కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మతనాయకులు రాజకీయాలు ప్రబోధించాలా?

మతనాయకులు రాజకీయాలు ప్రబోధించాలా?

మతనాయకులు రాజకీయాలు ప్రబోధించాలా?

“రాజకీయాల్లో చేరితే బీదవారికి సహాయం చేయవచ్చు అని కెనడాకు చెందిన ఒక ఆర్చ్‌బిషప్‌ యాత్రికులతో అన్నాడు . . . రాజకీయ వ్యవస్థ దేవుని చిత్తానికి అనుగుణంగా లేనట్లు అనిపించినా, ‘బీదలకు న్యాయం చేయాలంటే మనం రాజకీయాల్లో చేరక తప్పదు.’”​—⁠క్యాథలిక్‌ న్యూస్‌.

అనుభవజ్ఞులైన మతనాయకులు రాజకీయాల్లో చేరడం గురించి అనుకూలంగా మాట్లాడే నివేదికలు అసాధారణం కాదు; మతనాయకులే రాజకీయ పదవులు నిర్వహించడం అరుదైన విషయం కాదు. కొందరు రాజకీయ ప్రక్షాళనకు నడుం బిగిస్తే, మరికొందరు జాతి సమానత్వం, బానిసత్వ నిర్మూలన వంటి అంశాల గురించి ప్రచారం చేసినందుకు చిరస్మరణీయులయ్యారు.

అయినప్పటికీ, తమ ప్రచారకులు రాజకీయ వివాదాల్లో ఆయాపక్షాలు వహించడం సాధారణ ప్రజల్లోని అనేకులకు నచ్చడం లేదు. “తమ మతనాయకులు ప్రజా వ్యవహారాల్లో భాగం వహించడాన్ని ప్రొటస్టెంట్‌ చర్చిసభ్యులే కొన్నిసార్లు ప్రశ్నిస్తున్నారు” అని రాజకీయ వేదాంతంపై ప్రచురించబడిన వ్యాసంలో క్రిస్టియన్‌ సెంచరీ పేర్కొంది. పవిత్ర చర్చిలో రాజకీయాలకు చోటులేదని మత ప్రజలనేకమంది భావిస్తున్నారు.

మెరుగైన ప్రపంచాన్ని చూడాలని అభిలషించే వారందరినీ ప్రభావితంచేసే ఆసక్తికరమైన ప్రశ్నలను ఇది లేవదీస్తోంది. క్రైస్తవ ప్రచారకులకు రాజకీయ ప్రక్షాళన సాధ్యమా? * మెరుగైన ప్రభుత్వ స్థాపనకు, మెరుగైన ప్రపంచ సాధనకు రాజకీయాలు ప్రబోధించడమే దేవుని విధానమా? రాజకీయ అభ్యాసానికి ఒక కొత్త పద్ధతిగా క్రైస్తవత్వం పరిచయం చేయబడిందా?

క్రీస్తు పేరిట రాజకీయాలెలా మొదలయ్యాయి?

తొలి క్రైస్తవ సంఘం “ఈ లోకంలో అధికార సంపాదనపట్ల ఉదాసీన వైఖరికి” పెట్టింది పేరని, అది “రాజకీయాల్లేని, ప్రశాంతమైన, శాంతియుత సమాజంగా” ఉందని ది ఎర్లీ చర్చ్‌ అనే పుస్తకంలో చరిత్రకారుడైన హెన్రీ ఛాడ్విక్‌ చెబుతున్నాడు. ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటి ఇలా చెబుతోంది: “తమలో ఎవరూ ప్రభుత్వ పదవి చేపట్టరాదనే నిశ్చితభావం క్రైస్తవులందరిలో బలంగా నెలకొంది . . . ఒక పౌర న్యాయాధిపతి తను చర్చిలో చేరాలంటే తన రాజకీయ పదవికి రాజీనామా చేయాలనే షరతు చారిత్రక క్రైస్తవ వాడుకగా ఉండేదని దాదాపు మూడవ శతాబ్దారంభంలో హిప్పోలిటస్‌ చెప్పాడు.” అయితే క్రమేణా, అధికార దాహంగల మనుష్యులు తమకు తామే డాంబికమైన బిరుదులు తగిలించుకుంటూ అనేక సంఘాల్లో నాయకత్వం తీసుకోవడం ఆరంభించారు. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) కొందరు ఇటు మతనాయకులుగా అటు రాజకీయ నాయకులుగా ఉండాలని కోరుకున్నారు. రోమా ప్రభుత్వంలో ఆకస్మికంగా కలిగిన మార్పు ఆ విధమైన చర్చి నాయకులకు వారు కోరుకున్న అవకాశాన్నిచ్చింది.

సా.శ. 312లో అన్యుడైన రోమా చక్రవర్తి కాన్‌స్టంటైన్‌ నామకార్థ క్రైస్తవ మతంపట్ల స్నేహభావం చూపాడు. ఆశ్చర్యకరంగా, చర్చి బిషప్పులు ఆ అన్య చక్రవర్తి తమకిచ్చిన ఆధిక్యతలనుబట్టి రాజీపడేందుకు సిద్ధపడ్డారు. “రాజకీయ నిర్ణయాలు చేయడంలో చర్చి కీలకపాత్ర వహించడం మరింత ఎక్కువ కావడం ఆరంభమైంది” అని హెన్రీ ఛాడ్విక్‌ వ్రాశాడు. రాజకీయాల్లో చేరడం చర్చి నాయకులపై ఎలాంటి ప్రభావం చూపింది?

రాజకీయాలు ప్రబోధకులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

దేవుడే చర్చి నాయకులను రాజకీయ నాయకులుగా ఉపయోగించుకుంటాడనే అభిప్రాయాన్ని ప్రత్యేకంగా ఐదవ శతాబ్దపు, గొప్ప పలుకుబడిగల క్యాథలిక్‌ వేదాంతి అగస్టీన్‌ పురికొల్పాడు. దేశాలపై చర్చి పరిపాలన సాగిస్తూ మానవాళికి శాంతి తెస్తుందని ఆయన ఊహించాడు. అయితే చరిత్రకారుడైన హెచ్‌. జి. వేల్స్‌ ఇలా వ్రాశాడు: “ఐదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకున్న యూరప్‌ చరిత్రలో దైవిక ప్రపంచ ప్రభుత్వం ఆచరణకొస్తుందనే ఈ గొప్ప తలంపుయొక్క వైఫల్యమే పెద్ద చరిత్రగా ఉంది.” క్రైస్తవమత సామ్రాజ్యం మొత్తం ప్రపంచానికే కాదు, కనీసం యూరప్‌కు కూడా శాంతి తీసుకురాలేకపోయింది. క్రైస్తవత్వమని నమ్మబడినది అనేకుల దృష్టిలో తన స్థానాన్ని కోల్పోయింది. ఎలాంటి పొరపాటు జరిగింది?

క్రైస్తవత్వాన్ని ప్రబోధిస్తున్నామని చెప్పుకున్న అనేకులు మంచి ఉద్దేశాలతోనే రాజకీయాలవైపుకు ఆకర్షించబడ్డారు, అయితే వారు కీడు చేయడంలో భాగస్థులయ్యారు. మత ప్రబోధకుడు, బైబిలు అనువాదకుడూ అయిన మార్టిన్‌ లూథర్‌ క్యాథలిక్‌ చర్చిని సంస్కరించే తన ప్రయత్నాలకు ప్రఖ్యాతిగాంచాడు. అయితే చర్చి సిద్ధాంతాలకు ఆయన ధైర్యంగా ఎదురునిలవడం తిరుగుబాటు చేయాలనే రాజకీయ ఉద్దేశాలుగల వారిమధ్య ఆయనకు పేరుతెచ్చింది. చివరికి లూథర్‌ కూడా రాజకీయ వివాదాంశాలపై మాట్లాడడం ఆరంభించేసరికి అనేకుల గౌరవం కోల్పోయాడు. మొదట ఆయన నిరంకుశ ప్రభువులపై తిరుగుబాటు చేస్తున్న రైతుల పక్షం వహించాడు. ఆ తర్వాత, ఆ తిరుగుబాటు హింసాయుతంగా మారినప్పుడు, ఆ తిరుగుబాటును అణచివేయుమని ఆయన ఆ ప్రభువులను ప్రోత్సహించాడు, వారలాగేచేసి వేలాదిమందిని సంహరించారు. అందువల్ల రైతులు ఆయనను విశ్వాసఘాతకునిగా పరిగణించారంటే అందులో ఆశ్చర్యమేమీలేదు. క్యాథలిక్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆ ప్రభువులు చేసిన తిరుగుబాటును కూడా లూథర్‌ ప్రోత్సహించాడు. వాస్తవానికి, ప్రొటస్టెంట్లు అని పేరొందిన లూథర్‌ అనుచరులు మొదటి నుండే ఒక రాజకీయ ఉద్యమం నడిపారు. ఆ అధికారం లూథర్‌పై ఎలాంటి ప్రభావం చూపింది? అది అతన్ని భ్రష్టుణ్ణి చేసింది. ఉదాహరణకు, మత అసమ్మతీయులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఆయన మొదట వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆయన శిశు బాప్తిస్మాన్ని వ్యతిరేకించిన వారిని దహించి చంపేలా తన రాజకీయ స్నేహితులను ప్రోత్సహించాడు.

జాన్‌ కాల్విన్‌ జెనీవాలో పేరుగాంచిన మతనాయకుడే, అయితే ఆయన క్రమేణా అపారమైన రాజకీయ పలుకుబడి కూడా సంపాదించాడు. లేఖనాల్లో త్రిత్వానికి ఆధారం లేదని మైఖేల్‌ సర్వేటస్‌ వివరించినప్పుడు, ఆయనకు మరణశిక్ష విధించడాన్ని సమర్థించేందుకు కాల్విన్‌ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాడు, చివరకు సర్వేటస్‌ కొయ్యపై నిలువునా దహించి చంపబడ్డాడు. ఇది యేసు బోధలనుండి ఎంత భయంకరంగా వైదొలగడమో గదా!

బహుశా ఈ మనుష్యులు “లోకమంతయు దుష్టుని యందున్నది” అని 1 యోహాను 5:19లో బైబిలు చెబుతున్న విషయం మరచిపోయి ఉంటారు. వారిలో తమ కాలపు రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే యథార్థమైన కోరిక ఉందా, లేక అధికారం చేజిక్కడం, ఉన్నత పదవుల్లోవున్న స్నేహితులు లభించడం వారిని ఆకర్షించాయా? ఏదేమైనా, “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అని యేసు శిష్యుడైన యాకోబు వ్రాసిన ప్రేరేపిత మాటలను వారు గుర్తుతెచ్చుకోవాల్సింది. (యాకోబు 4:⁠4) “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని యేసు తన అనుచరుల గురించి చెప్పాడని యాకోబుకు తెలుసు.​—⁠యోహాను 17:14.

క్రైస్తవులు లోకంలోని చెడుతనంతో సంబంధం లేకుండా ఉండాలని తెలిసినా, అనేకులు రాజకీయంగా తటస్థంగా ఉండడానికి, నిజంగా ‘లోకసంబంధులు కాకుండా’ ఉండడానికి అభ్యంతరం చెబుతారు. అలా తటస్థంగా ఉండడం క్రైస్తవులు ఇతరులపట్ల క్రియాశీల దయ చూపించడాన్ని అడ్డగిస్తుందని వారు వాదిస్తారు. అవినీతికి, అన్యాయానికి విరుద్ధంగా పోరాడడంలో చర్చి నాయకులు తమ నోరు విప్పాలని, ఒక పాత్ర వహించాలని వారు నమ్ముతారు. అయితే ఇతరులపట్ల క్రియాశీల శ్రద్ధ చూపడానికి యేసు బోధించిన తటస్థ వైఖరి కలిగివుండడానికి నిజంగా పొత్తు కుదరదా? విభాగిత రాజకీయ వివాదాలకు ఒక క్రైస్తవుడు దూరంగా ఉంటూనే అతను ఇతరులకు ఆచరణాత్మక సహాయం అందించడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలను తర్వాతి ఆర్టికల్‌ విశ్లేషిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 5 రాజకీయాలు “ఒక దేశపు లేదా ప్రాంతపు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన కార్యకలాపాలు, అంటే అధికారం పొందాలనే ఆశతో ప్రత్యేకంగా ఆయావ్యక్తుల లేదా పక్షాల మధ్య జరిగే చర్చ లేదా పోరు” అని నిర్వచించబడ్డాయి.​—⁠ద న్యూ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఆఫ్‌ ఇంగ్లీష్‌.

[4వ పేజీలోని చిత్రం]

చర్చి నాయకులు రాజకీయ అధికారం పొందడానికి కాన్‌స్టంటైన్‌ చక్రవర్తి వంటి పరిపాలకులతో రాజీపడ్డారు

[చిత్రసౌజన్యం]

Musée du Louvre, Paris

[5వ పేజీలోని చిత్రాలు]

ప్రఖ్యాత మతనాయకులు రాజకీయాలవైపు ఎందుకు ఆకర్షించబడ్డారు?

అగస్టీన్‌

లూథర్‌

కాల్విన్‌

[చిత్రసౌజన్యం]

అగస్టీన్‌: ICCD Photo; కాల్విన్‌: Portrait by Holbein, from the book The History of Protestantism (Vol. II)