కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివక్షకు మూలకారణాలు

వివక్షకు మూలకారణాలు

వివక్షకు మూలకారణాలు

వివక్షకు అనేక కారణాలు ఉండవచ్చు. అయితే రుజువైన కారణాలు రెండు, (1) నిందించడానికి ఎవరు దొరుకుతారా అని చూడడం, (2) చరిత్రలో జరిగిన అన్యాయాల కారణంగా ఏర్పడిన పగ.

ముందరి ఆర్టికల్‌లో గమనించినట్లుగా, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రజలు తరచూ ఎవరినో ఒకరిని నిందించడానికి వెదకుతారు. ప్రముఖులు ఎవరైనా, అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారికి వ్యతిరేకంగా పదేపదే ఏదైనా ఆరోపణ చేస్తే, అది వెంటనే అంగీకరించబడుతుంది, దానినుండి వివక్ష పుట్టుకొస్తుంది. ఒక సాధారణ ఉదాహరణ చెప్పాలంటే, పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు కలిగే నిరుద్యోగ సమస్యకు వలస వచ్చినవాళ్ళే కారణమని నిందించబడతారు. వలస వచ్చినవాళ్ళు తరచూ స్థానిక ప్రజలు చేయడానికి నిరాకరించే ఉద్యోగాలనే చేస్తున్నా వాళ్ళపై ఆ నింద మోపబడుతుంది.

అయితే వివక్ష అన్ని సమయాల్లోను నిందించడానికి ఎవరు దొరుకుతారా అని వెదకడం నుండే పుట్టదు. అది చరిత్రపై కూడా ఆధారపడి ఉండవచ్చు. “బానిస వ్యాపారం జాతి విభేదాలను, నల్లజాతి వాళ్ళపట్ల తృణీకార భావాన్ని వృద్ధి చేసింది అనడం అతిశయోక్తి కాదు” అని యునెస్కో ఎగెయిన్స్‌ట్‌ రేసిజమ్‌ నివేదిక పేర్కొంది. బానిస వ్యాపారులు, ఆఫ్రికా దేశస్థుల్ని తక్కువ జాతివారని వాదిస్తూ మానవులను అమ్మడం కొనడం ద్వారా తాము చేసే నీచమైన వ్యాపారాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత వలస ప్రజలకు కూడా అంటగట్టబడిన ఈ నిరాధారిత వివక్ష ఇంకా ఉనికిలోనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అణచివేత, అన్యాయానికి సంబంధించిన ఇలాంటి సంఘటనలు వివక్షకు ఊపిరిపోస్తున్నాయి. ఐర్లాండులోని క్యాథలిక్కులకు, ప్రొటస్టెంట్లకు మధ్యవున్న విరోధం, 16వ శతాబ్దంలో ఇంగ్లాండు పాలకులు క్యాథలిక్కులను హింసించి, దేశంనుండి బహిష్కరించినప్పుడు ప్రారంభమయ్యింది. మతయుద్ధాలప్పుడు నామకార్థ క్రైస్తవులు చేసిన దారుణకృత్యాలు మధ్యప్రాచ్య ముస్లిముల్లో ఇప్పటికీ విరోధ భావాలను రేకెత్తిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన జనసంహారం బాల్కన్‌ ప్రాంతాల్లోని సెర్బ్‌ల, క్రొయేషియన్‌ల మధ్య విరోధాన్ని తీవ్రతరం చేసింది. ఈ ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా రెండు వర్గాల మధ్యగల శత్రుత్వపు చరిత్ర వివక్షను బలపరుస్తుంది.

అజ్ఞానాన్ని పెంపొందించడం

తప్పటడుగులువేసే పిల్లవాని హృదయంలో వివక్షకు చోటు ఉండదు. దానికి భిన్నంగా, ఒక పిల్లవాడు తరచూ మరోజాతి పిల్లవానితో ఆడుకోవడానికి వెనుకాడడని పరిశోధకులు చెబుతున్నారు. అయితే పిల్లవాడికి 10 లేదా 11 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను వేరే తెగ, జాతి లేదా మతంవారిని తిరస్కరించవచ్చు. ఆ పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు, జీవితాంతం నిలిచిపోయే అనేక దృక్కోణాలను అలవరచుకుంటాడు.

ఆ ఆలోచనలను అతనెలా అలవరచుకుంటాడు? ఒక పిల్లవాడు మొదట తన తల్లిదండ్రుల నుండి, ఆ తర్వాత తన స్నేహితుల, టీచర్ల మాటల నుండి, చేతల నుండి ప్రతికూల దృక్పథాలను నేర్చుకుంటాడు. ఆ తర్వాత పొరుగువారు, వార్తాపత్రికలు, రేడియో లేదా దూరదర్శిని అతనిపై మరింత ప్రభావం చూపించవచ్చు. తాను ఇష్టపడని గుంపుల గురించి అతనికి కేవలం కొంచమే తెలిసినా లేదా అస్సలు తెలియకపోయినా అతను పెరిగి పెద్దయ్యేసరికి ఆ గుంపువాళ్ళు తక్కువ స్థాయికి చెందినవాళ్ళు, నమ్మదగనివాళ్ళు అనే భావం అతనిలో బలంగా నాటుకుంటుంది. దానితో అతను వాళ్ళను ద్వేషించవచ్చు కూడా.

ప్రయాణ సౌకర్యాలు, వ్యాపార సంబంధాలు ఎక్కువ కావడంతో అనేక దేశాల్లో విభిన్న సంస్కృతుల, జాతుల ప్రజల మధ్య సంబంధాలు పెరిగాయి. అయితే బలమైన వివక్షను పెంచుకున్న వ్యక్తి తాను ముందుగా అలవరచుకున్న భావాలనే పట్టుకు వ్రేలాడతాడు. అతను వేలాదిమందిని లేదా లక్షలాదిమందిని ఒకే గుంపుకు చెందిన ప్రజలుగా వర్గీకరించి వాళ్ళందరికీ ఒకేలాంటి చెడు లక్షణాలున్నాయని పట్టుబట్టవచ్చు. ఆ గుంపుకు చెందిన ఒక వ్యక్తివల్ల ఏదైనా ప్రతికూల అనుభవం ఎదురైతే అతనికున్న వివక్ష మరింత బలపడుతుంది. దానికి భిన్నంగా అనుకూల అనుభవాలు ఎదురైతే, అవి మినహాయింపులని త్రోసిపుచ్చబడతాయి.

వివక్షను అధిగమించడం

చాలామంది సిద్ధాంతపరంగా వివక్షను ఖండించినా, కొద్దిమంది మాత్రమే దాని ప్రభావాన్నుండి తప్పించుకుంటారు. వాస్తవానికి, వివక్ష బలంగా నాటుకొనివున్న చాలామంది తాము అలాంటి వారం కాదని వాదిస్తారు. ప్రజలు తమ వివక్షను తమవరకే ఉంచుకుంటే అదంత ప్రాముఖ్యం కాదని మరికొందరు అంటారు. అయితే వివక్ష ముఖ్యమైన విషయమే ఎందుకంటే అది ప్రజలను గాయపరిచి వాళ్ళను విభాగిస్తుంది. అజ్ఞానానికి వివక్ష కొడుకైతే, ద్వేషం దాని మనవడు అని చెప్పవచ్చు. రచయిత ఛార్లెస్‌ కేలెబ్‌ కోల్టన్‌ (1780?-1832) ఇలా అన్నాడు: “మనకు కొందరు ప్రజలు తెలియదు కాబట్టి వాళ్ళను ద్వేషిస్తాము; మనం వాళ్ళను ద్వేషిస్తున్నాము కాబట్టి వాళ్లెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించము.” ఏదేమైనా, వివక్షను అలవర్చుకోగలిగినప్పుడు, దానిని అవతలికి నెట్టివేయవచ్చు కూడా. అదెలా సాధ్యం? (g04 9/8)

[7వ పేజీలోని బాక్సు]

మతం​—⁠సహనాన్ని ప్రేరేపిస్తుందా లేదా వివక్షను ప్రేరేపిస్తుందా?

“సగటున, చర్చి సభ్యులు కాని వారికంటే చర్చి సభ్యులే ఎక్కువ వివక్ష చూపిస్తున్నట్లు కనబడుతోంది” అని ద నేచర్‌ ఆఫ్‌ ప్రిజుడీస్‌ అనే తన పుస్తకంలో గోర్డన్‌ డబ్ల్యు. ఆల్‌పోర్ట్‌ చెప్పాడు. వివక్షను పరిష్కరించే బదులు తరచూ మతమే వివక్షకు అసలు కారణం, కాబట్టి గోర్డన్‌ అభిప్రాయం మనల్ని ఆశ్చర్యపరచదు. ఉదాహరణకు, మతనాయకులే ఎన్నో శతాబ్దాలుగా యూదులపట్ల వ్యతిరేక భావాలను పురికొల్పారు. ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటి అనే పుస్తకం ప్రకారం, హిట్లర్‌ ఒకసారి ఇలా అన్నాడు: “యూదులకు సంబంధించి నేను గత 1,500 సంవత్సరాలుగా క్యాథలిక్‌ చర్చి అనుసరించిన పద్ధతినే అనుసరిస్తున్నాను.”

బాల్కన్‌ ప్రాంతాల్లో దారుణకృత్యాలు జరిగినప్పుడు, మరో మతానికి చెందిన పొరుగువారిపట్ల సహనం, గౌరవం చూపించేలా క్రైస్తవులను పురికొల్పడంలో ఆర్థొడాక్స్‌, క్యాథలిక్‌ చర్చీల బోధలు విఫలమైనట్లు కనిపిస్తోంది.

అదే విధంగా, రువాండాలో చర్చి సభ్యులే తోటి విశ్వాసులను వధించారు. అక్కడి పోరాటంలో “అక్షరార్థంగా నిజమైన జాతి నిర్మూలనే జరిగింది, దానికి క్యాథలిక్కులు కూడా బాధ్యులు కావడం శోచనీయం” అని నేషనల్‌ క్యాథలిక్‌ రిపోర్టర్‌ చెప్పింది.

క్యాథలిక్‌ చర్చే స్వయంగా తాను ఇతర మతానికి చెందినవారిపట్ల చూపించిన అసహనతను గుర్తించింది. 2000వ సంవత్సరంలో రోమ్‌లో జరిగిన ప్రజా మాస్‌లో పోప్‌ జాన్‌ పాల్‌ II “గతంలో చేసిన పొరపాట్లకు” క్షమాపణ కోరాడు. ఆ ఆచరణలో, “యూదులు, స్త్రీలు, ఆదినివాసులు, వలస వచ్చిన ప్రజలు, బీదలు, జన్మించని శిశువుల మతం విషయంలో ప్రదర్శించబడిన అసహనం, జరిగిన అన్యాయం” ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి.

[6వ పేజీలోని చిత్రం]

పైన: శరణార్థి శిబిరం, బోస్నియా మరియు హెర్జెగోవినా, అక్టోబరు 20, 1995

అంతర్యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్న ఇద్దరు బోస్నియన్‌ సెర్బ్‌ శరణార్థులు

[చిత్రసౌజన్యం]

చిత్రాలు Scott Peterson/Liaison

[7వ పేజీలోని చిత్రం]

ద్వేషించడం నేర్పించబడింది

పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి, దూరదర్శిని తదితర చోట్లనుండి ప్రతికూల దృక్పథాలు ఏర్పరచుకోవచ్చు