సమూయేలు మొదటి గ్రంథం 14:1-52

  • మిక్మషులో యోనాతాను సాహస కార్యం (1-14)

  • ఇశ్రాయేలీయుల శత్రువుల్ని దేవుడు నాశనం చేయడం (15-23)

  • సౌలు తొందరపాటు ఒట్టు (24-46)

    • ప్రజలు రక్తంతో మాంసాన్ని తినడం (32-34)

  • సౌలు యుద్ధాలు; అతని కుటుంబం (47-52)

14  ఒకరోజు సౌలు కుమారుడైన ​యోనాతాను+ తన ఆయుధాలు మోస్తున్న సేవకునితో, “పద, మనం అవతలి వైపున్న ఫిలిష్తీయుల దండు దగ్గరికి వెళ్దాం” అన్నాడు. అయితే యోనాతాను ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పలేదు.  అప్పుడు సౌలు గిబియా+ పొలిమేరల్లోని మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద ఉన్నాడు. అతని వెంట దాదాపు 600 మంది ఉన్నారు.+  (అప్పుడు అహీటూబు+ కుమారుడైన అహీయా ఏఫోదును వేసుకొని ఉన్నాడు.+ అహీటూబు ఈకాబోదుకు+ సహోదరుడు, ​ఈకాబోదు ఫీనెహాసు+ కుమారుడు. ఈ ఫీనెహాసు, షిలోహులో+ యెహోవా యాజకు​నిగా ఉన్న ఏలీ+ కుమారుడు.) యోనాతాను వెళ్లినట్టు సైనికులకు తెలీదు.  ఫిలిష్తీయుల దండు ఉన్న స్థలాన్ని చేరుకునేందుకు ​యోనాతాను ​దాటడానికి ప్రయత్నిస్తున్న కనుమలకు ఇరువైపులా పంటి ఆకారంలో రెండు బండలు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, ఇంకొక దాని పేరు సెనే.  ఒక బండ ఉత్తరం వైపున మిక్మషుకు ఎదు​రుగా స్తంభంలా నిలిచివుంది. ఇంకొ​కటి దక్షిణం వైపున గెబాకు+ ఎదురుగా ఉంది.  అప్పుడు యోనాతాను తన ​ఆయుధాలు మోసే వ్యక్తితో ఇలా చెప్పాడు: “పద, మనం అవతలి వైపున్న ఆ సున్నతిలేని మనుషుల+ దండు దగ్గరికి వెళ్దాం. బహుశా యెహోవా మన పక్షాన చర్య తీసుకుంటాడేమో. ఎక్కువమం​దితోనైనా, తక్కువమందితోనైనా రక్షణ ఇచ్చే ​విషయంలో యెహోవాను ఏదీ ఆపలేదు.”+  ఆయుధాలు మోసే వ్యక్తి యోనాతానుతో, “నీ మనసుకు ఎలా అనిపిస్తే అలా చేయి. నీకు ఇష్టమైన చోటికి వెళ్లు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు వస్తాను” అన్నాడు.  అప్పుడు యోనాతాను ఇలా అన్నాడు: “మనం అవతలి వైపు ఆ మనుషుల దగ్గరికి వెళ్లి మనల్ని మనం వాళ్లకు కనబర్చుకుందాం.  ఒకవేళ వాళ్లు మనతో, ‘మేము మీ దగ్గరికి వచ్చే వరకు కదలకుండా నిలబడండి!’ అంటే, మనం వాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఉన్నచోటే నిలబడదాం. 10  అలా కాక వాళ్లు, ‘మా మీదికి రండి!’ అంటే, మనం వాళ్ల మీదికి వెళ్దాం; ఎందుకంటే యెహోవా వాళ్లను మన చేతికి అప్పగిస్తాడు. ఇదే మనకు సూచన.”+ 11  తర్వాత ఆ ఇద్దరూ ఫిలిష్తీయుల దండుకు తమను తాము కనబర్చుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు, “చూడండి! హెబ్రీయులు తాము దాక్కున్న కన్నాల్లో నుండి బయటికి వస్తున్నారు” అన్నారు.+ 12  ఫిలిష్తీయుల దండులోని వాళ్లు యోనాతానుతో, అతని ఆయుధాలు మోసే వ్యక్తితో, “మా దగ్గరికి రండి. మీకు గుణపాఠం నేర్పిస్తాం!”+ అన్నారు. వెంటనే ​యోనాతాను తన ఆయుధాలు మోసే వ్యక్తితో, “నా వెనక రా, యెహోవా వాళ్లను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తాడు”+ అన్నాడు. 13  ​యోనాతాను తన చేతులతో, కాళ్లతో పైకి ఎక్కాడు, ఆయుధాలు మోసే వ్యక్తి అతని వెనక ఉన్నాడు; యోనాతాను ఫిలిష్తీయుల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆయుధాలు మోసే వ్యక్తి అతని వెనక వాళ్లను చంపుతూ ఉన్నాడు. 14  ​యోనాతాను, అతని ఆయుధాలు మోసే వ్యక్తి చేసిన మొదటి దాడిలో, వాళ్లు ఎకరం పొలంలోని నాగటి చాలులో ఇంచుమించు సగం దూరంలోపు* దాదాపు 20 మందిని చంపారు. 15  అప్పుడు బయట ​శిబిరంలో ​ఉన్నవాళ్లూ, ఫిలిష్తీయుల దండులో ఉన్నవాళ్లందరూ భయంతో వణికిపోయారు, దాడిచేసే దళాలు+ కూడా ​వణికిపోయాయి. భూమి కంపించడం మొదలు​పెట్టింది; ఇవన్నీ దేవుని నుండి కలిగాయి. 16  గందరగోళం అన్నివైపులా వ్యాపిస్తుండడాన్ని+ బెన్యా​మీనీయుల గిబియాలోని+ సౌలు కావలివాళ్లు గమనించారు. 17  అప్పుడు సౌలు తనతో ఉన్న సైనికులతో, “దయచేసి లెక్కపెట్టి, ఎవరు మనల్ని వదిలేసి వెళ్లారో చూడండి” అన్నాడు. వాళ్లు లెక్కపెట్టినప్పుడు, యోనాతాను, అతని ఆయుధాలు మోసే వ్యక్తి అక్కడ లేరని తెలిసింది. 18  అప్పుడు సౌలు అహీయాకు,+ “సత్యదేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురా!” అని చెప్పాడు. (ఆ సమయంలో సత్యదేవుని మందసం ఇశ్రాయేలీయులతోపాటు ఉంది.) 19  సౌలు యాజకునితో మాట్లాడుతుండగా, ఫిలిష్తీయుల శిబిరంలో గందరగోళం అంతకంతకూ పెరుగుతూ ఉంది. అప్పుడు సౌలు యాజకునితో, “నువ్వు చేస్తున్నది ఆపేయి”* అన్నాడు. 20  దాంతో సౌలు, అతనితో ఉన్న సైనికులు సమకూడి యుద్ధానికి వెళ్లారు. అక్కడ ఫిలిష్తీయులు ఒకరి మీద ఒకరు కత్తి దూసుకోవడం వాళ్లు గమనించారు. పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. 21  అంతేకాదు, గతంలో ఫిలిష్తీయుల పక్షం వహించి, వాళ్లతో కలిసి శిబిరంలోకి వచ్చినవాళ్లు సౌలుతో, యోనాతానుతో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరికి రావడం మొదలుపెట్టారు. 22  ఫిలిష్తీయులు పారిపోయారని ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో దాక్కున్న ఇశ్రాయేలీయులందరూ+ విన్నప్పుడు వాళ్లు కూడా యుద్ధంలో ఫిలిష్తీయుల్ని తరి​మారు. 23  అలా ఆ రోజు యెహోవా ఇశ్రా​యేలీయుల్ని రక్షించాడు.+ యుద్ధం బేతావెను+ వరకు జరిగింది. 24  అయితే ఆ రోజు ఇశ్రాయేలీయులు బాగా అలసిపోయారు. ఎందుకంటే సౌలు సైనికులతో ఇలా ఒట్టు వేయించాడు: “నేను నా శత్రువుల మీద పగ తీర్చుకునేంతవరకు సాయంత్రం లోపు ఎవరైనా ఏమైనా తింటే వాళ్లు శపించబడతారు!” దాంతో ప్రజలెవ్వరూ ఏమీ తినలేదు.+ 25  అప్పుడు సైనికులందరూ* అడవిలోకి వచ్చారు. నేలమీద తేనె ఉంది. 26  సైనికులు అడవిలోకి వచ్చినప్పుడు తేనె ​కారుతుండడం గమనించారు. కానీ ఒట్టుకు భయపడి వాళ్లలో ఎవ్వరూ దాన్ని తినలేదు. 27  అయితే తన తండ్రి ప్రజలతో ఒట్టు వేయించడం యోనాతాను వినలేదు+ కాబట్టి అతను తన ​చేతిలోని కర్ర కొనను చాచి తేనెపట్టులో ముంచాడు. దాన్ని తిన్నప్పుడు అతని కళ్లు మెరిశాయి. 28  అప్పుడు వాళ్లలో ఒక సైనికుడు ఇలా అన్నాడు: “ ‘ఈ రోజు ఎవరైనా ఏమైనా తింటే అతను శపించబడతాడు!’+ అని చెప్పి నీ తండ్రి ప్రజలతో గట్టిగా ఒట్టు వేయించాడు. అందుకే ​సైనికులు చాలా అలసిపోయారు.” 29  అయితే యోనాతాను ఇలా అన్నాడు: “ప్రజల్ని నా తండ్రి కష్టపెట్టాడు. నేను ఈ కొంచెం తేనె తింటేనే నా కళ్లు ఎలా మెరిశాయో చూడండి. 30  శత్రువుల దగ్గర కొల్లగొట్టిన వాటిలో నుండి సైనికులు ఈ రోజు స్వేచ్ఛగా తినివుంటే+ ఇంకెంత బాగుండేది! అప్పుడు ఇంకా ఎక్కువమంది ఫిలిష్తీయులు చంపబడేవాళ్లు.” 31  ఆ రోజున వాళ్లు ఫిలిష్తీయుల్ని మిక్మషు నుండి అయ్యాలోను+ వరకు చంపుకుంటూ వెళ్లారు. దాంతో వాళ్లు బాగా అలసి​పోయారు. 32  అప్పుడు ప్రజలు కొల్లగొట్టిన​వాటి మీదికి ఆత్రంగా ఎగబడ్డారు. వాళ్లు గొర్రెల్ని, పశువుల్ని, దూడల్ని తీసుకొని నేలమీద వధించారు. వాళ్లు మాంసాన్ని రక్తంతోపాటు తిన్నారు.+ 33  కాబట్టి, “ఇదిగో! ప్రజలు మాంసాన్ని రక్తం​తోపాటు తింటూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు”+ అనే వార్త సౌలుకు అందింది. అప్పుడు అతను, “మీరు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. వెంటనే ఒక పెద్ద రాయి నా దగ్గరికి దొర్లించండి” అన్నాడు. 34  తర్వాత సౌలు ఇలా అన్నాడు: “మీరు ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్లతో, ‘మీలో ప్రతీ ఒక్కరు తన ఎద్దును, తన గొర్రెను తీసుకొచ్చి వాటిని ఇక్కడ వధించి, ఆ తర్వాత తినాలి. మాంసాన్ని రక్తంతోపాటు తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయకండి’ అని చెప్పండి.”+ దాంతో ఆ రాత్రి వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ఎద్దుల్ని తీసుకొచ్చి అక్కడ వధించారు. 35  సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.+ అతను యెహోవా కోసం కట్టిన మొదటి బలిపీఠం అది. 36  తర్వాత సౌలు, “రండి, మనం రాత్రిపూట ఫిలిష్తీయుల్ని తరిమి, తెల్లారేవరకు వాళ్లను ​దోచుకుందాం. మనం ఒక్కర్ని కూడా ప్రాణాలతో మిగలనివ్వద్దు” అన్నాడు. దానికి వాళ్లు, “నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు. అప్పుడు యాజకుడు, “ఇక్కడ సత్యదేవుణ్ణి అడుగుదాం”+ అన్నాడు. 37  కాబట్టి సౌలు, “నేను ఫిలిష్తీయుల్ని తరమాలా?+ నువ్వు వాళ్లను ఇశ్రాయేలు చేతికి అప్పగిస్తావా?” అని దేవుని దగ్గర విచారణ చేశాడు. అయితే దేవుడు ఆ రోజు అతనికి జవాబు ఇవ్వలేదు. 38  దాంతో సౌలు ఇలా అన్నాడు: “ప్రజల ప్రధానులారా, మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజు ఏ పాపం జరిగిందో కనుక్కోండి. 39  ఇశ్రాయేలును రక్షించిన యెహోవా జీవం తోడు, ఆ పని చేసింది నా కుమారుడు యోనాతానైనా సరే అతను చావాలి.” కానీ ప్రజలెవ్వరూ అతనికి జవాబు ఇవ్వలేదు. 40  అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరితో, “మీరు ఒకవైపు ఉండండి, నేనూ నా కుమారుడైన యోనాతానూ మరోవైపు ఉంటాం” అన్నాడు. దానికి ప్రజలు, “నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయి” అని అతనితో అన్నారు. 41  అప్పుడు సౌలు యెహోవాతో, “ఇశ్రాయేలు దేవా, తుమ్మీము+ ద్వారా జవాబు ఇవ్వు” అన్నాడు. అప్పుడు యోనాతాను, సౌలు ఎంపిక చేయబడ్డారు, ప్రజలు విడుదల పొందారు. 42  తర్వాత సౌలు, “నేనో, నా కుమారుడు యోనాతానో తెలుసుకోవడానికి చీట్లు* వేయండి” అన్నాడు. అప్పుడు యోనాతాను ఎంపికచేయబడ్డాడు. 43  అప్పుడు సౌలు, “నువ్వు ఏం చేశావో చెప్పు” అని యోనాతానును అడిగాడు. అందుకు అతను సౌలుతో, “నా చేతిలోని కర్ర కొనకు ఉన్న కొంచెం తేనెను రుచి చూశా​నంతే. నేను చనిపోవడానికి సిద్ధమే!” అన్నాడు. 44  అందుకు సౌలు, “యోనాతానూ, నువ్వు చావకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి” అన్నాడు. 45  కానీ ప్రజలు సౌలుతో ఇలా అన్నారు: “ఇశ్రాయేలుకు ఈ గొప్ప విజయాన్ని* తీసుకొచ్చిన యోనాతాను+ చనిపోవాలా? అలా ఎన్నటికీ జరగకూడదు! యెహోవా జీవం తోడు, అతని తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలమీద పడకూడదు, ఎందుకంటే అతను ఈ రోజు చేసిన పనిలో దేవుడు అతనికి సహాయం చేశాడు.”+ అలా ప్రజలు యోనాతానును రక్షించారు,* అతను చనిపోలేదు. 46  సౌలు ఫిలిష్తీయుల్ని తరమడం ఆపేశాడు, ఫిలిష్తీయులు తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. 47  సౌలు ఇశ్రాయేలు మీద తన రాజరికాన్ని స్థిరపర్చుకున్నాడు; అతను అన్నివైపులా తన శత్రువులందరితో, అంటే మోయాబీయులతో,+ అమ్మోనీయులతో,+ ఎదోమీయులతో,+ సోబా రాజులతో,+ ఫిలిష్తీయులతో+ యుద్ధం చేశాడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్లను ఓడించాడు. 48  అతను ధైర్యంగా పోరాడి అమాలేకీయుల మీద విజయం సాధించాడు;+ తమను దోచుకునేవాళ్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాడు. 49  సౌలు కుమారులు ఎవరంటే ​యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ.+ అతనికి ఇద్దరు కూతుళ్లు; పెద్ద కూతురి పేరు మేరబు,+ చిన్న కూతురి పేరు మీకాలు.+ 50  సౌలు భార్య పేరు అహీనోయము, ఆమె అహిమయస్సు కూతురు. సౌలు సైన్యాధిపతి పేరు అబ్నేరు,+ అతను నేరు కుమారుడు. అబ్నేరు సౌలు తండ్రికి సహోదరుడు. 51  సౌలు తండ్రి కీషు;+ అబ్నేరు తండ్రైన నేరు+ అబీయేలుకు కుమారుడు. 52  సౌలు బ్రతికిన కాలమంతా ఫిలిష్తీయులతో భీకరంగా యుద్ధం చేశాడు.+ అతను బలం గానీ, ధైర్యం గానీ ఉన్న ఏ వ్యక్తిని చూసినా సైన్యంలో చేర్చుకునేవాడు.+

అధస్సూచీలు

అంటే, రెండు ఎద్దులు ఒక రోజులో దున్నేంత భూమిలో సగం.
అక్ష., “నీ చేతిని వెనక్కి తీసుకో.”
అక్ష., “దేశమంతా.”
పదకోశం చూడండి.
లేదా “రక్షణను.”
అక్ష., “విడిపించారు.”