కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బర్నెట్‌, సీమోన్‌, ఈస్టన్‌, కేలబ్‌

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఓషియేనియాలో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఓషియేనియాలో

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న రాన్నే అనే సహోదరి, ఆస్ట్రేలియాలో ఉత్సాహంగా సేవచేసే సాక్షుల కుటుంబంలో పెరిగింది. ఆమె ఇలా అంటోంది, “రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి మేం చాలాసార్లు వెళ్లాం. అమ్మానాన్నలు ప్రతీ పనిని మాకు ఆసక్తికరంగా, ఉత్సాహంగా, సంతోషంగా అనిపించేలా చేశారు. నా ఇద్దరు పిల్లలకు కూడా నేను అలాంటి జీవితాన్నే ఇవ్వాలనుకున్నాను.”

దాదాపు అదే వయసున్న రాన్నే భర్త షేన్‌కు కూడా తన భార్యకున్నలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలే ఉన్నాయి. ఆయనిలా చెప్తున్నాడు, “మాకు రెండో బిడ్డ పుట్టాక, ఒక కావలికోటలో ఫసిఫిక్‌కు నైరుతి వైపునున్న టోంగా దీవుల్లో ప్రకటించడానికి ఓడలో వెళ్లిన ఓ సాక్షుల కుటుంబం గురించి చదివాం. a ఆ ఆర్టికల్‌ వల్ల మేమెంతో ప్రోత్సాహం పొందాం. దాంతో రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాల గురించి తెలియజేయమని కోరుతూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలకు ఉత్తరాలు రాశాం. b దానికి జవాబుగా మమ్మల్ని టోంగా అనే ప్రాంతానికి వెళ్లమనే ఆహ్వానం వచ్చింది, మేం కావలికోటలో చదివింది కూడా ఆ ప్రాంతం గురించే!”

1 జేకబ్‌, రాన్నే, స్కయ్‌, షేన్‌

షేన్‌, రాన్నేలు తమ పిల్లలు జేకబ్‌, స్కయ్‌లతో కలిసి టోంగాలో దాదాపు ఏడాదిపాటు ఉన్నారు. కానీ అక్కడ అల్లర్లు చెలరేగడంతో వాళ్లు తిరిగి రావాల్సివచ్చింది. అయితే వాళ్లు పరిచర్యను విస్తృతం చేసుకోవాలనే తమ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. అందుకే, 2011⁠లో ఆస్ట్రేలియాకు దాదాపు 15,000 కి.మీ. దూరంలో తూర్పున ఉన్న నార్‌ఫాక్‌ ఐలాండ్‌ అనే ఓ చిన్న ఫసిఫిక్‌ ద్వీపానికి వెళ్లారు. దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందారు? 14 ఏళ్ల జేకబ్‌ ఇలా చెప్తున్నాడు, “యెహోవా మమ్మల్ని చూసుకోవడమే కాదు, పరిచర్య కూడా సరదాగా ఉండేలా చేశాడు.”

కుటుంబమంతా కలిసి సేవచేయడానికి కృషిచేయడం

షేన్‌వాళ్ల కుటుంబంలాగే ఎంతోమంది తమ కుటుంబాలతో కలిసి అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు స్వచ్ఛందంగా వెళ్తున్నారు. అలా వెళ్లాలనే కోరిక వాళ్లలో ఎలా కలిగింది?

“ఇక్కడ ఆసక్తిగల వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లతో క్రమంగా బైబిలు స్టడీ చేయాలనుకున్నాం.”—బర్నెట్‌

తమ 30వ పడిలో ఉన్న బర్నెట్‌, సీమోన్‌ అనే జంట, వాళ్ల అబ్బాయిలైన పన్నెండేళ్ల ఈస్టన్‌, తొమ్మిదేళ్ల కేలబ్‌లతో కలిసి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న బర్క్‌టౌన్‌ అనే ఓ మారుమూల పట్టణానికి వెళ్లిపోయారు. “సాక్షులు ఇక్కడ ప్రకటించడానికి మూడు లేదా నాలుగేళ్లకోసారి మాత్రమే వస్తారు. ఇక్కడ ఆసక్తిగల వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లతో క్రమంగా బైబిలు స్టడీ చేయాలనుకున్నాం” అని బర్నెట్‌ చెప్తున్నాడు.

3 జిమ్‌, జాక్‌, మార్క్‌, క్యారన్‌

ప్రస్తుతం 50వ పడిలో ఉన్న మార్క్‌, క్యారన్‌ అనే దంపతులు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి దగ్గర్లో ఉన్న కొన్ని సంఘాల్లో సేవచేశారు. దానికి ముందు వాళ్లు తమ పిల్లలైన జెస్సికా, జిమ్‌, జాక్‌లతో కలిసి నార్థన్‌ టెరిటరీలోని గనులున్న ఓ మారుమూల ప్రాంతమైన నలన్‌బొయ్‌కు వెళ్లి సేవచేశారు. మార్క్‌ ఇలా అంటున్నాడు, “నాకు ప్రజలంటే ఇష్టం అందుకే సంఘంలో, పరిచర్యలో అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లాలనుకున్నాను.” మొదట్లో క్యారన్‌ అక్కడికి వెళ్లడానికి వెనకాడింది. ఆమె ఇలా చెప్తుంది, “కానీ మార్క్‌ అలాగే ఇతరులు నన్ను ప్రోత్సహించడంతో, ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. అలా చేసినందుకు నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది.”

2 బెంజమన్‌, జేడ్‌, బ్రీయ, క్యారలన్‌

బెంజమన్‌, క్యారలన్‌లకు జేడ్‌, బ్రీయ అనే ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వాళ్లు 2011⁠లో, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ నుండి ఇండోనేషియా దీవుల్లోని టీమర్‌ దీవికి చెందిన టీమర్‌ లెస్ట్‌ అనే చిన్న దేశానికి మళ్లీ వెళ్లారు. బెంజమన్‌ ఇలా అంటున్నాడు, “ఒకప్పుడు నేనూ, క్యారలన్‌ టీమర్‌ లెస్ట్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవచేశాం. అక్కడ ప్రకటనాపని చాలా అద్భుతంగా ఉండేది, సహోదరులు కూడా చాలా మద్దతిచ్చారు. అక్కడినుండి రావాలంటే చాలా బాధనిపించింది. అయితే అక్కడికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాం. కానీ మాకు పిల్లలు పుట్టడంతో ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నామేగానీ మార్చుకోలేదు.” క్యారలన్‌ కూడా ఇలా అంది, “మా పిల్లలు మిషనరీలు, బెతెల్‌ కుటుంబసభ్యులు, ప్రత్యేక పయినీర్ల మధ్య పెరుగుతూ యెహోవాను సంతోషంగా సేవించాలని మేం కోరుకున్నాం.”

అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధపడడం

“మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల . . . కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” అని యేసు తన శిష్యులతో అన్నాడు. (లూకా 14:28) అదేవిధంగా, ఓ కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే చక్కని ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. దానికోసం ఏం చేయాలి?

ఆధ్యాత్మికత: బెంజమన్‌ ఇలా అంటున్నాడు, “మేం ఇతరులకు సేవచేయాలని కోరుకున్నాం కానీ వాళ్లకు భారంగా మారాలనుకోలేదు. అందుకే, వేరే ప్రాంతానికి వెళ్లేముందు మేం ఆధ్యాత్మికంగా బలపడడానికి కృషిచేశాం. అంతేకాదు పరిచర్యలో, సంఘ పనుల్లో మరింత ఎక్కువగా పాల్గొన్నాం.”

పైన చెప్పుకున్న జేకబ్‌ ఇలా చెప్తున్నాడు, “నార్‌ఫాక్‌ ఐలాండ్‌కు వెళ్లడానికి ముందు, అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి వెళ్లిన ఎన్నో కుటుంబాల జీవిత కథలను కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో చదివాం. వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో, యెహోవా వాళ్లపట్ల ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నాడో మేం చర్చించుకున్నాం.” జేకబ్‌ చెల్లెలైన 11 ఏళ్ల స్కయ్‌ ఇలా చెప్పింది, “నేను సొంతంగా, అలాగే మమ్మీడాడీతో కలిసి చాలాసార్లు ప్రార్థించాను.”

భావోద్వేగాలు: రాన్నే ఇలా చెప్తుంది, “మేము మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దగ్గరగా మాకు ఇష్టమైన ప్రాంతంలో ఉండేవాళ్లం కాబట్టి మాకు అంత కష్టంగా అనిపించేది కాదు. అయితే వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నప్పుడు, నేనేమి వదులుకుంటున్నాననే దానికన్నా మా కుటుంబం పొందే ప్రయోజనాల గురించే ఆలోచించాను.”

సంస్కృతి: చాలా కుటుంబాలు తాము వెళ్లాలనుకుంటున్న కొత్త ప్రాంతానికి అలవాటుపడేందుకు, ముందుగా ఆ ప్రాంతం గురించి కొంత పరిశోధన చేస్తాయి. మార్క్‌ ఇలా అంటున్నాడు, “నలన్‌బొయ్‌ గురించి మేం వీలైనంత ఎక్కువగా చదివాం. అక్కడుండే సహోదరులు మా మీదున్న శ్రద్ధతో స్థానిక వార్తాపత్రికల్ని మాకు పంపించారు. వాటివల్ల అక్కడి ప్రజల గురించి, వాళ్ల సంస్కృతి గురించి కొంత తెలుసుకోగలిగాం.”

నార్‌ఫాక్‌ ఐలాండ్‌కు వెళ్లి సేవచేస్తున్న షేన్‌ ఏం చెప్తున్నాడంటే, “అన్నిటికన్నా ముఖ్యంగా నేను క్రైస్తవ లక్షణాలను చూపించడం మీదే మనసుపెట్టాను. ఒకవేళ నేను నిజాయితీగా, మృదువుగా, నమ్మకంగా ఉంటూ కష్టపడి పనిచేస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలనని నాకు తెలుసు.”

సవాళ్లను ఎదుర్కోవడం

అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి మంచి ఫలితాలు సాధించిన సహోదరసహోదరీలు, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు కూడా పరిస్థితులకు తగ్గట్లుగా, ధైర్యంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తున్నారు. కొన్ని అనుభవాలు పరిశీలించండి.

రాన్నే ఇలా అంటోంది, “నేను పనుల్ని వేర్వేరు పద్ధతుల్లో చేయడం నేర్చుకున్నాను. ఉదాహరణకు, నార్‌ఫాక్‌ ఐలాండ్‌లో సముద్రం మీద గాలులు బలంగా వీస్తున్నప్పుడు, సరుకుల్ని తెచ్చే ఓడలు ఆగడానికి కుదరదు దానివల్ల సరుకులు దొరకడం కష్టమౌతుంది, రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. కాబట్టి వంట చేస్తున్నప్పుడు, ఉన్నవాటిని పొదుపుగా వాడడం నేర్చుకున్నాను.” ఆమె భర్త షేన్‌ కూడా ఇలా అంటున్నాడు, “మేం వారానికి ఎంత ఖర్చుపెట్టాలనుకున్నామో దానికి మించి ఖర్చుపెట్టకుండా కూడా సర్దుబాటు చేసుకుంటాం.”

షేన్‌ వాళ్ల అబ్బాయి జేకబ్‌కు మరోరకమైన సమస్య ఎదురైంది. ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు, “మా కొత్త సంఘంలో మేం కాకుండా మరో ఏడుగురు మాత్రమే ఉండేవాళ్లు. పైగా వాళ్లందరూ పెద్దవాళ్లే అవ్వడంతో నా వయసున్న స్నేహితులెవ్వరూ నాకు ఉండేవాళ్లుకాదు. పెద్దవాళ్లయినా సరే వాళ్లతో కలిసి పరిచర్య చేసినప్పుడు, వాళ్లు నాకు ఇట్టే స్నేహితులైపోయారు.”

ప్రస్తుతం 21 ఏళ్ల వయస్సున్న జిమ్‌ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. “మా దగ్గర్లో ఉన్న సంఘం నలన్‌బొయ్‌కి 725 కి.మీ. కన్నా ఎక్కువ దూరంలో ఉంది. కాబట్టి అసెంబ్లీలు, సమావేశాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించేవాళ్లం. మేం వాటికి ముందుగానే వెళ్లి సహోదరసహోదరీల సహవాసాన్ని ఆనందించేవాళ్లం. సంవత్సరంలో వచ్చే ఈ సందర్భాల్ని మేం చాలా ముఖ్యమైనవిగా చూస్తాం.”

“ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది”

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును” అని బైబిలు చెప్తుంది. (సామె. 10:22) ఈ మాటలు ఎంత సత్యమో అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి వెళ్లిన ఎంతోమంది సహోదరసహోదరీలు రుచిచూసి తెలుసుకున్నారు.

మార్క్‌ ఇలా అంటున్నాడు, “వేరే ప్రాంతాలకు వెళ్లి సేవచేయడం మా పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది. అది మేం పొందిన గొప్ప ఆశీర్వాదం. రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్ల అవసరాల్ని యెహోవా తీరుస్తాడనే నమ్మకం మా పెద్ద పిల్లలిద్దరికీ కుదిరింది. ఆ నమ్మకాన్ని ఎంత డబ్బుపెట్టినా కొనలేం.”

షేన్‌ ఏమంటున్నాడంటే, “నేను నా భార్యాపిల్లలకు మరింత దగ్గరయ్యాను. యెహోవా వాళ్లకోసం చేసినవాటి గురించి చెప్పడం విన్నప్పుడు నాకు నిజంగా సంతృప్తిగా ఉంటుంది.” షేన్‌ వాళ్ల అబ్బాయి జేకబ్‌ ఇలా అంటున్నాడు, “నేనెంత ఆనందంగా గడిపానంటే, ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది!”

a కావలికోట డిసెంబరు 15, 2004 సంచికలోని 8-11 పేజీల్లో ఉన్న “‘స్నేహశీల దీవుల్లో’ దేవుని స్నేహితులు” అనే ఆర్టికల్‌ చూడండి.

b 2012⁠లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ బ్రాంచీలను విలీనం చేసి ఆస్ట్రలేషియా బ్రాంచీగా మార్చారు.