కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .

బాధపడుతున్నవాళ్లను ఓదార్చండి

బాధపడుతున్నవాళ్లను ఓదార్చండి

ఏడుస్తున్న వాళ్లను ఎలా ఓదార్చాలో మనకు తెలియకపోవచ్చు. ఆ పరిస్థితిలో ఏమి చెప్పాలో, ఏమి చేయాలో అర్థంకాక ఏమి చేయకుండా, ఏమి మాట్లాడకుండా అలానే ఉండిపోతాం. కానీ మనం చేయగలిగినవి చాలా ఉన్నాయి.

అలాంటి సమయంలో మీరు వాళ్ల పక్కన ఉండి, “ఐ యామ్‌ సారీ” లాంటి చిన్నమాట చెప్పినా చాలు. చాలా సంస్కృతుల్లో బాధపడుతున్నవాళ్లను కౌగిలించుకొని, ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి లేదా చేతులు పట్టుకుని వాళ్లపట్ల శ్రద్ధ చూపిస్తారు. బాధలో ఉన్నవాళ్లు ఏమైనా చెప్పాలనుకుంటే ఓపిగ్గా వినాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లు చేసుకోలేని కొన్ని పనులు, అంటే వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం లేదా అవసరమైతే అంత్యక్రియల్లో వాళ్లకు సహాయం చేయడం మంచిది. మాటల కన్నా అలాంటి పనులే ఎంతో ఓదార్పునిస్తాయి.

సమయం వచ్చినప్పుడు, చనిపోయిన వ్యక్తి గురించి మీరు ఏమైనా చెప్పండి. వాళ్లకున్న మంచి లక్షణాల గురించి, వాళ్లతో కలిసి మీరు సంతోషంగా గడిపిన సమయాల గురించి మాట్లాడండి. అప్పుడు బాధపడుతున్నవాళ్ల ముఖంలో ఆనందం కనిపించవచ్చు. ఉదాహరణకు, పామ్‌ అనే ఆమె భర్త ఈయన్‌ ఆరు సంవత్సరాలు క్రితం చనిపోయాడు. ఆమె ఇలా అంటుంది: “కొంతమంది ఈయన్‌ గురించి నాకు తెలియని విషయాలు అంటే ఆయన చేసిన మంచి పనులు గురించి నాతో చెప్తుంటారు. వాటిని విన్నప్పుడు నా హృదయానికి చాలా ఆనందంగా ఉంటుంది.”

పరిశోధకులు ఏమంటున్నారంటే, బాధపడుతున్నవాళ్లకు సహాయం చేయడానికి మొదట్లో చాలామంది ముందుకొస్తారు కానీ కొంతకాలం గడిచాక వాళ్ల సొంత పనుల్లో బిజీ అయిపోయి, సహాయం చేయలేకపోతారు. కానీ బాధపడుతున్నవాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి. a కొంతమందికి బాధ తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇలా మాట్లాడినప్పుడల్లా వాళ్లకు చాలా ఉపశమనంగా ఉంటుంది, వాళ్లు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు.

జపాన్‌ దేశానికి చెందిన కాయోరి అమ్మ చనిపోయింది. 15 నెలలకు ఆమె అక్క కూడా చనిపోయింది. దీనివల్ల ఆమె పరిస్థితి ఎంతో ఘోరం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో దగ్గరి స్నేహితులు ఆమెకు చాలా కాలం సహాయం చేశారు. ఆ సమయంలో కాయోరి కన్నా వయసులో చాలా పెద్దదైన రిట్‌సుకో ఆమెకు ఫ్రెండ్‌గా ఉంటానని చెప్పింది. “నిజం చెప్పాలంటే నాకు అది అంత నచ్చలేదు. మా అమ్మ స్థానంలో ఎవ్వరినీ ఊహించుకోలేను, అలా ఉండడానికి ఎవరైన ప్రయత్నిస్తే నాకు ఇష్టం ఉండదు. కానీ రిట్‌సుకో నన్ను చూసుకున్న విధానాన్ని బట్టి నేను ఆమెకు చాలా దగ్గరయ్యాను. ప్రతీవారం మేమిద్దరం కలిసి ప్రీచింగ్‌కు, మీటింగ్స్‌కు వెళ్లేవాళ్లం. ఆమెతో కలిసి టీ తాగడానికి పిలుస్తూ ఉండేది, నాకు భోజనం తెచ్చేది. నాకు చాలాసార్లు కార్డ్‌లు, ఉత్తరాలు రాసింది. ఆమె మంచితనం నాపై చాలా ప్రభావం చూపించింది.”

కాయోరి వాళ్ల అమ్మ చనిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కాయోరి, ఆమె భర్త ఎక్కువ సమయం దేవుని సేవలో గడుపుతున్నారు. “మమ్మీ రిట్‌సుకో నన్ను ఇంకా చూసుకుంటూనే ఉంది. నేను ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆమె దగ్గరకు వెళ్లి చక్కగా సమయం గడుపుతాను.”

మరో ఉదాహరణ పోలి, ఆమె సైప్రస్‌లో ఉంటున్న యెహోవాసాక్షి. ఆమెకు కూడా ఇలాంటి సహాయమే అందింది. పోలి భర్త సోజోస్‌ చాలా దయగలవాడు. క్రైస్తవ పెద్దగా ఆయన మంచి ఉదాహరణ చూపించాడు. అనాథలను, విధవరాళ్లను భోజనానికి ఇంటికి ఆహ్వానించి, చక్కగా సమయం గడిపేవాడు. (యాకోబు 1:27) విచారకరంగా, 53 సంవత్సరాల వయసులో ఆయన బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోయాడు. “33 సంవత్సరాలు మా వివాహబంధాన్ని ఆనందించాక ఇప్పుడు నా భర్త లేడు,” అని పోలి అంటుంది.

దుఃఖిస్తున్నవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి

అంత్యక్రియల తర్వాత పోలి తన 15 సంవత్సరాల కొడుకు డానియేల్‌ని తీసుకుని కెనడాకు వెళ్లిపోయింది. వాళ్లు అక్కడున్న యెహోవాసాక్షుల సంఘానికి వెళ్లడం మొదలుపెట్టారు. పోలి ఇలా చెప్తుంది: “ఇక్కడి సంఘం వాళ్లకు, మా గతం కానీ, మేము అనుభవించిన కష్టాలు కానీ తెలియవు. కానీ వాళ్లు మా దగ్గరకు వచ్చి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మాతో దయగా మాట్లాడుతూ అవసరమైన సహాయం చేశారు. అది చాలా గొప్ప సహాయం, ఎందుకంటే మా బాబుకి ఆ సమయంలో వాళ్ల నాన్న అవసరం చాలా ఉంది. సంఘంలో బాధ్యతల్లో ఉన్న సహోదరులు డానియేల్‌ మీద ఎంతో శ్రద్ధ చూపించారు. ముఖ్యంగా ఒక సహోదరుడు, స్నేహితులందరూ కలుసుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు డానియేల్‌ని కూడా కలుపుకునేలా చూసుకున్నాడు.” ఇప్పుడు పోలి, ఆమె కొడుకు కోలుకున్నారు.

దుఃఖిస్తున్నవాళ్లకు చాలా విధాలుగా ఆదరణను, సహాయాన్ని మనం ఇవ్వవచ్చు. రాబోయే రోజుల్లో మనం పొందే అద్భుతమైన భవిష్యత్తు గురించి చెప్తూ బైబిలు కూడా మనకు ఆదరణను ఇస్తుంది. (w16-E No. 3)

a కొంతమందైతే చనిపోయిన రోజును క్యాలెండర్‌లో రాసుకుంటారు. అప్పుడు ఆ రోజు గుర్తుపెట్టుకుని సమయానికి ఓదార్చవచ్చు.