కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మారి ప్రాచీన ఎడారుల మహారాణి

మారి ప్రాచీన ఎడారుల మహారాణి

మారి ప్రాచీన ఎడారుల మహారాణి

“మాఅదృష్టాన్ని నా సహచరులతో వేడుకగా జరుపుకొని నా పడక గదికి తిరిగి వచ్చేసరికి నాకు తల తిప్పినట్లు అనిపించింది” అని ఫ్రెంచి పురావస్తు శాస్త్రజ్ఞుడు ఆండ్రే ప్యారట్‌ గుర్తుచేసుకున్నాడు. 1934 జనవరిలో, సిరియాలోని యూఫ్రటీస్‌ నది తీరాన ఉన్న అబు కెమల్‌ అనే చిన్న పట్టణంవద్ద ఉన్న టెల్‌ హరెరెవద్ద ప్యారట్‌, అతని బృందం ఒక శిల్పాన్ని త్రవ్వి బయటకు తీశారు, ఆ శిల్పంపై ఇలా చెక్కబడి ఉంది: “లామ్గి మారి, మారి రాజు, ఎన్లిల్‌ ప్రధాన యాజకుడు.” వారు తాము కనుగొన్న దానిని చూసి ఆనందాన్ని పట్టలేకపోయారు.

చివరకు మారి నగరం కనుగొనబడింది! అది బైబిలు విద్యార్థులకు ఎందుకు ఆసక్తికరమైనది?

ఎందుకు ఆసక్తికరమైనది?

ప్రాచీన గ్రంథాల ప్రకారం మారి ఉనికిలో ఉండేదనే విషయం తెలిసినా, అది ఎక్కడ ఉండేదనే విషయం మాత్రం ఎంతోకాలంగా ఒక రహస్యంగా మిగిలిపోయింది. సుమేరియన్‌ లేఖికుల ప్రకారం, మారి ఒకప్పుడు మెసపొటేమియా అంతటిని పరిపాలించిన రాజవంశావళికి కేంద్రస్థానంగా ఉండేది. యూఫ్రటీస్‌ నది తీరాన నిర్మించబడిన మారి, పర్షియన్‌ సింధుశాఖను అస్సీరియా, మెసపొటేమియా, అనటోలియా, మధ్యధరా సముద్రతీరాలతో కలిపే వర్తక మార్గాల కూడలిలో ఉండేది. మెసపొటేమియాలో చాలా అరుదుగా లభించే కలప, లోహం, రాళ్ళు వంటి సరుకులు మారి నగరం గుండానే రవాణా చేయబడేవి. వాటిపై విధించిన పన్నులు మారిని సంపన్న నగరంగా మార్చాయి, తద్వారా ఆ నగరం ఆ ప్రాంతమంతటిపై అధికారం చెలాయించగలిగింది. అయితే సిరియాను అక్కాడ్‌కు చెందిన సర్గోన్‌ ఆక్రమించుకున్నప్పుడు దాని అధికారం అంతమయ్యింది.

సర్గోన్‌ ఆక్రమణ తర్వాత దాదాపు 300 సంవత్సరాల వరకూ మారిని ఎంతోమంది సైనికాధికారులు పరిపాలించారు. వారి పరిపాలన క్రింద ఆ నగరం మళ్ళీ వర్ధిల్లడం ప్రారంభించింది. అయితే తన ఆఖరి పరిపాలకుడైన జిమ్రి లిమ్‌ కాలానికి వచ్చేసరికి మారి తన అధికారాన్ని కోల్పోయింది. జిమ్రి లిమ్‌ వరుసగా సైనిక ఆక్రమణలతో, ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, పెళ్ళి సంబంధాలతో తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సా.శ.పూ. 1760లో బబులోను రాజైన హమ్మూరబీ ఆ నగరాన్ని ఆక్రమించుకొని, దానిని నాశనం చేయడం ద్వారా “ప్రాచీన ప్రపంచపు వెలుగైన ఒక నాగరికత” అని ప్యారట్‌ పిలిచిన నగరాన్ని అంతం చేశాడు.

హమ్మూరబీ సైనికులు మారిని నాశనం చేసినప్పుడు, అనాలోచితంగా ఆధునిక దిన పురావస్తు శాస్త్రజ్ఞులకు, చరిత్రకారులకు ఎంతో మేలు చేశారు. కాల్చని ఇటుకలతో కట్టిన గోడలను కూల్చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రాంతాల్లోని భవనాలను ఐదు మీటర్ల ఎత్తువరకూ పూడ్చేశారు, కాబట్టి అవి ఇంతకాలం గడిచినా సురక్షితంగానే ఉన్నాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు ఆలయాల, రాజగృహాల శిథిలాలతోపాటు ఎన్నో కళాకృతులు, ఆ ప్రాచీన నాగరికత గురించి సమాచారమిచ్చే వేలాది శిలాశాసనాలను త్రవ్వి బయటకు తీశారు.

మారి శిథిలాల గురించి మనకెందుకు ఆసక్తి ఉంది? పితరుడైన అబ్రాహాము భూమిపై జీవించిన కాలం గురించి ఆలోచించండి. అబ్రాహాము సా.శ.పూ. 2018లో అంటే గొప్ప జలప్రళయం తర్వాత 352 సంవత్సరాలకు జన్మించాడు. ఆయనది నోవహు నుండి పదవ తరము. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రాహాము తన స్వస్థలమైన ఊరును విడిచిపెట్టి, హారానుకు వెళ్ళాడు. సా.శ.పూ. 1943వ సంవత్సరంలో అబ్రాహాముకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన హారానును వదిలి కనానుకు వెళ్ళాడు. “అబ్రాహాము ఊరునుండి [కనానులో ఉన్న] యెరూషలేముకు చేసిన ప్రయాణాలు మారి ఉనికిలో ఉన్నప్పుడు జరిగాయి” అని ఇటాలియన్‌ పురావస్తు శాస్త్రజ్ఞుడు పౌలొ మత్తయి చెబుతున్నాడు. కాబట్టి మారి కనుగొనబడడం మనకు ఎంతో ప్రయోజనకరమైనది ఎందుకంటే అది దేవుని నమ్మకమైన సేవకుడైన అబ్రాహాము జీవించిన ప్రపంచాన్ని ఊహించుకోవడానికి మనకు సహాయం చేయగలదు. *​—⁠ఆదికాండము 11:10-12:⁠4.

శిథిలాలు ఏమి వెల్లడి చేస్తున్నాయి?

మెసపొటేమియాలోని ఇతర ప్రాంతాల్లోలాగే మారిలోనూ మతం వర్ధిల్లింది. దేవతలకు సేవ చేయడం మానవుడి విధిగా పరిగణించబడేది. ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ దేవతల చిత్తమేమిటో కనుక్కోబడేది. పురావస్తు శాస్త్రజ్ఞులు ఆరు ఆలయాల శిథిలాలను కనుగొన్నారు. వాటిలో సింహాల ఆలయం (కొందరు దానిని దాగోను దేవత అంటే బైబిలులో ప్రస్తావించబడిన దాగోను దేవత ఆలయంగా పరిగణిస్తారు), ఫలవృద్ధి దేవతయైన ఇష్తారు ఆలయం, సూర్య దేవుడైన షామాషు ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాల్లో వాటివాటి దేవతల విగ్రహాలు ఉండేవి, అక్కడకు వెళ్ళి ప్రజలు తమ అర్పణలను అర్పించేవారు, ప్రార్థించేవారు. భక్తులు తాము ప్రార్థన చేస్తున్నట్లు కనిపించే చిన్న చిన్న విగ్రహాలను తీసుకువచ్చి గుడిలోని బల్లలపై పెట్టేవారు, అలా వారు తమ విగ్రహం తమ ఆరాధనను కొనసాగిస్తుందని నమ్మేవారు. ప్యారట్‌ ఇలా చెప్పాడు: “ఆ విగ్రహం, నేటి క్యాథలిక్‌ ఆరాధనలో ఆరాధకుడు వెలిగించే కొవ్వొత్తిలాగే ఆ భక్తునికి ప్రతినిధిగా పనిచేసేది.”

టెల్‌ హారెరె శిథిలాల్లో కనుగొనబడిన అత్యంత గమనార్హమైనది, వివిధ భాగాలుగల విస్తారమైన భవంతి శిథిలాలు, ఆ భవంతి దాని ఆఖరి నివాసియైన జిమ్రి లిమ్‌ రాజు పేరుతో పిలువబడేది. ఫ్రెంచి పురావస్తు శాస్త్రజ్ఞుడు ల్వియూయెగ్‌ విన్సెంట్‌ దానిని “ప్రాచీన ప్రాచ్యదేశ భవన నిర్మాణశైలిని ప్రతిబింబించే మణిపూస” అని వర్ణించాడు. ఆరు ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించబడిన ఆ భవంతిలో దాదాపు 300 గదులు, ప్రాంగణాలు ఉన్నాయి. మధ్యయుగాల్లో ఆ భవనం ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటిగా పరిగణించబడింది. “అది ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే, సిరియన్‌ సముద్రతీరంపై ఉన్న యుగారిట్‌ నగరపు రాజు, కేవలం ‘జిమ్రి లిమ్‌ ఇంటిని సందర్శించడానికి’ తన కుమారుడిని 600 కిలోమీటర్ల దూరం పంపించడానికి కూడా వెనుకాడలేదు” అని జార్జెస్‌ రూ తన పుస్తకమైన ఏన్షియంట్‌ ఇరాక్‌లో వ్యాఖ్యానించాడు.

సందర్శకులు రెండు వైపులా రెండు గోపురాలు ఉండే ద్వారం గుండా భవంతిలోకి ప్రవేశించిన తర్వాత ఒక విశాలమైన ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఒక వేదికపై ఉంచబడిన సింహాసనంపై కూర్చొని మారి ఆఖరి రాజైన జిమ్రి లిమ్‌ సైనిక, వాణిజ్య, రాజ్య వ్యవహారాలను చూసుకునేవాడు; తీర్పు తీర్చేవాడు; సందర్శకులను, రాయబారులను కలుసుకునేవాడు. అతిథుల కోసం వసతి సౌకర్యాలు ఉండేవి, విందుల సమయంలో రాజు వారికి అద్భుతమైన ఆహారంతో, పానీయాలతో ఆతిథ్యమిచ్చేవాడు. ఆహారంలో నిప్పులపై కాల్చిన, వేయించిన, లేదా ఉడకబెట్టిన ఎద్దు మాంసం, మేక మాంసం, జింక మాంసం, చేపలు, కోడి మాంసంతో చేయబడిన వంటకాలు ఉండేవి, అవన్నీ ఘాటైన వెల్లులి పులుసుతో, వివిధ రకాల కూరగాయలతో, జున్నులతో కలిపి వడ్డించబడేవి. భోజనం తర్వాత తాజాపళ్ళు లేదా ఎండబెట్టబడిన పళ్ళు, చక్కెర చల్లిన పళ్ళు, రకరకాల ఆకారాల్లో చేయబడిన కేకులు వడ్డించబడేవి. అతిథులకు దాహం తీర్చుకోవడానికి బీరు లేదా ద్రాక్షారసం ఇవ్వబడేది.

ఆ రాజభవనంలో పారిశుద్ధ సౌకర్యాలు కూడా ఉండేవి. పింగాణీ తొట్లు, మలమూత్ర విసర్జనకు మరుగుదొడ్లు ఉన్న స్నానాల గదులు కనుగొనబడ్డాయి. ఆ గదుల గోడల క్రింది భాగంపై తారు పూత వేయబడి ఉంది. మురికి నీరు ఇటుకలతో కట్టిన నాళాల గుండా బయటకు పారేది, తారు పూతతో నీళ్ళు కారకుండా చేయబడిన మట్టి గొట్టాలు 3,500 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఉపయోగించగల స్థితిలో ఉన్నాయి. రాణివాస స్త్రీలలో ముగ్గురికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి సోకినప్పుడు, వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ వ్యాధి సోకిన స్త్రీ ప్రజలకు దూరంగా ఉండాలి అని ఆదేశించబడింది. “ఆమె త్రాగిన గిన్నెలో ఇంకెవ్వరూ త్రాగకూడదు, ఆమె బల్లవద్ద ఎవ్వరూ కూర్చోకూడదు, ఆమె కూర్చున్న కుర్చీపై ఎవ్వరూ కూర్చోకూడదు.”

ఆ ప్రాచీన పత్రాలనుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ప్యారట్‌, అతని బృందానికి అక్కేడియన్‌ భాషలో వ్రాయబడిన 20,000 కీలాకారపు పలకలు దొరికాయి. ఆ పలకలపై ఉత్తరాలు, రాజ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన వ్రాతలు ఉన్నాయి. ఆ ప్రాచీన పత్రాల్లో మూడవ వంతు మాత్రమే ప్రచురించబడ్డాయి. అయినప్పటికీ, అవి 28 సంపుటులుగా ఉన్నాయి. అవి ఎంత విలువైనవి? “మారి ప్రాచీన పత్రాలు కనుగొనబడకముందు, రెండవ సహస్రాబ్ది ప్రారంభంలో మెసపొటేమియా, సిరియాల చరిత్ర గురించి, వాటి సమాజాల గురించి, ప్రజల అనుదిన జీవితం గురించి మనకు ఏమీ తెలియదు. అవి దొరికినందువల్లనే ఎన్నో అధ్యాయాల చరిత్రను వ్రాయడం సాధ్యమయ్యింది” అని మారి ఆర్కియోలాజికల్‌ మిషన్‌ దర్శకుడు జీన్‌ క్లాడ్‌ మార్గెరాన్‌ చెప్పాడు. ప్యారట్‌ వ్యాఖ్యానించినట్లు ఆ ప్రాచీన పత్రాలు “వాటిలో ప్రస్తావించబడిన ప్రజలకు, పితరుల కాలం గురించి పాత నిబంధన మనకు చెబుతున్న విషయాలకు ఎంతో పోలిక ఉందని వెల్లడి చేస్తున్నాయి.”

మారిలో కనుగొనబడిన పలకలు కొన్ని బైబిలు వృత్తాంతాలపై కూడా వెలుగును ప్రకాశింపజేశాయి. ఉదాహరణకు, శత్రువు భార్యలను, ఉపపత్నులను స్వాధీనం చేసుకోవడం “అప్పట్లో రాజులు సర్వసాధారణంగా చేసే పని” అని ఆ పలకలు సూచిస్తున్నాయి. కాబట్టి నమ్మకద్రోహి అయిన అహీతోపెలు, దావీదు కుమారుడైన అబ్షాలోముకు తన తండ్రి ఉపపత్నులతో లైంగిక సంబంధాలు పెట్టుకొమ్మని ఇచ్చిన సలహా అతను కొత్తగా సృష్టించినది కాదు.​—⁠2 సమూయేలు 16:21, 22.

పురావస్తు శాస్త్రజ్ఞులు టెల్‌ హారెరెలో 1933 నుండి ఇప్పటివరకూ 41 సార్లు తవ్వకాలు జరిపారు. మారి విస్తీర్ణం 270 ఎకరాలైతే ఇప్పటివరకూ 20 ఎకరాలు మాత్రమే పరిశీలించబడ్డాయి. ప్రాచీన ఎడారుల మహారాణియైన మారిలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు కనుగొనబడవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 8 సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడిన తర్వాత బబులోనుకు తీసుకెళ్ళబడిన యూదా బంధీలు మారి సరిహద్దుల గుండా ప్రయాణించి ఉండవచ్చు.

[10వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పర్షియన్‌ సింధుశాఖ

ఊరు

మెసపొటేమియా

యూఫ్రటీసు నది

మారి

అస్సీరియా

హారాను

అనటోలియా

కనాను

యెరూషలేము

మధ్యధరా సముద్రం (మహా సముద్రం)

[11వ పేజీలోని చిత్రం]

ఈ పత్రంలో మారి రాజైన ఇయాధున్‌ లిమ్‌ తన నిర్మాణ పనుల గురించి గొప్పగా చెప్పుకున్నాడు

[11వ పేజీలోని చిత్రం]

లామ్గి మారికి చెందిన ఈ విగ్రహం కనుగొనబడడమే, మారిని గుర్తించడానికి దారి తీసింది

[12వ పేజీలోని చిత్రం]

ఎబిహెల్‌, మారి అధికారి ప్రార్థిస్తున్నాడు

[12వ పేజీలోని చిత్రం]

రాజభవనంలోని విగ్రహపీఠం, ఇక్కడ బహుశా ఒక దేవత విగ్రహం ఉండేది

[12వ పేజీలోని చిత్రం]

మారి శిథిలాలు, కాల్చని ఇటుకల నిర్మాణాన్ని చూపిస్తున్నాయి

[12వ పేజీలోని చిత్రం]

రాజగృహంలోని స్నానాల గది

[13వ పేజీలోని చిత్రం]

మారిని ఆక్రమించుకున్న నారామ్‌ సిమ్‌ విజయానికి చిహ్నంగా శాసనం చెక్కించిన రాతిపలకం

[13వ పేజీలోని చిత్రం]

రాజగృహం శిథిలాల్లో దాదాపు 20,000 కీలాకారపు పలకలు కనుగొనబడ్డాయి

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)

[11వ పేజీలోని చిత్రసౌజన్యం]

పత్రం: Musée du Louvre, Paris; statue: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)

[12వ పేజీలోని చిత్రసౌజన్యం]

విగ్రహం: Musée du Louvre, Paris; podium and bathroom: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

విజయానికి చిహ్నంగా శాసనం చెక్కించిన రాతిపలకం: Musée du Louvre, Paris; palace ruins: © Mission archéologique française de Tell Hariri - Mari (Syrie)