ద్వితీయోపదేశకాండం 31:1-30

  • మోషే చనిపోయే ముందు (1-8)

  • ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడం (9-13)

  • యెహోషువ నియమించబడ్డాడు (14, 15)

  • ఇశ్రాయేలు తిరుగుబాటు గురించి ముందే చెప్పడం (16-30)

    • ఇశ్రాయేలీయులకు నేర్పించాల్సిన పాట (19, 22, 30)

31  తర్వాత మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు.  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఇప్పుడు నాకు 120 ఏళ్లు.+ నేను ఇక మిమ్మల్ని నడిపించలేను, ఎందుకంటే ‘నువ్వు ఈ యొర్దాను నది దాటవు’ అని యెహోవా నాకు చెప్పాడు.+  మీ ముందు నది దాటేది మీ దేవుడైన యెహోవాయే. ఆయనే స్వయంగా ఈ జనాల్ని మీ ముందు నుండి సమూలనాశనం చేస్తాడు, మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ యెహోవా చెప్పినట్టే, యెహోషువ మిమ్మల్ని నది దాటిస్తాడు.+  అమోరీయుల రాజులైన సీహోనును,+ ఓగును,+ వాళ్ల దేశాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు యెహోవా వాళ్లకు ఏమి చేశాడో ఈ జనాలకు కూడా అదే చేస్తాడు.+  యెహోవా మీకోసం ఆ జనాల్ని ఓడిస్తాడు, అప్పుడు మీరు నేనిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం వాళ్లకు చేయాలి.+  ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి.+ భయపడకండి, వాళ్లను చూసి బెదిరిపోకండి;+ ఎందుకంటే స్వయంగా మీ దేవుడైన యెహోవాయే మీతోపాటు నడుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, వదిలేయడు.”+  తర్వాత మోషే యెహోషువను పిలిచి, ఇశ్రాయేలీయులందరి కళ్లముందు అతనితో ఇలా అన్నాడు: “ధైర్యంగా, నిబ్బరంగా ఉండు.+ ఎందుకంటే యెహోవా ఈ ప్రజలకు ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశానికి వాళ్లను తీసుకెళ్లేది నువ్వే; వాళ్లకు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేది నువ్వే.  స్వయంగా నీ దేవుడైన యెహోవాయే నీ ముందు నడుస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు.+ ఆయన నిన్ను విడిచిపెట్టడు, వదిలేయడు. నువ్వు భయపడకు, బెదిరిపోకు.”+  తర్వాత మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి,+ యెహోవా ఒప్పంద మందసాన్ని మోసే లేవీయులైన యాజకులకు, ఇశ్రాయేలు పెద్దలందరికీ ఇచ్చాడు. 10  మోషే వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “ప్రతీ ఏడు సంవత్సరాల చివర్లో, విడుదల సంవత్సరంలోని నియమిత సమయంలో, పర్ణశాలల* పండుగప్పుడు,+ 11  మీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోట ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిలో కనబడినప్పుడు+ మీరు ఇశ్రాయేలీయులందరికీ ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి.+ 12  వాళ్లు విని మీ దేవుడైన యెహోవా గురించి నేర్చుకొని, ఆయనకు భయపడుతూ ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా మీరు ప్రజల్ని అంటే పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని,* మీ నగరాల్లో ఉన్న పరదేశుల్ని సమావేశపర్చండి.+ 13  అప్పుడు ఈ ధర్మశాస్త్రం తెలియని వాళ్ల కుమారులు దాన్ని విని,+ మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడడం వాళ్లు నేర్చుకుంటారు.” 14  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో! నువ్వు చనిపోయే సమయం దగ్గరపడింది.+ యెహోషువను తీసుకొని ఇద్దరూ కలిసి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, అప్పుడు నేను అతన్ని నాయకుడిగా నియమిస్తాను.”+ దాంతో మోషే, యెహోషువ కలిసి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లారు. 15  అప్పుడు యెహోవా, ప్రత్యక్ష గుడారం దగ్గర మేఘస్తంభంలో కనిపించాడు. ఆ మేఘస్తంభం ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలిచింది.+ 16  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో! నువ్వు చనిపోబోతున్నావు,* తర్వాత ఈ ప్రజలు తాము వెళ్లబోయే దేశంలో తమ చుట్టూ ఉన్న వేరే దేవుళ్లను పూజించడం* మొదలుపెడతారు.+ వాళ్లు నన్ను విడిచిపెడతారు,+ నేను వాళ్లతో చేసిన ఒప్పందాన్ని మీరుతారు.+ 17  ఆ సమయంలో నా కోపం వాళ్లమీద రగులుకుంటుంది,+ నేను వాళ్లను విడిచిపెట్టేస్తాను,+ వాళ్లు నాశనం చేయబడే వరకు నేను వాళ్లకు కనిపించకుండా నా ముఖాన్ని దాచుకుంటాను.+ వాళ్లు తమ మీదికి చాలా విపత్తులు, కష్టాలు వచ్చిన తర్వాత,+ ‘మన దేవుడు మన మధ్య లేనందువల్లే కదా ఈ విపత్తులు మనమీదికి వచ్చాయి?’ అని అనుకుంటారు.+ 18  అయినాసరే, వేరే దేవుళ్ల వైపు తిరిగి వాళ్లు చేసిన చెడ్డ పనులన్నిటిని బట్టి నేను ఆ రోజున వాళ్లకు కనిపించకుండా నా ముఖాన్ని ఇంకా దాచుకునే ఉంటాను.+ 19  “ఇప్పుడు నీ కోసం ఈ పాట+ రాసుకొని, ఇశ్రాయేలీయులకు దీన్ని నేర్పించు.+ ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నా సాక్షిగా పనిచేసేలా దీన్ని వాళ్లకు నేర్పించు.* 20  నేను ఏ దేశం గురించైతే వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేశానో ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి+ నేను వాళ్లను తీసుకొచ్చిన తర్వాత వాళ్లు కడుపు నిండా తిని, వర్ధిల్లినప్పుడు+ వేరే దేవుళ్ల వైపు తిరిగి, వాటిని పూజించి నన్ను అగౌరవపరుస్తారు, నా ఒప్పందాన్ని మీరుతారు.+ 21  వాళ్ల మీదికి చాలా విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడు, ఈ పాట వాళ్లకు ఒక సాక్ష్యంగా ఉంటుంది (ఎందుకంటే వాళ్ల వంశస్థులు దీన్ని మర్చిపోకూడదు); నేను ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లను తీసుకురాకముందే, వాళ్లు ఎలాంటి మనోవైఖరి అలవర్చుకున్నారో నాకు తెలుసు.”+ 22  కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను రాసి, ఇశ్రాయేలీయులకు దాన్ని నేర్పించాడు. 23  తర్వాత ఆయన* నూను కుమారుడైన యెహోషువను నాయకుడిగా నియమించి+ ఇలా అన్నాడు: “ధైర్యంగా, నిబ్బరంగా ఉండు;+ ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లను తీసుకెళ్లేది నువ్వే,+ నేను నీకు తోడుగా ఉంటాను.” 24  మోషే ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ ఒక గ్రంథంలో రాయడం+ పూర్తిచేసిన వెంటనే, 25  యెహోవా ఒప్పంద మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు: 26  “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని+ తీసుకొని, దీన్ని మీ దేవుడైన యెహోవా ఒప్పంద మందసం పక్కన పెట్టండి.+ అక్కడ అది మీ మీద సాక్షిగా పనిచేస్తుంది. 27  ఎందుకంటే, మీరు ఎంత తిరుగుబాటుదారులో,+ ఎంత మొండివాళ్లో+ నాకు బాగా తెలుసు. నేను మీ మధ్య బ్రతికి ఉండగానే మీరు యెహోవా మీద ఇంత తిరుగుబాటు చేశారంటే, నేను చనిపోయాక ఇంకెంత తిరుగుబాటు చేస్తారో! 28  మీ గోత్ర పెద్దలందర్నీ, మీ అధికారుల్ని ఒకచోట సమావేశపర్చండి. వాళ్లు వింటుండగా, నేను భూమ్యాకాశాల్ని వాళ్లమీద సాక్షులుగా తీసుకొని+ ఈ మాటలు చెప్పాలి. 29  ఎందుకంటే నేను చనిపోయాక మీరు ఖచ్చితంగా చాలా చెడుగా ప్రవర్తిస్తారు,+ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి పక్కకుమళ్లుతారు. ఆ రోజుల చివర్లో ఖచ్చితంగా మీ మీదికి విపత్తు వస్తుంది,+ ఎందుకంటే మీరు యెహోవా దృష్టిలో చెడు చేసి, మీ చేతి పనులతో ఆయనకు కోపం తెప్పిస్తారు.” 30  తర్వాత ఇశ్రాయేలు సమాజమంతా వింటుండగా, మోషే ఈ పాటలోని మాటల్ని మొదటి నుండి చివరి వరకు మళ్లీ చెప్పాడు:

అధస్సూచీలు

లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”
అక్ష., “చిన్నపిల్లల్ని.”
లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడం.”
అక్ష., “నీ తండ్రులతో నిద్రించబోతున్నావు.”
అక్ష., “వాళ్ల నోట ఉంచు.”
దేవుడు అని స్పష్టమౌతోంది.