కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యెషయా 40:31​—“యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు”

యెషయా 40:31​—“యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు”

 “అయితే యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు. గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు; సొమ్మసిల్లకుండా నడుచుకుంటూ వెళ్తారు.”—యెషయా 40:31, కొత్త లోక అనువాదం.

 “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”—యెషయా 40:31, పరిశుద్ధ గ్రంథము.

యెషయా 40:31 అర్థమేంటి?

 ఎలాంటి సమస్యనైనా దాటడానికి లేదా దాన్ని భరించడానికి కావల్సిన బలాన్ని ఇస్తానని యెహోవా a దేవుడు తనను ఆరాధించేవాళ్లకు హామీ ఇస్తున్నాడు.

 “యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు.” తన ప్రజలకు సహాయం చేసే సామర్థ్యం, చేయాలనే కోరిక దేవునికి ఉన్నాయని నమ్మేవాళ్లకు ఆయన ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. (సామెతలు 3:5, 6) తనను ఆరాధించేవాళ్లకు తన పవిత్రశక్తిని లేదా చురుకైన శక్తిని ఇవ్వడం ద్వారా దేవుడు వాళ్లను బలపరుస్తాడు.—లూకా 11:13.

 “గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.” దేవుడు ఇచ్చే శక్తి ఎలా సహాయం చేస్తుందో ఈ పదచిత్రం చూపిస్తుంది. గద్ద ఎగిరేటప్పుడు థర్మల్స్‌ (thermals) అని పిలువబడే పైకెగిసే వేడి గాలుల్ని ఉపయోగించుకుని పైకి లేస్తుంది, సునాయాసంగా ఎగురుతుంది. ఒక థర్మల్‌ దొరికినప్పుడు అది తన రెక్కలు చాపి అందులో గుండ్రంగా తిరుగుతూ పైపైకి లేస్తుంది. ఒక థర్మల్‌ నుండి మరో థర్మల్‌కు మారుతూ అది గంటల తరబడి గాలిలోనే ఉండగలుగుతుంది. అలా, చాలా తక్కువ శక్తిని ఉపయోగించి గద్ద కావల్సిన చోటుకు చేరుకుంటుంది.

 “అలసిపోకుండా పరుగెత్తుతారు.” సమస్యలు మన శక్తిని లాగేసుకొని, మనల్ని కృంగదీస్తాయి. కానీ దేవుడు ఇచ్చే శక్తి, మనం వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది. తీవ్రమైన ఆటంకాలు ఉన్నా, సరైనది చేయడానికి కావల్సిన బలాన్ని ఇస్తుంది. పెద్దపెద్ద కష్టాలు సహించిన అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.

యెషయా 40:31 సందర్భం

 దేవుడు దాదాపు 2,700 సంవత్సరాల క్రితం తన ప్రవక్తైన యెషయాను ప్రేరేపించి ఈ మాటలు రాయించాడు. ఈ లేఖనంలోని మాటలు దేవుని నమ్మకమైన సేవకులందరికీ ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే యెహోవా ఈ మాటల్ని 70 ఏళ్లపాటు బబులోనులో బందీలుగా ఉండబోతున్న యూదులను ప్రోత్సహించడానికి చెప్పి ఉంటాడు. ఆ తర్వాత వాళ్లు స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు దేవుని మాటలు నెరవేరడాన్ని చూశారు. (యెషయా 40:1-3) క్రీ.పూ. 537 లో చాలారోజుల పాటు కష్టమైన ప్రయాణం b చేసి బబులోను నుండి యెరూషలేముకు రావడానికి కావల్సిన బలాన్ని దేవుడు వాళ్లకు ఇచ్చాడు.—యెషయా 40:29.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.

b యూదులు తిరిగివెళ్లిన దారి దాదాపు 1,600 కిలోమీటర్లు (1,000 మైళ్లు) ఉండి ఉండవచ్చు.