కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?

దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?

దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లాలి?

ఆధునిక దంతవైద్యం తెరమీదకు రాకముందు, ప్రజలు పంటినొప్పితో బాధపడేవారు, చిన్నప్పటి నుండే పళ్లు ఊడిపోయేవి. నల్లగా, వంకరటింకరగా ఉండే పళ్లవల్ల, అసలు పళ్లే లేకపోవడంవల్ల అనేకమంది వికారంగా కనిపించేవారు. పళ్లులేని వృద్ధులు ఆహారం నమలలేకపోయేవారు కాబట్టి, కుపోషణతో బాధపడేవారు, అకాలమరణానికి గురయ్యేవారు. నేడు దంతవైద్యుని దగ్గర చికిత్స పొందుతున్నవారు పంటినొప్పి తమ దరికి చేరకుండా చూసుకోవచ్చు, జీవితాంతం తమ పళ్ళను భద్రంగా ఉంచుకోవచ్చు, ముత్యాల్లాంటి పళ్లతో చిరునవ్వు చిందించవచ్చు. ఆధునిక దంతవైద్యం ఆ మూడు అసాధారణమైన కార్యాలను ఎలా సాధించింది?

పంటి నొప్పి, పళ్లు ఊడిపోవడం వంటి సమస్యలను నిరోధించడంలో నివారణా దంతవైద్యం (ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీ) ప్రముఖ పాత్ర పోషించింది, ఆ వైద్య విధానంలో పళ్లను సంరక్షించుకునే విధానాన్ని తెలుసుకోవడం, క్రమంగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పబడుతుంది. యేసు ఇలా చెప్పాడు: “రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.” (లూకా 5:​31) ఆ వైద్యవిధానం ద్వారా పళ్లను ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని కొందరు ఎంతగా ప్రయోజనం పొందారంటే వారికి అరుదుగా దంతచికిత్స అవసరమౌతుంది. * అయితే, చాలామంది దంతవైద్యుని దగ్గరికి వెళ్లరు. కొంతమంది తమ పళ్ల విషయంలో శ్రద్ధలేక దంత చికిత్సను చేయించుకోరు. మరికొందరు ఖర్చుకు భయపడి వెనుకాడతారు. ఇంకొందరు దంతవైద్యుని దగ్గర చికిత్స చేయించుకోవడానికి జంకుతారు. మీ పరిస్థితి ఎలావున్నా, మీరు ఈ ప్రశ్నలను వేసుకోవడం మంచిది: దంతవైద్యుడు నాకు ఎలా సహాయం చేస్తాడు? ఆయన దగ్గరికి వెళ్లడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నివారణా దంతవైద్యం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవాలంటే దంతవైద్యులు దేనిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి.

పంటి సమస్యలు ఎలా ప్రారంభమౌతాయి?

పంటినొప్పివల్ల, పళ్లు ఊడిపోవడంవల్ల కలిగే బాధను నివారించేందుకు దంతవైద్యులు సహాయం చేయగలరు. మీ సహకారంతో దంతవైద్యులు మీ పళ్ళకు పట్టిన గారవల్ల కలిగే దుష్పరిణామాలు మీ దరికి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పంటికి అంటుకునే సూక్ష్మక్రిముల మెత్తటి పొరే ఆ గార. ఆ సూక్ష్మక్రిములకు ఆహార పదార్థాలు లభిస్తే చాలు వాటి సంఖ్య పెరుగుతుంది. అవి చక్కెరను ఆమ్లాలుగా మారుస్తాయి, ఆ ఆమ్లాలు పంటి ఎనామిల్‌మీద దాడిచేసి వాటిమీద సూక్ష్మరంధ్రాలు ఏర్పడేలా చేస్తాయి. కొంతకాలానికి ఆ సూక్ష్మరంధ్రాలు పెద్ద రంధ్రాలుగా మారి పుప్పిపళ్లు ఏర్పడతాయి లేక దంతక్షయం కలగవచ్చు. ఈ దశలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అయితే మీ పంటి మూలభాగంలో ఉండే మెత్తటి చిగురు పుచ్చిపోయినప్పుడు మాత్రం మీకు భరించరాని నొప్పి కలగవచ్చు.

గారగా ఏర్పడే సూక్ష్మక్రిములు మీకు మరో విధంగా కూడా నొప్పి కలిగించవచ్చు. ఆ గారను శ్రద్ధగా శుభ్రం చేయకపోతే, క్యాలుకులస్‌ లేక టార్టర్‌ (పళ్ల పాచి) అని పిలవబడే కాల్షియం పొర ఏర్పడుతుంది, దానివల్ల చిగుర్లలో మంట పుట్టవచ్చు, ఆ చిగుర్లు పళ్ళ నుండి దూరంగా విడిపోయేందుకు దారితీయవచ్చు. దానివల్ల పళ్లకూ చిగుర్లకూ మధ్య సందు ఏర్పడుతుంది, దానిలో చిక్కుకున్న ఆహారం మీ చిగుర్లకు వ్యాధిని సంక్రమింపచేసే సూక్ష్మక్రిములకు విందుగా మారుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించడంలో మీ దంతవైద్యుడు మీకు సహాయం చేయగలడు, మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ పళ్ల చుట్టూ ఉండే ధాతువులకు ఎంతగా హాని చేయవచ్చంటే మీ పళ్లు ఊడిపోవచ్చు. దంతక్షయంవల్ల నష్టపోయే పళ్లకన్నా మీరిలా చాలా పళ్లు నష్టపోవచ్చు.

సూక్ష్మక్రిములు మీ పళ్లమీద రెండు విధాలుగా చేసే ఈ దాడి నుండి మీ లాలాజలం కొంతమేరకు రక్షణనిస్తుంది. మీరు పుష్టిగా భోంచేసినా లేక ఒక్క బిస్కెట్టే తిన్నా మీ నోటిలోని ఆహార పదార్థాలను శుభ్రం చేసి మీ పంటి గారలో ఉండే ఆమ్లాల ప్రభావాన్ని తగ్గించడానికి మీ లాలాజలానికి 15 నుండి 45 నిమిషాలు పడుతుంది. దానికి పట్టే సమయం మీరు తిన్న చక్కెర జిగటదనం మీద లేదా మీ పళ్లకు అంటుకొనివున్న ఆహార పదార్థాలమీద ఆధారపడుతుంది. బహుశా ఈ సమయంలోనే మీ పండ్లకు హాని జరగవచ్చు. కాబట్టి, మీ పళ్లకు ఎంత హాని జరుగుతుందనేది మీరు తినే చక్కెర పరిమాణంమీద ఆధారపడకపోవచ్చు గానీ మీరు ఎన్నిసార్లు భోంచేశారు, ఎన్నిసార్లు తీపి పదార్థాలు తిన్నారు అనేదానిమీద ఆధారపడవచ్చు. మీరు నిద్రిస్తున్నప్పుడు లాలాజలం తక్కువగా ఊరుతుంది కాబట్టి మీరు చక్కెర ఉన్న ఆహారాన్ని తిని లేక పానీయాన్ని సేవించి పళ్లు శుభ్రం చేసుకోకుండా నిద్రకుపక్రమిస్తే మీరు మీ పళ్లకు ఎంతో హాని చేసినవారౌతారు. మరోవైపు, భోంచేసిన తర్వాత షుగర్‌-ఫ్రీ చూయింగ్‌ గమ్‌ నమిలితే లాలాజలం ఎక్కువగా ఊరి మీ పళ్లు సంరక్షించబడతాయని చెప్పబడుతుంది.

నివారణా దంతవైద్యం

మీ పళ్ల పరిస్థితినిబట్టి సంవత్సరానికి ఒకసారి లేక రెండుసార్లు దంత పరీక్షలు చేయించుకోవాలని దంతవైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఆ పరీక్షలో మీ దంతవైద్యుడు బహుశా ఎక్స్‌రేలు తీసి మీకు పుప్పిపళ్లు ఉన్నాయో లేవో పరిశీలించవచ్చు. ఆయన సాధారణంగా మత్తుమందును, హై-స్పీడ్‌ డ్రిల్‌ను ఉపయోగిస్తూ తాను కనుగొనే పుప్పిపళ్లను మీకు నొప్పి కలిగించకుండానే నింపగలడు. కొంతమంది దంతవైద్యులు, ప్రత్యేకించి భయపడేవారి కోసం ఇప్పుడు లేజర్లనూ లేక పుచ్చిపోయిన పళ్లను కరిగించే జెల్‌నూ ఉపయోగిస్తున్నారు, అది డ్రిల్‌ లేక మత్తుమందు ఉపయోగించాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు లేక దాని అవసరమే లేకుండా కూడా చేయవచ్చు. దంతవైద్యులు పిల్లలను పరీక్షిస్తున్నప్పుడు క్రొత్తగా ఏర్పడిన చర్వణకాలపట్ల (నమలడానికి ఉపయోగించే దంతాలు) ప్రత్యేక దృష్టి నిలుపుతారు, టూత్‌బ్రష్‌తో తోమడానికి కష్టంగా ఉండే పంటి నమిలేభాగంమీద పగుళ్లు లేక ఎత్తు పల్లాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. పంటి ఉపరితలాన్ని నున్నగా, శుభ్రం చేసుకోవడానికి సులభంగా ఉండేలా చేయడానికి అలాంటి ఎత్తు పల్లాలను సీలెంట్‌తో పూడ్చాలని దంతవైద్యుడు సిఫారసు చేయవచ్చు, అలా చేస్తే అది పుచ్చిపోదు.

దంతవైద్యులు పెద్దవారిని పరిశీలిస్తున్నప్పుడు, చిగుర్లకు సంబంధించిన వ్యాధి రాకుండా చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కాబట్టి, గట్టిపడిన కాల్షియం పొరలు పళ్లమీద ఏర్పడినట్లు దంతవైద్యుడు కనిపెడితే ఆయన వాటిని గీకి తీసేస్తాడు. చాలామంది తమ పళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రతీసారి కొన్ని చోట్ల శుభ్రం చేసుకోకపోవచ్చు కాబట్టి, పళ్లను శుభ్రం చేసే విషయంలో మీ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో మీ దంతవైద్యుడు సూచించవచ్చు. కొందరు దంతవైద్యులు ఈ ప్రాముఖ్యమైన సేవలకోసం తమ రోగులను ప్రత్యేక శిక్షణ పొందిన డెంటల్‌ హైజీనిస్ట్‌ (పళ్లను, చిగుర్లను ఎలా కాపాడుకోవాలో వివరించే వ్యక్తి) దగ్గరికి పంపించవచ్చు.

పాడైన పళ్లను బాగుచేయడం

మీ పళ్లు పాడైనా, ఊడిపోయినా లేక వంకరటింకరగా ఉన్నా వాటిని బాగుచేసే క్రొత్త నైపుణ్యాలెన్నో దంతవైద్యులకు తెలుసని విని మీరు సంతోషిస్తారు. అయితే వాటికి చాలా ఖర్చౌతుంది కాబట్టి మీరు మీ స్తోమతకు మించి ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయినా చాలామంది ఆ చికిత్సకు డబ్బు ఖర్చు చేయడంవల్ల ఎంతో మేలు జరుగుతుందని భావిస్తారు. దంతవైద్యుడు, మీరు ఆహారాన్ని మళ్లీ నమలగలిగేలా చేయవచ్చు. లేక మీ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా తయారయ్యేలా చేయవచ్చు. అది అల్పమైన విషయమేమీ కాదు, ఎందుకంటే వికారంగా ఉండే పళ్లు మీ జీవిత నాణ్యతను ప్రభావితం చేయగలవు.

పళ్లు పగిలినా లేక ముందరి పళ్లమీద రంగు ఏర్పడినా దంతవైద్యుడు సహజ పళ్ల ఎనామిల్‌లాగే కనిపించే పారదర్శక పింగాణీతో తయారుచేయబడే పైపూతను పంటికి పట్టించాలని సిఫారసు చేయవచ్చు. ఆ పైపూతను పాడైన పళ్ల ఉపరితలానికి అంటుకొనే విధంగా పట్టించి వాటికి క్రొత్త ఆకారాన్ని, రూపాన్ని ఇస్తాడు. పళ్లు మరింత పాడైతే వాటికి శీర్షము అని సాధారణంగా పిలవబడే క్యాపు పెట్టాల్సివుంటుందని దంతవైద్యుడు సిఫారసు చేయవచ్చు. అది పాడైన పళ్లలో మిగిలివున్న భాగాన్ని పూర్తిగా కప్పేసి, బంగారంతో లేక పళ్లలాగే కనిపించే పదార్థంతో చేసిన పూర్తి క్రొత్త ఉపరితలాన్ని ఇస్తుంది.

పళ్లు ఊడిపోతే మీ దంతవైద్యుడు ఏమి చేయవచ్చు? తీసిపెట్టుకోవడానికి వీలుండే పాక్షిక కృత్రిమ పళ్లవరుసను ఆయన అమర్చవచ్చు, లేక పళ్లు ఊడిన చోట ఇరుప్రక్కల ఉన్న పళ్లకు క్యాపులు బిగించి ఒకటి లేక అంతకన్నా ఎక్కువ కృత్రిమ పళ్లను పట్టి ఉంచే స్థిరమైన వంతెనను అమర్చగలడు. లేకపోతే ఇప్పుడు వ్యాప్తిలోకి వస్తున్న మరో చికిత్సా విధానమైన ఇంప్లాంట్‌ను ఆయన ఉపయోగించవచ్చు. దంతవైద్యుడు టైటానియమ్‌ స్క్రూని మునుపు పళ్లున్న చోట దవడ ఎముకలోకి చొప్పిస్తాడు, ఎముకతోపాటు పంటిచిగురు తిరిగి పెరిగిన తర్వాత ఆయన ఆ స్క్రూకి ఒక కృత్రిమ పంటిని అమరుస్తాడు. అది సహజమైన పళ్లున్నట్లే ఉంటుంది.

వంకరటింకరగా ఉన్న పళ్లు ఇబ్బందికరమే కాక పళ్లు శుభ్రం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉండి అవి వ్యాధుల బారిన పడే అవకాశాన్ని పెంచుతాయి. పళ్లు సరైన వరుస క్రమంలో లేకపోతే నొప్పిపెట్టవచ్చు, ఆహారం నములుతున్నప్పుడు అసౌకర్యంగా ఉండవచ్చు. సంతోషకరంగా, దంతవైద్యులు సాధారణంగా, పళ్లకు ప్రత్యేక తీగలను కట్టడంవల్ల అలాంటి సమస్యలను సరిచేయగలరు. ఇటీవలి కాలంలో ఆ తీగల డిజైన్లలో జరిగిన ప్రగతివల్ల ఆధునిక తీగలు అంతగా బయటికి కనిపించవు, వాటిని ఎక్కువగా సర్దుబాటు చేయాల్సిన అవసరంలేదు.

కొంతమంది దంతవైద్యులు చెడు శ్వాసకు చికిత్స చేసే విషయంలో మరింత అవధానమిస్తున్నారు. చాలామంది అడపాదడపా చెడు శ్వాసతో బాధపడుతుంటారు, కొందరు ఎల్లప్పుడూ దానితో బాధపడుతుంటారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరు దంతవైద్యులు నిర్దిష్ట కారణాన్ని తెలుసుకోవడంలో నిపుణులుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో, సాధారణంగా నాలుక వెనుక భాగంలో ఉండే సూక్ష్మక్రిముల ద్వారా అది వస్తుంది. నాలుకను బ్రష్‌ చేయడం ద్వారా లేక నాలుకను గీకడం ద్వారా దానిని అరికట్టవచ్చు, షుగర్‌-ఫ్రీ చూయింగ్‌ గమ్‌ను నమిలి మీ లాలాజలాన్ని మరింత ఊరేలా చేయడంవల్ల కూడా దానిని అరికట్టవచ్చు. పాల ఉత్పత్తులను, మాంసాన్ని, చేపలను ఆరగించిన తర్వాత మీ నోటిని శుభ్రం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.

భయాన్ని అధిగమించడం

దంతవైద్యుణ్ణి కలుసుకోవడమనే తలంపే మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తే మీ దంతవైద్యుడు మీ భయాన్ని పోగొట్టేందుకు సహాయం చేయాలని కోరుకుంటాడు. కాబట్టి, చికిత్స విషయంలో మీ అభిప్రాయాలను ఆయనకు చెప్పండి. మీకు నొప్పేసినప్పుడు లేక భయమేసినప్పుడు మీరు చేతులతో ఎలాంటి సైగలు చేస్తారో ఆయనకు చెప్పండి. అలా చెప్పడంవల్ల తమకు మరింత ధైర్యంగా ఉంటుందని అనేకమంది రోగులు భావించారు.

మీ పళ్లు సరిగ్గా లేనందుకు మీ వైద్యుడు మిమ్మల్ని తిడతాడని మీరు భయపడుతుండవచ్చు. మీ పళ్లపట్ల సరైన శ్రద్ధ చూపించనందుకు ఆయన మిమ్మల్ని చిన్నబుచ్చుతాడని మీరు ఆందోళనపడవచ్చు. అయితే, అలాంటి మాటలు ఆయన వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి, మీ భయాందోళనలు నిరాధారమైనవి కావచ్చు. అనేకమంది దంతవైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగులతో దయతో మాట్లాడడానికి ఇష్టపడతారు.

దంతవైద్యుని దగ్గరికి వెళ్తే చాలా ఖర్చౌతుందని భయపడి చాలామంది ఆయన దగ్గరికి వెళ్లరు. మీ పళ్లను మీరిప్పుడు పరీక్షించుకుంటే, భవిష్యత్తులో సమస్యలను కొనితెచ్చుకోరు, ఖర్చుతోకూడిన చికిత్స తప్పుతుంది. అనేక ప్రాంతాల్లో, వ్యక్తి స్తోమతకు అనుగుణంగా వివిధ రకాల దంతసేవలు అందుబాటులో ఉన్నాయి. అతిసాధారణ దంతవైద్యుని క్లినిక్‌లో కూడా ఎక్స్‌రే పరికరం, హై-స్పీడ్‌ డ్రిల్‌ ఉండొచ్చు. దంతవైద్యులు రోగికి అంతగా ఇబ్బంది కలిగించకుండానే అనేక చికిత్సా విధానాలను నిర్వహించగలరు. మత్తుమందుకు అయ్యే ఖర్చు కూడా చాలామంది భరించేంత తక్కువగా ఉంటుంది, తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా దానిని భరించవచ్చు.

దంతవైద్యులు నొప్పిని తగ్గించడానికి ఇష్టపడతారు గానీ నొప్పి కలిగించడానికి ఇష్టపడరు. మీ తాత అమ్మమ్మల కాలంతో పోలిస్తే ఇప్పుడు, దంత చికిత్స చాలా ప్రగతి సాధించింది. ఆరోగ్యకరమైన పళ్లు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు, మీ జీవితాన్ని మరింత సంపూర్ణంగా ఆస్వాదించేందుకు మీకు దోహదపడతాయి కాబట్టి మీరు దంతవైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్లకూడదు? మీకు ఆశ్చర్యానందాలు కలగవచ్చు. (g 5/07)

[అధస్సూచి]

^ ఈ ఆర్టికల్‌, దంతవైద్యుడు రోగికి సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వివరిస్తుంది. మీ పళ్లను సంరక్షించుకోవడానికి మీరు ఏమి చేయవచ్చో తెలుసుకోవడానికి, తేజరిల్లు! (ఆంగ్లం) నవంబరు 8, 2005 సంచికలోని “మీరు చిరునవ్వును ఎలా కాపాడుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ను చూడండి.

[29వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆరోగ్యకరమైన దంత నిర్మాణం

శీర్షము

ఎనామిల్‌

డెంటిన్‌

పంటి మూలభాగంలో నరాలతో రక్తనాళాలతోపాటు ఉండే మెత్తని చిగురు

మూలం

చిగురు ధాతువు (జింజావా)

ఎముక

[29వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దంతక్షయం

పంటితొర్ర

పళ్లతొర్రల్లో పళ్లలాగే కనిపించే పదార్థాలు నింపడంవల్ల ఆ తొర్రలు పెరగవు

[29వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చిగురు వ్యాధి

గారను శుభ్రం చేయాలి లేక ఫ్లాసింగ్‌ చేయాలి

క్యాలుకులస్‌ లేక టార్టర్‌ను తొలగించడం కష్టం, అవి చిగుళ్లు విడిపోయేలా చేస్తాయి

విడిపోతున్న చిగుర్లు

[30వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పళ్లను బాగుచేయడం

పైపూత పళ్లకు అంటుకొని ఉంటుంది

క్యాపు

ఇంప్లాంట్‌

ఫిక్స్‌ చేయబడిన వంతెన ఇరుప్రక్కల ఉన్న పళ్లకు బిగించిన క్యాపులు కృత్రిమ పళ్లను స్థిరంగా పట్టి ఉంచుతాయి