పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను తన ముసలితనంలో దేవునిపట్ల అవిశ్వాసిగా మారాడు కాబట్టి, ఆయన పునరుత్థానం చేయబడడు అనే ముగింపుకు మనం రావచ్చా?​—1 రాజులు 11:​3-9.

బైబిలు, ఖచ్చితంగా పునరుత్థానమయ్యే దేవుని సేవకులైన కొందరు స్త్రీపురుషుల పేర్లు ఇస్తున్నా, అది పేర్కొనే ప్రతీ ఒక్కరి పునరుత్థాన అవకాశాల గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం లేదు. (హెబ్రీయులు 11:​1-40) అయితే సొలొమోను విషయంలో, కొందరు నమ్మకమైనవారు మరణించినప్పుడు సంభవించిన విషయాలను ఆయన మరణించినప్పుడు సంభవించిన విషయాలతో పోల్చడం ద్వారా దేవుని నిర్ణయం గురించిన తలంపును మనం అర్థం చేసుకోవచ్చు.

మరణించినవారి గురించి లేఖనాలు రెండు సాధ్యతల గురించి మాత్రమే చెబుతున్నాయి, ఒకటి తాత్కాలికంగా ఉనికిలో ఉండని స్థితి, మరొకటి నిత్యం ఉనికిలో ఉండని స్థితి. పునరుత్థానమయ్యేందుకు అనర్హులైనవారిగా తీర్పు తీర్చబడినవారు “గెహెన్నా”లో లేక “అగ్నిగుండము”లో పడవేయబడతారు. (మత్తయి 5:22; మార్కు 9:47, 48; ప్రకటన 20:​14) అందులో పడవేయబడినవారిలో మొదటి మానవ జంటయైన ఆదాము హవ్వలు, విశ్వాసఘాతకుడైన యూదా ఇస్కరియోతు, దేవుడు విధించిన తీర్పు కారణంగా మరణించిన నోవహు దినాల్లోని ప్రజలు, సొదొమ గొమొఱ్ఱా వాసులు లాంటి కొందరు ఉంటారు. * పునరుత్థానమయ్యేవారు మానవజాతి సామాన్య సమాధియైన షియోల్‌ లేక హేడిస్‌కు వెళ్తారు. అలాంటి వారి భవిష్యత్తు గురించి మాట్లాడుతూ బైబిలు ఇలా చెబుతోంది: ‘సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [హేడిస్‌] వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను.’​—⁠ప్రకటన 20:​13.

కాబట్టి హెబ్రీయులు 11వ అధ్యాయంలో పేర్కొనబడిన నమ్మకమైనవారు షియోల్‌ లేక హేడిస్‌లో ఉండి పునరుత్థానం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో దేవుని యథార్థ సేవకులైన అబ్రాహాము, మోషే, దావీదు ఉన్నారు. వారి మరణం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఇప్పుడు పరిశీలించండి. “నీవు క్షేమముగా నీ పితరులయొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు” అని యెహోవా అబ్రాహాముతో చెప్పాడు. (ఆదికాండము 15:​15) యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు.” (ద్వితీయోపదేశకాండము 31:​16) సొలొమోను తండ్రియైన దావీదు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.” (1 రాజులు 2:​10) కాబట్టి, ‘తన పితరులతో నిద్రించాడు’ అనే వాక్యాన్నే మరో విధంగా ఆ వ్యక్తి షియోల్‌కు వెళ్ళాడని చెప్పడంతో సమానం.

సొలొమోను మరణించినప్పుడు ఆయనకు ఏమి సంభవించింది? బైబిలు ఇలా జవాబిస్తోంది: “సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు. అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను.” (1 రాజులు 11:​42, 43) కాబట్టి సొలొమోను షియోల్‌ లేక హేడిస్‌లో ఉన్నాడని, అక్కడి నుండి ఆయన పునరుత్థానం చేయబడతాడనే ముగింపుకు రావడం సహేతుకమైనదిగా కనిపిస్తోంది.

‘వారు తమ పితరులతో నిద్రించారు’ అని ఎవరి గురించైతే లేఖనాలు ప్రత్యేకంగా చెబుతున్నాయో అలాంటివారు పునరుత్థానమయ్యే అవకాశం ఉందని ఆ ముగింపు సూచిస్తోంది. వాస్తవానికి సొలొమోను తర్వాత వచ్చిన చాలామంది రాజులు నమ్మకంగా లేకున్నా వారు ఆ విధంగానే వర్ణించబడ్డారు. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది” కాబట్టి ఇది అసహేతుకమైనది కాదు. (అపొస్తలుల కార్యములు 24:​14) “సమాధులలో నున్నవారందరు” పునరుత్థానమైన తర్వాతనే ఆ నిరీక్షణ ఎవరికి దొరికింది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. (యోహాను 5:​28, 29) ప్రాచీన కాలానికి చెందిన ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన పునరుత్థానం గురించి ఖచ్చితమైన జవాబిచ్చే బదులు మనం దేవుని పరిపూర్ణమైన నిర్ణయం మీద నమ్మకంతో వేచి ఉంటాం.

[అధస్సూచి]

^ పేరా 4 కావలికోట (ఆంగ్లం) జూన్‌ 1, 1988 సంచికలోని 30-1 పేజీలు చూడండి.