కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన విశ్వాసం ఇప్పటికీ సాధ్యమేనా?

నిజమైన విశ్వాసం ఇప్పటికీ సాధ్యమేనా?

నిజమైన విశ్వాసం ఇప్పటికీ సాధ్యమేనా?

“విశ్వాసమంటే దైవానుగ్రహంపై సజీవమైన, సాహసోపేతమైన నమ్మకం. అది ఎంత ఖచ్చితమైనది, నిశ్చయమైనది అంటే విశ్వాసంగల వ్యక్తి దాని కోసం వెయ్యిసార్లయినా తన ప్రాణాలను పణంగా పెట్టగలడు.”​—⁠మార్టిన్‌ లూథర్‌, 1522.

“దాదాపు అన్ని ఉద్దేశాల్లో, అన్ని సంకల్పాల్లో క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ అలవాట్లు ఏ మాత్రం లేకుండా ఇప్పటికే పూర్తిగా క్షీణదశలో ఉన్న ఒక లౌకిక సమాజంలో మనం జీవిస్తున్నాము.”​—⁠లూడోవిక్‌ కెన్నెడీ, 1999.

విశ్వాసం గురించిన దృక్కోణాలు అకస్మాత్తుగా మారతాయి. గతంలో, దేవుని మీద విశ్వాసం ఉండడం సర్వసాధారణమైన విషయం. ఈరోజుల్లో, అస్థిరమైన దుఃఖమయమైన ఈలోకంలో దేవుని మీద బైబిలు మీద నిజమైన విశ్వాసమనేది లేకుండా చాలా వేగంగా కనుమరుగై పోతోంది.

నిజమైన విశ్వాసం

చాలామంది, “విశ్వాసం” అంటే కేవలం ఒక మత నమ్మకం కలిగివుండడం లేదా ఒక విధమైన ఆరాధనా పద్ధతిని అనుసరించడం మాత్రమే అనుకుంటారు. అయితే, “విశ్వాసము” అన్న మాట బైబిల్లో ఉపయోగించబడిన విధానాన్ని బట్టి ప్రాథమికంగా సంపూర్ణమైన నమ్మకాన్ని అంటే​—⁠దేవుని మీద ఆయన వాగ్దానాల మీద ఉండే పరిపూర్ణమైన, అచంచలమైన ప్రగాఢవిశ్వాసాన్ని సూచిస్తుంది. యేసు క్రీస్తు శిష్యుడ్ని సూచించే ఒక లక్షణమది.

ఒక సందర్భంలో, యేసు క్రీస్తు “నిరుత్సాహం చెంద”కుండా ప్రార్థించాల్సిన అవసరం గురించి మాట్లాడాడు. అలా మాట్లాడుతున్నప్పుడు, మన రోజుల్లో నిజమైన విశ్వాసం అసలు ఉంటుందా అని ఆయన ఒక ప్రశ్నను లేవదీశాడు. ఆయనిలా అడిగాడు: “మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద ఆవిశ్వాసము కనుగొనునా?” ఆయన అలాంటి ప్రశ్నను ఎందుకు వేశాడు?​—⁠లూకా 18:⁠1, 8 అధస్సూచి.

కోల్పోయిన విశ్వాసం

ప్రజల్లో ఉన్న విశ్వాసం ఎటువంటిదైనా వాళ్ళు దాన్ని కోల్పోవడానికి అనేక విషయాలు కారణం కావచ్చు. వాటిలో అనుదిన జీవిత సమస్యలు కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు, 1958 లో మ్యునిచ్‌ ఎయిర్‌ విమానం కూలిపోవడంవల్ల, దాంట్లో ప్రయాణం చేస్తున్న మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లోని చాలామంది క్రీడాకారులు మరణించినప్పుడు, ఇంగ్లాండులోని మాంచెస్టర్‌లో ప్రొఫెసర్‌ మైఖేల్‌ గోల్డర్‌ ఒక పారిష్‌ ప్రీస్టుగా ఉండేవాడు. బిబిసి టెలివిజన్‌ ప్రోగ్రాములో, గోల్డర్‌ “ప్రజల దుఃఖ స్థాయిని చూసి నిస్సహాయుడిగా భావించాడు” అని అనౌన్సర్‌ జోన్‌ బేక్‌వెల్‌ తెలిపింది. దాని కారణంగా ఆయన “మానవుల భవిష్యత్తులో జోక్యం చేసుకునే దేవుని మీది తన విశ్వాసాన్ని కోల్పోయాడు.” గోల్డర్‌ “బైబిలు పొరబాట్లు లేని దేవుని వాక్యం కాదు, బహుశా దాంట్లో అక్కడ్కడ దైవ ప్రేరణ కలిగి ఉండవచ్చు కానీ, అది పొరబాట్లు ఉన్న మనుష్యుని వాక్యమే” అని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

కొన్నిసార్లు విశ్వాసం ఊరకే నశించిపోతుంది. రచయితా, బ్రోడ్‌కాస్టర్‌ అయిన లుడోవిక్‌ కెన్నెడీ విషయంలో అదే జరిగింది. చిన్నప్పటి నుండి “[దేవుని గురించి] సందేహాలు, అనుమానాలు మనసులో కదలాడుతూ చివరికి అవిశ్వాసం పెరిగిపోయింది” అని ఆయన అంటున్నాడు. ఆయన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను ఎవరూ ఇవ్వలేకపోయారని అనిపిస్తోంది. అనుకోకుండా ఆయన తండ్రి సముద్రంలో చనిపోవడంవల్ల అప్పటికే బలహీనంగా ఉన్న ఆయన విశ్వాసంపై గట్టి దెబ్బ తగిలింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళ నాన్నగారు జర్మనీ యుద్ధనౌకలు చేసిన దాడిలో మరణించడంతో “సముద్ర ప్రమాదాల నుండి, శత్రువుల దౌర్జన్యం నుండి మమ్మల్ని కాపాడు” అని దేవునికి చేసిన ప్రార్థనలు ప్రత్యుత్తరం లేకుండా పోయాయి.​—⁠కేవలం మనోకల్పన​—⁠దేవునికి వీడ్కోలు (ఆంగ్లం).

అలాంటి అనుభవాలు అసాధారణమేమీ కావు. “విశ్వాసము అందరికి లేదు” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (2 థెస్సలొనీకయులు 3:⁠2) మీరేమనుకుంటున్నారు? అంతకంతకూ అస్థిరంగా తయారవుతున్న ఈలోకంలో, దేవుని మీద ఆయన వాక్యం మీద నిజమైన విశ్వాసం కలిగి ఉండడం ఇప్పటికీ సాధ్యమేనా? ఈవిషయంలో దీని తర్వాతి ఆర్టికల్‌ ఏమి చెబుతుందో పరిశీలించండి.