కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలా సంతోషంగా ఉంటాం

దీవెనలు పొందాలంటే దేవుని మాట వినాలి

దీవెనలు పొందాలంటే దేవుని మాట వినాలి

మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడని మోషే ప్రవక్త చెప్పాడు. (ద్వితీయోపదేశకాండం 10:13; 11:27) అయితే, దేవుని మాట వినకపోతే ఆయన మనల్ని శిక్షిస్తాడేమో అనే భయంతో కాదుగానీ, దేవుని అద్భుతమైన లక్షణాలు నచ్చి మనం ఆయన మాట వింటాం. అంతేకాదు మనం ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన్ని బాధపెట్టే పనులు చేయకూడదని కోరుకుంటాం. “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే.”—1 యోహాను 5:3.

దేవుని మాట వినడానికి, దీవెనలు పొందడానికి సంబంధం ఏంటి? ఈ రెండు విషయాలు పరిశీలించండి:

1. దేవుని మాట వింటే తెలివిగలవాళ్లం అవుతాం

“యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.”—యెషయా 48:17.

మన సృష్టికర్త అయిన యెహోవా దేవునికి మన గురించి తెలుసు, ఆయనే మనకు అవసరమైన సలహాలు ఇస్తాడు. దేవుడు చెప్పేది వింటే, జీవితంలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అందుకోసం మనం పవిత్ర లేఖనాలు చదవాలి, మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. తర్వాత, ఆయన చెప్పినవన్నీ చేయాలి.

2. దేవుని మాట వింటే సంతోషంగా ఉంటాం

“దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!”—లూకా 11:28.

దేవుని వాక్యాన్ని పాటిస్తున్న లక్షలమంది ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. ఉదాహరణకు, స్పెయిన్‌లో ఉంటున్న ఒక వ్యక్తి అనుభవం గమనించండి. ఆయన ప్రతీ చిన్న విషయానికి అతిగా కోప్పడేవాడు; అందరితో, ఆఖరికి భార్యతో కూడా దురుసుగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ఆయన, యాకోబు కొడుకైన యోసేపు శాంత స్వభావం గురించి మోషే ప్రవక్త రాసిన విషయాలు చదివాడు. యోసేపును బానిసగా అమ్మేసినా, అన్యాయంగా జైల్లో వేసినా అతను కోపం తెచ్చుకోలేదు. బదులుగా ప్రశాంతంగా ఉన్నాడు, తనకు అన్యాయం చేసినవాళ్లను క్షమించాడు. (ఆదికాండం 37-45 అధ్యాయాలు) స్పెయిన్‌లో ఉంటున్న ఆ వ్యక్తి ఇలా చెప్పాడు: “యోసేపు గురించి ఆలోచించాక నాకు కూడా ఆయనలా ఉండాలని అనిపించింది. అందరితో శాంతంగా, దయగా ఉండాలని, కోపాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.”

వేరేవాళ్లతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో పవిత్ర లేఖనాల్లో చాలా సలహాలు ఉన్నాయి. తర్వాతి ఆర్టికల్‌లో, వాటి గురించి వివరంగా తెలుసుకుంటాం.