కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మెక్సికోలో మనస్సాక్షికి మరింత స్వాతంత్ర్యం అనుమతించబడుతుందా?

మెక్సికోలో మనస్సాక్షికి మరింత స్వాతంత్ర్యం అనుమతించబడుతుందా?

మెక్సికోలో మనస్సాక్షికి మరింత స్వాతంత్ర్యం అనుమతించబడుతుందా?

మెక్సికోలోని తేజరిల్లు! విలేఖరి

మెక్సికోలోని చట్టం మతస్వాతంత్ర్యానికి హామీ ఇచ్చింది. అయినప్పటికీ, చట్టం ప్రకారం, ఇప్పటికీ మతస్వాతంత్ర్యంపై కొన్ని నియంత్రణలు ఉన్నాయి. ఉదాహరణకు, మనస్సాక్షిని బట్టి సైనిక సేవలో చేరడానికి నిరాకరించవచ్చన్న తలంపు ఈ దేశంలో ఎవరికీ అంతగా తెలియదు. అందుకే, యూనివర్సిటీ ఆఫ్‌ మెక్సికో (యుఎన్‌ఎఎమ్‌)కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీగల్‌ ఇన్వెస్టిగేషన్స్‌, “మెక్సికోలో, అలాగే ప్రపంచమంతటా మనస్సాక్షిని బట్టి అభ్యంతరం చెప్పడం” అనే అంతర్జాతీయ గోష్ఠిని నిర్వహించాలని నిర్ణయించింది. యుఎన్‌ఎఎమ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీగల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ప్రభుత్వానికి జవాబుదారీయే. కానీ దాని ఉద్దేశం, సుస్థాపిత చట్టాలను వాటి అన్వయింపునూ పరిశీలించాలన్నదే. “యెహోవాసాక్షులూ, మనస్సాక్షిని బట్టి అభ్యంతరం చెప్పడమూ” అనే అంశంపై ఒక ప్రసంగం ఇచ్చేందుకు, మీ ప్రతినిధిని పంపండి అని అంటూ మెక్సికోలోని యెహోవాసాక్షులకు ఆహ్వానం లభించింది.

ప్రొఫెసర్లు మాట్లాడారు

“అంతర్జాతీయ చట్టంలో మనస్సాక్షిని బట్టి అభ్యంతరం చెప్పడం” అనే అంశాన్ని డా. ఝావీయేర్‌ మార్టీనెస్‌ టొరొన్‌ సమర్పించారు. ఆయన, స్పెయిన్‌లోని గ్రానాడా యూనివర్సిటీ ఆఫ్‌ లాలో ప్రొఫెసర్‌. మనస్సాక్షి స్వాతంత్ర్యమూ, మనస్సాక్షిని బట్టి కొన్ని చట్టాల అన్వయింపుకు గానీ వాటికి బద్ధులై ఉండడానికి గానీ అభ్యంతరం చెప్పే హక్కూ అంతర్జాతీయంగా గుర్తించబడినవేనని ఆయన నొక్కి చెప్పారు. స్పెయిన్‌లోని యెహోవాసాక్షుల పరిస్థితినీ, గ్రీస్‌లో జరిగిన కోకినాకిస్‌ కేస్‌నూ ఆయన పేర్కొన్నారు. *

యుఎన్‌ఎఎమ్‌ యొక్క ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీగల్‌ ఇన్వెస్టిగేషన్స్‌లో ప్రొఫెసర్‌ అయిన హోషే లూయీస్‌ సోబరానస్‌ ఫెర్నాన్‌డస్‌, “ఈ విషయంలో మెక్సికోవారి అనుభవం” అనే అంశంపై మాట్లాడారు. డా. సోబరానస్‌ ముగింపులో ఇలా అన్నారు: “వాస్తవానికి, మెక్సికన్‌ లా ఆఫ్‌ రెలిజియస్‌ అసోసియేషన్స్‌ అండ్‌ పబ్లిక్‌ వర్షిప్‌, మనస్సాక్షిని బట్టి అభ్యంతరం చెప్పడాన్ని నిషేధిస్తుందన్న విషయాన్ని ఎత్తి చెప్పవలసిందే” అని ఆయన అన్నాడు. మొదటి ఖండికను సూచిస్తూ, “ఎవరూ కూడా మతసంబంధ నమ్మకాల కారణంగా ఈ దేశపు చట్టాలకు విధేయులవ్వడం నుండి మినహాయించబడలేరు. చట్టాలు పేర్కొన్న బాధ్యతలనూ, కర్తవ్యాలను ప్రక్కన పెట్టేందుకు అనుమతి కోసం ఎవరూ తమ మతసంబంధ కారణాలను పేర్కొనలేరు. మెక్సికోలో మనస్సాక్షి కారణంగా అభ్యంతరం చెప్పేందుకు అనుమతించే చట్టాలను తయారుచేయడం అత్యవసరమని మేము నమ్ముతున్నాం” అని ఆయన అన్నాడు.

మెక్సికోలో, ప్రతి సంవత్సరమూ, వందలాది మంది సాక్షుల పిల్లలు పతాక వందనం చేయడానికి బైబిలు ఆధారంగా నిరాకరిస్తున్నందుకు తమ చదువు విషయంలో అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. కొంతమంది సాక్షుల పిల్లలు స్కూల్లో రిజిస్టర్‌ చేయించుకోవడానికి కూడా అనుమతించబడడంలేదు. అయితే, మానవ హక్కుల కమిషన్‌ ద్వారా అప్పీలు చేయడం మూలంగా అనేక మంది పిల్లలు విద్యనార్జించే తమ హక్కును తిరిగి సంపాదించుకున్నారు. కొంతమంది విద్యాధికారులు పిల్లలు స్కూలు నుండి బహిష్కరించబడడాన్ని నివారించే చర్యలు తీసుకున్నారు. కానీ కొంత మంది ఉపాధ్యాయులు ఆ ప్రయత్నాలను అలక్ష్యపెట్టారు. అధికారులు సాక్షుల దృక్పథానికి అనుమతిస్తున్నారు. కానీ, మెక్సికోలోని స్కూళ్ళకు అన్నింటికీ ఒక నిర్దిష్ట స్టాండర్డ్‌ అన్నది లేకుండా పోయింది.

పవిత్ర దినాలుగా ఎంచే రోజుల్లో పని చేయమని బలవంతపెట్టబడడం, తమ మతసంబంధ నమ్మకాలను ఉల్లంఘించే వస్త్రాలను పని స్థలంలో ధరించాలని కోరడం వంటివాటికి ఇతర మతాలవారు మనస్సాక్షిని బట్టి పెట్టే అభ్యంతరాలు కూడా ఆ గోష్ఠిలో చర్చించబడ్డాయి. అంతేకాక, సైనిక సేవకూ నిర్దిష్ట మెడికల్‌ ట్రీట్‌మెంట్స్‌కూ ఉన్న అభ్యంతరాలు కూడా చర్చించబడ్డాయి.

యెహోవాసాక్షులూ, కైసరూ

మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఆఫీస్‌ సిబ్బందిలోని ఒక సభ్యుడు, తమ ప్రాథమిక నమ్మకాలను సంగ్రహంగా చెప్పాడు. “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని” క్రైస్తవులకు చెబుతున్న లూకా 20:25 లో వ్యక్తీకరించబడినటువంటి బైబిలు సూత్రాలను వారు అనుసరిస్తారని ఆయన వివరించాడు. క్రైస్తవులు లోకాధికారులను తప్పనిసరిగా గౌరవించాలి అని చెబుతున్న రోమీయులు 13:1 ని కూడా ఆయన పేర్కొన్నాడు. యెహోవాసాక్షులు సాధారణ ప్రజలు, చట్టాన్ని అనుసరించే పౌరులు, వాళ్ళు పన్ను చెల్లించడానికి శ్రమిస్తారు, క్రమబద్ధమైన జీవితాలను గడుపుతారు, తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకుంటారు, తమ పిల్లలను పాఠశాలలకు పంపుతారు అని ఆయన నొక్కి చెప్పారు.

పతాక వందనం చేయడానికి యెహోవాసాక్షులు అభ్యంతరం చెప్పడానికి గల లేఖనాధారాన్ని ఆయన నొక్కి చెప్పాడు. అది నిర్గమకాండము 20:3-5 లో పేర్కొనబడిన పది ఆజ్ఞల్లో కనబడుతుంది. “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు” అని అక్కడ కనిపిస్తుంది.

యెహోవాసాక్షులు దేవుడ్ని మాత్రమే ఆరాధిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను ప్రతిమలను ఆరాధించరు. అయితే, జాతీయ ప్రతీకను అవమానపరిచే పనులను గానీ, దాని గురించి అగౌరవంగా మాట్లాడడం గానీ వాళ్ళు చేయరు.

ఈ వివాదాంశంపై యెహోవాసాక్షులకున్న దృక్కోణాన్ని నొక్కి చెప్పేందుకు, పర్పుల్‌ ట్రయాంగిల్స్‌ అనే వీడియోను చూపించారు. నాజీ జర్మనీలో (1933-45) యెహోవాసాక్షులు కనపరచిన దృఢ నిశ్చయాన్ని ఈ వీడియో చూపిస్తుంది. అది కుసరో కుటుంబ కథను చూపించింది. నాజీ పరిపాలనా కాలంలో కుసరో కుటుంబం తమ నమ్మకాల్లో దృఢంగా నిలబడింది. *

తర్వాత, యెహోవాసాక్షులు రక్త మార్పిడిని నిరాకరించడానికి గల లేఖన ఆధారమేమిటో కూడా చెప్పారు. (ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 15:28, 29) ప్రపంచవ్యాప్తంగా చేయబడుతున్న ఆసుపత్రి అనుసంధాన కమిటీల ఏర్పాటును గురించి వివరించారు. అంతేకాక, సహకార మనోభావంగల డాక్టర్లు యెహోవాసాక్షులకు రక్తరహిత శస్త్రచికిత్స చేయడంలో సాధించిన ఘన విజయాలను గురించి చెప్పారు.

ఈ గోష్ఠికి ప్రతిరోజు దాదాపు 100 మంది హాజరయ్యారు. వారిలో చాలా మంది లాయర్లు. హాజరైనవారిలో మెక్సికోలోని రెలిజియస్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ ప్రతినిధులు కూడా ఉన్నారు. మనస్సాక్షిని బట్టి చెప్పే అభ్యంతరాలకు గౌరవం ఇచ్చే విషయంపై నిపుణుల దృక్కోణాన్ని గురించి హాజరైనవారందరూ వినగల్గారు. ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌, అమెరికా వంటి అనేక ప్రజాస్వామ్య దేశాల్లోను, జెక్‌, స్లోవేకియా వంటి కొన్ని మాజీ కమ్యూనిస్ట్‌ దేశాల్లోను ఇది విస్తృతంగా అంగీకరించబడినప్పటికీ, మెక్సికోలోని లెజిస్లేటర్‌లకు ఈ భావన చాలా క్రొత్తే.

[అధస్సూచీలు]

^ కావలికోట సెప్టెంబరు 1, 1993లోని “గ్రీసులో ప్రకటించు హక్కును యూరప్‌ హైకోర్టు సమర్థించింది” అనే శీర్షికనూ, డిసెంబరు 1, 1998లోని “చట్టబద్ధంగా సువార్తను కాపాడటం” అనే శీర్షికనూ చూడండి.

^ఖైదులో ఉన్నా మృత్యువును ఎదుర్కున్నా మా కుటుంబానికి దేవుని మీద ఉన్న ప్రేమ” అనే శీర్షికను సెప్టెంబరు 1, 1985 కావలికోట (ఆంగ్లం) చూడండి. అలాగే, జనవరి 15, 1994వ సంచిక 5వ పేజీ చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

మెక్సికోలోని యెహోవాసాక్షులు తమ ప్రకటనా స్వాతంత్ర్యాన్ని విలువైనదిగా ఎంచుతారు