యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?
యుద్ధాలు, దాడులు జరగడానికి కారణాలు ఏంటి? అవి ఎందుకు ఆగట్లేదు? బైబిలు ఏం చెప్తుందో చూద్దాం.
పాపం
మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వల్ని దేవుడు తన స్వరూపంలో చేశాడు. (ఆదికాండం 1:27) అంటే, ఆయన తన లక్షణాలన్నిటినీ మనిషిలో పెట్టాడు. కాబట్టి వాళ్లు శాంతిగా ఉండగలరు, ప్రేమను చూపించగలరు. (1 కొరింథీయులు 14:33; 1 యోహాను 4:8) అయితే, ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపం చేశారు. దానివల్ల, మనుషులందరికీ వారసత్వంగా పాపం, మరణం వచ్చాయి. (రోమీయులు 5:12) మనలో ఉండే పాపం కారణంగా మనకు తరచూ చెడు ఆలోచనలు వస్తాయి. దానివల్ల చాలామంది ఇతరులకు హాని చేస్తారు.—ఆదికాండం 6:5; మార్కు 7:21, 22.
మనుషుల పరిపాలన
మనుషులు ఒకరినొకరు పరిపాలించుకునే సామర్థ్యంతో దేవుడు తయారుచేయలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి [మనిషికి] లేదు.” (యిర్మీయా 10:23) కాబట్టి మనుషుల పరిపాలన యుద్ధాల్ని, హింసను పూర్తిగా ఆపలేదు.
సాతాను, చెడ్డదూతలు
“లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 5:19) ఆ ‘దుష్టుడే’ సాతాను; అతను కిరాతకుడు, హంతకుడు. (యోహాను 8:44) సాతాను తన చెడ్డదూతలతో కలిసి హింసను, యుద్ధాల్ని వెనకుండి నడిపిస్తున్నాడు.—ప్రకటన 12:9, 12.
హింసను, యుద్ధాల్ని నామరూపాల్లేకుండా చేయడం మన వల్ల కాదు, అది దేవునికే సాధ్యం.