కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అద్భుతమైన కళాఖండం”

“అద్భుతమైన కళాఖండం”

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి

“అద్భుతమైన కళాఖండం”

యెహోవాసాక్షులు తమ ఆధునికదిన చరిత్ర తొలినాళ్ళ నుండే యేసుక్రీస్తు ప్రవచనాల్లో ఒక ప్రవచనమందు ప్రగాఢమైన ఆసక్తిని కలిగివున్నారు: “ఈ రాజ్య సువార్త సకలజనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:​14) “అంత్యదినము”లు ప్రారంభమైన సంవత్సరమైన 1914 సమీపిస్తుండగా నిష్కల్మష హృదయులైన బైబిలు విద్యార్థులు పరిశుద్ధ లేఖనాలపై ఆధారపడిన విద్యా కార్యక్రమాన్ని సంపూర్ణాత్మ నిశ్చయతతో చేపట్టి ఇంతకు మునుపెన్నడూ జరగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం ప్రారంభించారు.​—⁠2 తిమోతి 3:⁠1.

భూవ్యాప్తంగా సువార్తను ప్రకటించాలన్న తమ లక్ష్యాన్ని సాధించడానికిగాను ఈ యెహోవా సేవకులు ఒక వినూత్నమైన, సాహసోపేతమైన, ప్రభావవంతమైన పద్ధతిని వినియోగించారు. దాని గురించి మరింతగా తెలుసుకోవడానికి మనం గతచరిత్రలోనికి పయనిద్దాం.

సువార్తను ప్రకటించడానికి ఓ వినూత్నమైన మార్గం

అది 1914 జనవరి. న్యూయార్క్‌ సిటీలోని ఒక ఆడిటోరియమ్‌లో కూర్చున్న 5,000 మందిలో మీరూ ఉన్నట్లు ఊహించుకోండి. చుట్టూ చిమ్మ చీకటి. మీ ముందు పెద్ద సినిమా తెర ఉంది. ఆ తెరపై నెరిసిన జుట్టుతో పొడవాటి కోటు వేసుకునివున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమౌతాడు. మీరిప్పటివరకూ మూకీ (మాటల్లేని) సినిమాలైతే చూసివున్నారు, కానీ ఈ మనిషి మాట్లాడుతున్నాడు, మీకాయన మాటలు వినబడుతున్నాయి. సాంకేతికపరంగా కొత్తదైన ఒక చలనచిత్రం తొలి ప్రదర్శనలో మీరు కూర్చున్నారు, దాని సందేశమూ విశేషమైనదే. ఆ ప్రసంగీకుని పేరు చార్ల్స్‌ తేజ్‌ రస్సెల్‌, వాచ్‌ టవర్‌ సొసైటీకి మొట్టమొదటి అధ్యక్షుడు, ఆ ప్రదర్శన పేరు “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌.”

గొప్ప ప్రజానీకాన్ని ఒకే సమయంలో చేరడంలో చలనచిత్రాలకున్న శక్తిని సి.టి. రస్సెల్‌ గ్రహించాడు. అందుకని ఆయన 1912 లో “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను తయారుచేయడం ప్రారంభించాడు. చివరికది ఫోటోగ్రాఫిక్‌ స్లైడులు, చలన చిత్రాలు ఉన్న ఎనిమిది గంటల ప్రదర్శనగా రూపొందింది. అది రంగులతో కూడిన శబ్ద చిత్రం.

దీన్ని నాలుగు భాగాలుగా ప్రదర్శించడానికి రూపొందించారు. ఈ “ఫోటో-డ్రామా” వీక్షకుల్ని సృష్టి మొదలుకొని మానవజాతి చరిత్రమార్గాన నడిపించుకెళ్తుంది, భూమిపట్లా మానవజాతిపట్లా యెహోవా దేవునికున్న సంకల్పాలు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన చివర్లో చరమాంకానికి చేరుకోవడాన్ని వారికి చూపిస్తుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అటుతరువాత కొన్ని సంవత్సరాలకు గానీ వాణిజ్యపరంగా లాభసాటిగా మారలేదు. అయినా అప్పటికే కోట్లాదిమంది “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను ఉచితంగా చూశారు!

“ఫోటో-డ్రామా” కోసం పూర్తిగా నాణ్యతతో కూడిన సంగీత రికార్డింగులు అలాగే 96 ప్రసంగాల ఫోనోగ్రాఫు రికార్డులు తయారుచేయబడ్డాయి. ప్రపంచ చరిత్రను చూపిస్తున్న కళాత్మకమైన చిత్రాలు స్టీరియోప్టికాన్‌ స్లైడులపైకి ఎక్కించబడ్డాయి. అలాగే వందలాది క్రొత్త పెయింటింగులు రేఖాచిత్రాలు వేయాల్సివచ్చింది. కొన్ని రంగుల స్లైడుల్ని ఫిల్ముల్ని ఎంతో శ్రమతీసుకుని చేత్తో వేయడం జరిగింది. ఇలా మళ్ళీ మళ్ళీ వేయాల్సివచ్చింది, అలా కొంతకాలానికి నాలుగు భాగాల 20 సెట్లు తయారుచేయబడ్డాయి. దీనివల్ల “ఫోటో-డ్రామా”లోని ఒక భాగాన్ని ఒకే రోజున 80 నగరాల్లో ప్రదర్శించడం సాధ్యమైంది.

తెరవెనుక దృశ్యాలు

“ఫోటో-డ్రామా”ను ప్రదర్శిస్తుండగా తెరవెనుక జరిగిన సంఘటనల సంగతేమిటి? “డ్రామా ప్రారంభంలో సహోదరుడు రస్సెల్‌ తెరమీద ప్రత్యక్షమౌతారు. ఆయన తెరమీదికి రాగానే ఆయన పెదవులు కదులుతాయి, అదే సమయంలో ఫోనోగ్రాఫ్‌ను ఆన్‌ చేస్తారు . . . మేమిక ఆయన స్వరాన్ని వింటూ ఆనందించేవాళ్ళం” అని బైబిలు విద్యార్థి అయిన ఆలిస్‌ హాఫ్‌మన్‌ చెబుతుంది.

టైమ్‌-లాప్స్‌ ఫోటోగ్రఫీని గురించి జోలా హాఫ్‌మన్‌ గుర్తుచేసుకుంటూ ఇలా చెబుతుంది: “నేనక్కడ అందరితోపాటు కూర్చుని ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని సృష్టి దినాల చిత్రీకరణల్ని చూశాను. మా కట్టెదుట లిల్లీ పువ్వులు నెమ్మదిగా విచ్చుకున్నాయి.”

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన కార్ల్‌ ఎఫ్‌. క్లైన్‌ సంగీత ప్రేమికుడు, ఆయనిలా జోడిస్తున్నాడు: “ఈ చిత్రాలు తెరమీద కన్పిస్తున్నప్పుడే చక్కని సంగీతం వినబడుతూ ఉంటుంది, సంగీత ప్రపంచంలో ఆణిముత్యాల్లాంటి నార్సిస్సస్‌, హ్యూమరస్క్‌ వంటివి అందులో చేర్చబడ్డాయి.”

ఇంకా ఎన్నో చిరస్మరణీయమైన సంఘటనలు జరిగాయి కూడా. “కొన్నిసార్లు భలే నవ్వు తెప్పించే ప్రమాదాలు జరిగిపోయేవి. ఒక సందర్భంలో రికార్డింగులోనుండి ‘పక్షిలా పర్వతంపైకి ఎగిరిపో’ అని వినిపిస్తుండగా, తెరమీద మాత్రం జలప్రళయానికి పూర్వపు జంతువైన ఒక భారీ డైనాసార్‌ చిత్రం కనిపించింది!” అని క్లేటన్‌ జె. ఉడ్‌వర్త్‌ జూనియర్‌ అంటున్నాడు.

“ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”కు తోడు త్వరలోనే “యురేకా డ్రామా” సెట్లు కూడా సిద్ధమయ్యాయి. (బాక్సు చూడండి.) ఒక సెట్‌లో రికార్డు చేయబడిన ప్రసంగాలు, అలాగే సంగీత రికార్డింగులు, మరో సెట్‌లో రికార్డింగులు స్లైడులు రెండూ ఉండేవి. “యురేకా డ్రామా”లో చలనచిత్రాలు లేకపోయినా తక్కువ జనాభాగల ప్రాంతాల్లో ప్రదర్శించబడినప్పుడు చాలా విజయవంతం అయ్యింది.

సాక్ష్యమివ్వడానికి ఒక శక్తివంతమైన ఉపకరణం

1914 చివరికల్లా “ఫోటో-డ్రామా”ని ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియాల్లో 90,00,000 మంది ప్రజలు చూశారు. బైబిలు విద్యార్థులు సంఖ్యలో తక్కువగా ఉన్నా ఈ మాధ్యమం ద్వారా సువార్తను ప్రకటించడం సంబంధంగా వారిలో సంపూర్ణాత్మ నిశ్చయత మాత్రం కొదువగా లేదు. ఈ ప్రదర్శనల కోసం అనుకూలమైన స్థలాల్ని అద్దెకు తీసుకోవడానికి వారు అత్యానందంగా విరాళాలిచ్చారు. వీక్షకులకు దేవుని వాక్యాన్ని గూర్చీ ఆయన సంకల్పాలను గూర్చీ తెలియజేయడానికి “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” నిర్వహించిన గొప్ప పాత్ర ఇదీ.

సి.టి. రస్సెల్‌కు ఒక వ్యక్తి ఇలా ఉత్తరం వ్రాశాడు: “నా జీవితంలో మీ డ్రామాని తొలిసారి చూడ్డం ఒక మలుపురాయి; వేరేలా చెప్పాలంటే నా బైబిలు జ్ఞానం సంబంధంగా ఒక మలుపురాయి.” మరొక స్త్రీ ఇలా అన్నది: “అపనమ్మకం అనే ఊబిలో నేను దాదాపుగా చిక్కుకుపోయాను, క్రితం వేసవిలో ఇక్కడ ప్రదర్శించిన ‘ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌’ నన్ను కాపాడిందని నేను భావిస్తున్నాను. . . . ఇప్పుడు ఈ లోకమంతా కూడా ఇవ్వలేని శాంతిని అనుభవిస్తున్నాను, దానికి బదులుగా ఎంత ధనమిచ్చినా నేను దాన్ని వదులుకోలేను.”

సొసైటీ ముఖ్యకార్యాలయ సిబ్బందిలో ఎంతోకాలంగా సభ్యుడిగా ఉన్న డమీట్రీయస్‌ పాపాజార్జ్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “బైబిలు విద్యార్థుల చిన్న సంఖ్యనూ ఎంతో తక్కువగా ఉన్న ఆర్థిక వనరుల్నీ పరిగణలోనికి తీసుకుంటే ‘ఫోటో-డ్రామా’ నిజంగా ఒక అద్భుతమైన కళాఖండం. దాని వెనుక నిజంగా యెహోవా ఆత్మే ఉంది!”

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

“యురేకా డ్రామా”

“ఫోటో-డ్రామా” తొలి ప్రదర్శనకు ఎనిమిది నెలల తర్వాత దాన్నే కొన్ని మార్పులు చేసి “యురేకా డ్రామా”ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నదని సొసైటీ గుర్తించింది. పూర్తి “ఫోటో-డ్రామా”ని పెద్ద నగరాల్లో ప్రదర్శిస్తునే ఉండగా అదే సందేశంగల “యురేకా” సెట్‌లను గ్రామాల్లోను గ్రామీణ ప్రాంతాల్లోను ప్రదర్శించడం జరిగింది. “యురేకా డ్రామా”ను ప్రకటించడానికి “సహోదరీలకు ఒక గొప్ప అవకాశాన్ని” అందించినదిగా వర్ణించడం జరిగింది. ఎందుకని? ఎందుకంటే ఫోనోగ్రాఫుల రికార్డింగులు ఉన్న పెట్టె కేవలం 14 కిలోగ్రాములు మాత్రమే ఉండేది. నిజమే, ప్రదర్శనకొచ్చే సరికి ఒక ఫోనోగ్రాఫును కూడా పట్టుకెళ్ళాల్సివచ్చేది.