కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు సర్వశక్తిగల దేవుడా?

యేసు సర్వశక్తిగల దేవుడా?

యేసు సర్వశక్తిగల దేవుడా?

చాలామంది ఏమంటారంటే . . .

“అవును, యేసే సర్వశక్తిగల దేవుడు.”

“దేవుడే యేసులా మనిషిరూపంలో ఈ భూమి మీదకు వచ్చాడు.”

యేసు ఏమి చెప్పాడంటే . . .

‘తండ్రి నాకంటె గొప్పవాడు కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని మీరు సంతోషిస్తారు.’ (యోహాను 14:28) యేసే స్వయంగా తాను తన తండ్రికి సమానం కాదని ఒప్పుకున్నాడు.

‘నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని దగ్గరకు ఎక్కిపోతున్నాను.’ (యోహాను 20:17) యేసు తానే దేవుడినని చెప్పుకోలేదు, గానీ దేవుడు వేరే ఉన్నాడని తన మాటల్లో చూపించాడు.

‘నా అంతట నేనే మాట్లాడలేదు; నేను ఏమనాలో ఏమి మాట్లాడాలో దాన్నిగూర్చి నన్ను పంపిన తండ్రే నాకాజ్ఞ ఇచ్చాడు.’ (యోహాను 12:49) యేసు తనకు తోచింది బోధించలేదు గానీ తండ్రి ఆయనకు చెప్పిందే బోధించాడు.

యేసు, తాను దేవుని కుమారుడినని చెప్పాడే తప్ప, సర్వశక్తిగల దేవుణ్ణని చెప్పుకోలేదు. యేసే దేవుడైతే మరి భూమ్మీద ఉన్నప్పుడు ఆయన ఎవరికి ప్రార్థించాడు? (మత్తయి 14:23; 26:​26-29) ఆయన ఎవరికో ప్రార్థిస్తున్నట్లు మాత్రం నటించలేదు! యేసు వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటిస్తున్నాడనుకోవడంలో అర్థంలేదు!

తన రాజ్యంలో ప్రత్యేక స్థానాలు ఇవ్వమని ఇద్దరు శిష్యులు యేసును అడిగినప్పుడు ఆయన వారితో ‘నా కుడివైపున నా ఎడమవైపున కూర్చోనివ్వడం నా వశంలో లేదు’ అని అన్నాడు. (మత్తయి 20:23) వారు అడిగింది తన చేతుల్లో లేదని చెప్పినప్పుడు యేసు అబద్ధమాడాడా? లేదు. అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం దేవునికి మాత్రమే ఉందని ఆయన వినయంగా ఒప్పుకున్నాడు. దేవునికి తప్ప తనకుగానీ, దేవదూతలకుగానీ తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని యేసు వివరించాడు.​—⁠మార్కు 13:⁠32.

మరి యేసు భూమ్మీద మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికన్నా తక్కువ స్థానంలో ఉన్నాడా? లేదు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడాయనను తిరిగి బ్రతికించి పరలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా ఆయన దేవునికంటే తక్కువ స్థానంలోనే ఉన్నాడని బైబిలు చెబుతోంది. అపొస్తలుడైన పౌలు, “దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది” అని మనకు గుర్తుచేస్తున్నాడు. (1 కొరింథీయులు 11:​3, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) భవిష్యత్తులో, ‘సమస్తం ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తాన్ని లోపరచిన దేవునికి తానే లోబడతాడు’ అని బైబిలు చెబుతోంది.​—⁠1 కొరింథీయులు 15:⁠28.

దీన్నిబట్టి యేసు సర్వశక్తిగల దేవుడు కాదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఆయన తన తండ్రిని ‘నా దేవుడు’ అని సంబోధించాడు.​—⁠ప్రకటన 3:​2, 12; 2 కొరింథీయులు 1:​3, 4. * (w09 2/1)

[అధస్సూచి]

^ పేరా 12 ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 202-204 పేజీలను చూడండి.

[7వ పేజీలోని బ్లర్బ్‌]

దేవునికి తప్ప తనకుగానీ, దేవదూతలకుగానీ తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని యేసు వివరించాడు