కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నన్ను నేను గౌరవించుకోవడం, స్త్రీలను గౌరవించడం తెలుసుకున్నాను

నన్ను నేను గౌరవించుకోవడం, స్త్రీలను గౌరవించడం తెలుసుకున్నాను
  • పుట్టిన సంవత్సరం: 1960

  • దేశం: ఫ్రాన్స్‌

  • ఒకప్పుడు: డ్రగ్స్‌కు బానిస, స్త్రీలను అస్సలు గౌరవించేవాడు కాదు

నా గతం:

నేను ఫ్రాన్స్‌లోని మల్‌హౌస్‌లో పుట్టాను. ఊరి చివర్లో కూలిపని చేసుకునేవాళ్లు ఉండే చోట మేము ఉండేవాళ్లం. అక్కడ హింస బాగా ఉండేది. మా ప్రాంతంలో కుటుంబాల మధ్య భయంకరమైన ఘర్షణలు చూస్తూ నా చిన్నతనం గడిచింది. మా ఇంట్లో స్త్రీలను చిన్నచూపు చూసేవాళ్లు, మగవాళ్లు ఎప్పుడోగానీ స్త్రీల సలహా అడగరు. వంట చేసుకోవడం, మగవాళ్లను, పిల్లలను చూసుకోవడమే స్త్రీల పని అని నాకు చెప్పారు.

చిన్నతనంలోనే కష్టాలు చూశాను. నాకు 10 సంవత్సరాలప్పుడు త్రాగుబోతుతనంతో మా నాన్న చనిపోయాడు. 5 సంవత్సరాలు గడిచాక, మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సంవత్సరంలో ఎంతోకాలంగా ఉన్న కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్యను నేను కళ్లారా చూశాను, నాకు చాలా భయమేసింది. అవసరమైనప్పుడు కత్తులు, తుపాకీలు ఎలా వాడాలో మా ఇంట్లోవాళ్లు నాకు నేర్పించారు. చిన్నవయసులోనే మానసికంగా దెబ్బతిని, ఒంటినిండా బొట్లు పొడిపించుకున్నాను. మద్యానికి అలవాటు పడ్డాను.

పదహారు సంవత్సరాలు వచ్చేసరికి, రోజుకు 10 నుండి 15 బాటిల్లు బీరు తాగేవాణ్ణి, డ్రగ్స్‌ తీసుకోవడం కూడా మొదలుపెట్టాను. ఈ అలవాట్లకు డబ్బు కావాలి కాబట్టి పాత ఇనుప సామాన్లు అమ్మేవాణ్ణి, దొంగతనాలు చేసేవాణ్ణి. 17 సంవత్సరాలకే జైలుకు వెళ్లాను. దొంగతనాలు, కొట్లాటల్లో నాకు 18 సార్లు శిక్ష పడింది.

ఇరవైలలో అడుగుపెట్టినప్పటి నుండి నా పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. రోజుకు 20 గంజాయి సిగరెట్లు తాగేవాణ్ణి. హెరొయిన్‌ని, నిషేధించిన ఇతర మత్తు పదార్థాల్ని తీసుకునేవాణ్ణి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలాసార్లు చావుకు దగ్గరగా వెళ్లాను. డ్రగ్స్‌ అమ్మడం మొదలుపెట్టాక ఎప్పుడూ కత్తులు, తుపాకులు నాతో ఉంచుకునేవాణ్ణి. ఒకసారి ఒకతన్ని షూట్‌ చేశాను, కానీ ఆ బులెట్‌ అతని బెల్ట్‌ బకెల్‌కు తగిలి బ్రతికిపోయాడు. నాకు 24 సంవత్సరాలు వచ్చాక మా అమ్మ చనిపోయింది, నా కోపం ఇంకా పెరిగిపోయింది. రోడ్డు మీద నడిచేవాళ్లు నన్ను చూసి భయపడి అవతలికి వెళ్లిపోయేవాళ్లు. నేను ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేవాణ్ణి కాబట్టి శని, ఆదివారాల్లో ఎక్కువగా పోలిస్‌స్టేషన్‌లోగానీ, దెబ్బలకు కుట్లు వేయించుకుంటూ హాస్పిటల్లోగానీ గడిపేవాణ్ణి.

ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నాకు పెళ్లైంది. నేను నా భార్యను సరిగ్గా చూసుకోలేదు, సరిగా గౌరవించలేదు. ఆమెను తిట్టేవాడిని, కొట్టేవాడిని. భార్యాభర్తలుగా కలిసి మేము ఏ పని చేయలేదు. దొంగిలించిన బంగారాన్ని తెచ్చి ఆమె మీద కుమ్మరిస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఊహించనిది జరిగింది. నా భార్య యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టాక మొదటిసారికే ఆమె సిగరెట్టు కాల్చడం మానేసింది. నేను దొంగిలించిన డబ్బును తీసుకోనని చెప్పింది, బంగారాన్ని తిరిగి ఇచ్చేసింది. నాకు చాలా కోపం వచ్చింది. యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవద్దని చెప్పాను. సిగరెట్‌ పొగ ఆమె ముఖం మీద ఊదేవాడిని. మా ఇంటి దగ్గర వాళ్లముందు ఆమెను అవమానించేవాడిని.

ఒకరోజు రాత్రి తాగిన మైకంలో నేను మా ఆపార్ట్‌మెంట్‌కు నిప్పు అంటించాను. నా భార్య ఆ మంటల్లో నుండి నన్ను, మా ఐదు సంవత్సరాల కూతుర్ని కాపాడింది. తర్వాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో బాధ పడ్డాను. దేవుడు నన్ను ఎప్పటికీ క్షమించడని అనుకున్నాను. చెడ్డవాళ్లు నరకానికి వెళ్తారని పాస్టర్‌ చెప్పడం నేను ఒకసారి విన్నాను. నేను చూపించుకునే సైక్యాట్రిస్ట్‌ కూడా: “నువ్వు చాలా ఘోరంగా తయారయ్యావ్‌. నిన్ను ఇంక ఎవరూ మార్చలేరు” అని చెప్పాడు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే. . .

ఆ అగ్ని ప్రమాదం తర్వాత మేము మా అత్త వాళ్ల ఇంటికి వెళ్లిపోయాం. యెహోవాసాక్షులు నా భార్యను కలవడానికి వచ్చినప్పుడు, “నేను చేసిన పాపాలకు దేవుడు నన్ను క్షమిస్తాడా?” అని అడిగాను. వాళ్లు బైబిల్లో, 1 కొరింథీయులు 6:9-11 నాకు చూపించారు. అక్కడ దేవునికి ఇష్టం లేని ప్రవర్తన గురించి ఉంది, ఇంకా “మీలో కొందరు అట్టివారై యుంటిరి” అని కూడా ఉంది. ఆ మాటలు నేను కూడా మార్పులు చేసుకోగలననే నమ్మకాన్ని నాకు ఇచ్చాయి. వాళ్లు నాకు 1 యోహాను 4:8 చూపించి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారు. ఆ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి, వారానికి రెండుసార్లు వచ్చి నాకు నేర్పించమని యెహోవాసాక్షులను అడిగాను, వాళ్ల మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. యెహోవాకు ఎప్పుడూ ప్రార్థించేవాణ్ణి.

ఒక నెలకే డ్రగ్స్‌, మద్యం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. వెంటనే నా శరీరంలో యుద్ధం మొదలైనట్లు అనిపించింది. భయంకరమైన పీడ కలలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దురలవాట్లు మానేటప్పుడు వచ్చే ఇతర శారీరక ఇబ్బందులతో బాధపడ్డాను. అదే సమయంలో యెహోవా నా చెయ్యి పట్టుకుని నన్ను బలపరుస్తున్నట్లు అనిపించింది. అపొస్తలుడైన పౌలుకు అనిపించినట్లే నాకు అనిపించింది. దేవుడు ఇచ్చిన బలాన్ని గురించి పౌలు ఇలా రాశాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) కొంతకాలానికి నేను సిగరెట్‌ కూడా మానేశాను.—2 కొరింథీయులు 7:1.

చెడు అలవాట్లు మానుకోవడానికి, మా కుటుంబంలో సంతోషంగా ఉండడానికి బైబిలు నాకు సహాయం చేసింది. నా భార్యను ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను. ఆమెను చాలా గౌరవిస్తున్నాను, “ప్లీజ్‌,” “థాంక్యూ” అని మాట్లాడుతున్నాను. ఒక మంచి తండ్రిగా నా కూతుర్ని ఇప్పుడు బాగా చూసుకుంటున్నాను. ఒక సంవత్సరం యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకున్నాక, నా భార్యను చూసి నేను కూడా యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే. . . :

బైబిలు సూత్రాలు నా ప్రాణాలను కాపాడాయని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను మారకపోయి ఉంటే, డ్రగ్స్‌ అతిగా తీసుకునిగానీ, గొడవల్లోగానీ ఎదో ఒక రోజు చనిపోయి ఉండేవాణ్ణని యెహోవాసాక్షులు కానీ నా బంధువులు కూడా అనుకున్నారు.

ఒక భర్తగా, తండ్రిగా నా బాధ్యతల గురించి బైబిల్లో నేర్చుకున్న విషయాల వల్ల మా కుటుంబ జీవితం పూర్తిగా మారిపోయింది. (ఎఫెసీయులు 5:25; 6:4) మేమిద్దరం కలిసి పనులు చేసుకుంటున్నాం. నా భార్య వంటింటికే పరిమితం అనుకోకుండా, ఆమె దేవుని పని ఎక్కువగా చేయడానికి కూడా సంతోషంగా మద్దతు ఇస్తున్నాను. యెహోవాసాక్షుల సంఘ పెద్దగా నా బాధ్యతలు చూసుకోవడానికి ఆమె నాకు సంతోషంగా సహకరిస్తుంది.

యెహోవా దేవుని ప్రేమ, దయ నా జీవితాన్ని ఎంతగానో మార్చేశాయి. నేను మారనని నా గురించి అందరూ అనుకున్నారు. నాకులా, ఇంక మారరు అనే వాళ్లకు దేవుని గొప్ప లక్షణాల గురించి చెప్పాలి అనిపిస్తుంది. ఒక శుభ్రమైన, అర్థవంతమైన జీవితం గడపడానికి ఎవరికైనా సహాయం చేసే శక్తి బైబిలుకు ఉందని నాకు తెలుసు. ఇతరుల్ని అంటే స్త్రీలను, పురుషులను ప్రేమించడం, గౌరవించడమే కాకుండా, నన్ను నేను గౌరవించుకోవడం ఎలాగో కూడా బైబిలు నాకు నేర్పింది.▪ (w16-E No. 3)