కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము”

“పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము”

“పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము”

పుస్తకాలను, చర్మపు కాగితాలను తన దగ్గరికి తీసుకురమ్మని అపొస్తలుడైన పౌలు తన తోటి మిషనరీ అయిన తిమోతిని వేడుకున్నాడు. అయితే ఏ పుస్తకాల గురించి, చర్మపు కాగితాల గురించి పౌలు అడిగాడు? ఎందుకు అడిగాడు? దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

సా.శ. మొదటి శతాబ్దపు మధ్యభాగంలో పౌలు ఆ మాటలను రాసేనాటికి హెబ్రీ లేఖనాల 39 పుస్తకాలు 22 లేదా 24 పుస్తకాలుగా విభజించబడి ఉండేవి. వాటిలో చాలా పుస్తకాలు వేర్వేరు గ్రంథపు చుట్టల్లో ఉండేవి. ఇవి అప్పట్లో చాలా ఖరీదైనవైనప్పటికీ, “కొంతమేర ధనవంతులైన వారికి అవి అందుబాటులో ఉండేవి” అని ప్రొఫెసర్‌ ఆలన్‌ మిల్లర్డ్‌ అన్నాడు. వాటిలో కనీసం ఒక్కటైనా కొంతమంది దగ్గర ఉండేది. ఉదాహరణకు, ఐతియొపీయుడైన నపుంసకుడు తన రథం మీద వెళ్తూ తన దగ్గరున్న గ్రంథపు చుట్ట తెరిచి “ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను” అని బైబిలు చెబుతోంది. ఆయన “ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీద” అధికారిగా ఉండేవాడు. కాబట్టి ఆయన సొంత లేఖన ప్రతులను కలిగివుండేంత ధనవంతుడై ఉండవచ్చు.—అపొ. 8:27, 28.

పౌలు తిమోతిని ఇలా అభ్యర్థించాడు: “నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను [‘గ్రంథపు చుట్టలను,’ NW], ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.” (2 తిమో. 4:13) పౌలుకు ఎన్నో సొంత గ్రంథపు చుట్టలు ఉండేవని దీన్నిబట్టి తెలుస్తోంది. ఆయన దగ్గరున్న వాటన్నిటిలో దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. ఆ లేఖనంలోని “చర్మపు కాగితములు” అనే పదం గురించి ఎ.టి. రాబర్ట్‌సన్‌ ఇలా అన్నాడు: “ప్రత్యేకంగా అవి పాత నిబంధన పుస్తకాలై ఉండవచ్చు. పపైరస్‌ కన్నా చర్మపు కాగితాలు చాలా ఖరీదైనవి.” పౌలు తన చిన్నతనం నుండే ‘గమలీయేలు పాదములయొద్ద పెరిగాడు.’ అందరూ గౌరవించే గమలీయేలు పౌలుకు ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు. కాబట్టి, దేవుని వాక్యానికి సంబంధించిన గ్రంథపు చుట్టలను పౌలు సంపాదించుకొని ఉండవచ్చంటే అందులో ఆశ్చర్యం లేదు.—అపొ. 5:34; 22:3.

గ్రంథపు చుట్టలను క్రైస్తవులు ఎలా ఉపయోగించేవారు?

అప్పట్లో కొందరి దగ్గర మాత్రమే గ్రంథపు చుట్టలు ఉండేవి. మరైతే చాలామంది క్రైస్తవులకు దేవుని వాక్యం ఎలా అందుబాటులో ఉండేది? తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక మనకు ఒక చిన్న ఆధారాన్నిస్తోంది. ఆయనిలా రాశాడు: ‘నేను వచ్చు వరకు బహిరంగంగా చదువుతూ ఉండుము.’ (1 తిమో. 4:13, NW) క్రైస్తవ సంఘ కూటాల్లో బహిరంగంగా చదవడం ఒక భాగంగా ఉండేది. మోషే కాలం నుండి దేవుని ప్రజలు అలాగే చేస్తూ వస్తున్నారు.—అపొ. 13:15; 15:21; 2 కొరిం. 3:15.

సంఘ పెద్దగా తిమోతి ‘బహిరంగంగా చదువుతూ’ ఉండాలి. అలాచేయడం వల్ల సొంత లేఖన ప్రతులు లేనివారు ప్రయోజనం పొందేవారు. అలా దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదువుతున్నప్పుడు, ఒక్క పదం కూడా విడిచిపెట్టకుండా అందరూ శ్రద్ధగా వినేవారు. కూటాల్లో చదవబడిన విషయాలను తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఇంట్లో తప్పక చర్చించుకొనివుంటారు.

మృత సముద్రం వద్ద దొరికిన సుపరిచితమైన యెషయా గ్రంథపు చుట్ట దాదాపు 24 అడుగుల పొడవు ఉంటుంది. గ్రంథపు చుట్టకు రెండు చివర్లలో కర్రలుండి, పాడవకుండా ఎందులోనైనా పెట్టి ఉంటుంది కాబట్టి అది బరువుగా ఉండేది. బహుశా, ఎంతోమంది క్రైస్తవులు తమతోపాటు చాలా గ్రంథపు చుట్టలను ప్రకటనా పనికి తీసుకువెళ్లడం సాధ్యమయ్యేది కాదు. తన వ్యక్తిగత ఉపయోగం కోసం పౌలుకు సొంతగా కొన్ని లేఖన గ్రంథపు చుట్టలు ఉన్నప్పటికీ, తనకున్న వాటన్నిటినీ ప్రయాణాల్లో తనతో పాటు తీసుకువెళ్లడం వీలయ్యేది కాదు. వాటిలో కొన్నిటిని త్రోయలోవున్న తన స్నేహితుడైన కర్పు దగ్గర ఉంచాడని స్పష్టమౌతోంది.

పౌలు మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

రోములో రెండవసారి బందీగా ఉన్న పౌలు ఆ గ్రంథపు చుట్టలను తెమ్మని రాయడానికి ముందు తన ఉత్తరంలో ఇలా రాశాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని. . . . ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది.” (2 తిమో. 4:7, 8) ఈ మాటలను ఆయన దాదాపు సా.శ. 65లో నీరో చక్రవర్తి నుండి హింసలను ఎదుర్కొంటున్న కాలంలో రాసి ఉండవచ్చు. అప్పుడు పౌలు కఠినమైన జైలు శిక్ష అనుభవించాడు. త్వరలో తనకు మరణశిక్ష పడబోతుందని ఆయన గ్రహించాడు. (2 తిమో. 1:16; 4:6) అందుకే, తన సొంత గ్రంథపు చుట్టలు తన దగ్గర ఉండాలని పౌలు మనస్ఫూర్తిగా కోరుకున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు. చివరి వరకు తాను మంచిగా పోరాడాననే నమ్మకంతో ఉన్నప్పటికీ, దేవుని వాక్యాన్ని చదివి ఇంకా తననుతాను బలపరచుకోవాలని ఆయన కోరుకున్నాడు.

పౌలు ఉత్తరం అందేనాటికి తిమోతి బహుశా, ఇంకా ఎఫెసులోనే ఉండివుంటాడు. (1 తిమో. 1:3) ఎఫెసు నుండి త్రోయ మీదుగా రోము వరకు సుమారు 1,600 కి.మీ. దూరం ఉంటుంది. అదే ఉత్తరంలో పౌలు తిమోతిని ఇలా కోరాడు: “శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము.” (2 తిమో. 4:21) పౌలు కోరిన సమయంలోగా రోముకు వెళ్లేందుకు వీలుగా తిమోతికి పడవ దొరికిందో లేదో బైబిలు చెప్పడంలేదు.

“పుస్తకములను, ముఖ్యముగా చర్మపుకాగితములను” తీసుకురమ్మని పౌలు చేసిన మనవి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? తన జీవితంలోని ఆ వేదనకరమైన సమయంలో ఆయన దేవుని వాక్యం కోసం ఎంతగానో పరితపించాడు. ఆయన సదా ఆధ్యాత్మిక విషయాల్లో సజీవంగా, చురుకుగా ఉండడానికి, ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉండడానికి కారణం దేవుని వాక్యమే.

నేడు, మనకంటూ ఒక పూర్తి బైబిలు ఉంటే, మనం ఎంత ఆశీర్వదించబడినట్లు! మనలో కొంతమంది దగ్గర అనేక బైబిళ్లు ఉండడమేకాక వివిధ అనువాదాలు కూడా ఉన్నాయి. పౌలులాగే మనం కూడా లేఖనాలను లోతుగా గ్రహించాలనే కోరికను పెంపొందించుకోవాలి. పౌలు రాసిన 14 ప్రేరేపిత పత్రికల్లో తిమోతికి రాసిన రెండవ పత్రికే చివరిది. ఆయన చేసిన విన్నపం ఆ పత్రిక చివర్లో కనిపిస్తుంది. రాతపూర్వకంగా ఉన్న పౌలు చివరి కోరికల్లో, “పుస్తకములను” లేదా గ్రంథపు చుట్టలను “ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము” అని తాను తిమోతికి చేసిన విన్నపం ఒకటి.

పౌలులాగే విశ్వాసం విషయంలో చివరివరకు మంచిగా పోరాడాలని మీరు బలంగా కోరుకుంటున్నారా? ప్రభువు అనుమతించినంత కాలం సాక్ష్యమిచ్చే పనిలో కొనసాగేలా మీరు ఆధ్యాత్మికంగా చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలనుకుంటున్నారా? అలాగైతే, పౌలు ప్రోత్సహించినట్లు నడుచుకోండి. గ్రంథపు చుట్టల కంటే ఎంతో అనువైన రూపంలో ఉండి ఎన్నడూ లేనంతగా అనేకమంది ప్రజలకు అందుబాటులో ఉన్న బైబిలును శ్రద్ధగా క్రమంగా అధ్యయనం చేస్తూ ‘మీ విషయంలో, మీ బోధ విషయంలో జాగ్రత్త కలిగివుండండి.’—1 తిమో. 4:16.

[18, 19 పేజీల్లోని మ్యాపు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఎఫెసు

త్రోయ

రోము