చేయడం, పొగాకును వాడడం, లైంగిక అనైతికత ఇప్పుడు యౌవనస్థుల మధ్య చాలా ప్రబలమయ్యాయి. యౌవనస్థులు తమ తల్లిదండ్రులు తమకు “దేవోక్తి”ని ఉపదేశిస్తున్నప్పుడు అవధానమివ్వడం చాలా ప్రాముఖ్యం.

సామర్థ్యంగల భార్య

తల్లులు, పెద్దవాళ్ళవుతున్న తమ కుమారులు పెళ్ళి చేసుకుని తీసుకువచ్చే భార్యల గురించి ఆలోచించడం సమంజసమే. లెమూయేలు తల్లి, తర్వాత, ఆదర్శవంతురాలైన భార్య గురించి మాట్లాడుతుంది. ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఒక స్త్రీ దృక్కోణాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల ఒక యువకుడు ప్రయోజనం పొందుతాడనడంలో సందేహం లేదు.

10వ వచనం, “గుణవతియైన భార్య [“సామర్థ్యంగల భార్య,” NW]”ను అరుదైన విలువైన పగడముతో [NW] పోల్చింది. బైబిలు కాలాల్లో ఎంతో ప్రయత్నిస్తేనే గాని పగడాలు లభించేవి కావు. అదే విధంగా, సామర్థ్యంగల భార్యను కనుగొనేందుకు ప్రయత్నం అవసరం. ఒక యువకుడు ఆదుర్దాగా వివాహజీవితంలోకి దిగే బదులు, కావలసినంత సమయాన్ని తీసుకొని భార్యను ఎంపిక చేసుకోవడం మంచిది. అలా చేసినప్పుడు, తాను కనుగొన్న అమూల్యమైన భార్యకు విలువ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

“ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును” అని సామర్థ్యంగల భార్య గురించి లెమూయేలుకు ఆయన తల్లి చెప్పింది. (11వ వచనం) మరో మాటలో చెప్పాలంటే, తన భార్య అన్ని విషయాల్లోనూ తన అంగీకారాన్ని తీసుకోవాలని భర్త పట్టు పట్టకూడదు. నిజమే, ఖరీదైన కొనుగోళ్ళు, పిల్లల పెంపకానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు, వివాహిత దంపతులు ఒకరినొకరు సంప్రదించాలి. ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు, అరమరికలు లేకుండా మనసులో మాటను తెలియజేసుకోవడం ద్వారా వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధం పెరుగుతుంది.

అవును, సామర్థ్యంగల భార్య చేసే పనులు చాలా ఉన్నాయి. 13 నుండి 17 వచనాల్లో ఇవ్వబడిన ఉపదేశాలనూ సూత్రాలనూ ఏ వయస్సులోని భార్యలైనా సరే తమ కుటుంబ ప్రయోజనార్థం ఆచరణలో పెట్టగలరు. ఉదాహరణకు, వస్త్రాల, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నందువల్ల, సామర్థ్యంగల భార్య ఉపయోగకరమైన వివిధ పనులకు తన చేతులను సమర్థవంతంగా ఉపయోగించడాన్నీ, ఆదా చేయడాన్నీ నేర్చుకుంటుంది. అలా ఆమె కుటుంబ సభ్యులు సరైన, చూడముచ్చటైన వస్త్రాలను ధరించగల్గుతారు. (13, 19, 21, 22 వచనాలు) కుటుంబానికి అయ్యే భోజనాల ఖర్చును తగ్గించేందుకు, తను పండించగలవాటిని పండిస్తుంది, కొనవలసినవాటిని జాగ్రత్తగా కొంటుంది.—14, 16 వచనాలు.

“పనిచేయకుండ ఆమె భోజనము చేయదు” అన్నది స్పష్టం. ఆమె కష్టపడి పని చేస్తుంది, తన ఇంటి పనులన్నీ సవ్యంగా జరిగేలా చూస్తుంది. (27వ వచనం) ఆమె “నడుము బలపరచు”కొంటుంది అని అంటే, శారీరకంగా కష్టపడవలసిన పనులను చేయడానికి సిద్ధమౌతుంది అని అర్థం. (17వ వచనం) సూర్యుడు ఉదయించక ముందే ఆమె తన పని మొదలుపెడుతుంది, రాత్రి వరకూ కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. ఆమె దీపం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉన్నట్లుగా ఉంటుంది.—15, 18 వచనాలు.

అన్నింటికన్నా ముఖ్యంగా, సామర్థ్యంగల స్త్రీ ఆధ్యాత్మికతగల వ్యక్తై ఉంటుంది. ఆమె దేవునికి భయపడుతుంది, ప్రగాఢ గౌరవంతో, భక్తి ఆదరములతో కూడిన భయంతో దేవుడ్ని ఆరాధిస్తుంది. (30వ వచనం) తమ పిల్లలు కూడా అదే విధంగా చేసేందుకు తర్ఫీదునివ్వడంలో ఆమె తన భర్తకు సహాయాన్నందిస్తుంది. “జ్ఞానము”తో పిల్లలకు నిర్దేశాలనిస్తుంది, ‘నోరు తెరచి కృపగల ఉపదేశమును బోధిస్తుంది’ అని 26వ వచనం అంటోంది.

సామర్థ్యంగల భర్త

సామర్థ్యంగల భార్యను ఆకర్షించేందుకు సామర్థ్యంగల భర్త నిర్వర్తించే బాధ్యతలను లెమూయేలు నిర్వర్తించవలసిన అవసరముంది. లెమూయేలు తల్లి వాటిలో కొన్నింటిని ఆయనకు జ్ఞాపకం చేస్తుంది.

సామర్థ్యంగల భర్త, “దేశపు పెద్దల” దగ్గర మంచి పేరు పొందుతాడు. (సామెతలు 31:23) దానర్థం ఆయన, సామర్థ్యంగలవాడూ, నిజాయితీపరుడూ, నమ్మదగినవాడూ, దైవభక్తిగలవాడూ అయ్యుంటాడు. (నిర్గమకాండము 18:21; ద్వితీయోపదేశకాండము 16:18-20) కనుక, ఆయన, నగర కార్యాలను నిర్వహించేందుకు ప్రముఖులు కూడుకునే “గవినియొద్ద పేరుగొనినవాడై” ఉంటాడు. దైవభక్తిగల పురుషునిగా “పేరుగొని” ఉండేందుకు, ఆయన సహేతుకమైనవాడూ, ఆ “దేశపు” పెద్దలతో ఐక్యంగా పనిచేసేవాడూ అయ్యుండాలి. ఇక్కడ “దేశము” అన్నదాని భావం, మండలం లేదా ప్రాంతం అని కావచ్చు.

సొంత అనుభవంతో మాట్లాడుతున్న లెమూయేలు తల్లి, తన కుమారుడు తన భావి భార్యపై మెప్పుదల చూపవలసినదాని ప్రాముఖ్యతను తన కుమారునికి గుర్తు చేస్తుంది. భూమి మీద ఇంకెవరూ ఆయనకు అంతగా ప్రియమైనవారిగా ఉండరు. “చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు [“సామర్థ్యాన్ని కనబరచి ఉన్నారు,” NW] గాని వారందరిని నీవు మించినదానవు అని” ఆయన అందరి ముందు, ఒప్పుకునేటప్పుడు అతని స్వరంలో వినిపించే లోతైన భావోద్వేగాన్ని ఊహించండి.—సామెతలు 31:29.

తన తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని లెమూయేలు గ్రహించాడన్నది స్పష్టం. ఉదాహరణకు, తన తల్లి చెప్పిన మాటలను, తన మాటలుగా ఆయన 1వ వచనంలో పేర్కొనడాన్ని మనం గమనిస్తాం. కనుక, ఆయన ఆమె చెప్పిన “దేవోక్తి”ని హృదయంలోకి తీసుకుని, ఆమె సలహా నుండి ప్రయోజనం పొందాడు. మనం కూడా ఈ “దేవోక్తి”లోని సూత్రాలను మన జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందుదాం.

[31వ పేజీలోని చిత్రాలు]

సామర్థ్యంగల స్త్రీ ‘పనిచేయకుండ భోజనము చేయదు’