కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి ఉత్సాహంగా సేవచేస్తున్న సాక్షుల్లో ఎంతోమంది పెళ్లికాని సహోదరీలు కూడా ఉన్నారు. వాళ్లలో కొంతమంది కొన్ని దశాబ్దాలుగా వేరే దేశాల్లో సేవచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల ముందే అలా వేరే దేశానికి వెళ్లడానికి వాళ్లకేమి సహాయం చేసింది? వేరే దేశంలో సేవ చేయడంవల్ల వాళ్లేమి నేర్చుకున్నారు? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎన్నో ఏళ్లుగా వేరే దేశాల్లో సేవచేస్తున్న ఎంతోమంది సహోదరీలను మేం ఇంటర్వ్యూ చేశాం. ఒకవేళ మీరు కూడా చెప్పలేనంత సంతృప్తినిచ్చే పరిచర్యలో భాగం వహించాలనే కోరిక ఉన్న పెళ్లికాని సహోదరి అయితే, ఈ ఇంటర్వ్యూ నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. అవును, వాళ్ల అనుభవాల్ని పరిశీలించడం ద్వారా దేవుని ప్రజలందరూ ప్రయోజనం పొందవచ్చు.

సందేహాలను వెనక్కినెట్టడం

అనీత

ఒంటరిగా వేరే దేశానికి వెళ్లి మీరు పయినీరు సేవ చేయగలరాననే సందేహం మీలో ఉందా? ప్రస్తుతం 70వ పడిలో ఉన్న అనీత అనే సహోదరికి కూడా అలాంటి సందేహాలే ఉండేవి. ఇంగ్లండ్‌లో పెరిగిన ఈమె, 18 ఏళ్ల వయసులో పయినీరు సేవచేయడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెప్తోంది, “ప్రజలకు యెహోవా గురించి నేర్పించడమంటే నాకు ఇష్టం. కానీ నేను వేరే దేశం వెళ్లి సేవ చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎన్నడూ వేరే భాష నేర్చుకోలేదు, నేర్చుకోగలనని కూడా అనుకోలేదు. కాబట్టి నాకు గిలియడ్‌ పాఠశాలకు ఆహ్వానం వచ్చినప్పుడు అవాక్కయ్యాను. నాలాంటి వాళ్లకు ఇలాంటి ఆహ్వానం వచ్చిందానని ఆశ్చర్యపోయాను. కానీ, ‘నేను చేయగలనని యెహోవా అనుకుంటుంటే నేను ప్రయత్నిస్తాను’ అని అనుకున్నాను.” ఇదంతా 50 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. అప్పటినుండి ఇప్పటివరకు నేను జపాన్‌లో మిషనరీగా సేవచేస్తున్నాను. “అప్పుడప్పుడు నేను కళ్లలో మెరుపుతో ‘మీ బ్యాగు తీసుకుని అత్యంత అద్భుతమైన పనికి నాతోపాటు రండి’ అని యౌవన సహోదరీలతో అంటుంటాను. సంతోషకరమైన విషయమేమిటంటే, చాలామంది ఆ మాటలకు స్పందించారు.”

ధైర్యాన్ని కూడగట్టుకోవడం

వేరే దేశానికి వెళ్లి సేవ చేసిన చాలామంది సహోదరీలు, అలా వెళ్లడానికి మొదట్లో కాస్త వెనుకంజ వేశారు. మరి అడుగు ముందుకు వేయడానికి కావాల్సిన ధైర్యాన్ని వాళ్లెలా కూడగట్టుకున్నారు?

మోరీన్‌

ప్రస్తుతం 60వ పడిలో ఉన్న మోరీన్‌ ఇలా అంటోంది, “ఇతరులకు సహాయపడేలా అర్థవంతమైన జీవితాన్ని గడపాలని నేను చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని.” ఆమెకు 20 ఏళ్లు వచ్చాక, పయినీర్ల అవసరం ఎక్కువున్న కెనడాలోని క్విబెక్‌కు ఆమె వెళ్లిపోయింది. ఆమె ఇంకా ఇలా చెప్తోంది, “కొంతకాలానికి నాకు గిలియడ్‌ పాఠశాలకు హాజరవ్వమనే ఆహ్వానం వచ్చింది. కానీ స్నేహితులెవ్వరూ లేకుండా కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే భయమేసింది. పైగా జబ్బుతో ఉన్న మా నాన్న బాగోగులు చూసుకుంటున్న అమ్మను వదిలి వెళ్లాలంటే దిగులుగా అనిపించింది. వీటన్నిటి గురించి ఎన్నో రాత్రులు ఏడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాను. నా భయాల గురించి అమ్మానాన్నలతో మాట్లాడినప్పుడు వాళ్లు నన్ను గిలియడ్‌కు వెళ్లమని ప్రోత్సహించారు. దాంతోపాటు స్థానిక సంఘం మా అమ్మానాన్నలకు ప్రేమతో ఇచ్చిన మద్దతును కూడా చూశాను. యెహోవా చూపిస్తున్న శ్రద్ధను గమనించాక, ఆయన నన్ను కూడా చూసుకుంటాడనే నమ్మకం నాలో కలిగింది. అప్పుడు, బయల్దేరడానికి సిద్ధమయ్యాను.” 1979 మొదలుకొని 30 కన్నా ఎక్కువ ఏళ్లు పశ్చిమాఫ్రికాలో ఆమె మిషనరీగా సేవ చేసింది. ప్రస్తుతం మోరీన్‌ కెనడాలో వాళ్ల అమ్మ బాగోగులు చూసుకుంటూ ఇప్పటికీ ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తోంది. వేరే దేశంలో సేవ చేసిన సంవత్సరాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా అంటోంది, “నాకు అవసరమైన వాటిని, అవసరమైన సమయంలో యెహోవా ఎప్పుడూ ఇచ్చాడు.”

వెండీ

ప్రస్తుతం 60వ పడిలో ఉన్న వెండీ టీనేజీలో ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలో పయినీరు సేవ మొదలుపెట్టింది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది, “నేను చాలా పిరికిదానిలా ఉండేదాన్ని, తెలియని వాళ్లతో మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించేది. కానీ అన్నిరకాల వాళ్లతో ఎలా మాట్లాడాలో పయినీరు సేవ నాకు నేర్పించింది, దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అప్పటినుండి మాట్లాడడానికి ఏమాత్రం జంకేదాన్ని కాదు. పయినీరు సేవ నాకు యెహోవా మీద ఆధారపడడాన్ని నేర్పించింది, వేరే దేశంలో సేవ చేయాలనే ఆలోచన కూడా నాకు నచ్చింది. దానితోపాటు, అప్పటికే జపాన్‌లో 30 కన్నా ఎక్కువ సంవత్సరాలు మిషనరీగా సేవచేసిన ఓ పెళ్లికాని సహోదరి నన్ను మూడు నెలలపాటు పరిచర్య చేయడానికి తనతోపాటు జపాన్‌కు రమ్మని పిలిచింది. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల వేరే దేశానికి వెళ్లి సేవ చేయాలనే నా కోరిక మరింత పెరిగింది.” 1980 మధ్య కాలంలో వెండీ వనౌటు అనే దీవికి వెళ్లింది, ఆ దీవి ఆస్ట్రేలియాకు తూర్పున 1770 కి.మీ. దూరంలో ఉంది.

వెండీ ఇప్పటికీ వనౌటులో ఉంటూ అక్కడున్న అనువాద కార్యాలయంలో సేవచేస్తోంది. ఆమె ఇలా చెప్తోంది, “మారుమూల ప్రాంతాల్లో గ్రూపులు, సంఘాలు ఏర్పడడం చూసినప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. ఈ దీవుల్లో జరుగుతున్న యెహోవా పనిలో నాకొక చిన్న వంతు దొరకడం ఎంత గొప్ప అవకాశమో నేను మాటల్లో చెప్పలేను.”

కూమీకో (మధ్యలో)

ప్రస్తుతం 60వ పడిలో ఉన్న కూమీకో జపాన్‌లో క్రమపయినీరుగా సేవ చేస్తుండేది. అయితే ఆమెతో కలిసి పయినీరు సేవ చేస్తున్న మరో సహోదరి, నేపాల్‌కు వెళ్లి సేవచేద్దామని సలహా ఇచ్చింది. కూమీకో ఇలా అంటోంది, “ఆమె నన్ను పదేపదే అడిగేది, కానీ నేను వద్దని చెప్తూ వచ్చాను. ఎందుకంటే అలా వెళ్తే కొత్త భాష నేర్చుకోవాలని, కొత్త వాతావరణానికి సర్దుకుపోవాలని భయపడేదాన్ని. పైగా వేరే దేశానికి వెళ్లడానికి అవసరమయ్యే డబ్బు ఎక్కడ నుండి వస్తుందని కూడా ఆలోచించేదాన్ని. వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, నాకు యాక్సిడెంట్‌ అయ్యి హాస్పిటల్‌ పాలయ్యాను. అక్కడ ఉండగా, ‘తర్వాత నాకేమి జరుగుతుందో ఎవరికి తెలుసు? నాకేదైనా తీవ్రమైన జబ్బు రావచ్చు, అలా జరిగితే వేరే దేశంలో సేవచేసే అవకాశాన్ని చేజార్చుకుంటాను. కాబట్టి కనీసం ఒక్క సంవత్సరమైనా వేరే దేశంలో ఎందుకు సేవ చేయకూడదు?’ అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు తగ్గట్లుగా ప్రవర్తించేలా సహాయం చేయమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేశాను.” హాస్పిటల్‌ నుండి వచ్చాక కూమీకో నేపాల్‌కు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని చూసి వచ్చింది. ఆ తర్వాత ఆమె, ఆమె తోటి పయినీరు అక్కడికి వెళ్లిపోయారు.

నేపాల్‌లో సుమారు పదేళ్లు సేవచేసిన జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకుంటూ కూమీకో ఇలా చెప్తోంది, “ఎర్ర సముద్రం పాయలుగా విడిపోయినట్లు నాకున్న సమస్యలన్నీ పటాపంచలైపోయాయి. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ సాధారణంగా ఏదైనా ఒక ఇంటికి వెళ్లి ప్రకటిస్తుంటే, చుట్టుప్రక్కల వాళ్లు ఓ ఐదారుగురు వచ్చి వింటారు. బైబిలుకు సంబంధించిన కరపత్రాల్ని ఇవ్వమని చిన్నపిల్లలు సహితం గౌరవపూర్వకంగా అడుగుతారు. ఇంత మంచి స్పందన ఉన్న ప్రాంతంలో సేవచేయడం చాలా ఆనందాన్నిస్తోంది.”

సవాళ్లను అధిగమించడం

మేం ఇంటర్వ్యూ చేసిన ధైర్యంగల పెళ్లికాని సహోదరీలకు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. మరి వాటిని వాళ్లెలా అధిగమించారు?

డైయన్‌

ఇప్పుడు 60వ పడిలోకి వచ్చిన కెనడాకు చెందిన డైయన్‌ అనే సహోదరి, ఐవరీ కోస్ట్‌లో (ఇప్పుడు దాన్ని కోటే డి ఐవరీ అని పిలుస్తున్నారు) 20 ఏళ్లపాటు మిషనరీగా సేవచేసింది. ఆమె ఇలా చెప్తోంది, “కుటుంబానికి అంత దూరంగా ఉండడం మొదట్లో కష్టమనిపించింది. నన్ను నియమించిన ప్రాంతంలోని ప్రజలను ప్రేమించేందుకు సహాయం చేయమని నేను యెహోవాను అడిగాను. మా గిలియడ్‌ ఉపదేశకుల్లో ఒకరైన జాక్‌ రెడ్‌ఫార్డ్‌ అనే సహోదరుడు, మా నియామకాన్ని మొదలుపెట్టిన కొత్తలో ఎదురయ్యే పరిస్థితులు కాస్త ఇబ్బందిగా ఉంటాయని, అవి మేం అవాక్కయ్యేలా కూడా ఉండవచ్చని వివరించాడు. ముఖ్యంగా కడుపేదరికం ఎదురైనప్పుడు అలా అనిపించవచ్చని చెప్పాడు. కానీ అతనిలా చెప్పాడు, ‘మీరు పేదరికాన్ని చూడకండి. ప్రజల్ని చూడండి, వాళ్ల ముఖాల్ని, కళ్లను చూడండి. బైబిలు సత్యాల్ని విన్నప్పుడు వాళ్లలో కలిగే స్పందనను చూడండి.’ నేను అదే చేశాను, అది నిజంగా ఓ ఆశీర్వాదం. ఓదార్పునిచ్చే రాజ్యసువార్తను చెప్పినప్పుడు ప్రజల కళ్లల్లో ఆనందం కనిపించేది.” వేరే దేశంలోని పరిస్థితులకు సర్దుకుపోవడానికి ఆమెకు ఇంకా ఏమి సహాయం చేసింది? “నేను నా బైబిలు విద్యార్థులకు మరింత దగ్గరై, వాళ్లు యెహోవా నమ్మకమైన సేవకులుగా మారడం చూసినప్పుడు కలిగే గొప్ప ఆనందాన్ని అనుభవించాను. నేను వెళ్లిన దేశమే నా ఇళ్లు అయిపోయింది. యేసు మాటిచ్చినట్టే నేను ఆధ్యాత్మిక తల్లుల్ని, తండ్రుల్ని, సహోదరసహోదరీల్ని పొందాను.”—మార్కు 10:29, 30.

ప్రస్తుతం 40వ పడిలో ఉన్న ఆన్‌ అనే సహోదరి ఆసియాలో మన పనిపై నిషేధం ఉన్న ప్రాంతంలో సేవచేస్తోంది. ఆమె ఇలా వివరిస్తోంది, “గడిచిన సంవత్సరాల్లో వేర్వేరు దేశాల్లో సేవ చేస్తున్నప్పుడు వేర్వేరు నేపథ్యాలు, మనస్తత్వాలు ఉన్న సహోదరీలతో కలిసి ఉన్నాను. అప్పుడప్పుడు మా మధ్య అపార్థాలు, భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అలాంటివి జరిగినప్పుడు నేను వాళ్ల సంస్కృతిని మరింత బాగా అర్థంచేసుకునేలా వాళ్లకు ఇంకా దగ్గరవ్వడానికి ప్రయత్నించేదాన్ని. వాళ్లతో మరింత ప్రేమగా, అర్థంచేసుకునేలా ఉండడానికి తీవ్రంగా కృషిచేసేదాన్ని. నేను చేసిన కృషికి మంచి ఫలితాలు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. దానివల్ల నాకు ఎంతోమంది చిరకాల స్నేహితులు దొరికారు, నా నియామకాన్ని కొనసాగించడానికి వాళ్లు సహాయం చేశారు.”

ఊట

జర్మనీలో ఉంటున్న ఊట అనే సహోదరి ప్రస్తుతం 50వ పడిలో ఉంది. 1993లో ఆమెకు మడగాస్కర్‌లో మిషనరీగా సేవ చేసే నియామకం వచ్చింది. ఆమె ఇలా చెప్తోంది, “అక్కడి స్థానిక భాష నేర్చుకోవడం, అక్కడి వాతావరణానికి అలవాటుపడడం, మలేరియా, అమీబాలు, పురుగులతో ఇబ్బందులకు గురవ్వడం మొదట్లో కష్టమనిపించింది. కానీ నాకు అక్కడున్న వాళ్లు చాలా సహాయం చేశారు. నేను వాళ్ల భాషపై పట్టు సాధించడానికి స్థానిక సహోదరీలు, వాళ్ల పిల్లలు, నా బైబిలు విద్యార్థులు ఓపిగ్గా సహాయం చేశారు. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు నాతోపాటు మిషనరీ సేవ చేస్తున్న సహోదరి ప్రేమతో నా బాగోగులు చూసుకునేది. అందరికన్నా ఎక్కువగా యెహోవా నాకు సహాయం చేశాడు. నా ఆందోళనలన్నీ ఎప్పటికప్పుడు ప్రార్థనలో ఆయనకు చెప్పుకునేదాన్ని. ఆ తర్వాత ఆయనిచ్చే జవాబు కోసం కొన్ని రోజులపాటు, కొన్నిసార్లైతే కొన్ని నెలలపాటు వేచిచూసేదాన్ని. నా ప్రతీ సమస్యను యెహోవా పరిష్కరించాడు.” ఊట గత 23 ఏళ్లుగా మడగాస్కర్‌లో మిషనరీగా సేవచేస్తోంది.

మెండుగా దీవెనలు

అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఇతరుల్లాగే, వేరే దేశంలో సేవచేస్తున్న పెళ్లికాని సహోదరీలు కూడా తమకు జీవితంలో దొరికిన దీవెనల గురించి చెప్తుంటారు. వాళ్లు పొందిన దీవెనల్లో కొన్నేమిటి?

హైడీ

జర్మనీకి చెందిన హైడీ అనే సహోదరి ప్రస్తుతం 70వ పడిలోకి వచ్చింది. ఆమె 1968 నుండి ఇప్పటివరకు ఐవరీ కోస్ట్‌లో (ఇప్పుడు కోటే డి ఐవరీ అని పిలుస్తున్నారు) మిషనరీగా సేవచేస్తోంది. ఆమె ఇలా అంటోంది, “నేను సత్యం అందించినవాళ్లు ‘సత్యంలో కొనసాగడాన్ని’ చూడడమే నేను పొందిన ఆనందాల్లో గొప్పది. నేను ఒకప్పుడు బైబిలు స్టడీ ఇచ్చినవాళ్లలో కొంతమంది ఇప్పుడు పయినీర్లుగా, సంఘపెద్దలుగా సేవచేస్తున్నారు. వాళ్లలో చాలామంది నన్ను అమ్మ లేదా అమ్మమ్మ అని పిలుస్తుంటారు. వాళ్లలో ఓ సంఘపెద్ద, అతని భార్యాపిల్లలు నన్ను వాళ్ల కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆ విధంగా యెహోవా నాకు ఓ కొడుకును, కోడలిని, ఇద్దరు మనవళ్లను, ఒక మనవరాల్ని ఇచ్చాడు.”—3 యోహా. 4.

కారన్‌ (మధ్యలో)

కెనడాకు చెందిన కారన్‌ ఇప్పుడు 70వ పడిలో ఉంది, ఆమె 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు పశ్చిమాఫ్రికాలో సేవచేసింది. ఆమె ఇలా అంటోంది, “మరింత స్వయంత్యాగ స్ఫూర్తిని, ప్రేమను, సహనాన్ని ఎలా చూపించాలో మిషనరీ జీవితం నాకు నేర్పింది. ఎన్నో ఇతర జాతులవాళ్లతో కలిసి పనిచేయడం వల్ల చక్కగా ఆలోచించడం నేర్చుకున్నాను. పనుల్ని వేర్వేరు విధానాల్లో చేయగలమని అర్థంచేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల్ని పొందే దీవెన నాకు దొరికింది. మా జీవితాలు, నియామకాలు మారినా మా స్నేహం మాత్రం అలానే ఉంటుంది.”

ఇంగ్లాండ్‌కు చెందిన మార్గరెట్‌ ప్రస్తుతం 70వ పడి చివర్లో ఉంది. ఆమె లావోస్‌లో మిషనరీగా సేవచేసింది. “వేరే దేశంలో సేవచేయడం వల్ల, యెహోవా అన్నీ జాతులకు, నేపథ్యాలకు చెందిన ప్రజల్ని తన సంస్థలోకి ఎలా నడిపిస్తాడో కళ్లారా చూడగలిగాను. ఆ అనుభవం నా విశ్వాసాన్ని ఎంతో బలపర్చింది. దానివల్ల యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడని, ఆయన సంకల్పాలు నెరవేరతాయని నాకు పూర్తి నమ్మకం కలిగింది” అని ఆమె చెప్పింది.

నిజానికి, వేరే దేశంలో సేవచేస్తున్న పెళ్లికాని సహోదరీలు సేవచేసే విషయంలో చక్కని ఫలితాల్ని తీసుకువచ్చారు. వాళ్లను మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. (న్యాయా. 11:40) అంతేకాదు వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. (కీర్త. 68:11) మీరు కూడా మీ పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకొని, ఈ ఆర్టికల్‌ కోసం మేం ఇంటర్వ్యూ చేసిన ఉత్సాహవంతమైన సహోదరీల్ని అనుకరించగలరా? ఒకవేళ మీరలా చేస్తే, ‘యెహోవా ఉత్తముడని రుచి చూసి’ తెలుసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు.—కీర్త. 34:8.