కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

తేనె పట్టు

తేనె పట్టు

తేనెటీగలు (ఏపిస్‌ మెలిఫెరా) వాటి పొట్ట కింద ఉన్న గ్రంథుల నుండి వచ్చే జిగురు లేదా మైనంతో తెనెపట్టుల్ని నిర్మిస్తాయి. తేనెపట్టు ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. ఎలా?

ఆలోచించండి: తక్కువ వస్తువుల్ని ఉపయోగించి ఎక్కువ స్థలం వచ్చేలా గదుల్ని కట్టాలంటే త్రిభుజ (△), చతురస్ర (◻) ఆకారాల కన్నా షడ్భుజ (hexagon) ఆకారం మంచిదని గణిత శాస్త్రవేత్తలు (mathematicians) చాలాకాలంగా అనుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయారు. 1999లో ప్రొఫెసర్‌ థామస్‌ సి. హేల్స్‌ “తేనెపట్టు కల్పన” (honeycomb conjecture) అనే సిద్ధాంతం ద్వారా షడ్భుజ ఆకార ఉపయోగాలను నిరూపించాడు. తక్కువ సామగ్రితో, ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ సమానంగా విభజించడానికి ఒకే విధంగా ఉన్న షడ్భుజాలు ఉత్తమం అని ఆయన చూపించాడు.

గదుల్ని షడ్భుజ ఆకారంలో కడుతూ తేనెటీగలు ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాయి. షడ్భుజం వల్ల తక్కువ మైనంతో, గట్టిగా ఉండే బరువులేని పట్టును కడతాయి. ఉన్న స్థలంలోనే ఎంత ఎక్కువ తేనెను నింపవచ్చో అంత ఎక్కువ తేనెను నింపుతాయి. అందుకే తేనె పట్టును “అద్భుతమైన భవనం” అని వర్ణిస్తారు.

నేడు శాస్త్రవేత్తలు తేనెపట్టును అనుకరిస్తూ, ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ దృఢంగా ఉండే నిర్మాణాలను కడుతున్నారు. విమానాల్ని నిర్మించే ఇంజనీర్లు తేనెపట్టుల్ని అనుకరిస్తూ తక్కువ బరువుతో బలంగా ఉండే విమానాల్ని తయారుచేస్తున్నారు. ఇలా ఇంధనం కూడా ఆదా అవుతుంది.

మీరేమంటారు? ఇంత చక్కని భవనాలు అంటే తేనెపట్టులను నిర్మించే జ్ఞానం తేనెటీగలకు పరిణామం వల్ల వచ్చిందా? లేదా దాని వెనక ఎవరైనా ఉన్నారా?