కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బీరు_పసిడి రంగు పానీయం కథ

బీరు_పసిడి రంగు పానీయం కథ

బీరు_పసిడి రంగు పానీయం కథ

చెక్‌ రిపబ్లిక్‌లోని తేజరిల్లు! రచయిత

బాగా దప్పికతో ఉన్న ఒక వ్యక్తి కోరుకునేదేమిటి? అనేక దేశాల్లో అతను శ్రామికుడైనా, వ్యాపారవేత్త అయినా తనకు ఇష్టమైన పసిడి రంగు పానీయాన్ని ఓ గ్లాసుడు కోరుకుంటాడు. నురుగులు పొంగుతూ చిరుచేదుగా ఉండే కమ్మని పానీయం అతని కళ్లలో మెదలవచ్చు. ఆ తర్వాత అతను తనలోతాను ‘ఒక గ్లాసు చల్లటి బీరు కోసం నేనేమైనా ఇవ్వగలను!’ అనుకుంటాడు.

బీరు దాదాపు మానవ చరిత్రంత పురాతనమైనది. సహస్రాబ్దాలుగా అది ప్రజాదరణ పొందుతూనే ఉంది, అంతేకాక అది అనేక ప్రాంతాల స్థానిక సంస్కృతిలో అంతర్భాగమైంది. అయితే ప్రత్యేకించి కొన్ని యూరోపియన్‌ దేశాల్లో బీరు అధికంగా సేవించే వారికి అది సమస్యల సుడిగుండంలా తయారు కావడం శోచనీయం. కానీ మితంగా సేవిస్తే, దాని విలక్షణత, రుచి మధురానుభూతిని కలిగిస్తాయి. ప్రజాదరణ పొందిన ఈ పానీయం చరిత్రను మనం పరిశీలిద్దాం.

దీనిని తయారు చేయడం ఎప్పుడు మొదలుపెట్టారు?

మెసొపొతమియలోని ప్రాచీన సుమేరియన్లు నివసించిన ప్రాంతాల్లో దొరికిన కీలలిపి పలకలు చూపిస్తున్నట్లుగా, సా.శ.పూ. మూడవ సహస్రాబ్దికల్లా అక్కడ బీరు అందుబాటులోకి వచ్చింది. అదే కాలానికి చెందిన బబులోనీయులు, ఐగుప్తీయులు కూడా దానిని సేవించేవారు. బబులోనులో 19 రకాల బీరు తయారు చేయబడేది, హమ్మురాబి నియమావళిలో చేర్చబడిన సూత్రాల్లో దీని తయారీ నిర్దేశించబడింది. ఆ సూత్రాలు బీరు ఖరీదు మొదలైనవాటిని సూచించేవి, ఆ సూత్రాలను ఉల్లంఘించినవారికి మరణ శిక్ష విధించబడేది. ప్రాచీన ఐగుప్తులో బీరు విస్తృతంగా తయారు చేయబడేది, అది అక్కడి ప్రజల అభిమాన పానీయంగా ఉండేది. అక్కడ జరిగిన పురాతత్త్వ పరిశోధనా త్రవ్వకాల్లో బీరు తయారీకి సంబంధించిన అతి పురాతన తయారీ విధానం కనుగొనబడింది.

చివరకు బీరు తయారీ యూరప్‌కు విస్తరించింది. సామాన్య శకం ఆరంభంలో కొందరు రోమన్‌ చరిత్రకారులు సెల్టులు, జర్మన్‌లు, ఇతర తెగలకు చెందినవారు బీరును ఆస్వాదించేవారని పేర్కొన్నారు. వాల్‌హల్లాలో సైతం అంటే నార్డిక్‌ పురాణాల ప్రకారం ధైర్యవంతులైన శూరులు మరణాంతరం చేరుకునే మందిరంలో పురుషుల చేతుల్లోని గ్లాసుల్లో బీరు తొణికిసలాడేదని సముద్రపు దొంగలు నమ్మేవారు.

మధ్యయుగాల్లో యూరప్‌లో బీరు, సన్యాసుల మఠాల్లో తయారు చేయబడేది. యూరోపియన్‌ సన్యాసులు బీరు చెడిపోకుండా ఉండేందుకు హాప్‌ ఫలాలను ఉపయోగిస్తూ దాని తయారీ విధానానికి మెరుగులు దిద్దారు. 19వ శతాబ్దపు పారిశ్రామీకరణతో బీరును యంత్రాల సహాయంతో తయారు చేయడం ప్రారంభించారు, అది ఈ ప్రఖ్యాత పానీయపు చరిత్రలోనే మైలురాయిగా మారింది. ఆ తర్వాత చాలా ప్రాముఖ్యమైన విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు జరిగాయి.

బీరును పులియబెట్టడానికి వాడే ఈస్ట్‌లో సూక్ష్మక్రిములు ఉన్నాయని ఫ్రెంచి దేశపు రసాయన శాస్త్రవేత్త, సూక్ష్మక్రిమి శాస్త్రవేత్త అయిన లూయిస్‌ పాశ్చర్‌ కనుగొన్నాడు. దానితో చక్కెర పదార్థాన్ని ఆల్కహాలుగా మార్చే విధానాన్ని మరింత ప్రామాణికంగా నియంత్రించడం సాధ్యమైంది. బీరు తయారీ చరిత్రలో డెన్మార్క్‌ దేశ వృక్షశాస్త్ర నిపుణుడైన ఐమెల్‌ క్రిస్టెయన్‌ హాన్‌సెన్‌ అత్యంత ప్రఖ్యాతిగాంచాడు. ఆయన తన జీవితమంతా పరిశోధనలో గడిపి వివిధ రకాల ఈస్ట్‌లను వర్గీకరించాడు. ఆయన బీరు తయారీకి అవసరమయ్యే స్వచ్ఛమైన ఈస్ట్‌ను తయారు చేయడంపై ఎక్కువగా పరిశోధన చేశాడు. ఆ విధంగా హాన్‌సెన్‌, బీరు తయారీలో ఒక విప్లవమే తెచ్చాడు.

అయితే బీరును తయారు చేయడం అంత కష్టమా? బహుశా అది నమ్మశక్యం కాకపోవచ్చు కానీ బీరును తయారు చేయడం నిజంగా కష్టమే. ఎంతో రుచికరమైన బీరు తయారు చేయడం వెనకున్న రహస్యాన్ని మనమిప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం.

అది మీ గ్లాసులోకి చేరకముందు

శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ బీరు తయారు చేసే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి, నేడు కూడా బీరు తయారుచేసే కర్మాగారాలు ఒక్కొక్కటీ ఒక్కో పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. అయితే సాధారణంగా అన్ని రకాల బీరుల్లోనూ నాలుగు ప్రధాన పదార్థాలు ఉంటాయి: బార్లీ (యవలు), హాప్‌ ఫలాలు, నీళ్ళు, ఈస్ట్‌. బీరు తయారు తయారు చేసే పద్ధతిని నాలుగు చర్యలుగా విభాగించవచ్చు: ధాన్యాన్ని నానబెట్టడం (మాల్టింగ్‌), వార్ట్‌ను తయారుచేయడం, పులియబెట్టడం, పక్వదశకు తీసుకురావడం.

ధాన్యాన్ని నానబెట్టడం. ఈ దశలో బార్లీని ఎంచుకొని, తూకంవేసి రాళ్లురప్పలు లేకుండా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని నీటిలో నానబెడతారు, బార్లీ మొలకెత్తడానికి ఇలా చేయడం అవసరం. దాదాపు 14 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో ఐదు నుండి ఏడు రోజుల్లో బార్లీ మొలకెత్తుతుంది. ఆ తర్వాత మొలకెత్తిన బార్లీని ఆరబెట్టడానికి ప్రత్యేక బట్టీల్లోకి చేరుస్తారు. మొలకల పెరుగుదలను నిరోధించడానికి బార్లీలోని తేమను 2 నుండి 5 శాతం వరకు తగ్గిస్తారు. అలా ఆరబెట్టిన తర్వాత, బార్లీనుండి ఆ మొలకలు తొలగించి, వాటిని మెత్తని పిండిగా చేస్తారు. అది తర్వాతి చర్యకు సిద్ధమవుతుంది.

వార్ట్‌ను తయారుచేయడం. ఆ బార్లీ పిండిని నీళ్ళలో కలిపి గుజ్జులా తయారు చేసి, నెమ్మదిగా వేడి చేస్తారు. ఒకానొక ఉష్ణోగ్రతకు చేరుకోగానే ఆ గుజ్జులోని సేంద్రియ పదార్థాలు పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చడం ఆరంభిస్తాయి. ఆ ప్రక్రియ నాలుగుకంటే ఎక్కువ గంటలపాటు కొనసాగిన తర్వాత తయారైన వార్ట్‌ను వడబోసి దానిలోని మలినాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత సేంద్రియ పదార్థాల చర్యను ఆపేందుకు దానిని మరగబెడతారు. వార్ట్‌ను అలా మరగబెడుతున్నప్పుడు, బీరుకు విలక్షణమైన చేదు రుచి రావడానికి హాప్‌ ఫలాలు చేరుస్తారు. అలా రెండు గంటలపాటు మరగబెట్టిన తర్వాత, వార్ట్‌ను తగిన ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు.

పులియబెట్టడం. బీరు తయారీలో ఇది బహుశా అత్యంత ప్రాముఖ్యమైన దశ. ఈ దశలో వార్ట్‌లోని చక్కెర పదార్థాన్ని ఈస్ట్‌ ద్వారా ఆల్కహాలుగా, కార్బన్‌డయాక్సైడ్‌గా మార్చబడుతుంది. దానికి ఒక వారంకంటే ఎక్కువ పట్టదు, ఆ ప్రక్రియకు అవసరమైన ఉష్ణోగ్రత ఎలాంటి బీరు తయారు చేయాలనే దానిబట్టి అంటే ఏల్‌ లేదా లేగర్‌ రకాలనుబట్టి ఉంటుంది. గ్రీన్‌ బీర్‌ అని పిలువబడే ఆ ద్రావకం పక్వదశకు చేరుకోవడానికి భూగృహంలోని పెద్ద తొట్లలోకి మారుస్తారు.

పక్వదశకు తీసుకురావడం. ఈ దశలో బీరు తనదైన రుచిని, వాసనను సంతరించుకుంటుంది; అంతేకాక సహజంగా ఉత్పన్నమయ్యే కార్బన్‌డయాక్సైడ్‌ బీరుకు ఆ మెరుపు తెస్తుంది. బీరు రకాన్ని బట్టి అది పక్వదశకు చేరుకోవడానికి మూడు వారాల నుండి కొన్ని నెలల వరకు పట్టవచ్చు. చివరకు అలా తయారైన బీరు చెక్క డ్రమ్ముల్లో లేదా సీసాల్లో నింపబడి దాని గమ్యస్థానానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది, బహుశా అది చివరకు మీ బల్లమీదకు చేరవచ్చు! అయితే మీరు ఏ రకం బీరు త్రాగాలనుకుంటారు?

బీరులో అనేక రకాలున్నాయి

నిజానికి బీరు వివిధ రకాలుగా ఉండవచ్చు. లేత రంగులోవున్న లేదా ముదురు రంగులో ఉన్న, తియ్యగావున్న లేదా చేదుగావున్న, అలాగే బార్లీతో చేసినా గోధుమతో చేసినా బీరును మీరు ఆస్వాదించవచ్చు. బీరు రుచి అనేక విషయాలపై అంటే ఉపయోగించబడిన నీటి నాణ్యత, ధాన్యపు పిండి నాణ్యత, ఉపయోగించబడిన పద్ధతి, ప్రక్రియలో ఉపయోగించబడిన ఈస్ట్‌లు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రఖ్యాత బీరుల్లో ఒకటి, పిల్సినర్‌ (లేదా పిల్సి) అని పిలువబడే అంతగా రంగు ఉండని లేగర్‌ బీరు. ప్రపంచవ్యాప్తంగా వందలాది కర్మాగారాలు ఈ రకం బీరును తయారు చేస్తున్నాయి. అయితే, అధికారిక పిల్సినర్‌ బీరు మాత్రం ఛెక్‌ రిపబ్లిక్‌లోని ప్లిజెన్‌ లేదా పిల్సెన్‌ పట్టణంలోనే తయారవుతుంది. దాని ఉత్పత్తిలోని రహస్యం అది తయారు చేయబడే పద్ధతిలోనే కాక వాడే ముడి పదార్థాల్లో అంటే లవణమూ ఖనిజమూ లేని నీరు, అత్యంత ప్రామాణికమైన ధాన్యపు పిండి, బీరు తయారీకి సంబంధించి సరైన ఈస్ట్‌ వంటివాటిలో కూడా ఉంది.​—⁠పక్కనున్న బాక్సు చూడండి.

మరో మంచి రకమైన బీరు విస్‌ బీరు, ఇది ప్రత్యేకంగా జర్మనీలో ప్రజాదరణ పొందిన గోధుమ బీరు. బ్రిటన్‌లో పోర్టర్‌, స్టౌట్‌ రకాలు ప్రత్యేకమైనవి. పోర్టర్‌ బీరు బాగా పులియబెట్టే ఈస్ట్‌తో తయారైన ఎక్కువ మత్తునిచ్చే బీరు, ఇది వేయించిన ధాన్యంతో తయారు చేయబడుతుంది, అందుకే ఇది ముదురు రంగులో ఉంటుంది. పోర్టర్‌ బీరు మొదటిగా 18వ శతాబ్దంలో లండన్‌లో తయారు చేయబడింది. మొదట్లో ఈ బీరు కష్టపడి పనిచేసే కూలీలకు “బలాన్నిచ్చే” పానీయంగా ఉపయోగించడానికి ఉద్దేశించబడింది. స్టౌట్‌ బీరు బాగా ముదురు రంగులో ఉండి మత్తునిస్తుంది, గిన్నీస్‌ కుటుంబంవల్ల ఇది ఐర్లాండులోనే కాక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇది సాంప్రదాయ పోర్టర్‌ బీరుకు భిన్నంగా ఉంటుంది. మీరు సాధారణంగా లాక్టోస్‌ (పాలచక్కెర) ఉండే తియ్యని ఇంగ్లీష్‌ స్టౌట్‌ను లేదా చేదుగా, ఆల్కహాలు శాతం ఎక్కువగా ఉండే ఐరిష్‌ స్టౌట్‌ను ఆస్వాదించవచ్చు.

బీరు త్రాగే అనేకులకు దానిని తీసుకొనే విషయంలో అంటే అది సీసాలోదా లేక క్యాన్‌లోదా లేక ఒక పీపానుండి తీయబడిందా అనేవి ప్రాముఖ్యం. అమెరికన్‌లు బాగా చల్లగా చేయబడిన బీరును తీసుకోవడానికి మొగ్గుచూపుతారు. మరి కొందరు గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా లేదా కొంత చల్లగా ఉండి బీరు షాపు భూగృహంలో ఉంచిన డ్రమ్ముల్లో నుండి నేరుగా ఇవ్వబడే బీరును ఇష్టపడతారు.

నిజంగానే బీరులో అనేక రకాలున్నాయి. మోతాదుకు మించకుండా తీసుకున్నప్పుడు, దానివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి, దానిలో రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, క్రోమియమ్‌, జింక్‌ వంటి వివిధ రకాల ప్రాముఖ్యమైన విటమిన్లు, ఖనిజ పదార్థాలు ఉంటాయి. కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం, బీరును మితంగా త్రాగడం హృదయ సంబంధ రుగ్మతలను, చర్మసంబంధ వ్యాధులను అరికట్టడానికి సహాయం చేస్తుంది. అందుబాటులో ఉన్న కంపెనీల నుండి, రకాల నుండి మంచివాటిని ఎంచుకోగలిగి, త్రాగే విషయంలో సమతుల్యం కాపాడుకుంటే ఈ మధురమైన, ఆహ్లాదకరమైన పానీయాన్ని మీరు ఆస్వాదించవచ్చు. కాబట్టి ఈసారి మీరు తెల్లటి నురుగులు పొంగే ఈ పసిడి రంగు పానీయపు గ్లాసుతో కూర్చున్నప్పుడు దాని ఆసక్తికరమైన చరిత్రను గుర్తుతెచ్చుకోండి! (g04 7/8)

[25వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రముఖ పాత్రధారులు

పూర్వం అనేకమంది నిపుణుల ప్రమేయంతో బీరు తయారు చేయబడేది. వారిలో కొందరి గురించి తెలుసుకోండి.

మాల్ట్‌స్టర్‌​—బీరు తయారీలో మొదటి పాత్రధారి. అతను బార్లీనుండి లేదా గోధుమలనుండి పిండిని తయారు చేయడానికి నియమించబడతాడు. అతను ధాన్యం మొలకెత్తడాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబెట్టడాన్ని పర్యవేక్షిస్తాడు. బీరు రుచి ధాన్యపు పిండి నాణ్యతపై ఎంతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతనిపై బరువైన బాధ్యత ఉంటుంది.

బ్రూవర్‌ (పైన చూపబడిన వ్యక్తి)​—⁠మరగబెట్టడాన్ని పర్యవేక్షిస్తాడు. మొదట, ఆయన ధాన్యపు పిండిని నీటితో కలిపి, దానిని మరిగించేటప్పుడు హాప్‌ ఫలాలు చేరుస్తాడు. అతని పని మూలంగానే వార్ట్‌ తయారవుతుంది.

సెల్లార్‌ మాస్టర్‌​—⁠ఈయన తొట్లలో ఉన్న బీరు పులియడాన్ని, భూగృహంలో అది పక్వదశకు చేరుకోవడాన్ని పర్యవేక్షించే అనుభవంగల నిపుణుడు. ఆ తర్వాత తయారైన బీరును ఆయన చిన్నసైజు పాత్రల్లోకి మారుస్తాడు.

[చిత్రసౌజన్యం]

S laskavým svolením Pivovarského muzea v Plzni

[26వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పిల్సినర్‌ అత్యధికంగా అనుకరించబడిన ప్రాచీన బీరు

పిల్సినర్‌ తయారీ 1295లో ఆరంభమైంది. బొహెమియా రాజు వెన్సిస్‌లాస్‌ II ప్లిజెన్‌ పట్టణం స్థాపించి, ఆ తర్వాత అనతికాలంలోనే 250 మంది ప్లిజెన్‌ పౌరులకు బీరు తయారు చేసే హక్కు ఇచ్చాడు. మొదట్లో ఆ పౌరులు చిన్న మొత్తాల్లో తమ ఇళ్ళలోనే బీరును తయారు చేసేవారు, కానీ ఆ తర్వాత వాళ్ళు వ్యాపార సంఘాలు స్థాపించి బీరు తయారుచేసే కర్మాగారాలను నెలకొల్పారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి బొహెమియా ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి క్షీణించిపోయింది, అది బీరు తయారీపై ప్రభావం చూపింది. తయారీదారులు ఆమోదించబడిన పద్ధతిని పక్కనబెట్టి తమ సొంత విధానాలు ఉపయోగిస్తూ బీరు అనడానికే అనర్హమైన విరసమైన పానీయం తయారు చేశారు.

ఆ కాలంలో యూరప్‌లో రెండురకాల బీరు తయారు చేయబడేది. బొహెమియాలో ప్రత్యేకంగా ఎక్కువ ఉష్ణోగ్రత క్రింద పులియబెట్టిన బీరు తయారు చేయబడేది, బవేరియాలో తక్కువ ఉష్ణోగ్రత క్రింద అనేక నెలలపాటు పులియబెట్టి తయారు చేయబడిన ఎంతో మెరుగైన నాణ్యతగల బీరు ప్రజాదరణ పొందింది. బవేరియా లేగర్‌ బీర్లకు ప్లిజెన్‌ బీర్లకు చాలా తేడా ఉండేది.

అయితే, 1839లో ఒక ప్రాముఖ్యమైన మార్పు జరిగింది. ప్లిజెన్‌ పౌరుల్లో 200 మంది పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు బర్గెస్‌ బట్టీని స్థాపించారు, అక్కడ తక్కువ ఉష్ణోగ్రత క్రింద అనేక నెలలపాటు పులియబెట్టిన బీరును లేదా బవేరియన్‌ బీరును మాత్రమే తయారు చేయాలని అనుకున్నారు. ప్రఖ్యాత బ్రూవర్‌ యోసెఫ్‌ గ్రోల్‌ను బవేరియా నుండి పిలిపించారు. ఆయన వెంటనే విలక్షణమైన బవేరియన్‌ బీరు తయారు చేయడం ఆరంభించాడు. ఫలితం అద్భుతంగా ఉండడమే కాక, ఊహించిన దానికంటే మరింత మెరుగైన బీరు తయారైంది. గ్రోల్‌ అనుభవానికి నాణ్యమైన స్థానిక ముడి పదార్థాలు తోడుకావడంతో లోకాన్ని మైమరిపించే బీరును తయారు చేయడానికి సహాయం లభించింది. అలాగని ఎందుకు అనవచ్చు? ఎందుకంటే దాని రుచి, రంగు, వాసన అమోఘంగా ఉంటాయి. కానీ ప్లిజెన్‌ బీరు ఉత్కృష్టత కొన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. అనేకమంది తయారీదారులు దానినుండి లాభం పొందడానికి తమ ఉత్పత్తులను కూడా పిల్సినర్‌ బీరు అని పిలవడం ఆరంభించారు. అలా పిల్సినర్‌ ప్రఖ్యాతిగాంచడమే కాక, అత్యధికంగా అనుకరించబడిన పసిడి రంగు పానీయంగా కూడా తయారైంది.

[చిత్రాలు]

యోసెఫ్‌ గ్రోల్‌

ప్లిజెన్‌ బీరుబట్టీ నీటి బురుజు

[చిత్రసౌజన్యం]

S laskavým svolením Pivovarského muzea v Plzni

[24వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ప్లిజెన్‌

[24, 25వ పేజీలోని చిత్రం]

రొట్టె, బీరు తయారీని వర్ణించే ఐగుప్తు నమూనా

[చిత్రసౌజన్యం]

Su concessione del Ministero per i Beni e le Attività Culturali - Museo Egizio - Torino

[27వ పేజీలోని చిత్రాలు]

హాప్‌ ఫలాలు, ధాన్యపు పిండి, తయారీ స్థలం