కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేనె మానవునికి తేనెటీగ ఇచ్చిన బహుమానం

తేనె మానవునికి తేనెటీగ ఇచ్చిన బహుమానం

తేనె మానవునికి తేనెటీగ ఇచ్చిన బహుమానం

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

అలసిపోయిన ఒక ఇశ్రాయేలు సైనికుడు అడవిలో తేనెపట్టు నుండి తేనె బొట్లుబొట్లుగా కారుతూ కనిపించినప్పుడు తన చేతికర్రను తేనెపట్టులో గుచ్చి కొంచెం తేనె తిన్నాడు. వెంటనే ‘అతని కన్నులు ప్రకాశించాయి,’ అతని శక్తి పునరుద్ధరించబడింది. (1 సమూయేలు 14:​25-30) ఆ బైబిలు వృత్తాంతం, తేనె మానవునికి ప్రయోజనం చేకూర్చే గుణాల్లో ఒక దానిని ఉదాహరిస్తోంది. అది వెంటనే పునరుత్తేజాన్నిస్తుంది, దానిలో ప్రధానంగా అంటే దాదాపు 82 శాతం పిండిపదార్థం ఉంటుంది. ఆసక్తికరంగా, ఒక తేనెటీగ సూత్రప్రాయంగా, కేవలం 30 గ్రాముల తేనె నుండి దొరికే శక్తితో ప్రపంచాన్ని చుట్టిరాగలదు!

తేనెటీగలు కేవలం మానవుల ప్రయోజనం కోసమే తేనెను తయారు చేస్తాయా? లేదు, అవి ఆహారం కోసం తేనె మీద ఆధారపడతాయి. సాధారణ పరిమాణంలో ఉండే తేనెపట్టులోని తేనెటీగలు శీతాకాలంలో బ్రతకాలంటే వాటికి 10 నుండి 15 కిలోల తేనె అవసరమవుతుంది. అయితే అనుకూల వాతావరణంలో ఒక తేనెపట్టు దాదాపు 25 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలదు, కాబట్టి మానవులు ఆ మిగులును పోగుచేసుకుని ఆనందించడానికి వీలవుతుంది, అంతేకాక ఎలుగుబంట్లు, రాకూన్లూ వంటి జంతువులు కూడా తేనె తింటాయి.

తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి? మకరందం దొరికే స్థలం కోసం వెదికే తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరిస్తాయి, అవి ట్యూబుల్లాగా ఉండే తమ నాలుకలతో మకరందాన్ని పీలుస్తాయి. అవి తమ రెండు కడుపుల్లో ఒకదానిలో ఆ మకరందాన్ని దాచి తేనెపట్టులోకి చేరుస్తాయి. ఆ మకరందం వేరే తేనెటీగలకు బదిలీ చేయబడుతుంది, ఆ తేనెటీగలు దానిని దాదాపు అరగంట సేపు “నములుతూ” తమ నోటిలో ఉన్న గ్రంథులలోని ఎంజైములతో కలుపుతాయి. ఆ తర్వాత అవి దానిని షడ్భుజాకారంలో ఉండే, తేనెమైనంతో చేయబడిన అరల్లోకి చేర్చి, దాంట్లో ఉన్న నీటిని తీసివేయడానికి తమ రెక్కలతో గాలి విసురుతాయి. * నీటి శాతం 18 శాతం కన్నా తక్కువ అయినప్పుడు తేనెటీగలు ఆ అరలను సన్నటి మైనపు పొరతో మూసివేస్తాయి. పొరతో కప్పబడిన తేనె దాదాపు ఎప్పటికీ పాడవకుండా ఉండగలదు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం నాటి ఫరోల సమాధుల్లో తినడానికి తగినంత మంచిగావున్న తేనె దొరికిందని చెప్పబడుతోంది.

తేనెకున్న ఔషధ గుణాలు

తేనె బి విటమిన్లు, వివిధ ఖనిజాలు, ఆన్టియాక్సిడెంట్ల స్వచ్ఛమైన నిధిగల అద్భుతమైన ఆహారమే కాక అది ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన అతి ప్రాచీన ఔషధాల్లో ఒకటి. * అమెరికాలోని ఇలినోయిస్‌ విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్రజ్ఞురాలిగా పనిచేస్తున్న డాక్టర్‌ మే బెరన్‌బామ్‌ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “గాయాలు, కాలినగాయాలు, కంటి శుక్లాలు, చర్మం మీద పుండ్లు, దెబ్బలవల్ల కలిగే వాపులు వంటి వివిధ వైద్య సమస్యలకు చికిత్స చేయడానికి తేనె ఎన్నో శతాబ్దాలు ఉపయోగించబడింది.”

తేనెకున్న ఔషధ విలువలపట్ల ఇటీవల పెరుగుతున్న ఆసక్తి గురించి వ్యాఖ్యానిస్తూ సిఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ఇలా నివేదించింది: “రెండవ ప్రపంచ యుద్ధసమయంలో యాంటిబయాటిక్‌ పట్టీలు అభివృద్ధి చెందినప్పుడు తేనెతో తయారు చేసే గాయాల పట్టీల ఉపయోగం తగ్గిపోయింది. అయితే క్రొత్త పరిశోధనల కారణంగా, యాంటిబయాటిక్స్‌ను తట్టుకొనే సూక్ష్మక్రిములు పెరుగుతున్న కారణంగా రోగాలకు లేక గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రాచీన సంప్రదాయ ఔషధం ఇప్పుడు మళ్ళీ ఉపయోగించబడుతోంది.” ఉదాహరణకు, కాలినగాయాల చికిత్సకు సంబంధించిన ఒక పరిశోధన జరిగింది. తేనెతో తయారు చేసిన పట్టీలు గాయాలకు ఉపయోగించినప్పుడు రోగులు త్వరగా కోలుకుంటున్నారని, నొప్పి తక్కువగా ఉంటుందని, మచ్చలు తక్కువగా ఏర్పడుతున్నాయని గమనించబడింది.

తేనెటీగలు మకరందానికి ఒక ఎంజైమ్‌ను చేరుస్తాయి కాబట్టి, తేనెకు సూక్ష్మక్రిములను నశింపజేసే గుణం, యాంటిబయాటిక్‌ గుణం ఉందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అపాయకరమైన సూక్ష్మక్రిములను చంపే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను ఆ ఎంజైమ్‌ తయారు చేస్తుంది. * అంతేకాక చికిత్స చేయబడుతున్న శరీర భాగం మీద తేనెను నేరుగా పూస్తే అది వాపును తగ్గిస్తుందని, ఆరోగ్యకరమైన కణజాలాలు పెరగడానికి దోహదపడుతుందని రుజవయింది. అందుకే, న్యూజీలాండ్‌కు చెందిన జీవరసాయనశాస్త్రజ్ఞుడు పీటర్‌ మోలన్‌ ఇలా చెబుతున్నాడు: “సంప్రదాయ వైద్యవృత్తిలో ఉన్నవారు, తేనెను మంచి పేరున్న పదార్థంగా, సమర్థంగా వ్యాధిని నయం చేసే పదార్థంగా ఆమోదిస్తున్నారు.” వాస్తవానికి, ది ఆస్ట్రేలియన్‌ థెరప్యూటిక్‌ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌, తేనెను ఒక మందుగా ఆమోదించింది, ఆ దేశంలో వైద్య సంబంధమైన తేనెను గాయాలకు పట్టీగా అమ్ముతున్నారు.

ఎంతో పుష్టికరంగా, రుచిగా ఉండడంతోపాటు ఔషధంగా కూడా ఉపయోగపడే ఇతర ఆహారపదార్థాలు ఎన్ని మీకు తెలుసు? తేనెటీగలను, తేనెటీగలను పెంచేవారిని సంరక్షించేందుకు గతంలో ప్రత్యేక నియమాలు చేయబడ్డాయంటే అందులో ఆశ్చర్యం లేదు. తేనెటీగలు నివసించే చెట్లను గానీ తేనెపట్టులను గానీ నాశనం చేయడం, పెద్ద జరిమానా లేక మరణశిక్ష వంటి శిక్షలు పడే నేరంగా ఉండేది. నిజమే, మానవునికి తేనె ఒక అమూల్యమైన కానుక, అది సృష్టికర్తకు గౌరవాన్నిస్తుంది. (g05 8/8)

[అధస్సూచీలు]

^ తేనెటీగలు తేనెపట్టును నిర్మించడానికి ఉపయోగించే మైనం, తేనెటీగ శరీరంలోని ప్రత్యేక గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతుంది. తేనెపట్టులోని అరల మధ్యవుండే గోడల మందం మిల్లీమీటర్లో మూడోవంతు మాత్రమే ఉంటుంది అయినా ఆ అరలు షడ్భుజాకారంలో ఉంటాయి కాబట్టి, అరల మధ్యవుండే సన్నని గోడలు తమ బరువు కన్నా 30 రెట్లు అధిక బరువును మోయగలవు. నిజంగా, తేనెపట్టు ఇంజనీరింగుకు సంబంధించిన ఒక అద్భుతం.

^ తేనె పసిబిడ్డలకు ఆహారంగా సిఫారసు చేయబడడం లేదు, ఎందుకంటే తేనె పసిపిల్లల్లో బోటులిసమ్‌ అనే జబ్బుకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

^ వేడి చేస్తే, వెలుగులో ఉంచితే ఆ ఎంజైమ్‌ నాశనమవుతుంది కాబట్టి వైద్య సంబంధమైన ఉపయోగాలకు వేడిచేయని తేనె ఉపయోగించబడుతుంది.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

తేనెతో వంటకాలు

తేనె, చక్కెర కన్నా తియ్యగా ఉంటుంది. కాబట్టి చక్కెర బదులు తేనెను ఉపయోగిస్తున్నప్పుడు మీరు సాధారణంగా ఉపయోగించే చక్కెరకు కేవలం సగం లేక మూడు వంతులు తేనెను మాత్రమే ఉపయోగించండి. అంతేకాక తేనెలో దాదాపు 18 శాతం నీళ్ళు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు చేసే వంటకంలో ద్రవాలను తగ్గించండి. మీరు చేసే వంటకంలో ద్రవాలు లేనట్లయితే ఒక కప్పు తేనెకు రెండు టీస్పూన్ల పిండి కలపండి. బేక్‌ చేసే పిండివంటకాలకు కూడా ఒక కప్పు తేనెకు అర టీస్పూను బేకింగ్‌ సోడా కలిపి మీ అవన్‌ ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెల్సియస్‌ తగ్గించండి.

[చిత్రసౌజన్యం]

National Honey Board

[22వ పేజీలోని చిత్రం]

మకరందం దొరికే స్థలం కోసం వెదుకుతున్న తేనెటీగ

[22, 23వ పేజీలోని చిత్రం]

తేనెపట్టు

[23వ పేజీలోని చిత్రం]

తేనెటీగల సముదాయం

[23వ పేజీలోని చిత్రం]

తేనెటీగలను పెంచే ఒక వ్యక్తి తేనెపట్టు నుండి ఒక ఫ్రేమును పరిశీలిస్తున్నాడు